'ఆంగ్ల వ్యామోహం వీడి తెలుగుకు రండి'
హైదరాబాద్: ప్రాచీన హోదా పొందేందుకు తెలుగు భాషకు అన్ని అర్హతలున్నాయని మద్రాసు హైకోర్టు స్పష్టం చేయడంపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2008 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం అతి ప్రాచీన భాషల్లో తెలుగును చేర్చింది. అయితే, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2009లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా కల్పించారని స్పష్టం చేస్తూ ఆ పిటిషన్ ను కొట్టేసింది. ఈ కేసును రవీంధ్రనాధ్ అనే న్యాయవాది వాదించారు. కోర్టు తీర్పుపట్ల హర్షం వ్యక్తం చేసిన రామకృష్ణ ఇప్పటికైనా తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేయాలని కోరారు. ఆంగ్ల భాషా వ్యామోహాన్ని విడిచిపెట్టి విస్మరిస్తున్న ప్రాచీన తెలుగుకు న్యాయం చేయాలని అన్నారు. ఉత్తరప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కోర్టు తీర్పు అభినందనకరం : కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
తెలుగు భాషకు ప్రాచీన భాష హోదాను సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడం శుభపరిణామమని జగదీశ్వరరెడ్డి అన్నారు.