International Mother Language Day
-
విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మాతృభాషను పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెలుగు భాషను ప్రోత్సహిస్తూనే సువిశాల ప్రపంచంలో పోటీని తట్టుకుని నిలబడేలా సిలబస్‌లో మార్పులు తెచ్చామని చెప్పారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేసిన 30 మంది కళాకారులను, భాషాకోవిదులను, సాహితీవేత్తలను, జర్నలిస్టులను ‘మాతృభాషా సేవా శిరోమణి’ పురస్కారాలతో సత్కరించింది. విజయవాడలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభకు మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు అ«ధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తెలుగు భాషకు ప్రాధాన్యతనిస్తూనే ఇతర భాషల ఆవశ్యకతను గుర్తించారని తెలిపారు. ఆంగ్లం నేర్చుకుని తెలుగును విస్మరించాలనే అభిప్రాయం సీఎంకు లేదన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి.ఆర్.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలు వీరే.. కల్లూరి భాస్కరం, డాక్టర్ విజయలక్ష్మీ పండిట్, డాక్టర్ ఓలేటి పార్వతీశం, పెరుగు రామకృష్ణ, డాక్టర్ కప్పగంతుల రామకృష్ణ, ఉపద్రష్ట రమణ, వేంపల్లి షరీఫ్, నవ మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ, గుంటూరు రామరాజు, డాక్టర్ పాములపాటి వెంకట శేషయ్య, పి.వి.గుణశేఖర్, డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, షేక్ అహ్మద్ జయా, వెంకట్ పూలబాల, వెంకటేష్ కులకర్ణి, ఎం.ఎ.రజాక్, సత్యవోలు రాంబాబు, టేకుమళ్ల వెంకటప్పయ్య, బి.అశోక్ కుమార్, కట్టెకోల చిన నరసయ్య, రమేష్ ఆడ్రికడర్ల, పొక్కులూరు సుబ్బారావు, కరణ్ శర్మ, గాజుల సత్యనారాయణ, అన్నవరపు బ్రహ్మయ్య. హర్మోహీందర్ సింగ్ సహనీ, డాక్టర్ కె.జి.ఆర్. శేషుకుమార్, డాక్టర్ కె.ఎస్. గోపాలదత్త, డాక్టర్ తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యమూర్తి ఉన్నారు. -
పదోన్నతులు అడిగితే సస్పెండ్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: భాషా పండితులను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ఉపసంహరణతోపాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వారి ప్రమోషన్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజ్ఞప్తిచేశారు. ఈమేరకు ఆయన లేఖరాశారు. మంగళవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భాషా పండితులు చేస్తున్న సేవలకు వారిని సత్కరించాల్సిందిపోయి.. ప్రమోషన్లు అడిగినందుకు ముగ్గురు భాషా పండితులను సస్పెండ్ చేయడం గర్హనీయమన్నారు. రాష్ట్రంలో 8,500 మందికిపైగా ఉన్న భాషా పండితులకు 22 ఏళ్లుగా ప్రమోషన్లు ఇవ్వలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన తెలుగు మహాసభల్లో భాషా పండితులకు వెంటనే ప్రమోషన్లు కల్పిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అధికారిక లాంఛనాల్లోనూ ఇదేం వివక్ష? ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచి ప్రజలకు సేవ చేసిన దళిత నేత సాయన్న అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయమని బండి సంజయ్ మండిపడ్డారు. నిజాం రాజు వారసుడికి మాత్రం అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించిందని ఎద్దేవాచేశారు. దళితుడైన సాయన్న విషయంలో వివక్ష చూపడం క్షమించరానిదన్నారు. అంబర్‌పేటలో గంగపుత్ర సామాజికవర్గానికి చెందిన 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణిస్తే సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. -
స్వర్ణభారతి ట్రస్ట్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
-
తెలుగు భాషను పరిరక్షించుకోవాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత’’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చదవండి: జనం ముందు కత్తులు.. తెర వెనుక పొత్తులు ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర -
తల్లిభాష నిలవాలి ఇంగ్లిష్తో గెలవాలి!
తల్లి భాషమీద తెలుగువారికి భావోద్వేగం ఉన్నంత పట్టుదల లేదు. వీరభక్తి పొంగి పొర్లేపాటి వివేకం లేదు. విధిగా ఏం చేసి భాషను బతికించుకోవచ్చో వివేచన లేదు. పాలకుల్లోనూ గాలి మాటలు చెప్పడము న్నంత కార్యాచరణ లేదు. తల్లి భాషగా తెలుగు బాగుకు, భాషాభివృద్ధికి ప్రభుత్వాల పరంగా చేస్తున్నది పెద్ద బండిసున్న. రెండు వేల ఏళ్లకు పైన వాడుకలో, వెయ్యేండ్లకు పైబడి సాహిత్యంలో తెలుగు నిలిచిందంటే... కవి–పండితులు, ఇతర సాహిత్యకారులు, భాషాభిమానులు, సామాన్యుల నిరంతర కృషి, సాధన, వ్యాప్తి, వ్యవహారమే తప్ప పనిగట్టుకొని ప్రభుత్వాలు చేసిన గొప్ప మేళ్లేమీ లేవు. నిర్దిష్ట కార్యాచరణే లేదు. సర్కార్లు చేసిన మేలు లేకపోగా... అధికారుల ఆంగ్ల ఆధిపత్యధోరణి వల్ల ఇన్నాళ్లు తెలుగుకు జరిగిన ద్రోహమే ఎక్కువ! ఇక భాష వివిధ రూపాల్లోకి, మాండలి కాల్లోకి మారుతూ కూడా మౌలికంగా తన స్వభావాన్ని నిలుపుకొని ఈ నేలపై మనుగడ సాగిస్తోందంటే, అందుకు తెలుగు సమాజపు అవస రాలే కారణం. సామాన్యుల నుంచి సంపన్నులు, మహా విద్యావంతుల వరకు రోజువారీ వాడుక, వ్యవహారం వల్ల, అంతో ఇంతో వారి సాహితీ సృజన, ఆసక్తి వల్ల తెలుగు నిలిచింది. ఇప్పుడు తల్లి భాష గురించి తల్లడిల్లే వారిది, ఆంగ్ల భాషను తిట్టిపోసుకునే వారిదీ ఆవేశమే తప్ప సమగ్ర ఆలోచన కాదు. అసలు తెలుగుకు గడ్డుకాలం దాపురిం చడంలో లోపమెక్కడుందో గుర్తించే తెలివిడీ కాదు. తెలుగుపై సాను భూతి ప్రకటనలో ఆడంబరమే తప్ప కనీసం తమ పిల్లలకు తెలుగు నేర్పించడంలోనూ ఆచరణ శూన్యం! తెలుగు మాతృభాషలోనే ప్రాథ మిక విద్యాబోధన జరగాలనే వాదనలో హేతువుంది. మామూలుగా చూసినపుడు ఆ ప్రతిపాదన బాగానే కనిపిస్తున్నా... అలా చదివిన వారు ప్రాథమిక విద్యో, మాధ్యమిక విద్యో ముగిశాక ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతున్నారో చూడాలి. తర్వాతి కాలంలో వారెంతగా ఆంగ్లంపై ఆధారపడాల్సి వస్తున్నదో పరిశీలించాలి. అప్పటిదాకా తెలుగులో సాగించిన విద్యాభ్యాసం తమ తదనంతర ఉన్నత విద్యకు, ఉద్యోగం–ఉపాధి పొందడానికి ఎలా ప్రతిబంధకమౌతోందో గమనిం చాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్ దాటాక కూడా తెలుగు మాధ్య మంలోనే కొనసాగడానికున్న అవకాశాలు–పరిధులు, వనరులు–పరి మితులు, ఇతర సాధన సంపత్తి–కొరత ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించాలి. వాటన్నిటికీ మించి, ఉన్నత–వృత్తి విద్యా కోర్సుల్లో విధి లేని పరిస్థితుల్లో ఇంగ్లీషు మాధ్యమంలోకి మారడం వల్ల వారు ఎదు ర్కొంటున్న కష్ట–నష్టాలు బేరీజు వేయాలి. అప్పుడుగాని, మన వాళ్ల భావావేశంలో కొరవడుతున్న సంబద్ధత, తెలుగే కావాలంటూ ఇంగ్లీషు ను ఈసడించుకోవడంలో లోపిస్తున్న హేతుబద్ధత అర్థం కావు. పోటీకి సమస్థితి కల్పించాలి జర్మనీ, జపాన్, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ... ఇలా అభివృద్ధి చెందిన దేశాలను ఉటంకిస్తూ, వారంతా తల్లిభాషలో ప్రాథమిక విద్య బోధన వల్లే అత్యంత సృజనతో ఎదుగుతున్నారనే వాదన ఉంది. అది నిజమే! ప్రాథమిక విద్య తల్లి బాషలోనే సాగాలన్నప్పుడు, ఇతరేతర సదుపా యాలు, వనరుల కల్పన, సన్నద్ధత ఎంతో అవసరం. పోటీదారుల మధ్య సమ, సానుకూల వాతావరణమూ ముఖ్యమే! ఆంగ్ల–తెలుగు మాధ్యమ విద్యార్థులకు విద్య–ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వ్యత్యాసా లకు తావులేని సమస్థితి ప్రభుత్వాలు కల్పించాలి. అవసరమైతే తెలుగు మాధ్యమ విద్యార్థులకు ప్రోత్సాహకాలివ్వాలి. రిజర్వేషన్ కల్పించాలి. ఆయా దేశాల్లో లేని ఒక విచిత్ర పరిస్థితి బ్రిటీష్ వలస దేశాల్లో ఉంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో కొఠారీ విద్యా విధాన ప్రభావం వల్ల ఇంగ్లీషు చదువులొక పార్శ్వంలో వృద్ధి చెందుతూ వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ వంటి స్థానిక భాషలకు, విశ్వ భాషగా పరిగణించే ఇంగ్లీషుకు మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. పైన పేర్కొన్న అభివృద్ధి సమాజాల్లో ఈ పంచాయతీ లేదు. వారికి తల్లి భాషలోనే అన్నీ ఉంటాయి. ఆంగ్ల మాధ్యమంతో పోటీ పడే వారెవరూ ఉండరు. దేశంలోని అన్ని స్థాయిల వారికీ తల్లి భాషలోనే పోటీ! ఇక భాషాపరమైన వ్యత్యాసాలు, వివక్షకు తావెక్కడ? మన దగ్గర ఇప్పటికీ సంపన్నులు, ఎగువ మధ్య తరగతి, అంతో ఇంతో ఆర్థిక స్తోమత కలి గిన వారు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమంలో విద్యా బోధన జరిపిస్తుంటారు. అది సైన్స్–టెక్నాలజీ అయినా, సామాజిక శాస్త్రా లైనా, వృత్తి కోర్సులయినా... ప్రపంచ స్థాయి విషయ వనరులు, ఆధు నిక సమాచారం, కొత్త పరిభాష ఆంగ్లంలోనే లభిస్తుంది. కానీ, తెలుగు వంటి స్థానిక భాషల్లో శాస్త్రీయ పరిశోధనల లేమి, భాష ఎదుగుదల లేకపోవడం, భాషాంతరీకరణలు, అనువాదాలు ఎప్పటికప్పుడు జర గకపోవడం, పారిభాషక పదకోశాలు, నిఘంటువులు సరిగా నిర్మాణం కాకపోవడం వల్ల విషయ వనరుల కొరత ఉంటుంది. బోధన కూడా ఆ స్థాయిలో ఉండదు. భావ ప్రసరణ నైపుణ్యాల్లోనూ వెనుకబాటుత నమే! దాంతో, ఉన్నత విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలప్పుడు ఆంగ్ల మాధ్యమ విద్యార్థులతో పోటీ పడలేని స్థితి తెలుగు మాధ్యమ విద్యార్థులకుంటుంది. ఇందుకు నేపథ్యం... పేద, దిగువ మధ్య తర గతి పిల్లలు ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన దొరకని సర్కారీ బడుల్లో, తెలుగులోనే చదువుకోవాల్సి రావడం. ఒక స్థాయి దాటిన తర్వాత వారికి కష్టాలు ఎదురవుతున్నాయి. అవకాశపు తలుపులు మూసుకు పోతున్నాయి. తెలివి, చొరవ, ఆసక్తి, వాటన్నిటికీ మించి అవసరం ఉండి కూడా పోటీని తట్టుకోలేక చతికిలపడుతున్నారు. అందుకే, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధ నను వారు స్వాగతిస్తున్నారు. ఇవేవీ ఆలోచించకుండా సర్కారు బడుల్లో తెలుగే మాధ్యమంగా ఉండాలని, ఇంగ్లీషు మాధ్యమంగా ఉండకూడదనే వాదన సరికాదు. అది కడకు ఉన్నవారికి–లేనివారికి మధ్య దూరం పెంచడమే! అవకాశాల్లో వివక్షను పెంచి పోషించడమే అవుతుంది. పేదవర్గాలకు చెందిన తెలుగు మాధ్యమ విద్యార్థుల అవ కాశాల్ని కర్కశంగా నలిపేయడమే అవుతుంది. బతికుంచుకునే ఏ యత్నమూ జరగట్లే! భాష ఎన్నో ప్రయోజనాలు కలిగిన మానవ పనిముట్టు. ఇతర జీవుల నుంచి మనిషిని వేరుపర్చే ప్రత్యేక లక్షణం భాషది. మరే జీవీ మనిషి లాగా భాషనొక సాధనంగా మార్చుకొని తన రోజువారీ అవసరాలు తీర్చుకున్నది లేదు. భాషలెన్ని ఉన్నా... తల్లి భాష ఎంతో ముఖ్య మైంది. రోజువారీ వ్యవహారాల్లోనే కాక మనసు ప్రకటించడం, బంధా లల్లుకోవడం, వక్తిత్వ వికాసం, ఊహ పరిధి విస్తరణ, మానవ సంబం ధాల వృద్ధి... ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు భాష వల్లే సాధ్యం. ఇలా పరస్పర భావ ప్రసరణకే కాకుండా వారసత్వంగా వస్తున్న సంప్ర దాయ విజ్ఞానాలను భవిష్యత్తరాలకు అందించడానికి, భద్రపరచడా నికీ భాష సాధనం. ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి 21 అంతర్జాతీయ తల్లి భాషా దినోత్సవంగా ప్రకటించడానికి ప్రేరణ మన బెంగాలీలే! తూర్పు పాకిస్తానీయులు తమ తల్లి భాష బంగను జాతీయ భాషగా గుర్తించాలని 1952 ఫిబ్రవరి 21న ఢాకాలో ఆందోళన చేస్తున్నపుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు యువకులు బలయ్యారు. దాంతో కదిలిపోయిన పాక్ ప్రభుత్వం బంగను ఒక జాతీయ భాషగా ప్రకటించింది. తర్వాత 1971లో బంగ్లాదేశ్ ఏర్పడ్డపుడు బంగ భాషే అక్కడ అధికార భాషయింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తల్లి భాషను కాపాడుకునే నిర్మాణాత్మక ప్రయత్నమేదీ తెలుగు సమాజంలో జరగటం లేదు. రాను రాను తెలుగు చదివే, రాసే వారి సంఖ్య రమా రమి తగ్గిపోతోంది. తెలుగుపట్ల కొత్తతరం ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. తెలుగు నేర్చుకొండని తలిదండ్రులూ తమ పిల్లల్ని ఒత్తిడి చేయడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ప్రతి తరగతిలో తెలుగు ఒక తప్పనిసరి ‘విషయం’గా నిర్బంధం చేస్తూ ఆదేశాలి చ్చారు. ఇదివరకు అలా లేదు. తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంకా ఫ్రెంచ్ తదితర భాషల్లోంచి ఏదైనా ఒకటి ఎంపిక చేసుకునే అవ కాశమిస్తూ వచ్చారు. దాంతో, తేలిగ్గా ఉంటుందని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని ఏ హిందీనో, సంస్కృతమో, ఫ్రెంచో ఎంపిక చేసు కోవడం మన పిల్లలకు అలవాటయింది. దాంతో తెలుగుకు పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు తెలుగును నిర్బంధం చేయడం వల్ల విధిగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తల్లి భాష పరిరక్షణలో ఇదో ముందడుగు. ఇంకెంతో చేయాలి ఉన్నత విద్య ప్రవేశాల్లో, ఉద్యోగ–ఉపాధి అవకాశాల కల్పనలోనూ తెలుగులో అభ్యర్థులకుండే ప్రావీణ్యానికి అదనపు వెయిటేజీ మార్కు లివ్వాలి. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధునిక పరిశోధనలు, పరిణామాల సమాచారం నిరంతరం తెలుగులోకి తర్జుమా అయ్యేట్టు చూడాలి. ఇంటర్నెట్తో పాటు ఇతర సామాజిక మాధ్యమ వేదికల్లో తెలుగు అందుబాటులో ఉండేట్లు ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలి. తెలుగును ఓ ఆధారపడదగ్గ భాషగా నేటి యువతరానికి విశ్వాసం కల్పించాలి. అధికార భాషా చట్టం నిర్దేశిస్తున్నట్టు, ప్రభుత్వ ఉత్త ర్వులు, ఆదేశాలు, నివేదికలు, విధివిధానాలు, నిత్య వ్యవహారాలు... ఇలా అన్నీ తెలుగులోనే జరిగేలా కట్టడి చేయాలి. స్థానిక న్యాయ స్థానాల్లో తెలుగులోనే తీర్పులు వెలువడేలా చూడాలి. వారికెంత ఇంగ్లీష్ వచ్చినా, తెలుగువాళ్లు పరస్పరం తెలుగులోనే మాట్లాడు కోవాలి. తల్లి భాషలో మాట్లాడటాన్ని తక్కువ చేసి చూడకూడదు. మాండలికాల్ని ఆదరిస్తూనే ఓ ప్రమాణభాష రూపొందించుకోవాలి. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు తెలంగాణ ప్రభుత్వం ‘ప్రతి ఒకరు మరొకరికి నేర్పండి’ (ఈచ్ వన్ టీచ్ వన్) అంటోంది. తల్లిభాష వ్యాప్తికి ఇదొక చక్కని అవకాశం. తల్లి భాష తెలుగును కాపాడుకోవ డమంటే ప్రపంచపు కిటికీ ‘ఇంగ్లీషు’ను వ్యతిరేకించడం కాదు. తెలు గును విని, మాటాడి, చదివి, రాయగలిగితే చాలు. మహా కథకుడు కొడవటిగంటి కుటుంబరావు అన్నట్టు ‘తల్లిభాషలో ఒక ఉత్తరం రాయటం చాతగాని వాడు ఎన్ని డాక్టరేట్లు సంపాదించినా నిరక్షరుడే!’ (నేడు అంతర్జాతీయ తల్లిభాషా దినోత్సవం) ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
రాష్ట్రాల మధ్య భాషా సమస్యలు
మన దేశంలోని అన్ని వ్యవస్థలు ఇంగ్లిష్ భాషని ఎక్కువగా ఉపయోగిస్తు న్నాయి. ఒక వ్యక్తి చాలా భాషలు నేర్చుకున్నప్పటికీ తన మాతృ భాషకి ఉన్న ప్రాముఖ్యం ప్రత్యేకమైనది. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజల భాషని అధికార భాషగా అమలు చేసుకునే సౌకర్యాన్ని మన రాజ్యాంగం కల్పించింది. అందుకని తెలుగుని అధికార భాషగా ఉమ్మడి రాష్ట్రం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రం కూడా గుర్తించింది. ప్రభుత్వ, న్యాయపాలనలో తెలుగుని ఎక్కువగా వాడటంవల్ల పాలన ప్రజలకి చేరువవు తుంది. తెలుగులో తీర్పులతో బాటూ, తెలుగులో న్యాయ శాస్త్రానికి సంబంధించి ఓ యాభై పుస్తకాలు రాశాను. తెలుగులో న్యాయపాలన దిశగా అవసర మైనంత కృషి జరగడంలేదని గొంతు చించుకున్న వ్యక్తుల్లో నేనూ ఉన్నాను. కింది కోర్టుల్లో మాతృ భాషలో న్యాయపాలన జరగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తీర్పులని పై కోర్టుల్లో సవాలు చేసినప్పుడు వాటికి ఇంగ్లిష్ అను వాదం పంపించాల్సిన అవసరం ఉంది. మరో రకంగా చెప్పాలంటే మనకి కూడా ఓ దేశ భాష అవసరం అయిపోయింది. ఆ స్థానాన్ని హిందీ భాష కాకుండా ఇంగ్లిష్ ఆక్రమించింది. హైకోర్టుల్లో సుప్రీం కోర్టుల్లో వివిధ భాషలకి చెందిన న్యాయమూర్తులు ఉంటారు. అందుకని దేశ భాష అవసరం అయి పోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో న్యాయపాలన, ప్రభుత్వ పాలన ఇంగ్లిష్‌లోనే ఎక్కువగా జరుగు తుంది. హిందీ రాష్ట్రాల్లో, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వ పాలన, న్యాయ పాలన వాళ్ల భాషల్లో జరుగుతుంది. చాలా మంచి పరిణామం. అయితే నేర న్యాయ వ్యవస్థ పాలన వాళ్ల భాషలోనే జరగడంవల్ల కొన్ని చిక్కులు ఉన్నాయి. భీమా, కోరేగావ్ కేసులో చాలామంది వ్యక్తులని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మన రాష్ట్రం లోనూ ఆ కేసుకి సంబంధించి ప్రముఖ కవి వరవర రావుని పోలీసులు అరెస్టు చేసి టాన్సిట్ వారంట్ కోసం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజ రుపరిచారు. ఆ తరువాత ఆయన్ని పుణేలోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. అప్పటికి సుప్రీంకోర్టు వాళ్లని గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఆయనని మళ్లీ హైదరాబాద్ తీసుకునివచ్చి గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ అరెస్టుకి భాషకి సంబం ధం ఉంది. వీవీని అరెస్టు చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినప్పుడు, వాళ్లు హైదరాబాద్ కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్లన్నీ మరాఠీలో ఉన్నాయి. ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అతనికి రిమాండ్ రిపోర్టుని ఇవ్వాలి. అది ఇతర భాషల్లో ఉంటే దాని ఇంగ్లిష్ అనువాదాన్ని ఇవ్వాలి. ఈ కేసులో మేజిస్ట్రేట్‌కి సమర్పించిన డాక్యుమెంట్లన్నీ మరాఠీలోనే ఉన్నాయి. ఆ మెజిస్ట్రేట్‌కి మరాఠీ రాదు. వాటి తర్జుమాని నాకు ఫలానా వాళ్లు చేశారన్న నోట్ కూడా మేజిస్ట్రేట్ చేయ లేదు. కానీ వీవీని రిమాండ్ చేసి çపుణే కోర్టులో హాజరుపరచమని ఆదేశాలు జారీ చేశారు. ఎవరినైనా రిమాండ్ చేసే ముందు అతనిపైన ఆరోపించిన నేరా లకి గట్టి ఆధారాలు ఉన్నాయా లేదా అని మేజిస్ట్రేట్ చూడాలి. ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడే రిమాం డ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్సిట్ రిమాండ్‌కి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ విధంగా చేయనప్పుడు ఆ రిమాండ్ చట్ట వ్యతిరేకమవుతుంది. ఈ విషయంలో హైకోర్టు కూడా జోక్యం చేసుకోకపోవడం, ఇతర భాషల్లో డాక్యుమెంట్స్ ఉండి, ఆ భాష ఆ మేజి స్ట్రేట్కి తెలియనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని కూడా హైకోర్టు నిర్దేశించకపోవడం బాధ కలిగించే అంశం. ఇదే కేసులో గౌతమ్ నవలఖాని కూడా పోలీ సులు ఢిల్లీలో అరెస్టు చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ ట్రాన్సిట్ రిమాండ్‌ని రద్దు చేసింది. ప్రజల భాషలో న్యాయపాలన జరగడం అత్యంత అవశ్యం. అయితే పై కోర్టులకి కేసు వెళ్లిన ప్పుడు అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో అరెస్టులు చేసి నప్పుడు అవసరమైన చర్యలని పోలీసులు, ఇతర అధికారులు తీసుకోవా ల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భీమా, కోరేగావ్ కేసులో భాషవల్ల ఉత్పన్న మైన సమస్యవల్ల ప్రజల భాషలో పరిపాలన అవసరం లేదు. దేశీ భాష ఇంగ్లిష్‌లో జరగాలని అనడం సమంజసమా? న్యాయస్థానాల్లో వాదోపవాదాలు, కార్యకలా పాలు, తీర్పులు ప్రజల భాషలో కాకుండా, వారికి అర్థంకాని భాషలో జరిగినప్పుడు ఆ వ్యవస్థపట్ల వారికి నమ్మకం సడలిపోతుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్నప్పుడు, అరెస్టులు చేస్తున్న ప్పుడు అక్కడి ప్రజల భాషలో లేదా దేశ భాషలో జరగాలి. అలా జరగనప్పుడు న్యాయవ్యవస్థ మీద, దర్యాప్తు సంస్థలమీద విశ్వాసం ఉంటే అవకాశం లేదు. భాష మన అస్తిత్వానికి చిహ్నం. భాషవల్ల ఉత్పన్నమయ్యే సమస్యలని అధిగమించాలి తప్ప, ప్రజల భాషలో న్యాయపాలన జరగకూడదనీ అను కోవడం సమంజసం కాదు. (నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం) వ్యాసకర్త : మంగారి రాజేందర్ (గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు) మొబైల్ : 94404 83001 -
తెలుగువారి కోసం లె జిస్లేచర్ కమిటీ
మంత్రి పల్లె రఘునాథరెడ్డి - సీఎం చంద్రబాబుకు సూచిస్తానని వెల్లడి చెన్నై దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక లెజిస్లేచర్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా చెన్నైలో పలు తెలుగు సంఘాల ప్రతినిధులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలలా తెలుగువారు స్థిరపడి ఉన్నారని తెలిపారు. తమిళనాడులో తెలుగువారు నిర్బంధ తమిళం చట్టంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగానే స్థానికేతరులుగా ఇతర రాష్ట్రాల్లో సైతం పలు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. తెలుగువారందరి సమస్యలను ఆకళింపు చేసుకునేందుకు ఒక లెజిస్లేచర్ కమిటీ డెలిగేషన్గాఏర్పడి దేశవ్యాప్తంగా పర్యటించడం, కమిటీ సేకరించిన తెలుగువారి అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కార మార్గాలు కనుగొనవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో ఐటీ రంగంలో విప్లవాన్ని సాధిస్తున్నామని, జూన్, జూలై నాటికి ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ ఉన్న రాష్ట్రంగా రికార్డు సృష్టించనున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో ఐదు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. చెన్నైలో ఈనెల 20వ తేదీన నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో 27 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొనగా 15 మంది రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సుముఖత వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. -
మన తెలుగు భాషకు జేజేలు పలుకుదాం...!!
ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషల పరిరక్షణార్థం ‘‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్స వంగా’’(ఫిబ్రవరి 21) ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ(విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ) యునెస్కో ప్రకటించింది. మాతృభాష కోసం కొంత మంది బెంగాలీ విద్యార్థులు పోరాడి ప్రాణాలను కోల్పోయారు. వారి త్యాగానికి నివాళిగా ఆ రోజున కనీసం అమ్మభాష గురించి ఆలోచించి ప్రణాళిక వేసి మాతృభాషల మనుగడకు ఆయా భాషలు మాట్లాడేవారు పూనుకోవాలన్న ఉద్దేశంతోనే దీనిని ప్రకటించారు. యునెస్కో సర్వేలో ఆంగ్లభాష అనే రోడ్డు రోలరు కిందపడి బక్కచిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగైపోయాయని తేలింది. ప్రపంచంలో సుమారు 7105 భాషల్లో, 230 భాషలు అంతరించాయి. ఇంకా 2956 భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో చెబుతున్నది. ఇందుకు కారణం పరభాష మీద మోజు- మాతృభాషపై శ్రద్ధ, ప్రేమ లేకపోవడమే. తెలుగు భాష పరిరక్షణకు నడుం కట్టకపోతే అంతరించే భాషల్లో చేరే అవకాశముంది. సృజనకూ, అమ్మభాషకూ ఆత్మీయ చుట్టరికం ఉంది. అమ్మభాషలోనే ఆలోచించగలిగినపుడే సృజన పురి విప్పుకుంటుంది కదా! జపాన్, చైనా, రష్యా, జర్మనీ, ఫ్రెంచ్, అరబిక్, పార్సీస్, స్పెయిన్‌లాంటి దేశాలు వారి వారి మాతృభాషల సాయంతోనే ఆర్థికాభివృద్ధి చెంది ఖ్యాతిని గడిస్తున్నాయి. ఇది ఎవరూ కాదనలేని నిజం! మాతృభాషను ప్రేమించు, భాషలన్నింటిని గౌరవించు, పరభాషను హరించకు అన్న రాజ్యాంగ స్ఫూర్తితోనైనా పాలకులారా! పరభాష మోజు వీడండి? ‘‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టెయ్యి’’ అనే చందంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. ‘‘అన్యభాష నేర్చి ఆంధ్రంబు రాదను సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’’ అన్న కాళోజీ మాటలు గుర్తుకు తెచ్చుకోండి. ఎన్నికలకు ముందు నేతలు వారి మాతృభాషలో మాట్లాడి ఓట్లేయించుకున్న వాళ్లే భావవ్యక్తీకరణ, భావోద్వేగాలకు ఆయువుపట్టు అమ్మభాషని మీకే ఎక్కువ తెలుసు? తెలుగు భాషకు చీకటంటూ లేనే లేదు. ప్రకాశం, ప్రచారం కల్పించాలనే చిత్తశుద్ధి పాలకులకు లేకపోవటమే చీకటి..! మాతృభాష మనుగడకు ఇప్పటికైనా కొన్ని చర్యలు తీసుకోవాలి. పాలకులతో పాటు తెలుగుజాతి కూడా నిండు మనస్సుతో యునెస్కో మాతృభాషల పరిరక్షణ ఇచ్చిన ప్రేరణ, మన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతిజ్ఞపూని అమలుకు దిగాలి. శిశువుకి తొలి గురువు అమ్మ. ఆ అమ్మ ఒడి నుంచి నేర్చుకునే భాష మాతృభాష. అప్రయత్నంగా, ఏ ఇబ్బందీ లేకుండా నేర్చుకునే భాష ఇదే. దీని ద్వారానే రసానుభూతి, ఉత్తమ సంస్కారం, మానవతా విలువలు, సామాజిక నైతిక విలువలు పెంపొందుతాయి. భాష ఒక సమాజపు సొత్తు. ప్రతి తరం ఆ అద్భుత సంపదను కాపాడడానికి తమ వంతు కృషి చేస్తూనే ఉండాలి. బిడ్డ శారీరకంగా ఎదగడానికి తల్లిపాలు ఎంత అవసరమో, మానసిక ఎదుగుదలకు అమ్మభాష కూడా అంతే అవసరం. ఏ భాషకైనా చతుర్విధ ప్రక్రియల ద్వారానే- వినడం, మాట్లాడడం, చదవడం, రాయడంతోనే భాషాభివృద్ధి జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ శాఖలో పాలన, న్యాయ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరగాలి. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రత్యేకంగా ఉపాధి, ఉద్యోగాలలో అవకాశాలు ఇవ్వాలి. 1-7 తరగతుల వరకు తెలుగు మాధ్యమంలో బోధన జరగాలి. కాదంటే.. కేజీ నుండి పీజీ వరకు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విశ్వవిద్యాలయాల్లో తెలుగును తప్పనిసరి చేయాలి. విజ్ఞాన, సాంకేతిక, కంప్యూటర్ రంగాల్లో తెలుగు నిఘంటువు, ఆధునిక పరిజ్ఞానం ప్రతి ఆంగ్లపదానికి సమానార్థం వెతికే యజ్ఞం నిరంతరం సాగాలి. వ్యాపార ప్రకటనలు, దుకాణాల ముందు బోర్డులు తెలుగులో రాయించాలి. అమ్మభాష రాకపోతే అవతల భాషపై పట్టురాదన్న వాస్తవాన్ని అందరూ గ్రహించేటట్టు చేయాలి. గిరిజన ఆదివాసీ ప్రాంతీయ భాషలను రక్షించాలి. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయ సంకల్పంతో చట్టాలను రూపొందించి భాష మనుగడకు చిత్తశుద్ధితో పాలకులు అడుగులేస్తే అనతికాలంలోనే అధికార భాషగా తెలుగు అమలు జరిగి తీరుతుందనడంలో సందేహంలేదు. మా పిల్లలు తెలుగులోనే మాట్లాడాలి, చదవాలి అనే భావన తల్లిదండ్రుల్లో రావాలి. వెర్రి ఆంగ్లమోజు తగ్గాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి భాష మనుగడకు ఉద్యోగ, ఉపాధి కల్పన చేసేలా పోరాడాలి. తెలుగు జాతిలో మరో భాష పరిరక్షణ ఉద్యమం స్వతంత్ర పోరాటాన్ని తలపించేలా చేయాలి. ‘‘మాతృభాష మాత్రమే మానవ పరిపూర్ణ వికాసానికి ప్రాణం పోస్తుందనేది’’ గొప్ప సత్యాన్ని మరవరాదు. కన్నడ, తమిళ రాష్ట్రాల పాలకుల భాషాభిమానాన్ని చూడండి! తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తే, మాతృభాష ‘‘జ్ఞానాన్ని, సృజనాత్మకతను’’ పెంచుతుంది. ‘‘మాతృభాష కన్నయితే, ఆంగ్లభాష కళ్లజోడు లాంటిది.’’ అసలు కన్నంటూ ఉంటేగా కళ్లజోడుతో అవసరం ఉండేది! ఇప్పటి తీరుగా భాషమనుగడను గాలికి జాలికి వదిలితే జాతి, సంస్కృతి అంతమవుతుందనేది మరవరాదు? హాలుని గాథాసప్తశతి క్రీస్తు శకం ఒకటో శతాబ్దం ప్రాంతానిది. అప్పటికే తెలుగు మాటలున్నట్లు చరిత్ర చాటుతుంది. లోతైన మూలాలు కలిగిన మురిపాల తెలుగు భాషను కాపాడుకోవడానికి నిష్టతో పనిచేద్దాం..! (అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా) మేకిరి దామోదర్, కన్వీనర్, తెలంగాణ సామాజిక రచయితల సంఘం మొబైల్ : 9573666650 -
తెలుగు భాషను కాపాడుకుందాం
మాతృభాషకు ప్రాధాన్యమిస్తామని పార్టీలు మేనిఫెస్టోల్లో చేర్చాలి తెలుగు భాషోద్యమ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి శౌరీ నీలా(రెంజల్), న్యూస్‌లైన్: తెలుగు భాషకు ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇస్తూ అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో చే ర్చాలని తెలుగు భాషోద్యమ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి శౌరీ డిమాండ్ చేశారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా మాతృభాష తెలుగేనని అన్నారు. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజ కీయ పార్టీల ప్రతినిధులను కలిసి తెలుగుభాషను మాతృభాషగా అమలు చేస్తామని మేనిఫెస్టోల్లో చేర్చాలని కోరుతామన్నారు. సోమవారం మండలంలోని నీలా ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా శౌరీ మాట్లాడు తూ.. తెలుగుభాష కలుషిత మవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు రకాలుగా భాష నాశనమవుతోందన్నారు. మొదటిది తల్లిఒడిలో, రెండో బడిలో, మూడోది ఏలుబడిలోనని వివరించారు. తమిళనాడులో 60 శాతం, ఒరిస్సాలో 30 శాతం తెలుగువారున్నారని, అలాగే అన్ని రాష్ట్రాల్లో, ప్రపంచంలో తెలుగువారున్నారన్నారు. అన్య భాషాపదాలను నాశ నం చేయాలని సూచించారు. ఆంగ్లేయులు దేశం మొ త్తం పాలించారని, అన్ని రాష్ట్రాల్లో మాతృభాషను తప్పని సరిగా అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్నా మన రాష్ట్రంలో మాత్రం ఇంగ్లిష్ పద్ధతులనే పాలకులు పాటిస్తున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి వరకు మాతృభాష తప్పనిసరని, మన రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు తెలుగు లేకుం డానే చదువుకుంటున్నారనిఅన్నారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ.. యూనెస్కో నిర్వహిం చిన పరిశోధనలో మాతృభాషల ఉనికి తగ్గుతోందని పేర్కొందని అందులో తెలుగు సైతం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా తల్లిదండ్రులు ఇంగ్లిష్ చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఇంగ్లిషతోపాటు మాతృభాషను మర్చిపోవద్దని కోరారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గణేష్‌రావు, తెలుగు భాషోద్యమ సమాఖ్య బోధన్ అధ్యక్షురాలు దుర్గాబాయి, సలహాదారురాలు రాధారాణి తదితరులు పాల్గొన్నారు. -
విశ్వవీణ పాడుతున్న పాట
విభిన్న ప్రాంతాల్లో పోగుపడుతున్న వేర్వేరు విజ్ఞానదాయక సమాచారానికి సమగ్రతను సమకూర్చడం, దాన్ని భద్రపరచడం, రేపటి తరాలకు అందించడం తెలుగోడు సమర్థంగా నిర్వర్తించగలడని ప్రపంచం నమ్ముతున్నది. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలు గోడా!’ అన్నాడు వేముల పల్లి శ్రీకృష్ణ. తెలుగు వారికి ఒక రాష్ర్టర కావా లనే కోరికతో విశాలాంధ్ర సాధన దిశగా ఇచ్చిన ఆ పిలుపు ఆనాడు తన కర్త వ్యాన్ని నిర్వర్తించింది. దేశాల ఎల్లలు దాటి గ్లోబల్ విలేజ్ పేరిట విశ్వ గ్రామం రూపుదిద్దుకొంటున్న ఆధునిక ప్రపం చంలో విశాలాంధ్రను, ఆంధ్రప్రదేశ్‌ను, సీమాంధ్రను, తెలంగాణను దాటి విశాల విశ్వంలో తెలుగోడు తనను తాను తెలుసు కోవాలి; తన కర్తవ్యాన్ని సమీక్షించుకోవాలి; తిరిగి నిర్వచించుకోవాలి. చురుకు బుద్ధికి పాదరసం పోలిక అయినట్లు తెలుగోడి వ్యక్తి త్వానికి తగిన ఉపమానం ‘కలకండ’. తియ్యదనం భాష నుండి జాతికి సంక్ర మించిందో లేక జాతి నుండి భాషకు అలవ డిందో చెప్పడం కష్టర గానీ మాధుర్యర విష యంలో రెండూ సమానమే. తెలుగు భాష, తెలుగోడి వ్యక్తిత్వర రెండూ కలకండ పలుకు మాదిరే పైకి కించిత్ కఠినం, లోన ఆపాత మధురం. కాబట్టే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నెగ్గుకొస్తున్నాడు. రేపటి ప్రపంచ అవస రాలు తీర్చే బాధ్యతను తలెత్తుకోడానికి తగినట్లు తమను తాము దిదు కోడానికి తెలుగుజాతి సమాయ త్తర కావాలి. భౌగోళిక స్వరూప స్వభా వాల్లో, భాషా, సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక రాజకీయ వ్యవ హారాల్లో భిన్న భిన్న ప్రాంతాలకు వెళ్లిన తెలుగువారు ప్రతిచోటా తమ ప్రత్యేకతను నిలుపుకొం టూనే మాధుర్యాన్ని పంచుతు న్నారు. ఆ వ్యక్తిత్వమే అతడిని పరదేశాల్లో సైతం ఉన్నత పదవు లపై అధిష్ఠింపజేస్తున్నది. తెలుగు వారి జ్ఞానభాండా గారంలో చేరుతున్న సమాచా రంలో రాగాలు పలికించే రాతి స్తంభాల నిర్మా ణం నుండి అంతరిక్ష రహస్యాలను ఛేదించే ఉపగ్రహ నిర్మాణ, ప్రయోగాల దాకా ఉంది. చెట్టు చేమలతోసహా సమస్త జీవుల వృద్ధి, క్షయాలను నియంత్రించే పరిజ్ఞానం నుండి, మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనంద మయ జీవితాన్ని గడపడానికి తగిన జీవన ప్రణాళికా శాస్త్రాలు కళలు ఉన్నాయి. వ్యక్తులు, జాతుల వికాసానికి విజ్ఞానమే ప్రాణమనీ, జ్ఞానానికి, విజ్ఞానానికి, సమా చారమే మూలమని ఎరిగిన వారందరికీ తెలు గోడి పరిధిలోకి వస్తున్న సమాచార సంపద పరిమాణం గమనిస్తే ఇతరుకు అసూయ కలుగకమానదు. విభి న్న ప్రాంతాల్లో పోగుపడుతున్న వేర్వేరు విజ్ఞానదాయక సమాచా రానికి సమగ్రతను సమకూర్చ డం, దాన్ని భద్రపరచడం, రేపటి తరాలకు అందించడం తెలుగోడు సమర్థంగా నిర్వర్తించగలడని ప్రపంచం నమ్ముతున్నది. తమిళనాడులోని తెలుగు ప్రజల విద్యా సమస్యలను ప్రస్తా విస్తూ తమిళనాట మొత్తర జనా భాలో 42 శాతం తెలుగు ప్రజలు ఉన్నారని కుళితల నియోజకవర్గ ఎమ్మెల్యే లెక్క చెప్పారు. కర్ణాటక జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు తెలు గువారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస పురం నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ అన్న మాట ఇది. ఒరిస్సాలో 22 శాతం, మహా రాష్ర్టలో 16 శాతం తెలుగు ప్రజలు ఉన్నారు. కేరళ ముఖ్యపట్టణం తిరువనంతపురంలో కరమన ప్రాంతం (ఒక పేట)లో 500 తెలుగు కుటుంబాలున్నాయి. ఉత్తర కేరళ ప్రాంతం లోని తలచేరి తాలూకాలో 1000 దేవాంగుల కుటుంబాలున్నాయి. కేరళలోని తెలుగు వారై న ‘ఆండి పండారం’ అనే సంచార జాతి నేటికీ ప్రదర్శిస్తున్న ‘కూడియాట్టం’ అనే తెలుగు జానపద కళా రూపమే కేరళ ప్రసిద్ధ ‘కథాకళి’కి మూలం అంటారు. పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని మాళ్వ ప్రాం తంలో ‘కులోంగ్’ అనే తెలుగు సంచార కులం వారు 3 లక్షల మంది (ఈతాకుల చీపుర్లు తయారు చేసి అమ్మేవారు) ఉన్నారు. ఛత్తీస్ గఢ్లోని ఇంద్రావతి నది సమీపంలోని దక్షిణ బస్తర్‌లో వేలాది మంది, రాజస్తాన్‌లో వేలా దిగా గల ‘బహురూపి’ అనే సంచార జాతి జనులు తెలుగువారే. అంతెందుకు: భారత దేశంలోని సంచార జాతుల్లో సగం మంది తెలుగు వారే. శ్రీలంకలో తెలుగు మూలాలకు చెందిన ‘అహికుంటికలు’ అనే తెగలో జీవనోపాధిగా మగవాళ్లు పాములు ఆడిస్తే ఆడాళ్లు పచ్చ బొట్లు పొడుస్తారు. ‘రామ కులువర్’ అనే మరోతెగ కోతులను ఆడిస్తారు. ఇలా ప్రపం చం అంతటా వ్యాపించిన తెలుగు వారి జన సంఖ్య లెక్కిస్తే ఇరువది కోట్లకు పైమాటే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అం తర్జాతీయ ఐక్యత, విజ్ఞాన సమీకరణ, విశ్వ మానవ కల్యాణం, ప్రగతి కోసమై వినియోగం అనే లక్ష్యాల సాధనకు తెలుగోడి శక్తియుక్తులు ఉపయోగపడితేనే సార్థకత! (ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం) (వ్యాసకర్త సామాజిక కార్యకర్త) - పె. వేణు గోపాల రెడ్డి