![Andhra Pradesh High Court says Arguments in mother tongue not wrong - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/23/AP-HIGH-COURT.jpg.webp?itok=Lc_-vlqe)
సాక్షి, అమరావతి: హైకోర్టులో మాతృ భాషలో వాదనలు వినిపించడం కోర్టును అవమానించడం ఏ మాత్రం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తను ఇంగ్లిష్‌లో అడిగిన ప్రశ్నకు ఓ న్యాయవాది తెలుగులో సమాధానం ఇచ్చినందుకు ఆగ్రహించిన సింగిల్ జడ్జి రూ.25 వేలు ఖర్చుల కింద చెల్లించాలంటూ ఆ కేసు దాఖలు చేసిన పిటిషనర్‌ను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. విశాఖలో ఓ భవన నిర్మాణం అనుమతుల విషయమై అగనంపూడికి చెందిన గురు భాస్కరరావు 2019లో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి విచారణ జరిపారు.
న్యాయమూర్తి పిటిషనర్ విచారణార్హతపై ఓ ప్రశ్న అడిగారు. అప్పటివరకు ఇంగ్లిష్‌లోనే వాదనలు వినిపిస్తూ వచ్చిన న్యాయవాది.. తెలుగులో స్పందిస్తూ.. ‘తమరు పేజీ నెంబర్ 18, 19 ఓసారి చూడండి’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో తెలుగులో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్‌ను అవమానించడమేనంటూ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే ఆ పిటిషన్‌ను కొట్టేశారు. ఆ వెంటనే సదరు న్యాయవాది బేషరతు క్షమాపణలు కోరారు. తెలుగులో చెప్పిన సమాధానాన్ని పట్టించుకోవద్దంటూ.. తిరిగి ఇంగ్లిష్‌లో విన్నవించారు. అయినా న్యాయమూర్తి వినిపించుకోకుండా రూ.25 వేల జరిమానాను 4 వారాల్లో హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు.
ధర్మాసనం ముందు అప్పీల్ వేసిన పిటిషనర్
జరిమానా చెల్లించాలనడంపై పిటిషనర్ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా, ఇటీవల ఇది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మొత్తం విషయం తెలుసుకున్న ధర్మాసనం.. ‘కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఈ అప్పీల్‌ను తేల్చాలని పిటిషనర్ కోరడం లేదు. అందువల్ల మేం కూడా ఈ కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలిస్తే, న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే తెలుగులో చెప్పారు. అంతే తప్ప ఆ న్యాయవాది కేసు మొత్తాన్ని తెలుగులో వాదించలేదు. హైకోర్టులో కార్యకలాపాలు జరిగే భాష ఇంగ్లిష్. అయితే మాతృభాషలో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్‌ను అవమానించడం ఎంత మాత్రం కాదు. అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment