ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషల పరిరక్షణార్థం ‘‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్స వంగా’’(ఫిబ్రవరి 21) ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ(విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ) యునెస్కో ప్రకటించింది. మాతృభాష కోసం కొంత మంది బెంగాలీ విద్యార్థులు పోరాడి ప్రాణాలను కోల్పోయారు. వారి త్యాగానికి నివాళిగా ఆ రోజున కనీసం అమ్మభాష గురించి ఆలోచించి ప్రణాళిక వేసి మాతృభాషల మనుగడకు ఆయా భాషలు మాట్లాడేవారు పూనుకోవాలన్న ఉద్దేశంతోనే దీనిని ప్రకటించారు. యునెస్కో సర్వేలో ఆంగ్లభాష అనే రోడ్డు రోలరు కిందపడి బక్కచిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగైపోయాయని తేలింది. ప్రపంచంలో సుమారు 7105 భాషల్లో, 230 భాషలు అంతరించాయి. ఇంకా 2956 భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో చెబుతున్నది. ఇందుకు కారణం పరభాష మీద మోజు- మాతృభాషపై శ్రద్ధ, ప్రేమ లేకపోవడమే. తెలుగు భాష పరిరక్షణకు నడుం కట్టకపోతే అంతరించే భాషల్లో చేరే అవకాశముంది. సృజనకూ, అమ్మభాషకూ ఆత్మీయ చుట్టరికం ఉంది. అమ్మభాషలోనే ఆలోచించగలిగినపుడే సృజన పురి విప్పుకుంటుంది కదా! జపాన్, చైనా, రష్యా, జర్మనీ, ఫ్రెంచ్, అరబిక్, పార్సీస్, స్పెయిన్‌లాంటి దేశాలు వారి వారి మాతృభాషల సాయంతోనే ఆర్థికాభివృద్ధి చెంది ఖ్యాతిని గడిస్తున్నాయి. ఇది ఎవరూ కాదనలేని నిజం!
మాతృభాషను ప్రేమించు, భాషలన్నింటిని గౌరవించు, పరభాషను హరించకు అన్న రాజ్యాంగ స్ఫూర్తితోనైనా పాలకులారా! పరభాష మోజు వీడండి? ‘‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టెయ్యి’’ అనే చందంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. ‘‘అన్యభాష నేర్చి ఆంధ్రంబు రాదను సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’’ అన్న కాళోజీ మాటలు గుర్తుకు తెచ్చుకోండి. ఎన్నికలకు ముందు నేతలు వారి మాతృభాషలో మాట్లాడి ఓట్లేయించుకున్న వాళ్లే భావవ్యక్తీకరణ, భావోద్వేగాలకు ఆయువుపట్టు అమ్మభాషని మీకే ఎక్కువ తెలుసు? తెలుగు భాషకు చీకటంటూ లేనే లేదు. ప్రకాశం, ప్రచారం కల్పించాలనే చిత్తశుద్ధి పాలకులకు లేకపోవటమే చీకటి..! మాతృభాష మనుగడకు ఇప్పటికైనా కొన్ని చర్యలు తీసుకోవాలి. పాలకులతో పాటు తెలుగుజాతి కూడా నిండు మనస్సుతో యునెస్కో మాతృభాషల పరిరక్షణ ఇచ్చిన ప్రేరణ, మన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతిజ్ఞపూని అమలుకు దిగాలి.
శిశువుకి తొలి గురువు అమ్మ. ఆ అమ్మ ఒడి నుంచి నేర్చుకునే భాష మాతృభాష. అప్రయత్నంగా, ఏ ఇబ్బందీ లేకుండా నేర్చుకునే భాష ఇదే. దీని ద్వారానే రసానుభూతి, ఉత్తమ సంస్కారం, మానవతా విలువలు, సామాజిక నైతిక విలువలు పెంపొందుతాయి. భాష ఒక సమాజపు సొత్తు. ప్రతి తరం ఆ అద్భుత సంపదను కాపాడడానికి తమ వంతు కృషి చేస్తూనే ఉండాలి. బిడ్డ శారీరకంగా ఎదగడానికి తల్లిపాలు ఎంత అవసరమో, మానసిక ఎదుగుదలకు అమ్మభాష కూడా అంతే అవసరం.
ఏ భాషకైనా చతుర్విధ ప్రక్రియల ద్వారానే- వినడం, మాట్లాడడం, చదవడం, రాయడంతోనే భాషాభివృద్ధి జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ శాఖలో పాలన, న్యాయ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరగాలి. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రత్యేకంగా ఉపాధి, ఉద్యోగాలలో అవకాశాలు ఇవ్వాలి. 1-7 తరగతుల వరకు తెలుగు మాధ్యమంలో బోధన జరగాలి. కాదంటే.. కేజీ నుండి పీజీ వరకు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విశ్వవిద్యాలయాల్లో తెలుగును తప్పనిసరి చేయాలి. విజ్ఞాన, సాంకేతిక, కంప్యూటర్ రంగాల్లో తెలుగు నిఘంటువు, ఆధునిక పరిజ్ఞానం ప్రతి ఆంగ్లపదానికి సమానార్థం వెతికే యజ్ఞం నిరంతరం సాగాలి. వ్యాపార ప్రకటనలు, దుకాణాల ముందు బోర్డులు తెలుగులో రాయించాలి.
అమ్మభాష రాకపోతే అవతల భాషపై పట్టురాదన్న వాస్తవాన్ని అందరూ గ్రహించేటట్టు చేయాలి. గిరిజన ఆదివాసీ ప్రాంతీయ భాషలను రక్షించాలి. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయ సంకల్పంతో చట్టాలను రూపొందించి భాష మనుగడకు చిత్తశుద్ధితో పాలకులు అడుగులేస్తే అనతికాలంలోనే అధికార భాషగా తెలుగు అమలు జరిగి తీరుతుందనడంలో సందేహంలేదు.
మా పిల్లలు తెలుగులోనే మాట్లాడాలి, చదవాలి అనే భావన తల్లిదండ్రుల్లో రావాలి. వెర్రి ఆంగ్లమోజు తగ్గాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి భాష మనుగడకు ఉద్యోగ, ఉపాధి కల్పన చేసేలా పోరాడాలి. తెలుగు జాతిలో మరో భాష పరిరక్షణ ఉద్యమం స్వతంత్ర పోరాటాన్ని తలపించేలా చేయాలి. ‘‘మాతృభాష మాత్రమే మానవ పరిపూర్ణ వికాసానికి ప్రాణం పోస్తుందనేది’’ గొప్ప సత్యాన్ని మరవరాదు. కన్నడ, తమిళ రాష్ట్రాల పాలకుల భాషాభిమానాన్ని చూడండి! తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తే, మాతృభాష ‘‘జ్ఞానాన్ని, సృజనాత్మకతను’’ పెంచుతుంది. ‘‘మాతృభాష కన్నయితే, ఆంగ్లభాష కళ్లజోడు లాంటిది.’’ అసలు కన్నంటూ ఉంటేగా కళ్లజోడుతో అవసరం ఉండేది! ఇప్పటి తీరుగా భాషమనుగడను గాలికి జాలికి వదిలితే జాతి, సంస్కృతి అంతమవుతుందనేది మరవరాదు?
హాలుని గాథాసప్తశతి క్రీస్తు శకం ఒకటో శతాబ్దం ప్రాంతానిది. అప్పటికే తెలుగు మాటలున్నట్లు చరిత్ర చాటుతుంది. లోతైన మూలాలు కలిగిన మురిపాల తెలుగు భాషను కాపాడుకోవడానికి నిష్టతో పనిచేద్దాం..!
(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా) మేకిరి దామోదర్, కన్వీనర్, తెలంగాణ సామాజిక రచయితల సంఘం
మొబైల్ : 9573666650