తెలుగు దివ్వెను వెలుగనిద్దాం | opinion on telugu language in educational system by dileep reddy | Sakshi
Sakshi News home page

తెలుగు దివ్వెను వెలుగనిద్దాం

Published Fri, Jul 22 2016 3:12 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

తెలుగు దివ్వెను వెలుగనిద్దాం - Sakshi

తెలుగు దివ్వెను వెలుగనిద్దాం

సమకాలీనం

ప్రాథమిక స్థాయి విద్యాబోధన తల్లిభాషలోనే జరగాలని సుప్రీంకోర్టు 1993లోనే స్పష్టమైన తీర్పిచ్చింది. రాజ్యాంగం 350 అధికరణం ఇదే నిర్దేశిస్తోంది. అయినా పాలకులు పట్టించు కోవడం లేదు. పాఠశాల స్థాయిలోనూ ఇంగ్లిష్‌ మాధ్యమ విద్యా బోధనకే వారు దోహద పడుతున్నారు. తెలుగును నిర్బంధంగా నేర్పించే విధానాలే మన రాష్ట్రంలో లేవు. భాషా ప్రయుక్త ప్రాతిపదికతో ఏర్పడ్డ తొలి రాష్ట్రమే అయినా తెలుగువారికి భాషపైన శ్రద్ధ లేదని  ఎన్నోసార్లు, ఎన్నో స్థాయిల్లో రుజువైంది.

‘‘తెలుగు వెలది పలుకు తీయని పలుకులు, వినినయంత రాగధునులు దూకు; తెలుగు పలుకు కన్న తీయనిదున్నదా...?’’ అని ప్రశ్నించాడు మహాకవి దాశరథి. లేదని ఆయన భావన, ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అని ప్రశంసలం దుకున్న తెలుగుభాషకు ఇప్పుడు తెగుళ్లు పట్టుకున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, ప్రపంచీకరణ ప్రభావం, ఇంగ్లిష్‌ పట్ల వ్యామోహం, విద్యా సంస్థల్లో పెరిగి పోయిన వ్యాపార దృష్టి, కొత్తతరం నిరాదరణ, ప్రసారమాధ్యమాల అశ్రద్ధ... వెరసి తెలుగు భాష మనుగడ ఆందోళన కలిగించే స్థితికి చేరుతోంది. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేస్తున్న తీరు తెలుగు భాషను మరింత సంక్షోభంలోకి నెడుతోంది. ఈ తాజా పరిణామం వల్ల సర్కారు బడుల స్థానే గ్రామీణ ప్రాంతాల్లో సహితం ప్రయివేటు బడులు, అంటే దాదాపు అన్నీ ఆంగ్ల మాధ్యమ బడులే వెలుస్తున్న క్రమంలో ఒక తరమే తెలుగుకు దూర మయ్యే దుస్థితి కనిపిస్తున్నది.

సరైన మాతృభాషా భూమిక లేకుండా అన్య భాషల్లో చదివి పట్టాలు పొందుతున్న మన కొత్తతరం... ఉపాధికి, ఉద్యోగాల కవసరమైన ప్రతిభ సంపాదిస్తున్నారేమో! కానీ, సహజ సిద్ధమైన సృజన, నైపుణ్యాలు కొరవడుతున్నాయి. దీన్నెవరూ తీవ్రంగా పరిగణించడం లేదు. ఇలా మాట్లాడటం అతిశయోక్తి అనుకునే భాషా ఉదారవాదులు కొందరుంటారు. ‘‘భాష ఎలా చస్తుంది? మరీ చోద్యం కాకపోతే....?!’’ అని వారు విస్మయం ప్రకటించినా ఆశ్చర్యం లేదు. ప్రపంచంలోని ఏడువేల భాషల్లో దాదాపు 65 శాతం భాషలు కాలక్రమంలో మృతభాషలయినట్టు ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ‘ఒక భాషకు చెందినవారు ఆ భాషను వాడుకలో పెట్టుకో నప్పుడు, సంభాషణల్లో, తమ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల్లో (కమ్యూనికేటివ్‌ డొమైన్స్‌) తల్లిభాషను వాడే వారి సంఖ్య తగ్గిపోతున్నప్పుడు, ఒక తరం తమ భాషను తర్వాతి తరానికి వారసత్వంగా అందించే స్థితిలో లేనప్పుడు ఆ భాష తీవ్ర ప్రమాదంలో పడినట్టే’ అని ‘యునెస్కో’ నివేదిక స్పష్టం చేసింది. ప్రపం చీకరణ, ఆర్థిక సరళీకరణల తర్వాత సుమారు 40 నుంచి 50 శాతం మంది తెలుగు పిల్లలు తల్లిభాషకు దూరమైనట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

తెలుగు తెలుసని చెప్పే వారిలోనూ అరకొరగా చదవడం, అంతకన్నా అధ్వా నంగా రాయడం మాత్రమే వచ్చిన వారి శాతం ఎక్కువే.  ఒక భాష వాడుక నుంచి క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఆ భాష/జాతి తాలూకు సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ, పర్యావరణ సంబంధిత విలక్షణమైన ప్రత్యేక పరిజ్ఞానం, విలువైన ఆచరణలు వంటివీ కోలుకోలేని నష్టానికి గుర వుతాయి’ అని కూడా యునెస్కో హెచ్చరించింది.

భాష అంటే మాటలు కాదు!
భాషకూ మనిషికీ ఉన్న సంబంధం మానవ సమాజం పుట్టినప్పట్నుంచీ ఉంది. తల్లీ–పిల్లల సంబంధం నుంచి మొదలై... మానవ సంబంధాలన్నిం టినీ సూత్రబద్ధం చేసేది భాష మాత్రమే! భాష పరమ ప్రయోజనం మాన వుల మధ్య భావప్రసరణలకు ఒక వాహకంగా ఉపయోగపడటం. ఇక నాగరి కతా వికాసం, మానవాభ్యుదయం, సంస్కృతీ–సంప్రదాయాల కొనసా గింపు, కళల సంరక్షణ–వృద్ధి, మనిషి మానసికోల్లాసమీమడం వంటి వన్నీ భాష వల్ల సాధ్యపడుతున్నవే! భాష ఇంకా జన సమూహాల్ని జాతులుగా కట్టి ఉంచుతోంది. తమలో తమ భావవినిమయానికి అవసరమైన తల్లిభాషతో పాటు ఇతర జన సముదాయాలతో సంబంధాలకు అన్యభాషలు, ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ అనుసంధాన భాషలు ప్రాధాన్యత సంతరించుకుం టున్నాయి. విదేశాలకు వెళ్లేటప్పటి అవసరాలకే కాకుండా, ఉన్నచోటే ప్రపంచ పరిణామాలతో సంబంధం కలిగి ఉండాలన్నా, విషయ పరిజ్ఞానం పెంచు కోవాలన్నా.. ఇంగ్లిష్‌ వంటి అన్యభాషలు తెలిసి ఉండటం అవసరమైంది. రోజువారీ సంభాషణల్లో ఉన్నట్టు మాత్రమే పైకి కనిపించినా, తల్లిభాషలో అనేకానేకాంశాలు ఇమిడి ఉంటాయి.

తల్లిభాష ఆలంబనగానే సాహితీ– సాంస్కృతిక విప్లవాలు సాధ్యమయ్యాయంటే అతిశయోక్తి కాదు. అభివృద్ధి చెందిన దాదాపు అన్ని సమాజాలు, దేశాల్లోనూ తల్లిభాషతోనే విద్యా వికాసం, పరస్పర భావప్రసరణ జరిగాయి, జరుగుతున్నాయి. ప్రజల అను భూతులు, ఆలోచనలు, జీవన విధానానికి సంబంధించిన సమస్త విషయాలు తల్లిభాషలో గాఢంగా ప్రతిబింబిస్తాయి. అసాధారణ సుఖదుఃఖాలు కలిగిన పుడు భావాలు శక్తిమంతంగా తల్లిభాషలోనే వ్యక్తమవుతాయి. అన్య భాషలు తెలిసి ఉండటం వల్ల ప్రయోజనమే! ఇతరులపై ఆధారపడనవసరం లేకుండా ఆయా సందర్భాల్లో కమ్యూనికేషన్‌ పరమైన అవసరాలను అది తీరుస్తుంది. ఇంగ్లిష్‌ వంటి అంతర్జాతీయ భాష తగినంత లోతుపాతులతో తెలిసి ఉండడం తప్పనిసరి అదనపు ప్రయోజనం/అవసరంగా మారింది. తల్లిభాష అబ్బినంత తేలికగా, సులభంగా అన్యభాష రాదు. నేర్చుకోవడం అసాధ్యం కాకపోయినా.. అది మాతృభాష తర్వాతిదే అవుతుంది. పట్టుదలగా నేర్చు కుంటే అన్యభాషనూ లోతుగా నేర్చుకోవచ్చు. అంత మాత్రాన అన్య భాష లపై ఆసక్తి, మోజు తల్లిభాష ప్రయోజనాల్ని పణంగా పెట్టి కాకూడదు. ఆంగ్ల భాషా వ్యామోహం తెలుగు వికాసానికి అడ్డంకిగా మారింది.

తల్లి భాష ప్రాధాన్యం రుజువైన సత్యం
పాఠశాల విద్యా బోధన ఏ భాషలో జరగాలనేదానిపై సందేహాలకతీతంగా స్పష్టత ఉంది. తల్లి భాషలోనే జరగాలన్నది విశ్వసమాజం అంగీకరించి, అను సరిస్తున్న సత్యం. తల్లి భాషలో విద్యాబోధన వల్ల పిల్లల్లో సహజ సృజన విక సిస్తూనే, విషయ పరిజ్ఞానం పొందగలుగుతారనేది శాస్త్రీయంగా రుజువైంది. 1959 ఆగస్టు 11న ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌లో జరిగిన ‘అంగ్రేజీ హటావో’ సదస్సులో డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా ఓ గొప్ప మాట చెప్పారు. ‘‘విషయపరిజ్ఞానం లోతుల్లోకి వెళ్లి వాటిని అవగాహన చేసుకోవడానికి ఎంత సమయం, శ్రద్ధ అవసరమవుతాయో, అదంతా మన పిల్లలు పరాయి భాష అయిన ఆంగ్ల పరిజ్ఞానాన్ని సంపాదించడానికే వెచ్చించాల్సివస్తోంది’’ అన్నారు. తల్లిభాషలో పాఠశాల విద్యాబోధన జరగాలన్న సిద్ధాంతం ఈ అంశం ఆధారంగా బలపడ్డదే! ప్రాథమిక స్థాయి విద్యాబోధన తల్లిభాషలోనే జరగాలని సుప్రీంకోర్టు 1993లోనే స్పష్టమైన తీర్పిచ్చింది. రాజ్యాంగం 350 అధికరణం ఇదే నిర్దేశిస్తోంది. అయినా పాలకులు పట్టించుకోవడం లేదు. పాఠశాల స్థాయిలోనూ ఇంగ్లిష్‌ మాధ్యమ విద్యా బోధనకే వారు దోహద పడు తున్నారు. తెలుగును నిర్బంధంగా నేర్పించే విధానాలే మన రాష్ట్రంలో లేవు.  భాషా ప్రయుక్త ప్రాతిపదికతో ఏర్పడ్డ తొలి రాష్ట్రమే అయినా తెలుగువారికి భాషపైన శ్రద్ధ లేదని ఎన్నోమార్లు రుజువైంది.

అన్నివైపులా కృషి జరగాలి
క్రీ.శ.625 నుంచి నన్నూరేండ్లకు పైబడి ఈ నేలనేలిన తూర్పు చాళుక్యరాజులు తెలుగును అధికార భాషగా ప్రకటించి పట్టం కట్టారు. ఈ 1,400 ఏళ్లలో భాష పలు మార్పులకు గురవుతూ వచ్చింది. ఏపీ శాసనసభ 1966లో తెలుగును అధికార భాషగా ప్రకటిస్తూ ప్రత్యేక చట్టం తెచ్చింది. అప్పట్నుంచి చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు రకరకాల ఉత్తర్వులు, ఆదేశాలు, ఇస్తున్నప్పటికీ తెలుగును పరిరక్షించడంలో ఆశించిన ఫలితాలు రాలేదు. వ్యక్తులు, కొన్ని సంస్థలు తమ స్థాయిలో కృషి చేస్తున్నా అది సమగ్రంగా జరగలేదు. ప్రాథ మిక విద్య తప్పనిసరిగా తెలుగు మాధ్యమంగానే జరగాలన్న కోరిక ఆచర ణకు నోచట్లేదు. 2003లో ప్రభుత్వ విద్యాశాఖ ఒక ఉత్తర్వు (జీవో ఎమ్మెస్‌ నం: 86) జారీ చేసింది. పాఠశాలల్లో తప్పనిసరిగా తెలుగును ఒక (ప్రథమ/ ద్వితీయ/తృతీయ) భాషగా నేర్పాలనేది సదరు ఉత్తర్వు ఉద్దేశం. దాని అమలు కూడా నీరు కారింది. ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా టెలివిజన్, వెబ్, బ్లాగ్‌ వంటి వాటిలో తెలుగు భాషా పరిరక్షణ, వృద్ధికి ఎటువంటి ప్రత్యేక చర్యలూ లేవు. పైగా భాషను సంకరపరిచి వారే దెబ్బతీస్తున్నారు. అన్యభాషా పదాల్ని వినియోగించ కూడదని కాదు.

ఇతర భాషా పదాల ఆదానప్రదానాలతో భాష పరిపుష్టమైన సందర్భాలెన్నో ఉంటాయి. అంతి మంగా ప్రజలు మాట్లాడే భాషే ప్రామాణికం అవుతుంది. లోపాలు, కొరతలు లేకుండా విషయం వారికి అర్థం అవడమే భాష అంతిమ లక్ష్యం కావాలి. తేలికైన, ప్రజలకు పరిచయమున్న తెలుగు ప్రత్యామ్నాయ పదాలున్నా వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా ఆంగ్లపదాల్ని వాడటం, వాటినే ప్రోత్సహించడం తెలుగుకు నష్టం కలిగిస్తోంది. ఈ విషయాల్లో కొంత పరిశోధన జరగాలి. విస్తారంగా వాడకంలో ఉన్న వైవిధ్యభరిత మాండలిక పదాల్ని మలుబడిలో ఉంచాలి. వాటితో పదకోశాలు, నిఘంటువులు తయా రుచేయాలి. కొత్తగా ఆవిర్భవిస్తున్న అన్యభాషా పదాలకు సమానార్థక తెలుగు పదసృష్టి జరగాలి. కొత్తగా పుట్టుకొచ్చే రంగాలు, వ్యవహారాలకు సంబం ధించిన పారిభాషక పదకోశాల్నీ తెలుగులో రూపొందించాలి. ఈ భాషా కృషిలో ప్రభుత్వం, విద్యావేత్తలు, కవి–రచయితలు, విద్యాసంస్థలు, యువ తరం, వారి తల్లిదండ్రులు, ప్రసారమాధ్యమాలు ఇలా.. అందరూ శ్రద్ధ తీసుకోవాలి. బాధ్యతను నెత్తినెత్తుకోవాలి. ఈ విషయంలోనూ మనకు ఆదర్శ మయ్యేలా మహాకవి దాశరథి ఇదుగో ఇలా చెప్పారు. ‘‘..జగాన అనేకములైన భాషలన్‌ తెలిసి, తెలుంగునందుగల తేట తనమ్మును తెల్పు బాధ్యతన్‌ తలపయి మోపికొంటి కద! దాశరథీ కరుణా పయోనిథీ!’’
(నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి)

మెయిల్‌: dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement