మంత్రి పల్లె రఘునాథరెడ్డి
- సీఎం చంద్రబాబుకు సూచిస్తానని వెల్లడి
చెన్నై
దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక లెజిస్లేచర్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా చెన్నైలో పలు తెలుగు సంఘాల ప్రతినిధులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలలా తెలుగువారు స్థిరపడి ఉన్నారని తెలిపారు.
తమిళనాడులో తెలుగువారు నిర్బంధ తమిళం చట్టంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగానే స్థానికేతరులుగా ఇతర రాష్ట్రాల్లో సైతం పలు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. తెలుగువారందరి సమస్యలను ఆకళింపు చేసుకునేందుకు ఒక లెజిస్లేచర్ కమిటీ డెలిగేషన్‌గాఏర్పడి దేశవ్యాప్తంగా పర్యటించడం, కమిటీ సేకరించిన తెలుగువారి అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కార మార్గాలు కనుగొనవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో ఐటీ రంగంలో విప్లవాన్ని సాధిస్తున్నామని, జూన్, జూలై నాటికి ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ ఉన్న రాష్ట్రంగా రికార్డు సృష్టించనున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో ఐదు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. చెన్నైలో ఈనెల 20వ తేదీన నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో 27 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొనగా 15 మంది రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సుముఖత వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు.