కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం అన్నది పాతమాట. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా, అసలు తెలుగులోనే కంప్యూటర్లు ఎందుకు ఉండకూడదూ అని ఆలోచిద్దాం.కంప్యూటర్లు వాడుకలోనికి రావడం మొదలైననాటి నుండి వాటిలో (ఆంగ్లేతర) మానవ భాషల వినియోగానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంత సాంకేతిక అభివృద్ధి జరిగిన తర్వాత, ఇప్పటికైనా మామూలు తెలుగువాడు కంప్యూటర్ని తెలుగులోనే వాడుకోగలడా!? అయితే, ఎంతవరకూ వాడుకోగలడు? దీన్ని నాలుగు స్థాయుల్లో చూద్దాం. కంప్యూటర్ అంటే స్మార్టు ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు కూడా.
ఒకటో స్థాయి: తెలుగు చూడటం, టైపు చెయ్యడం
ఈ స్థాయిలో కంప్యూటర్లు తెలుగులో సమాచారాన్ని తెరపై చూపించగలగాలి. మనకి టైపు చేసే వీలు కల్పించాలి. నేడు మనం ఈ స్థాయిని చాలావరకు చేరాం అని చెప్పవచ్చు. అన్ని రకాల కంప్యూటర్లలోనూ (విండోస్, గ్నూ/లినక్స్, మ్యాకింటోష్), కొత్త స్మార్టు ఫోన్లలోనూ (ఆండ్రాయిడ్, ఐఓస్, విండోస్) ఇప్పుడు మనం తెలుగు సమాచారాన్ని చూడవచ్చు, వీటిలో టైపు చెయ్యవచ్చు కూడా. ఈ పరికరాలన్నీ కూడా ఇప్పుడు కనీసం ఒక తెలుగు ఫాంటుతో వస్తున్నాయి. ఇక టైపు చెయ్యడానికి మనం కీబోర్డు సెట్టింగులలో తెలుగు భాషను ఎంచుకుంటే చాలు. చాలా వరకూ తెలుగు ఇన్‌స్క్రిప్టు కీబోర్డు లేయవుట్లు ఉంటుంది. మనకి ఇప్పటికే ఆపిల్, మాడ్యులర్ వంటి లేయవుట్లు తెలిసివుంటే, వాటితోనూ టైపు చేసుకోడానికి అప్లికేషన్లూ దొరుకుతున్నాయి.
అంతర్జాలంలో మనకు అన్ని అవసరాలకు ఉపయోగపడే తెలుగు సమాచారం అందుబాటులో లేదు. తెలుగు వార్తా పత్రికల సైట్లు, తెలుగు బ్లాగులు, తెలుగు వికీపీడియా, మరి కొన్ని గాసిప్ సైట్లూ తప్ప అంతర్జాలంలో తెలుగు పెద్దగా లేదన్నది ఒక వాదన. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వెబ్ సైట్లూ అరకొరగానే తెలుగులో ఉన్నాయి. కానీ ఈ మధ్య ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో తెలుగులో రాసేవారు బాగా పెరిగారు.
రెండో స్థాయి: తెరపై మొత్తం తెలుగు కనబడటం ఈ స్థాయిలో కంప్యూటరు గానీ, ఫోను గానీ మామూలు అవసరాలకు వాడుకోడానికి ఆంగ్లం అవసరం ఉండకూడదు. తెలుగుకి సంబంధించినంత వరకూ మనం ఈ స్థాయిలో మొదటి మెట్టు దగ్గరే ఉన్నాం. విండోస్, గ్నూ/లినక్స్ నిర్వాహక వ్యవస్థలను తెలుగు భాషలో వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కొరకు తెలుగు భాషా ప్యాక్‌లు మైక్రోసాఫ్ట్ వారి సైటు నుండి దింపుకోవచ్చు. మొజిల్లా ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి ఏవో కొన్ని అప్లికేషన్లు మాత్రమే తెలుగులో లభిస్తున్నాయి. ఇక అంతర్జాలం విషయానికి వచ్చేసరికి, గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సైట్లూ, ఆప్స్ తెలుగులో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ డాక్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, లిబ్ర ఆఫీస్ లోనూ కొంత వరకూ తెలుగు స్పెల్ చెకింగ్ అందుబాటులో ఉంది. కానీ తెలుగు వ్యాకరణాన్ని సరిచూసే వెసులుబాటు మాత్రం లేదు. మన దేశ కంపెనీలు పేటీఎమ్, 1ఎమ్‌జీ వంటి ఆప్స్ తెలుగులో కూడా ఉన్నాయి. వీటిని తెలుగులో వాడుకోడానికి, ఆయా ఆప్స్ సెట్టింగులలో మన భాషని తెలుగుగా ఎంచుకోవాలి. గూగుల్ మ్యాప్స్‌లో ఊర్లు, వీధుల పేర్లు ఈ మధ్య తెలుగులో కనిపిస్తున్నాయి. ఇదో శుభపరిణామం.
ఇన్ని ప్రోగ్రాములూ ఆప్స్ తెలుగులో అందుబాటులో ఉన్నా వీటిలోని అనువాదాలు అందరికీ అర్థమయ్యే విధంగా లేవనీ అనువాదాలలో నిలకడ, నాణ్యత లోపించాయనీ కూడా ఫిర్యాదులున్నాయి. మనం వాడి చూసి, తప్పులనూ దోషాలనూ ఆయా కంపెనీలకు నివేదించాలి. తెలుగు బాగా తెలిసిన వారినీ, అనువాదాలపై పట్టున్న వారినీ ఈ స్థానికీకరణ ప్రక్రియలో భాగస్వాములను చెయ్యాలి.
ఇంత చెప్పుకున్నా, రోజువారీ అవసరాలను పూర్తిగా తెలుగులోనే జరుపుకోగలమా అంటే లేదనే చెప్పాలి. ఈ దిశగా మనం ప్రభుత్వాలనూ, వ్యాపార సంస్థలనూ అడగాలి. తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడయ్యే, వస్తూత్పత్తులూ, సేవలూ, వాటి సంబంధిత సమాచారమూ తెలుగులో కూడా ఉండేవిధంగా మన ప్రభుత్వాలు విధానపరంగా చర్యలు చేపట్టాలి.
ఇంగ్లీషు లేకుండా కంప్యూటర్లు వాడుకోడానికి, కీబోర్డులు తెలుగులో కూడా ఉండాలి. గతంలో టీవీఎస్ కీబోర్డులు తెలుగు మీటలతో ఉండేవి. ఈ మధ్య సురవర వారు తెలుగు కీబోర్డులు అమ్మారు. అలాంటి ప్రయత్నాలు ఊపందుకోవాలి. భారతదేశంలో విక్రయించే స్మార్టు ఫోన్లలో తప్పనిసరిగా ప్రాంతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు ఉంది. కానీ కంప్యూటర్లకూ, వెబ్ సైట్లకూ ఇలాంటి ఉత్తర్వులు ఏమీ ఉన్నట్టు లేవు.
మూడో స్థాయి: కంప్యూటర్లు మన మాటల్ని అర్థం చేసుకొని తెలుగులోనే బదులివ్వగలగడం
ఐఫోన్లో సిరి, గూగుల్ అసిస్టెంట్, మైక్రోసాఫ్ట్ కోర్టానా, అమెజాన్ అలెక్సా వంటి ఉత్పత్తులు/సేవలు మన మాటల్ని ఇంగ్లీషు (ఇంకొన్ని భాషల్లో) అర్థం చేసుకుని బదులివ్వగలుగుతున్నాయి. కానీ, ఇవి తెలుగులో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు.
తెరపై తెలుగు పాఠ్యాన్ని చదవగలిగే ఉపకరణాలు ఉన్నా, అవి చదివింది వింటే తెలుగు విన్నట్టు ఉండదు. తెలుగు తీయదనాన్ని అవి నేర్చుకోలేదు. అది నేర్పవలసింది తెలుగువారం మనమే కదా. ఇక తెలుగులో ఉన్న రకరకాల మాండలీకాల్నీ యాసల్నీ, మనందరం మాట్లాడే పద్ధతులనీ అర్థం చేసుకుని అదే రీతిలో బదులివ్వాలంటే, చాలా పరిశోధన జరగాలి. ఈ దిశగా, ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాజెక్టులు, పరిశోధనలూ చెయ్యాలి.
నాలుగో స్థాయి: తెలుగులోనే కంప్యూటరు ప్రోగ్రామింగ్
తెలుగులో కంపైలరు తయారుచేయడానికి, తెలుగులో ప్రాగ్రామింగు రాయడానికి ఔత్సాహికుల చిన్ని చిన్ని ప్రయత్నాలు జరిగినా, ఒక స్థాయి చేరుకోడానికి ఇప్పటివరకూ జరిగిన ప్రయత్నాలు సముద్రంలో నీటు బొట్టు కాదు కదా పరమాణువంత లెక్క. ఈ నాలుగో స్థాయిని ప్రస్తుతానికి చేరుకోలేనిదిగా వదిలేయవచ్చు. కానీ, మనం కంప్యూటర్లో చిన్న చిన్న పనులు చక్కబెట్టుకోడానికి, పైపై ఆటోమేషన్లకు తేలిగ్గా వాడుకోగలిగేలా తెలుగు స్క్రిప్ట్ కూడా ఉంటే బాగుంటుంది.
మూడో స్థాయి వరకూ మనం ఎదగడానికి, తెలుగు భాషకి ప్రత్యేకించి తీరని సాంకేతిక ఇబ్బందులంటూ ఏమీ లేవు; కేవలం మన భాషంటే తేలికభావం, నిర్లక్ష్యం, ఉదాసీనత తప్ప! ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నైనా మనందరం మన అమ్మ భాషకి పునరంకితమై ఈ దిశగా కృషి చేయాలని ఆశిస్తున్నాను.
మొట్టమొదటి తెలుగు సామెతల సంకలనం 1868లో వెలువడిన ‘ఆంధ్రలోకోక్తి చంద్రిక’. సంకలన కర్త ఎం.డబ్ల్యూ. కార్. ఇందులో 2,200 సామెతలున్నాయి.
పుస్తకం విజ్ఞానధనం పదిలపరచిన తాళం కప్పలేని ఇనప్పెట్టె. – సూర్యప్రకాశ్
నిజమైన కళ ఆత్మనే సంస్కరిస్తుంది. కాని ఆ సంస్కారం కంటికి కనబడదు. చూసి విలువ కట్టలేము. – చలం
Comments
Please login to add a commentAdd a comment