రక్తం చిందకుండానే చక్కెర మోతాదు తెలుసుకునే పరికరాన్ని రూపొందించిన వర్షిత, విమల్
డయాబెటిస్ రోగికి రోజూ వేలికి సూది గుచ్చుకుని మరీ పరీక్ష చేస్తేగానీ... రక్తంలో చక్కెర మోతాదు ఎంత ఉందో తెలియదు.
మరి అలాంటి అవసరమే లేకుండా దేహంలో షుగర్ ఎంత ఉందో చటుక్కున తెలిసిపోతే ఎంత బాగుంటుంది?
క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాల్సి రావడం వల్ల నెలకు నాలుగైదు వేలు ఖర్చు తప్పదు.
కానీ ఇలా రోజూ పరీక్షలు చేయిస్తున్నా సరే... నాలుగేళ్లు గడిచాక కూడా ఆ వ్యయం... నెల ఖర్చుకు మించకపోతే ఇంకెంత బాగుంటుంది?
చక్కెర జబ్బు అంటూ పేరులో మాత్రమే తీపి ఉన్న డయాబెటిస్ అనే ఈ సమస్య రోజూ చేసుకోవాల్సిన చిన్నపాటి గాయాలతోనూ, వ్యయాలతోనూ చాలా బాధిస్తుంటుంది. కానీ ఇకపై అలాంటి బాధలేవీ లేకుండానే... మొబైల్‌సహాయంతోనే చక్కెర మోతాదును తెలుసుకునే యాప్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసింది దువ్వూరు వర్షిత. ఆ ప్రయత్నానికి సాంకేతికంగా సహాయపడ్డాడు విమల్ అనే ఇంజినీర్.
కాలం కలిసొస్తే ఎలాంటి గుచ్చుకోవడాలు లేకుండా మన మొబైల్‌లోనే గ్లూకోమీటర్ రూపొంది... దాని సహాయంతో చక్కెర మోతాదులు చాలా తేలిగ్గా తెలుసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనీ, మహా అయితే మరో ఆర్నెల్లు లేదా ఏడాది లోపే ఇది అందుబాటులోకి రావచ్చంటున్నారు 20 ఏళ్ల వర్షిత, యువ ఇంజనీర్ విమల్ కుమార్ లు. వారిరువురూ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పిన విషయాలు డయాబెటిస్‌తో బాధపడుతున్న ఎందరికో తీపికబురు కాబోతున్నాయి. అవేమిటో తెలుసుకుందాం.
‘‘నా పేరు దువ్వూరు వర్షిత. మాది నెల్లూరు. పుట్టినప్పట్నుంచే టైప్–1 డయాబెటిస్ తో బాధపడుతున్నాను. ఒక్కోసారి ఒకేరోజు నాలుగైదుసార్లు సూదితో వేలిని గుచ్చుకుని చక్కెరను పరీక్షించుకోవాల్సి వచ్చేది. ఒక్కసారి పరీక్ష కోసం పెట్టే ఖర్చు రూ. 40 వరకు అయ్యేది. అంటే ఒక్కరోజుకు రూ. 160 అన్నమాట. అలా చూస్తే నెలలో కేవలం వైద్యపరీక్ష కోసమే ఐదువేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వచ్చేది.
చిన్నప్పుడు పెద్దగా బాధ తెలియకపోయినా పెరుగుతున్న కొద్దీ వేదన మరింత ఎక్కువైంది. రోజులో ఇన్నిసార్లు పరీక్షల కోసం పెట్టే ఖర్చే కాకుండా... ఇక మందులు, ఇన్సులిన్ లాంటివాటికి ఎంతవుతుందో ఊహించవచ్చు. ఓ సగటు మధ్యతరగతి వారికి ఇది ఎంత పెద్ద మొత్తమో ఎవరికైనా తెలిసే విషయమే. ఎప్పటికైనా నాలాంటివాళ్లకోసం ఏదైనా చేస్తానంటూ పదేళ్ల వయసప్పుడే నాన్న దగ్గర ఓ సంకల్పం తీసుకున్నా. అందుకే ఐఐటీకి క్వాలిఫై అయి, అందులో చేరాక కూడా బయోటెక్నాలజీపై ఆసక్తితో బయటకి వచ్చి చెన్నైలో ఆ కోర్సులో చేరాను.
కోయంబత్తూరులో 2019లో ఓ హ్యాకాథాన్ (కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై తమ తమ భావాలు, ఆలోచనలు పంచుకునే సదస్సు) నిర్వహించారు. అక్కడ పరిచయమయ్యారు తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన విమల్‌కుమార్ అనే యువ ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఈ హ్యాకాథాన్‌లో నా ఆలోచనలను వివరించా. తన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సామర్థ్యంతో నా ఐడియాలను సాకారం చేయవచ్చని విమల్‌తో మాట్లాడినప్పుడు తెలిసింది.
అంతే... మేమిద్దరమూ కలిసి మా ప్రాజెక్టు కోసం పనిచేయడం ప్రారంభించాం. ఇందుకోసం రూపొందించిన గ్లూకోమీటర్ కూడా చాలా సింపుల్‌గా పనిచేస్తుంది. నిజానికి ఇదో చిన్న పెన్ డ్రైవ్ తరహాలో ఉండే పరికరం. దీన్ని మన మొబైల్‌కి జతచేయాలి. అక్కడ మన వేలిని ఉంచితే చాలు... ఎలాంటి సూదిగాయాలూ, నొప్పి లేకుండానే మన రక్తంలోని చక్కెర మోతాదులు తెలిసిపోతాయి’’ అంటూ తమ ప్రాజెక్టు గురించి వివరించింది వర్షిత.
‘‘ఇది వన్ టైమ్ ఎక్స్‌పెన్స్ ఎక్విప్‌మెంట్. అంటే ఒక్కసారి కొంటే చాలు ఎప్పటికీ వాడుకునేలా రూపొందించిన డివైస్ ఇది. నియర్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ (ఎన్‌ఐఆర్) అనే సాంకేతికత సహాయంతో ఎలాంటి గాటూ లేకుండానే మన దేహంలోని చక్కెరను అంచనా వేస్తుంది ‘ఈజీ లైఫ్’ అనే పేరున్న ఈ పరికరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో చక్కెర విలువలను విశ్లేషించడం వల్ల నిమిషంలోపే షుగర్ రీడింగ్స్ మనకు తెలిసిపోతాయి. ఎక్కడైనా ఎప్పుడైనా నిస్సంకోచంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు’’ అంటూ వివరించారు విమల్.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సులో వర్షిత, విమల్‌ల ఈ ‘స్టార్ట్ అప్’ ప్రథమస్థానంలో నిలిచింది. అంతేకాదు ‘ఎమ్‌పవర్–2021’ పేరిట గతేడాది నిర్వహించిన ‘వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాంపిటీషన్’లో రన్నరప్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు... ‘ఎన్‌ఐటీటీఈ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్’ హ్యాకథాన్‌తో పాటు మరికొన్ని సదస్సుల్లోనూ వీరి ఆవిష్కరణ అనేక బహుమతులను గెలుచుకుంది. గతంలో దుబాయిలో గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించిన ఓ సదస్సులో దాదాపు 42 దేశాల నుంచి యువతులు పాల్గొన్నారు. ‘టై ఉమన్ గ్లోబల్ పిచ్–2021 హైదరాబాద్ చాప్టర్’ ప్రాజెక్టును ప్రోత్సహించి... వర్షితను ఆ సదస్సు కు పంపినప్పుడు అక్కడ కూడా ఆమె ప్రాజెక్టుకు మంచి ప్రశంసలు దొరికాయి.
ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన గ్రేలాజిక్ టెక్నాలజీస్ అండ్ ఎడిఫై పాత్ సంస్థల డైరెక్టర్ వర్ల భానుప్రకాశ్‌రెడ్డి... ఈ ప్రాజెక్టుకు మెంటార్‌గా, ప్రమోటర్‌గా వర్షిత, విమల్‌లకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పరిశోధనలో పాలు పంచుకునేలా అనేక ఇతర సంస్థలను సైతం వీరి ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో రూపొందించనున్న ఈ ప్రాజెక్టుకు ‘వివాలైఫ్’ అని పేరు పెట్టుకున్నారు. వీళ్ల పరిశోధనలకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment