తెలుగు ఉనికి నిజంగానే ప్రమాదంలో ఉందా?
తేనెలూరే ఈ భాష మరో మూడు తరాల తర్వాత మరి వినిపించదా?
సగటు తెలుగువాడిలో ఎక్కడో కలవరం!
ఇంటా బయటా అన్ని స్థాయిల్లోనూ మార్పు రావాలి తప్ప ఇలా సభలూ సమావేశాలతో ఏమవుతుంది?
ఎక్కడో తెలియని అనుమానం!!
కానీ...
ఇసుకేస్తే రాలనట్టుగా పోటెత్తిన జనం సాక్షిగా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ప్రపంచ తెలుగు మహాసభలు సాగిన ఐదు రోజులూ తల్లి భాషకు అక్షరాలా బ్రహ్మోత్సవమే జరిగింది. ప్రారంభోత్సవానికే వన్నె తెచ్చిన బాణసంచా మిరుమిట్లు కూడా తెలుగు వెలుగుల ముందు చిన్నబోయాయి. ఎల్బీ స్టేడియం మొదలుకుని రవీంద్రభారతి దాకా వేదికలన్నీ తెలుగు సాహితీ రస ప్రవాహ ఝరిలో మునిగి తేలాయి. సాహితీ గోష్టి, కవి సమ్మేళనం, అవధానం... ఇలా అనేకానేక ప్రక్రియలతో ఆహూతులను ఉర్రూతలూగించాయి. ఇసుకేస్తే రాలనంతగా పోటెత్తిన జనాన్ని నియంత్రించేందుకు ఒక దశలో పోలీసులూ రంగంలోకి దిగాల్సి వచ్చింది!! సభా వేదికల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశువుగా పాడిన పద్యాలు సభలకే వన్నె తెచ్చాయి. ఇదంతా కళ్లారా చూసిన భాషాభిమానుల మనసులు ఉప్పొంగాయి. మన తేనెలూరు తెలుగుకు వచ్చిన ప్రమాదమేమీ లేదని మహాసభల సాక్షిగా నిరూపితమైంది!!
తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత జరుగుతున్న తొలి సభలు కావటంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎల్బీ స్టేడియంతో పాటు మరో ఐదు వేదికల్లో ‘న భూతో’ అన్న రీతిలో సభలను నిర్వహించింది. ప్రతి రోజూ 30 వేల మందికి పైగా సభలకు పోటెత్తినట్టు అంచనా. 1,500 మంది కవులు, 500 మంది రచయితలు పాల్గొన్నారని, 100 సదస్సులు నిర్వహించి 250 కొత్త పుస్తకాలు, భాషా ప్రక్రియలపై 10 సీడీలు, 10 ప్రత్యేక సంచికలు ఆవిష్కరించినట్టు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ప్రకటించారు. భావి సదస్సులకు ఈ సభలు మార్గదర్శక ముద్ర వేశాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడిక సగటు భాషాభిమానులంతా తెలుగుకు మరింతగా జవసత్వాలు కల్పించే దిశగా జనవరిలో ముఖ్యమంత్రి వెలువరించబోయే నిర్ణయాల కోసం ఆశగా, ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
– సాక్షి, హైదరాబాద్
భాషకు బ్రహ్మోత్సవం
Published Wed, Dec 20 2017 2:32 AM | Last Updated on Wed, Dec 20 2017 2:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment