మాతృభాషతోనే బంగారు తెలంగాణ | Bangaru telangana to be formed with mother tongue | Sakshi
Sakshi News home page

మాతృభాషతోనే బంగారు తెలంగాణ

Published Wed, Jul 13 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

మాతృభాషతోనే బంగారు తెలంగాణ

మాతృభాషతోనే బంగారు తెలంగాణ

అవసరమైన వనరులు, వసతులు కల్పించడంద్వారా విద్యాలయాలను సముద్ధరించకుండా ఆదరాబాదరాగా కేజీ నుంచి పీజీ విద్యను ఆంగ్లమాధ్యమంలో జరుపుతామని పాలకులు ప్రకటించడం, దానికోసం సన్నాహాలు చేయడం, బాహాటంగా ప్రకటనలు చేయడం అప్రజాస్వామికమే కాదు.. అది చట్టవిరుద్ధం కూడా అవుతుంది.
 
 ఒకప్పటి నిజాం జమానా హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ఉర్దూను పరిపాలనా భాషగా శాసనపరంగా నిర్ణయించి దానికనుగుణంగా ఉర్దూను బోధనాభాషగా చేపట్టారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బి. రామకృష్ణారావు హయాంలో తెలుగును పరిపాలనాభాషగా శాసన పరంగా నిర్ణయించి తదనుగుణంగా తెలుగు భాషను బోధనా మాధ్యమంగా చేపట్టి ఆనాటి ఉర్దూ భాష ద్వారా విద్యాబోధన చేస్తున్న ప్రభుత్వ రంగ విద్యాల యాలన్నీ తెలుగు మాధ్యమంలోకి మార్చారు.
 
 కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వపరంగా కేజీ నుంచి పీజీ వరకు ఇకపై ఇంగ్లిష్ మాధ్యమంలోనే విద్యాబోధన జరుగుతుందని పదేపదే ప్రకటించారు. ఈ మధ్యే తెలుగు మీడియం పాఠ్యాంశాలను ఇంగ్లిష్ మీడి యంలోకి మార్చే ప్రక్రియలు కూడా చేబడుతున్నారని సమాచారం. కానీ తెలుగు మీడియంను ఇంగ్లిష్ మీడి యంలోకి మార్చాలంటే మొదట శాసనసభలో దానిపై చర్చించి శాసనపరమైన నిర్ణయం తీసుకోవాలి. దానికి మొట్టమొదట తెలుగును పరిపాలనా భాషగా వదిలివే యాలి. అలాగే ఉర్దూ కూడా అధికార భాష కనుక దాన్ని కూడా వదిలివేయాలి. తర్వాతే ఇంగ్లిష్‌ను అధికార భాషగా శాసనపరంగా నిర్ణయించి ప్రకటించాలి.
 
 పరిపాలనా రంగానికి చెందిన ఇంత పెద్ద నిర్ణ యాన్ని ప్రభుత్వపరంగా తీసుకోవడానికి ముందు ప్రజా భిప్రాయం కోసం ఒక ఒపీనియన్ పోల్ లాంటిది నిర్వ హించాలి. అంతకంటే ముందుగా, అత్యధికులు పరిపా లనా భాష గురించి, దానికి అనుబంధమైన విద్యా బోధన గురించి ఎలాంటి భావాలు వ్యక్తపరుస్తారో మౌఖిక చర్చల ద్వారా, లిఖితపూర్వక సర్వేల ద్వారా ప్రభుత్వం తెలుసుకోవాలి.
 వరంగల్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర తెలుగు మాధ్యమ పరిరక్షణోద్యమ సమాఖ్య సభలో ఈ విషయంపై లోతుగా చర్చించింది. ఇంగ్లిష్ మీడియంను తీసుకురావడానికి ముందుగా విద్యార్థుల విద్యాప్రమా ణాలు పెరగడానికి అనేక లోటుపాట్లతో నడుస్తున్న ప్రభుత్వ విద్యాలయాలన్నింటినీ వనరులు, వసతులు, అధ్యాపకులరీత్యా సరిదిద్దిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే విద్యాప్రమాణాలు మరింత తగ్గుతాయని, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని సమాఖ్య హెచ్చరించింది.
 
 అలాంటివేవీ చేయకుండా ఆదరాబాదరాగా కేజీ నుంచి పీజీ విద్యను ఇకపై ఆంగ్లమాధ్యమంలో జరుపు తామని ప్రకటించడం, దానికోసం సన్నాహాలు చేయడం, బాహాటంగా ప్రకటనలు చేయడం అప్రజా స్వామికమే కాదు.. అది చట్టవిరుద్ధం కూడా అవుతుంది. ఇలాంటి నిర్ణయాలు సరికావని ప్రభుత్వం దృష్టికి, ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకు రావడానికి విస్తృత చర్చలు, సర్వే లేదా ఒపీనియన్ పోల్ వంటిది నిర్వహించి వాటికనుగుణంగా శాసనాలు చేయాలని, అంతవరకు కేజీ నుంచి పీజీ విద్యను తెలుగు లోనే కొనసాగించాలని సమాఖ్య డిమాండ్ చేసింది. ఇంగ్లిష్ మీడియం కంటే తెలుగు మీడియం బహుజను లకు మంచిదని ఈ వ్యాసకర్త ఇప్పటికే అనేక వ్యాసాలు రాసి, ప్రచురించారు.
 
 భాషా మాధ్యమంలో మార్పులు చేయడానికి ముందుగా ప్రభుత్వం చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనై శిథిలావస్థలో ఉన్న అనేకానేక ప్రభుత్వ విద్యాలయాలను వెంటనే పునరుద్ధరించడం తక్షణ కర్తవ్యం. అంతేకాని తెలుగు మాధ్యమం కంటే కష్టమైన ఇంగ్లిష్ మీడియం చేపట్టడం సరైంది కాదు. అంతవరకు ఇప్పుడున్న తెలుగు మాధ్యమాన్నే కొనసాగిస్తూ, ప్రైవేట్ రంగ విద్యాలయాలకు నిర్దేశించే గుర్తింపు నిబంధనలను ప్రభుత్వరంగ విద్యాలయాలకు కూడా తు.చ. తప్ప కుండా వర్తించజేస్తూ వాటిని పాటించకపోతే రెండిం టిపై సమానంగా చర్యలు తీసుకోవాలి. నిర్దేశిత నిబంధ నలను అన్ని విద్యాలయాలు కచ్చితంగా పాటించడానికి పకడ్బందీగా పర్యవేక్షణ అమలు చేయవలసి ఉంటుంది.
 
 జూన్ 25-27 తేదీల్లో వరంగల్‌లో తెలంగాణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫోరమ్ ఆధ్వర్యాన తెలం గాణలో తెలుగు మాధ్యమ విద్యాబోధనపై వివిధ స్వచ్ఛంద సంస్థలు సమావేశమై తెలంగాణ రాష్ట్ర తెలుగు మాధ్యమ పరిరక్షణోద్యమ సమాఖ్యగా ఏర్పడినాయి. అంపశయ్య నవీన్, సుప్రసన్నాచార్య, అనుమాండ్ల భూమయ్య, కె. యాదగిరి, కోదండరామారావు, ఈ వ్యాస రచయిత తదితరులు పాల్గొన్న ఈ సమావేశం ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తేవాలని కొన్ని ప్రతి పాదనలు కూడా చేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రతి జిల్లాలోని విద్యా, సామాజిక సాంస్కృతిక లక్ష్యా లతో స్థాపితమైన రాజకీయేతర స్వచ్చంద సంస్థల సహకారంతో ఈ ఉద్యమాన్ని అందించాలని, ప్రతి జిలా కేంద్రంలో జిల్లా పరిరక్షణోద్యమ శాఖను స్థాపించి, అడపాదడపా చర్చాగోష్టులు జరిపి అవసరమైన కార్య క్రమాలు రూపొందించాలని నిర్ణయించారు.
 
 అలాగని సమాఖ్య ఇంగ్లిష్ భావనను వ్యతిరేకిం చడం లేదు. ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని మాత్రమే వ్యతిరేకిస్తోంది. కేంద్ర, ప్రైవేట్ రంగ విద్యాలయాల్లో కూడా తెలుగు, ఇంగ్లిష్ మాధ్య మాల్లో విద్యాబోధన జరపాల్సి ఉంది. కేసీఆర్ బోధనా మాధ్యమం గురించి ఇంతవరకు తీసుకున్న నిర్ణయా లను ఆపి సావధానంగా వాటి గురించి చర్చించాలి.
 - డాక్టర్ వెల్చాల కొండలరావు
 వ్యాసకర్త కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర తెలుగు మాధ్యమ పరిరక్షణ సమాఖ్య
 మొబైల్ : 98481 95959

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement