తల్లిభాష నిలవాలి ఇంగ్లిష్‌తో గెలవాలి! | International Mother Language Day On February 21 | Sakshi
Sakshi News home page

తల్లిభాష నిలవాలి ఇంగ్లిష్‌తో గెలవాలి!

Published Fri, Feb 21 2020 4:30 AM | Last Updated on Fri, Feb 21 2020 4:30 AM

International Mother Language Day On February 21 - Sakshi

తల్లి భాషమీద తెలుగువారికి భావోద్వేగం ఉన్నంత పట్టుదల లేదు. వీరభక్తి పొంగి పొర్లేపాటి వివేకం లేదు. విధిగా ఏం చేసి భాషను బతికించుకోవచ్చో వివేచన లేదు. పాలకుల్లోనూ గాలి మాటలు చెప్పడము న్నంత కార్యాచరణ లేదు. తల్లి భాషగా తెలుగు బాగుకు, భాషాభివృద్ధికి ప్రభుత్వాల పరంగా చేస్తున్నది పెద్ద బండిసున్న. రెండు వేల ఏళ్లకు పైన వాడుకలో, వెయ్యేండ్లకు పైబడి సాహిత్యంలో తెలుగు నిలిచిందంటే... కవి–పండితులు, ఇతర సాహిత్యకారులు, భాషాభిమానులు, సామాన్యుల నిరంతర కృషి, సాధన, వ్యాప్తి, వ్యవహారమే తప్ప పనిగట్టుకొని ప్రభుత్వాలు చేసిన గొప్ప మేళ్లేమీ లేవు. నిర్దిష్ట కార్యాచరణే లేదు. సర్కార్లు చేసిన మేలు లేకపోగా... అధికారుల ఆంగ్ల ఆధిపత్యధోరణి వల్ల ఇన్నాళ్లు తెలుగుకు జరిగిన ద్రోహమే ఎక్కువ! ఇక భాష వివిధ రూపాల్లోకి, మాండలి కాల్లోకి  మారుతూ కూడా మౌలికంగా తన స్వభావాన్ని నిలుపుకొని ఈ నేలపై మనుగడ సాగిస్తోందంటే, అందుకు తెలుగు సమాజపు అవస రాలే కారణం. సామాన్యుల నుంచి సంపన్నులు, మహా విద్యావంతుల వరకు రోజువారీ వాడుక, వ్యవహారం వల్ల, అంతో ఇంతో వారి సాహితీ సృజన, ఆసక్తి వల్ల తెలుగు నిలిచింది. ఇప్పుడు తల్లి భాష గురించి తల్లడిల్లే వారిది, ఆంగ్ల భాషను తిట్టిపోసుకునే వారిదీ ఆవేశమే తప్ప సమగ్ర ఆలోచన కాదు.

అసలు తెలుగుకు గడ్డుకాలం దాపురిం చడంలో లోపమెక్కడుందో గుర్తించే తెలివిడీ కాదు. తెలుగుపై సాను భూతి ప్రకటనలో ఆడంబరమే తప్ప కనీసం తమ పిల్లలకు తెలుగు నేర్పించడంలోనూ ఆచరణ శూన్యం! తెలుగు మాతృభాషలోనే ప్రాథ మిక విద్యాబోధన జరగాలనే వాదనలో హేతువుంది. మామూలుగా చూసినపుడు ఆ ప్రతిపాదన బాగానే కనిపిస్తున్నా... అలా చదివిన వారు ప్రాథమిక విద్యో, మాధ్యమిక విద్యో ముగిశాక ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతున్నారో చూడాలి. తర్వాతి కాలంలో వారెంతగా ఆంగ్లంపై ఆధారపడాల్సి వస్తున్నదో పరిశీలించాలి. అప్పటిదాకా తెలుగులో సాగించిన విద్యాభ్యాసం తమ తదనంతర ఉన్నత విద్యకు, ఉద్యోగం–ఉపాధి పొందడానికి ఎలా ప్రతిబంధకమౌతోందో గమనిం చాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ దాటాక కూడా తెలుగు మాధ్య మంలోనే కొనసాగడానికున్న అవకాశాలు–పరిధులు, వనరులు–పరి మితులు, ఇతర సాధన సంపత్తి–కొరత ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించాలి. వాటన్నిటికీ మించి, ఉన్నత–వృత్తి విద్యా కోర్సుల్లో విధి లేని పరిస్థితుల్లో ఇంగ్లీషు మాధ్యమంలోకి మారడం వల్ల వారు ఎదు ర్కొంటున్న కష్ట–నష్టాలు బేరీజు వేయాలి. అప్పుడుగాని, మన వాళ్ల భావావేశంలో కొరవడుతున్న సంబద్ధత, తెలుగే కావాలంటూ ఇంగ్లీషు ను ఈసడించుకోవడంలో లోపిస్తున్న హేతుబద్ధత అర్థం కావు.

పోటీకి సమస్థితి కల్పించాలి
జర్మనీ, జపాన్, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ... ఇలా అభివృద్ధి చెందిన దేశాలను ఉటంకిస్తూ, వారంతా తల్లిభాషలో ప్రాథమిక విద్య బోధన వల్లే అత్యంత సృజనతో ఎదుగుతున్నారనే వాదన ఉంది. అది నిజమే! ప్రాథమిక విద్య తల్లి బాషలోనే సాగాలన్నప్పుడు, ఇతరేతర సదుపా యాలు, వనరుల కల్పన, సన్నద్ధత ఎంతో అవసరం. పోటీదారుల మధ్య సమ, సానుకూల వాతావరణమూ ముఖ్యమే! ఆంగ్ల–తెలుగు మాధ్యమ విద్యార్థులకు విద్య–ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వ్యత్యాసా లకు తావులేని సమస్థితి ప్రభుత్వాలు కల్పించాలి. అవసరమైతే తెలుగు మాధ్యమ విద్యార్థులకు ప్రోత్సాహకాలివ్వాలి. రిజర్వేషన్‌ కల్పించాలి. ఆయా దేశాల్లో లేని ఒక విచిత్ర పరిస్థితి బ్రిటీష్‌ వలస దేశాల్లో ఉంది. ముఖ్యంగా భారత్‌ వంటి దేశాల్లో కొఠారీ విద్యా విధాన ప్రభావం వల్ల ఇంగ్లీషు చదువులొక పార్శ్వంలో వృద్ధి చెందుతూ వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ వంటి స్థానిక భాషలకు, విశ్వ భాషగా పరిగణించే ఇంగ్లీషుకు మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. పైన పేర్కొన్న అభివృద్ధి సమాజాల్లో ఈ పంచాయతీ లేదు. వారికి తల్లి భాషలోనే అన్నీ ఉంటాయి. ఆంగ్ల మాధ్యమంతో పోటీ పడే వారెవరూ ఉండరు. దేశంలోని అన్ని స్థాయిల వారికీ తల్లి భాషలోనే పోటీ! ఇక భాషాపరమైన వ్యత్యాసాలు, వివక్షకు తావెక్కడ? మన దగ్గర ఇప్పటికీ సంపన్నులు, ఎగువ మధ్య తరగతి, అంతో ఇంతో ఆర్థిక స్తోమత కలి గిన వారు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమంలో విద్యా బోధన జరిపిస్తుంటారు.

అది సైన్స్‌–టెక్నాలజీ అయినా, సామాజిక శాస్త్రా లైనా, వృత్తి కోర్సులయినా... ప్రపంచ స్థాయి విషయ వనరులు, ఆధు నిక సమాచారం, కొత్త పరిభాష ఆంగ్లంలోనే లభిస్తుంది. కానీ, తెలుగు వంటి స్థానిక భాషల్లో శాస్త్రీయ పరిశోధనల లేమి, భాష ఎదుగుదల లేకపోవడం, భాషాంతరీకరణలు, అనువాదాలు ఎప్పటికప్పుడు జర గకపోవడం, పారిభాషక పదకోశాలు, నిఘంటువులు సరిగా నిర్మాణం కాకపోవడం వల్ల విషయ వనరుల కొరత ఉంటుంది. బోధన కూడా ఆ స్థాయిలో ఉండదు. భావ ప్రసరణ నైపుణ్యాల్లోనూ వెనుకబాటుత నమే! దాంతో, ఉన్నత విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలప్పుడు ఆంగ్ల మాధ్యమ విద్యార్థులతో పోటీ పడలేని స్థితి తెలుగు మాధ్యమ విద్యార్థులకుంటుంది. ఇందుకు నేపథ్యం... పేద, దిగువ మధ్య తర గతి పిల్లలు ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన దొరకని సర్కారీ బడుల్లో, తెలుగులోనే చదువుకోవాల్సి రావడం. ఒక స్థాయి దాటిన తర్వాత వారికి కష్టాలు ఎదురవుతున్నాయి. అవకాశపు తలుపులు మూసుకు పోతున్నాయి. తెలివి, చొరవ, ఆసక్తి, వాటన్నిటికీ మించి అవసరం ఉండి కూడా పోటీని తట్టుకోలేక చతికిలపడుతున్నారు. అందుకే, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధ నను వారు స్వాగతిస్తున్నారు. ఇవేవీ ఆలోచించకుండా సర్కారు బడుల్లో తెలుగే మాధ్యమంగా ఉండాలని, ఇంగ్లీషు మాధ్యమంగా ఉండకూడదనే వాదన సరికాదు. అది కడకు ఉన్నవారికి–లేనివారికి మధ్య దూరం పెంచడమే! అవకాశాల్లో వివక్షను పెంచి పోషించడమే అవుతుంది. పేదవర్గాలకు చెందిన తెలుగు మాధ్యమ విద్యార్థుల అవ కాశాల్ని కర్కశంగా నలిపేయడమే అవుతుంది.

బతికుంచుకునే ఏ యత్నమూ జరగట్లే!
భాష ఎన్నో ప్రయోజనాలు కలిగిన మానవ పనిముట్టు. ఇతర జీవుల నుంచి మనిషిని వేరుపర్చే ప్రత్యేక లక్షణం భాషది. మరే జీవీ మనిషి లాగా భాషనొక సాధనంగా మార్చుకొని తన రోజువారీ అవసరాలు తీర్చుకున్నది లేదు. భాషలెన్ని ఉన్నా... తల్లి భాష ఎంతో ముఖ్య మైంది. రోజువారీ వ్యవహారాల్లోనే కాక మనసు ప్రకటించడం, బంధా లల్లుకోవడం, వక్తిత్వ వికాసం, ఊహ పరిధి విస్తరణ, మానవ సంబం ధాల వృద్ధి... ఇలా ఎన్నెన్నో  ప్రయోజనాలు భాష వల్లే సాధ్యం. ఇలా పరస్పర భావ ప్రసరణకే కాకుండా వారసత్వంగా వస్తున్న సంప్ర దాయ విజ్ఞానాలను భవిష్యత్తరాలకు అందించడానికి, భద్రపరచడా నికీ భాష సాధనం. ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి 21 అంతర్జాతీయ తల్లి భాషా దినోత్సవంగా ప్రకటించడానికి ప్రేరణ మన బెంగాలీలే! తూర్పు పాకిస్తానీయులు తమ తల్లి భాష బంగను జాతీయ భాషగా గుర్తించాలని 1952 ఫిబ్రవరి 21న ఢాకాలో ఆందోళన చేస్తున్నపుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు యువకులు బలయ్యారు. దాంతో కదిలిపోయిన పాక్‌ ప్రభుత్వం బంగను ఒక జాతీయ భాషగా ప్రకటించింది. తర్వాత 1971లో బంగ్లాదేశ్‌ ఏర్పడ్డపుడు బంగ భాషే అక్కడ అధికార భాషయింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తల్లి భాషను కాపాడుకునే నిర్మాణాత్మక ప్రయత్నమేదీ తెలుగు సమాజంలో జరగటం లేదు. రాను రాను తెలుగు చదివే, రాసే వారి సంఖ్య రమా రమి తగ్గిపోతోంది. తెలుగుపట్ల కొత్తతరం ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. తెలుగు నేర్చుకొండని తలిదండ్రులూ తమ పిల్లల్ని ఒత్తిడి చేయడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ప్రతి తరగతిలో తెలుగు ఒక తప్పనిసరి ‘విషయం’గా నిర్బంధం చేస్తూ ఆదేశాలి చ్చారు. ఇదివరకు అలా లేదు. తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంకా ఫ్రెంచ్‌ తదితర భాషల్లోంచి ఏదైనా ఒకటి ఎంపిక చేసుకునే అవ కాశమిస్తూ వచ్చారు. దాంతో, తేలిగ్గా ఉంటుందని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని ఏ హిందీనో, సంస్కృతమో, ఫ్రెంచో ఎంపిక చేసు కోవడం మన పిల్లలకు అలవాటయింది. దాంతో తెలుగుకు పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు తెలుగును నిర్బంధం చేయడం వల్ల విధిగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తల్లి భాష పరిరక్షణలో ఇదో ముందడుగు.

ఇంకెంతో చేయాలి
ఉన్నత విద్య ప్రవేశాల్లో, ఉద్యోగ–ఉపాధి అవకాశాల కల్పనలోనూ తెలుగులో అభ్యర్థులకుండే ప్రావీణ్యానికి అదనపు వెయిటేజీ మార్కు లివ్వాలి. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధునిక పరిశోధనలు, పరిణామాల సమాచారం నిరంతరం తెలుగులోకి తర్జుమా అయ్యేట్టు చూడాలి. ఇంటర్నెట్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమ వేదికల్లో తెలుగు అందుబాటులో ఉండేట్లు ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలి. తెలుగును ఓ ఆధారపడదగ్గ భాషగా నేటి యువతరానికి విశ్వాసం కల్పించాలి. అధికార భాషా చట్టం నిర్దేశిస్తున్నట్టు, ప్రభుత్వ ఉత్త ర్వులు, ఆదేశాలు, నివేదికలు, విధివిధానాలు, నిత్య వ్యవహారాలు... ఇలా అన్నీ తెలుగులోనే జరిగేలా కట్టడి చేయాలి. స్థానిక న్యాయ స్థానాల్లో తెలుగులోనే తీర్పులు వెలువడేలా చూడాలి. వారికెంత ఇంగ్లీష్‌ వచ్చినా, తెలుగువాళ్లు పరస్పరం తెలుగులోనే మాట్లాడు కోవాలి. తల్లి భాషలో మాట్లాడటాన్ని తక్కువ చేసి చూడకూడదు. మాండలికాల్ని ఆదరిస్తూనే ఓ ప్రమాణభాష రూపొందించుకోవాలి. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు తెలంగాణ ప్రభుత్వం ‘ప్రతి ఒకరు మరొకరికి నేర్పండి’ (ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌) అంటోంది. తల్లిభాష వ్యాప్తికి ఇదొక చక్కని అవకాశం. తల్లి భాష తెలుగును కాపాడుకోవ డమంటే ప్రపంచపు కిటికీ ‘ఇంగ్లీషు’ను వ్యతిరేకించడం కాదు. తెలు  గును విని, మాటాడి, చదివి, రాయగలిగితే చాలు. మహా కథకుడు కొడవటిగంటి కుటుంబరావు అన్నట్టు ‘తల్లిభాషలో ఒక ఉత్తరం రాయటం చాతగాని వాడు ఎన్ని డాక్టరేట్లు సంపాదించినా నిరక్షరుడే!’


(నేడు అంతర్జాతీయ తల్లిభాషా దినోత్సవం)
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com
దిలీప్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement