computer programming
-
మధుమేహులకు వర్షిత తీపికబురు!
డయాబెటిస్ రోగికి రోజూ వేలికి సూది గుచ్చుకుని మరీ పరీక్ష చేస్తేగానీ... రక్తంలో చక్కెర మోతాదు ఎంత ఉందో తెలియదు. మరి అలాంటి అవసరమే లేకుండా దేహంలో షుగర్ ఎంత ఉందో చటుక్కున తెలిసిపోతే ఎంత బాగుంటుంది? క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాల్సి రావడం వల్ల నెలకు నాలుగైదు వేలు ఖర్చు తప్పదు. కానీ ఇలా రోజూ పరీక్షలు చేయిస్తున్నా సరే... నాలుగేళ్లు గడిచాక కూడా ఆ వ్యయం... నెల ఖర్చుకు మించకపోతే ఇంకెంత బాగుంటుంది? చక్కెర జబ్బు అంటూ పేరులో మాత్రమే తీపి ఉన్న డయాబెటిస్ అనే ఈ సమస్య రోజూ చేసుకోవాల్సిన చిన్నపాటి గాయాలతోనూ, వ్యయాలతోనూ చాలా బాధిస్తుంటుంది. కానీ ఇకపై అలాంటి బాధలేవీ లేకుండానే... మొబైల్సహాయంతోనే చక్కెర మోతాదును తెలుసుకునే యాప్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసింది దువ్వూరు వర్షిత. ఆ ప్రయత్నానికి సాంకేతికంగా సహాయపడ్డాడు విమల్ అనే ఇంజినీర్. కాలం కలిసొస్తే ఎలాంటి గుచ్చుకోవడాలు లేకుండా మన మొబైల్లోనే గ్లూకోమీటర్ రూపొంది... దాని సహాయంతో చక్కెర మోతాదులు చాలా తేలిగ్గా తెలుసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనీ, మహా అయితే మరో ఆర్నెల్లు లేదా ఏడాది లోపే ఇది అందుబాటులోకి రావచ్చంటున్నారు 20 ఏళ్ల వర్షిత, యువ ఇంజనీర్ విమల్ కుమార్ లు. వారిరువురూ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పిన విషయాలు డయాబెటిస్తో బాధపడుతున్న ఎందరికో తీపికబురు కాబోతున్నాయి. అవేమిటో తెలుసుకుందాం. ‘‘నా పేరు దువ్వూరు వర్షిత. మాది నెల్లూరు. పుట్టినప్పట్నుంచే టైప్–1 డయాబెటిస్ తో బాధపడుతున్నాను. ఒక్కోసారి ఒకేరోజు నాలుగైదుసార్లు సూదితో వేలిని గుచ్చుకుని చక్కెరను పరీక్షించుకోవాల్సి వచ్చేది. ఒక్కసారి పరీక్ష కోసం పెట్టే ఖర్చు రూ. 40 వరకు అయ్యేది. అంటే ఒక్కరోజుకు రూ. 160 అన్నమాట. అలా చూస్తే నెలలో కేవలం వైద్యపరీక్ష కోసమే ఐదువేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వచ్చేది. చిన్నప్పుడు పెద్దగా బాధ తెలియకపోయినా పెరుగుతున్న కొద్దీ వేదన మరింత ఎక్కువైంది. రోజులో ఇన్నిసార్లు పరీక్షల కోసం పెట్టే ఖర్చే కాకుండా... ఇక మందులు, ఇన్సులిన్ లాంటివాటికి ఎంతవుతుందో ఊహించవచ్చు. ఓ సగటు మధ్యతరగతి వారికి ఇది ఎంత పెద్ద మొత్తమో ఎవరికైనా తెలిసే విషయమే. ఎప్పటికైనా నాలాంటివాళ్లకోసం ఏదైనా చేస్తానంటూ పదేళ్ల వయసప్పుడే నాన్న దగ్గర ఓ సంకల్పం తీసుకున్నా. అందుకే ఐఐటీకి క్వాలిఫై అయి, అందులో చేరాక కూడా బయోటెక్నాలజీపై ఆసక్తితో బయటకి వచ్చి చెన్నైలో ఆ కోర్సులో చేరాను. కోయంబత్తూరులో 2019లో ఓ హ్యాకాథాన్ (కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై తమ తమ భావాలు, ఆలోచనలు పంచుకునే సదస్సు) నిర్వహించారు. అక్కడ పరిచయమయ్యారు తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన విమల్‌కుమార్ అనే యువ ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఈ హ్యాకాథాన్లో నా ఆలోచనలను వివరించా. తన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సామర్థ్యంతో నా ఐడియాలను సాకారం చేయవచ్చని విమల్‌తో మాట్లాడినప్పుడు తెలిసింది. అంతే... మేమిద్దరమూ కలిసి మా ప్రాజెక్టు కోసం పనిచేయడం ప్రారంభించాం. ఇందుకోసం రూపొందించిన గ్లూకోమీటర్ కూడా చాలా సింపుల్‌గా పనిచేస్తుంది. నిజానికి ఇదో చిన్న పెన్ డ్రైవ్ తరహాలో ఉండే పరికరం. దీన్ని మన మొబైల్‌కి జతచేయాలి. అక్కడ మన వేలిని ఉంచితే చాలు... ఎలాంటి సూదిగాయాలూ, నొప్పి లేకుండానే మన రక్తంలోని చక్కెర మోతాదులు తెలిసిపోతాయి’’ అంటూ తమ ప్రాజెక్టు గురించి వివరించింది వర్షిత. ‘‘ఇది వన్ టైమ్ ఎక్స్పెన్స్ ఎక్విప్మెంట్. అంటే ఒక్కసారి కొంటే చాలు ఎప్పటికీ వాడుకునేలా రూపొందించిన డివైస్ ఇది. నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ (ఎన్ఐఆర్) అనే సాంకేతికత సహాయంతో ఎలాంటి గాటూ లేకుండానే మన దేహంలోని చక్కెరను అంచనా వేస్తుంది ‘ఈజీ లైఫ్’ అనే పేరున్న ఈ పరికరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో చక్కెర విలువలను విశ్లేషించడం వల్ల నిమిషంలోపే షుగర్ రీడింగ్స్ మనకు తెలిసిపోతాయి. ఎక్కడైనా ఎప్పుడైనా నిస్సంకోచంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు’’ అంటూ వివరించారు విమల్. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సులో వర్షిత, విమల్‌ల ఈ ‘స్టార్ట్ అప్’ ప్రథమస్థానంలో నిలిచింది. అంతేకాదు ‘ఎమ్పవర్–2021’ పేరిట గతేడాది నిర్వహించిన ‘వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాంపిటీషన్’లో రన్నరప్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు... ‘ఎన్ఐటీటీఈ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్’ హ్యాకథాన్‌తో పాటు మరికొన్ని సదస్సుల్లోనూ వీరి ఆవిష్కరణ అనేక బహుమతులను గెలుచుకుంది. గతంలో దుబాయిలో గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించిన ఓ సదస్సులో దాదాపు 42 దేశాల నుంచి యువతులు పాల్గొన్నారు. ‘టై ఉమన్ గ్లోబల్ పిచ్–2021 హైదరాబాద్ చాప్టర్’ ప్రాజెక్టును ప్రోత్సహించి... వర్షితను ఆ సదస్సు కు పంపినప్పుడు అక్కడ కూడా ఆమె ప్రాజెక్టుకు మంచి ప్రశంసలు దొరికాయి. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన గ్రేలాజిక్ టెక్నాలజీస్ అండ్ ఎడిఫై పాత్ సంస్థల డైరెక్టర్ వర్ల భానుప్రకాశ్‌రెడ్డి... ఈ ప్రాజెక్టుకు మెంటార్‌గా, ప్రమోటర్‌గా వర్షిత, విమల్లకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పరిశోధనలో పాలు పంచుకునేలా అనేక ఇతర సంస్థలను సైతం వీరి ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో రూపొందించనున్న ఈ ప్రాజెక్టుకు ‘వివాలైఫ్’ అని పేరు పెట్టుకున్నారు. వీళ్ల పరిశోధనలకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా నిలిచింది. -
దరఖాస్తు చేయకుండానే ముంబైకర్‌కు రూ.1.2 కోట్ల వేతనం
ముంబై: ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ల్లో చదివి ప్రఖ్యాత సంస్థల్లో రూ.కోట్ల వేతనాల కొలువులు పొందడం చూశాం. కానీ, అబ్దుల్లా ఖాన్(21) విషయం వేరు. ముంబైకి చెందిన ఈ ఇంజినీరింగ్ విద్యార్థి ఏడాదికి రూ.1.2 కోట్ల వేతనంతో గూగుల్ సంస్థలో ఉద్యోగంలో చేరబోతున్నాడు..! ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయకుండానే ఈ ఘనత సాధించాడు. అదెలా? సౌదీ అరేబియాలో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న అబ్దుల్లా ఖాన్ ముంబైకి వచ్చి ఐఐటీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ముంబై మీరా రోడ్డులో ఉన్న శ్రీ ఎల్ఆర్ తివారీ ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. కంప్యూటర్ కోడింగ్ అంటే ఇష్టపడే అబ్దుల్లా.. ఉద్యోగం కోసమని కాకుండా, యథాలాపంగా గూగుల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పోటీల్లో పాల్గొనేందుకు తన ప్రొఫైల్ ఉంచాడు. దీనిని చూసి ఇంప్రెస్ అయిన గూగుల్ అధికారులు ఇంటర్వ్యూకు రమ్మంటూ మెయిల్ పంపారు. మొదట్లో దీనిని అబ్దుల్లా నమ్మలేదు. ఇలాంటి మెయిల్ తన స్నేహితుడి పరిచయస్తునికి కూడా రావడంతో వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం పలు విడతలుగా జరిగిన ఇంటర్వ్యూల్లో అబ్దుల్లా విజేతగా నిలిచాడు. దీంతోపాటు మార్చి మొదటి వారంలో లండన్‌లో జరిగిన ఫైనల్ స్క్రీనింగ్ టెస్ట్‌లోనూ పాసయ్యాడు. దీంతో, సెప్టెంబర్‌లో లండన్‌లోని గూగుల్ కార్యాలయంలో ‘రిలయబిలిటీ ఇంజినీరింగ్ టీం’ సభ్యునిగా ఉద్యోగంలో జాయిన్ కావాలంటూ గూగుల్ నుంచి అబ్దుల్లాకు పిలుపొచ్చింది. ఏడాది వేతనం రూ.54.5 లక్షలు కాగా కంపెనీ బోనస్‌లో 15 శాతం, నాలుగేళ్లకు కలిపి రూ.58.9 లక్షల విలువైన కంపెనీ షేర్లు అతడికి అందుతాయి. ఇవన్నీ కలిపితే ఏడాదికి అతడికి అందే మొత్తం సుమారు రూ.1.2 కోట్లు అవుతుంది. రూ.2 కోట్ల స్కాలర్షిప్ అమెరికాలోని ప్రఖ్యాత బోస్టన్ యూనివర్సిటీలో చదివేందుకు నోయిడాకు చెందిన ఆర్నవ్ మిశ్రా అనే విద్యార్థి ఎంపికయ్యాడు. బోస్టన్ వర్సిటీ ట్రస్టీ స్కాలర్‌షిప్‌పై చదివేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 20 మందిలో భారత్‌కు చెందిన ఏకైక విద్యార్థి మిశ్రా కావడం గమనార్హం. ట్రస్టీ స్కాలర్ షిప్ ఎంపిక పరీక్షలో 1,600 మార్కులకు గాను 1,500 మార్కులు, యూనివర్సిటీ స్కాలర్ షిప్ ఎంపిక పరీక్షలో 99 శాతం మార్కులు మిశ్రా సాధించాడు. దీంతో అతడు నాలుగేళ్లకు కలిపి దాదాపు రూ.2 కోట్ల మేర ఉపకార వేతనానికి ఎంపికయ్యాడు. -
అర చేతి తెరలోకి తెలుగొస్తుందా?
కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం అన్నది పాతమాట. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా, అసలు తెలుగులోనే కంప్యూటర్లు ఎందుకు ఉండకూడదూ అని ఆలోచిద్దాం.కంప్యూటర్లు వాడుకలోనికి రావడం మొదలైననాటి నుండి వాటిలో (ఆంగ్లేతర) మానవ భాషల వినియోగానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంత సాంకేతిక అభివృద్ధి జరిగిన తర్వాత, ఇప్పటికైనా మామూలు తెలుగువాడు కంప్యూటర్ని తెలుగులోనే వాడుకోగలడా!? అయితే, ఎంతవరకూ వాడుకోగలడు? దీన్ని నాలుగు స్థాయుల్లో చూద్దాం. కంప్యూటర్ అంటే స్మార్టు ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు కూడా. ఒకటో స్థాయి: తెలుగు చూడటం, టైపు చెయ్యడం ఈ స్థాయిలో కంప్యూటర్లు తెలుగులో సమాచారాన్ని తెరపై చూపించగలగాలి. మనకి టైపు చేసే వీలు కల్పించాలి. నేడు మనం ఈ స్థాయిని చాలావరకు చేరాం అని చెప్పవచ్చు. అన్ని రకాల కంప్యూటర్లలోనూ (విండోస్, గ్నూ/లినక్స్, మ్యాకింటోష్), కొత్త స్మార్టు ఫోన్లలోనూ (ఆండ్రాయిడ్, ఐఓస్, విండోస్) ఇప్పుడు మనం తెలుగు సమాచారాన్ని చూడవచ్చు, వీటిలో టైపు చెయ్యవచ్చు కూడా. ఈ పరికరాలన్నీ కూడా ఇప్పుడు కనీసం ఒక తెలుగు ఫాంటుతో వస్తున్నాయి. ఇక టైపు చెయ్యడానికి మనం కీబోర్డు సెట్టింగులలో తెలుగు భాషను ఎంచుకుంటే చాలు. చాలా వరకూ తెలుగు ఇన్‌స్క్రిప్టు కీబోర్డు లేయవుట్లు ఉంటుంది. మనకి ఇప్పటికే ఆపిల్, మాడ్యులర్ వంటి లేయవుట్లు తెలిసివుంటే, వాటితోనూ టైపు చేసుకోడానికి అప్లికేషన్లూ దొరుకుతున్నాయి. అంతర్జాలంలో మనకు అన్ని అవసరాలకు ఉపయోగపడే తెలుగు సమాచారం అందుబాటులో లేదు. తెలుగు వార్తా పత్రికల సైట్లు, తెలుగు బ్లాగులు, తెలుగు వికీపీడియా, మరి కొన్ని గాసిప్ సైట్లూ తప్ప అంతర్జాలంలో తెలుగు పెద్దగా లేదన్నది ఒక వాదన. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వెబ్ సైట్లూ అరకొరగానే తెలుగులో ఉన్నాయి. కానీ ఈ మధ్య ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో తెలుగులో రాసేవారు బాగా పెరిగారు. రెండో స్థాయి: తెరపై మొత్తం తెలుగు కనబడటం ఈ స్థాయిలో కంప్యూటరు గానీ, ఫోను గానీ మామూలు అవసరాలకు వాడుకోడానికి ఆంగ్లం అవసరం ఉండకూడదు. తెలుగుకి సంబంధించినంత వరకూ మనం ఈ స్థాయిలో మొదటి మెట్టు దగ్గరే ఉన్నాం. విండోస్, గ్నూ/లినక్స్ నిర్వాహక వ్యవస్థలను తెలుగు భాషలో వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కొరకు తెలుగు భాషా ప్యాక్‌లు మైక్రోసాఫ్ట్ వారి సైటు నుండి దింపుకోవచ్చు. మొజిల్లా ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి ఏవో కొన్ని అప్లికేషన్లు మాత్రమే తెలుగులో లభిస్తున్నాయి. ఇక అంతర్జాలం విషయానికి వచ్చేసరికి, గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సైట్లూ, ఆప్స్ తెలుగులో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ డాక్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, లిబ్ర ఆఫీస్ లోనూ కొంత వరకూ తెలుగు స్పెల్ చెకింగ్ అందుబాటులో ఉంది. కానీ తెలుగు వ్యాకరణాన్ని సరిచూసే వెసులుబాటు మాత్రం లేదు. మన దేశ కంపెనీలు పేటీఎమ్, 1ఎమ్జీ వంటి ఆప్స్ తెలుగులో కూడా ఉన్నాయి. వీటిని తెలుగులో వాడుకోడానికి, ఆయా ఆప్స్ సెట్టింగులలో మన భాషని తెలుగుగా ఎంచుకోవాలి. గూగుల్ మ్యాప్స్‌లో ఊర్లు, వీధుల పేర్లు ఈ మధ్య తెలుగులో కనిపిస్తున్నాయి. ఇదో శుభపరిణామం. ఇన్ని ప్రోగ్రాములూ ఆప్స్ తెలుగులో అందుబాటులో ఉన్నా వీటిలోని అనువాదాలు అందరికీ అర్థమయ్యే విధంగా లేవనీ అనువాదాలలో నిలకడ, నాణ్యత లోపించాయనీ కూడా ఫిర్యాదులున్నాయి. మనం వాడి చూసి, తప్పులనూ దోషాలనూ ఆయా కంపెనీలకు నివేదించాలి. తెలుగు బాగా తెలిసిన వారినీ, అనువాదాలపై పట్టున్న వారినీ ఈ స్థానికీకరణ ప్రక్రియలో భాగస్వాములను చెయ్యాలి. ఇంత చెప్పుకున్నా, రోజువారీ అవసరాలను పూర్తిగా తెలుగులోనే జరుపుకోగలమా అంటే లేదనే చెప్పాలి. ఈ దిశగా మనం ప్రభుత్వాలనూ, వ్యాపార సంస్థలనూ అడగాలి. తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడయ్యే, వస్తూత్పత్తులూ, సేవలూ, వాటి సంబంధిత సమాచారమూ తెలుగులో కూడా ఉండేవిధంగా మన ప్రభుత్వాలు విధానపరంగా చర్యలు చేపట్టాలి. ఇంగ్లీషు లేకుండా కంప్యూటర్లు వాడుకోడానికి, కీబోర్డులు తెలుగులో కూడా ఉండాలి. గతంలో టీవీఎస్ కీబోర్డులు తెలుగు మీటలతో ఉండేవి. ఈ మధ్య సురవర వారు తెలుగు కీబోర్డులు అమ్మారు. అలాంటి ప్రయత్నాలు ఊపందుకోవాలి. భారతదేశంలో విక్రయించే స్మార్టు ఫోన్లలో తప్పనిసరిగా ప్రాంతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు ఉంది. కానీ కంప్యూటర్లకూ, వెబ్ సైట్లకూ ఇలాంటి ఉత్తర్వులు ఏమీ ఉన్నట్టు లేవు. మూడో స్థాయి: కంప్యూటర్లు మన మాటల్ని అర్థం చేసుకొని తెలుగులోనే బదులివ్వగలగడం ఐఫోన్లో సిరి, గూగుల్ అసిస్టెంట్, మైక్రోసాఫ్ట్ కోర్టానా, అమెజాన్ అలెక్సా వంటి ఉత్పత్తులు/సేవలు మన మాటల్ని ఇంగ్లీషు (ఇంకొన్ని భాషల్లో) అర్థం చేసుకుని బదులివ్వగలుగుతున్నాయి. కానీ, ఇవి తెలుగులో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. తెరపై తెలుగు పాఠ్యాన్ని చదవగలిగే ఉపకరణాలు ఉన్నా, అవి చదివింది వింటే తెలుగు విన్నట్టు ఉండదు. తెలుగు తీయదనాన్ని అవి నేర్చుకోలేదు. అది నేర్పవలసింది తెలుగువారం మనమే కదా. ఇక తెలుగులో ఉన్న రకరకాల మాండలీకాల్నీ యాసల్నీ, మనందరం మాట్లాడే పద్ధతులనీ అర్థం చేసుకుని అదే రీతిలో బదులివ్వాలంటే, చాలా పరిశోధన జరగాలి. ఈ దిశగా, ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాజెక్టులు, పరిశోధనలూ చెయ్యాలి. నాలుగో స్థాయి: తెలుగులోనే కంప్యూటరు ప్రోగ్రామింగ్ తెలుగులో కంపైలరు తయారుచేయడానికి, తెలుగులో ప్రాగ్రామింగు రాయడానికి ఔత్సాహికుల చిన్ని చిన్ని ప్రయత్నాలు జరిగినా, ఒక స్థాయి చేరుకోడానికి ఇప్పటివరకూ జరిగిన ప్రయత్నాలు సముద్రంలో నీటు బొట్టు కాదు కదా పరమాణువంత లెక్క. ఈ నాలుగో స్థాయిని ప్రస్తుతానికి చేరుకోలేనిదిగా వదిలేయవచ్చు. కానీ, మనం కంప్యూటర్లో చిన్న చిన్న పనులు చక్కబెట్టుకోడానికి, పైపై ఆటోమేషన్‌లకు తేలిగ్గా వాడుకోగలిగేలా తెలుగు స్క్రిప్ట్ కూడా ఉంటే బాగుంటుంది. మూడో స్థాయి వరకూ మనం ఎదగడానికి, తెలుగు భాషకి ప్రత్యేకించి తీరని సాంకేతిక ఇబ్బందులంటూ ఏమీ లేవు; కేవలం మన భాషంటే తేలికభావం, నిర్లక్ష్యం, ఉదాసీనత తప్ప! ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నైనా మనందరం మన అమ్మ భాషకి పునరంకితమై ఈ దిశగా కృషి చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి తెలుగు సామెతల సంకలనం 1868లో వెలువడిన ‘ఆంధ్రలోకోక్తి చంద్రిక’. సంకలన కర్త ఎం.డబ్ల్యూ. కార్. ఇందులో 2,200 సామెతలున్నాయి. పుస్తకం విజ్ఞానధనం పదిలపరచిన తాళం కప్పలేని ఇనప్పెట్టె. – సూర్యప్రకాశ్ నిజమైన కళ ఆత్మనే సంస్కరిస్తుంది. కాని ఆ సంస్కారం కంటికి కనబడదు. చూసి విలువ కట్టలేము. – చలం -
సత్తా ఉన్న ఇంజనీర్లు 5 శాతంలోపే..
► 95 శాతం మంది ఇంజనీర్లు ప్రోగ్రామింగ్ జాబ్స్‌కి పనికిరారు ► యాస్పైరింగ్ మైండ్స్ సర్వే న్యూఢిల్లీ: భారత్ అంటే ఐటీ.. ఐటీ అంటే భారత్ అని గొప్పగానే చెప్పుకుంటుంటాం. మన దేశం నుంచి చాలా మంది ఐటీ ఉద్యోగాలకు ఇతర దేశాలకు వెళ్తున్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వారు అయితే ఏకంగా దిగ్గజ టెక్ కంపెనీలకు బాస్‌లుగా కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఐటీ, డేటా సైన్స్ విభాగాల్లో నైపుణ్యాల కొరత చాలా స్పష్పంగా కనిపిస్తోంది. భారత్‌లోని 95 శాతం మంది ఇంజనీర్లు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు పనికిరారని తాజాగా ఎంప్లాయబిలిటీ అసెస్మెంట్ కంపెనీ యాస్పైరింగ్ మైండ్స్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. కేవలం 4.77 శాతం మంది మాత్రమే ఒక ప్రోగ్రామ్‌కు సరైన కోడ్ రాయగలుగుతున్నారు. ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ జాబ్‌కి కావలసిన కనీస అర్హత ఇది. సర్వే ప్రకారం.. 500కుపైగా కాలేజీలకు చెందిన 36,000 మందికిపైగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఆటోమేటా టెస్ట్‌ను (దీని ద్వారా అభ్యర్థి ప్రోగ్రామింగ్ స్కిల్స్‌ను అంచనా వేస్తారు) ఎదుర్కొంటే వారిలో 60% మంది కోడ్‌ను రాయలేకపోతున్నారు. కేవలం 1.4% మంది మాత్రమే సమర్థవంతమైన కోడ్‌ను రాస్తున్నారు. ప్రోగ్రామింగ్ నైపుణ్యాల కొరత ఐటీ, డేటా సైన్స్ విభాగాలను బాగా ప్రభావితం చేస్తోందని, ప్రపంచం ప్రోగ్రామింగ్‌లో దూసుకెళ్తుంటే మనం మాత్రం ఇంకా అలాగే ఉండిపోయామని యాస్పైరింగ్ మైండ్స్ సీటీవో, సహ వ్యవస్థాపకుడు వరుణ్ అగర్వాల్ తెలిపారు. -
ఈ బంగారూ గొప్పేంటో తెలుసా?
చాలామంది మార్కులు, ర్యాంకులే గొప్ప అనుకుంటారు. అందుకోసం పిల్లల్ని నానారకాలుగా ఒత్తిడికి గురిచేస్తూ.. తమ అభిప్రాయాలను వారిపై రుద్దుతుంటారు. కానీ, ముంబైకి చెందిన సుప్రియా అందరిలాగా ఆలోచించలేదు. సంప్రదాయ చదువులే సర్వసమని భావించలేదు. నిజానికి నాలుగేళ్ల కిందట ఆమె ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. దాదర్ పార్సీ యూత్ అసెంబ్లీ స్కూల్లో ఏడో తరగతిలో అద్భుతంగా చదువుతున్న తన కూతురు మాల్విక రాజ్ జోషీతో బడి మాన్పించింది. సంప్రదాయ చదువులకు స్వస్తిచెప్తి.. తనకు నచ్చిన సబ్జెక్ట్‌ను చదువుకొనేలా మాల్వికను ప్రోత్సహించింది. అదే 17 ఏళ్ల మాల్వికకు అద్భుతమైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది. పదో తరగతి చదవకపోయినా.. ఇంటర్ సర్టిఫికెట్ లేకపోయినా ఆమెకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్)లో సీటు లభించింది. మాల్వికలోని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రతిభను గుర్తించిన మిట్ పిలిచి మరీ సీటు ఇచ్చింది. మిట్ అందించే ఉపకార వేతనం (స్కాలర్షిప్)తో ఆమె ప్రస్తుతం బ్యాచ్‌లర్ సైన్స్ డిగ్రీని అభ్యసిస్తున్నది. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు రతజ, ఒక కాంస్య పతకం సాధించడంతో ఆమెను ఈ అవకాశం వెతుక్కుంటూ వచ్చి వరించింది. ప్రొగ్రామింగ్ ఒలింపియాడ్‌గా పేరొందిన ఈ (మాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సబ్జెక్ట్) పోటీల్లో పతకాలు సాధించిన వారికి తమ ఇన్స్టిట్యూట్లోనే తీసుకొనే సంప్రదాయాన్ని మిట్ కొనసాగిస్తున్నది. నిజానికి మాల్విక ఇంటర్ పాస్ కాకపోవడంతో దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీటు లభించలేదు. కేవలం చెన్నై మాథ్మేటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ)లో ఆమెకు సీటు దొరికింది. డిగ్రీ విద్యార్థులకు సమానంగా ఆమెకు సబ్జెక్ట్‌పై అవగాహన ఉండటంతో ఆమె ఎమ్మెస్సీలో చేరింది. మాల్వికకు ప్రతిష్టాత్మక మిట్లో సీటు రావడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 'మాది మధ్య తరగతి ఫ్యామిలీ. నిజానికి స్కూల్లో మాల్విక బాగా చదువుతున్నప్పుడే.. పిల్లలు సంతోషంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయ చదువుల కన్నా ఆనందమే అత్యంత ముఖ్యమని భావించాను' అని సుప్రియా చెబుతారు. ఆమెకు మాల్వికతోపాటు రాధ అనే కూతురు ఉంది. 'క్యాన్సర్ రోగుల సంక్షరణ చూసే ఓ స్వచ్ఛంద సంస్థలో నేను పనిచేస్తాను. ఎనిమిది, తొమ్మిది తరగతి చదివే పిల్లలు కూడా క్యాన్సర్ బారిన పడి అవస్థలు పడటం నన్ను కలిచివేసింది. అందుకే చదువుల కన్నా నా బిడ్డలు ఆనందంగా ఉండటం ముఖ్యమనుకున్నా' అని ఆమె తెలిపారు. ఇంజినీరు అయిన భర్తను కూడా ఇందుకు ఒప్పించారు. ప్రస్తుతం బోస్టన్‌లో ఉండి చదువుకుంటున్న మాల్విక మాట్లాడుతూ 'నాలుగేళ్ల కిందట చదువు మానేసినప్పుడు నేను చాలా సబ్జెక్టులను అన్వేషించారు. అందులో ఒకటైన ప్రోగామింగ్ నాకు ఆసక్తి కలిగించింది. దాంతో మిగతా సబ్జెక్టుల కన్నా ప్రోగ్రామింగ్‌పై ఎక్కువ దృష్టి సారించా. దానిపై ఇష్టం ఏర్పడింది' అని తెలిపింది. ఆ ఇష్టం వల్లే సబ్జెక్టుపై పట్టు సాధించి.. ఇప్పుడు మిట్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్టు తాను సంతోషం వ్యక్తం చేసింది. -
జ్యోత్స్న ఫణిజ పాడితే సంగీతం పరవళ్లు
మిణుగురులు సమాజానికి దివిటీలు జ్యోత్స్న ఫణిజ పాడితే సంగీతం పరవళ్లు తొక్కుతుంది. కలం కదిపితే అక్షరాలు తరంగాలై మనసును తట్టిలేపుతాయి. అంతేనా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్లనూ వేగంగా చేస్తారు జ్యోత్స్న. పేద విద్యార్థులకు ఆంగ్ల భాషలో, కంప్యూటర్ అప్లికేషన్లలో ఉచిత శిక్షణ ఇస్తూ, ఆంగ్లసాహిత్యంలో నేడో రేపో డాక్టరేట్ పట్టా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారామె.ఇవన్నీ ప్రతిభ గలవారందరూ అవలీలగా చేసేవేగా... జ్యోత్స్న ప్రత్యేకత ఏమిటి.. అంటే ఆమెకు చూపు లేదు! అలా అని ఆమె ఏనాడూ దిగులు చెందలేదు. తన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ పదిమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఆమె విజయగాథే ఈ వారం ‘మిణుగురులు’ - నిర్మలారెడ్డి కృష్ణా జిల్లా కైకలూరులో పాతికేళ్ల క్రితం... అభిమన్యకుమార్, సత్యవతిలకు అబ్బాయి తర్వాత రెండోసంతానంగా జన్మించింది జోత్స్న. మూడు నెలల వరకు వారు ఆ ఆనందంలోనే ఉన్నారు. తర్వాత ఓ రోజు ఆమె చూపులో ఏదో తేడాను గమనించారు. వైద్యులకు చూపిస్తే పుట్టుకతోనే అంధురాలు అని తేల్చారు! ‘‘అప్పుడు మా అమ్మ చాలా ఏడ్చిందట. నాన్నగారు చాలా బాధపడ్డారట. కానీ, అంత బాధలోనూ వారో నిర్ణయం తీసుకున్నారు. నా భవిష్యత్తును చక్కగా మలచాలని. అన్నయ్యతో పాటు నన్నూ స్కూల్లో చేర్పించారు. ఇంటర్మీడియెట్‌కి వచ్చాక చూపులేనివారికి సీట్ ఇవ్వలేమని కాలేజీ యాజమాన్యం చెప్పింది. నేనే కాలేజీ ప్రిన్సిపల్‌తో ‘మిగతా అందరికన్నా మంచి మార్కులు సాధించి చూపిస్తాను’ అని వాదించి, ఒప్పించాను. ఇంటర్మీడియెట్ వరకు ఉన్న ఊర్లోనే చదువుకున్న నేను డిగ్రీకి హైదరాబాద్‌కు వచ్చాను’’ అని చెప్పారు జ్యోత్స్న. అన్నింటా మేటి..! హైదరాబాద్‌లో ఓ అంధుల పాఠశాలలో చేరారు జ్యోత్స్న. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మాధ్యమంగా చదివినప్పటికీ డిగ్రీలో ఇంగ్లిష్ లిటరేచర్ని ఎంచుకున్నారు. యూనివర్శిటీ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత మెరిట్ స్కాలర్షిప్లు వరించి ఆమె తండ్రి కష్టాన్ని సగానికి తగ్గించాయి. కాలేజీ స్థాయిలో ఫెయిర్ అండ్ లవ్లీ వారి మెరిట్స్కాలర్షిప్తో జ్యోత్స్నకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. మూడు లక్షల మంది విద్యార్థినులతో పోటీపడి ఆ విజయాన్ని అందుకోగలిగారు. మరోవైపు ఎమ్.ఎ చేసి యు.సి.జి నెట్ క్వాలిఫై అయ్యారు. కువైట్, కెనడియన్ దేశాలలో మహిళల అభ్యున్నతికోసం ప్రసంగాలు ఇచ్చే అవకాశాలనూ వినియోగించుకున్నారు.. ఎక్కడకు వెళ్లినా ఒంటరిగానే వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇందుకు అమ్మానాన్నలే జ్యోత్స్నను ప్రోత్సహించారు. ప్రస్తుతం ఆమె ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం ముంబయ్‌లో అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్స్ చేశారు జ్యోత్స్న. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో టీ.సి.ఎస్ సంస్థ పెట్టిన పరీక్షలో మెరిట్ సాధించడంతో ఆ అవకాశం లభించింది. అంధులైన యువతీ యువకులకు మార్గదర్శకం చేసే కేంద్రాన్ని నెలకొల్పాలన్నది తన ఆశయం అని తెలిపారు జ్యోత్స్న. ఆధారపడటం తను ఇష్టపడదు జ్యోత్స్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మాకు దూరపు బంధుత్వం కూడా ఉంది. తన వ్యక్తిత్వం, ఎవరిమీదా ఆధారపడని తత్త్వం నన్ను ఎప్పుడూ అబ్బురపరిచేవి. పట్టుదల, ఇతరులకు సాయపడాలనే ఆలోచన కలిగిన ఆమెకు వెన్నుదన్నుగా నిలవాలనుకుని, తన చేయందుకున్నాను. నేను ఎం.బి.ఎ చేస్తున్నాను. నా సబ్జెక్ట్‌ల్లో వచ్చే సందేహాలనే కాదు జీవితంలో వచ్చే సవాళ్లనూ ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది. - రాధాకృష్ణ (జ్యోత్స్న భర్త)