గొప్ప చరిత్రతో వారసత్వ సంపద అయిన తెలుగు పదికాలు బతకాలి. భాషా పండుగలు ఇందుకెంతో మేలు చేస్తాయి. ఈ స్ఫూర్తి కొనసాగాలి. భాషను బతికించడానికి ఉద్యమాల సంగతెలా ఉన్నా, ఉన్న చట్టాల అమలు ముఖ్యం. 40 శాతం మంది మాతృభాషను చదవడం, రాయడం మానివేసినప్పట్నుంచి ఈ భాష అతి స్పల్ప కాలంలో మృతభాషగా మారే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి (యూఎన్)కి చెందిన ‘యునెస్కో’ హెచ్చరిం చింది. ఇంగ్లీషుపై ఇటీవలి మోజు, కార్పొరేట్ విద్యాసంస్థలు సృష్టిస్తున్న ‘పోటీ’ మాయ, ఆశావహులైన తల్లిదండ్రుల భ్రమ, ప్రభుత్వాల అచేతన... వెరసి నేటితరంలో అత్యధికులు మాతృభాష రాయడం, చదవడం రాని దుస్థితిలోకి జారుతున్నారు. పరిపాలన వ్యవహారాలు తెలుగులో సాగాలని డిమాండ్ చేయలేని తరం తయారైనా ఆశ్చర్యం లేదు.
కానీ, అక్షరాస్యతా శాతాలు, ప్రమాణాలను బట్టి చూస్తే తెలుగులో అధికారిక వ్యవహారాలే సామాన్యులకు మేలు. సృజన వృద్ధికి, మేధో పరిణతికి, సంస్కృతీ వికాసానికి, ప్రజాభాషలో పాలనా వ్యవహారాలకు.. తెలుగును కాపాడుకోవడమే కర్తవ్యం. ప్రాథమిక స్థాయి విద్యాబోధన మాతృభాషలోనే సాగాలని, 1993లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం 350 అధికరణమూ ఇదే చెబుతోంది. తెలుగును అధికార భాషగా 1966లో శాసనం ద్వారా ప్రకటించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1898)ని సవరిస్తూ కేంద్రం 1974లో చట్టం తెచ్చింది. నిబంధనలు 137 ప్రకారం సివిల్ కోర్టుల్లో, 272 ప్రకారం క్రిమినల్ కోర్టుల్లో (హైకోర్టు కాకుండా) అధికార భాష ఏముండాలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 1974లో ఇచ్చిన ఉత్తర్వు (జీవో:485) ప్రకారం క్రిమినల్ కోర్టుల్లో తెలుగును అధికార భాషగా పరిగణించాలి. కానీ, అమలు శూన్యం. 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారమైనా, పౌరులు కోరేదైనా స్థానిక/అధికార భాషలో అందించాలి. పౌర సమాజం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఇవన్నీ సాధించుకోవాలి.
..: దిలీప్‌రెడ్డి
వైతాళికులు భాగ్యరెడ్డివర్మ
సంఘసంస్కర్తగా హరిజనోద్ధ్దరణకు కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ దళితుడు. 1932లో ఆయన రాసిన ‘వెట్టి మాదిగ’ ఒక దళితుని కథ. ఇది తెలుగులో దళితుడు రాసిన మొదటి కథ కూడా. 1914లో ఆయన హైదరాబాద్‌లో బ్రహ్మసమాజం స్థాపించారు. 1915లో సంఘసంస్కార నాటక మండలిని స్థాపించారు. ఈ మండలి ద్వారా హరిజన కళాకారులు నాటకాలను ప్రదర్శించేవారు. 1931లో ‘భాగ్యనగర్’ పత్రికను స్థాపించారు. 1937లో దీనిని ‘ఆది హిందూ పత్రిక’గా మార్చారు. సామాన్య ప్రజల్లో గొప్ప అభిమానాన్ని, ఆదరణను చూరగొన్న భాగ్య రెడ్డివర్మ ఆర్యసమాజం ద్వారా ప్రజల్లో అంటరానితనం, స్త్రీ విద్య, వితంతు వివాహాలు, విగ్రహారాధన వంటి మూఢ నమ్మకాల నిర్మూలనకు కృషి చేశారు.
తెలుగులో తొలి రాజనీతి గ్రంథం
కాకతీయ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత సామంతులు, దండనాథులు చిన్న చిన్న రాజ్యాలను ఏర్పరుచుకున్నారు. ప్రతాపరుద్రుని సేనాని ముప్ప భూపతి సచ్చ రాష్ట్రానికి (కరీంనగర్ జిల్లా) అధిపతి అయ్యాడు. ఆ ముప్ప భూపతి ఆస్థాన కవి మడికి సింగన. పద్మపురాణోత్తర ఖండం, భాగవత దశమస్కంధం, వాసిష్ట రామాయణం, సకల నీతి సమ్మతం గ్రంథాలను రాశాడు సింగన. పురాణాల నుంచి అద్భుతమైన అంశాలను తీసుకుని కావ్యాన్ని రాయడం ఆయన ప్రారంభించిన కొత్త ప్రక్రియ. ఆయన రాసిన సకల నీతి సమ్మతం కూడా గొప్పప్రయోగం. సకల నీతి సమ్మతంలో సమాజానికి అవసరమైన సర్వనీతులూ పొందుపరిచాడు. ఇందులో ప్రస్తుతం మూడు ఆశ్వాసాలే లభిస్తున్నాయి. కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఆ పరిస్థితి చక్కబడాలంటే పాలకులకు రాజనీతి పరిజ్ఞానం అవసరం. అందుకే చాణుక్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన విషయాలు, భోజరాజు అనుసరించిన రాజనీతి సూత్రాలు, కాకతీయులలోనే సమర్థుడైన మొదటి ప్రతాపరుద్రుడు నీతిసారంలో చెప్పిన మంచి విషయాలు, మహాభారత రామాయణాది కావ్యాలలోని రాజనీతి అంశాలను, ఇతర గ్రంథాలలోని పాటింపదగిన సంగతులను క్రోడీకరించాడు సింగన. పాలకులు అనుసరించాల్సిన రాజనీతిని వారికి కరతలామలకం చేశాడు.
- ప్రొ. కుసుమారెడ్డి
షడ్రుచుల ‘పద్యా’న్నం!
అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె, నేయి వోయ భ
గ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి, హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల గుంకుమ పత్రభంగ సం
జనిత నవీన కాంతి వెదచల్లగ గద్గద ఖిన్న కంఠిౖయె
అసలే సత్యభామ... ఆపై కోపం. నారదుడు తెచ్చిన పారిజాతం ఓ పువ్వే కావచ్చు. రుక్మిణి పక్కనుందని ఆ కృష్ణుడు ఇచ్చేయడమేనా? కోపం రాదేంటి. సత్య అలకను అల్లాటప్పగా చెప్పేందుకు తిమ్మనకు మనసొప్పలేదు. తైలవర్ణ చిత్రం గీసేందుకు ‘వర్ణా’లను సరిచూసుకున్నాడు. సత్య విసురుగా లేచింది... ఎలా? తోకతెగిన ఆడత్రాచులా, నేయిపోస్తే ఎగజిమ్మే జ్వాలలా! చింతనిప్పుల్లా కణకణమండే కళ్లు. కళ్ల ఎరుపు చెక్కిళ్ల ఎరుపుతో కలగలసి జేవురించిన మొహం. అదుపు తప్పిన స్వరం. ఇదీ సత్య ఉగ్రరూపం. ఆవేశం, ఆక్రోశం, ఉక్రోషం ముప్పిరిగొన్న గొంతుకతో సఖితో ఆరా తీయసాగింది. తిమ్మన్న సత్యభామను దూరంలో త్రాచులా, కాస్త దగ్గరలో ఎర్రబడిన కళ్లతో, అతి దగ్గరలో వణుకుతున్న స్వరంతో... మూడు దశల్లో త్రీడీ చిత్రంలా చూపాడు. పద్యం కవితోపాటు పాఠకుల్ని చెలికత్తెగా మార్చి సత్య వద్ద నిలబెట్టినట్టు లేదూ!
సామెత
‘ఊరంతా వడ్లెండ బెట్టుకుంటే నక్క తోక ఎండబెట్టుకొన్నదట’ ఇంకొకరిని అనుకరించి అభాసుపాలయ్యేవారిని ఉద్దేశించి ఈ సామెత ప్రయోగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment