First Time In History, High Court Was Given Verdict In Regional Language In Land Dispute Case - Sakshi
Sakshi News home page

HC Judgement In Telugu Language: రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలిసారి తెలుగులో తొలి తీర్పు 

Published Fri, Jun 30 2023 3:47 AM | Last Updated on Fri, Jun 30 2023 9:00 AM

Judgment in land dispute case in 45 pages in telugu  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలిసారి ఓ తీర్పు తెలుగు భాషలో వెలువడింది. ఉమ్మడి హైకోర్టు చరిత్రలోనూ ప్రాంతీయ భాషలో ఉత్తర్వులు రావడం ఇదే మొదటిది కావడం విశేషం. సికింద్రాబాద్‌ మచ్చ బొల్లారంలోని ఓ భూ వివాదానికి సంబంధించి దాఖలైన అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం ఈ నెల 27న 45 పేజీల తీర్పును  తెలుగులో ఇచ్చింది.

ఈ కేసులో విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు అధికారిక కార్యకలాపాల కోసం ఆంగ్లంలో కూడా ప్రతిని వెలువరించింది.

కొన్ని ఆంగ్ల పదాలకు సందర్భానుసారం తెలుగు పదాలు అందుబాటులో లేకపోవడంతో, మరికొన్ని ఆంగ్ల పదాలు జన బాహుళ్యంలో ఎక్కువగా వినియోగంలో ఉండటంతో వాటిని తీర్పు కాపీలో ఆంగ్లంలోనే పేర్కొన్నారు. ఇదిలాఉండగా, దేశంలో ప్రాంతీయ భాషలో హైకోర్టు తీర్పు వెలువరించడం ఇది రెండోసారి. కేరళ హైకోర్టు గతంలో అక్కడి స్థానిక భాషలో తీర్పునిచ్చింది. 

కేసు ఇదీ.. 
మచ్చబొల్లారంలో సర్వే నంబర్‌ 162, 163లో కె.వీరారెడ్డికి 13.01 ఎకరాల భూమి ఉండేది. వీరారెడ్డికి ఇద్దరు కొడుకులు. వీరారెడ్డి మరణానంతరం అందులో 4.08 ఎకరాలు తల్లి సాలమ్మకు ఇచ్చి మిగిలినది కొడుకులిద్దరు పంచుకున్నారు. సాలమ్మ జీవించి ఉండగానే ఆమె భూమిని వాదప్రతివాదులు మౌఖిక అగ్రిమెంట్‌ ప్రకారం చెరోసగం తీసుకున్నారు. 2005లో సాలమ్మ చనిపోవడంతో తనకు ఆమె ద్వారా సంక్రమించిన ఆస్తిని మ్యుటేషన్‌ చేయాలని ఒక కుమారుడు కె.చంద్రారెడ్డి మండల రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు.

సాలమ్మ రాసిన వీలునామాపై మరో కుమారుడు కె.ముత్యంరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ వారసత్వ చట్టం–1956 ప్రకారం హిందూ మహిళ తన భర్త నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి (4.08 ఎకరాలు)ని భర్త వారసులకు బదలాయించాలని, భారత వారసత్వ చట్టం–1925కు అనుగుణంగా వీలునామా లేదని, సాలమ్మను 80 ఏళ్ల వయసులో భయపెట్టి వీలునామా రాయించారని, కాబట్టి ఆమె ఆస్తిని వారసులందరికీ సమంగా పంచాలన్నారు.

వీరి వాదనలను కిందికోర్టు ఆమోదించింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ చంద్రారెడ్డి హైకోర్టులో అప్పీల్‌ చేశారు. దీనిపై జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ నగేశ్‌ ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement