
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.ఇన్ తాజాగా తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ పోర్టల్ ఇంగ్లిష్, హిందీలో సేవలు అందిస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్‌లో కస్టమర్లకు భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. రానున్న పండుగల సీజన్లో మరో 20–30 కోట్ల మంది వినియోగదార్లను చేరుకోవడానికి ఇది దోహదం చేస్తుందని వివరించింది. కస్టమర్లు తమకు అనువైన భాషలో డీల్స్, డిస్కౌంట్లను తెలుసుకోవడం, ఉత్పత్తుల సమాచారం చదువుకోవడం, ఖాతాల నిర్వహణ, ఆర్డర్లు, చెల్లింపులు జరిపేందుకు మార్గం సుగమం అయిందని అమెజాన్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్, మార్కెటింగ్ డైరెక్టర్ కిశోర్ తోట ఈ సందర్భంగా తెలిపారు. నాలుగు భాషల చేరిక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్, మొబైల్, డెస్క్‌టాప్ సైట్స్‌లో వినియోగదార్లు తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. కస్టమర్ సర్వీసు సిబ్బందితో తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళంలో మాట్లాడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment