యంగ్ లేడీ ఘాటు మోసం
కోయంబత్తూర్: తనను పెళ్లి చేసుకుంటుంది కదా అని ఎదురు చూసిన అతడికి అలుపొచ్చింది. అదే ఊహలో ఉంటూ ఆమెకు అడిగిందల్లా అందించిఅందించి చిరాకు వచ్చేసింది. అది కాస్త దాదాపు రూ.40 లక్షల వరకు చేరేసరికి ఎదురుచూపు అనుమానానికి దారి తీసింది. రోజులు గడిచినా డబ్బులు అయిపోతున్నా ఆమె పెళ్లి విషయంలో స్పష్టతనివ్వకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంతోష్ కుమార్ అనే ఇంజినీర్కు 40 ఏళ్లు. అతడు పెళ్లి చేసుకునేందుకు ఆన్ లైన్లో వివాహ వేదిక (మ్యాట్రిమోనీ)లో తన ప్రొఫైల్ పెట్టాడు.
అది చూసిన ఓ 20 ఏళ్ల అమ్మాయి అతడితో సంబంధం కలుపుకునేందుకు ప్రయత్నించింది. అనుకుందే తడువుగా అతడితో మాట్లాడటం ప్రారంభించింది. పెళ్లి గురించి మాట్లాడుకుందాం అని ఓ దేవాలయం వద్దకు పిలిచి పరిచయం ఏర్పరుచుకుంది. తల్లిదండ్రులు ఇప్పుడే పెళ్లికి తగిన డబ్బును సమకూర్చే స్తోమతలో లేరని చెబుతూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చింది. అతడిని అప్పుడప్పుడు కలిసి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. అలా మొత్తం 40 లక్షల వరకు తీసుకుంది. పెళ్లి గురించి అతడు ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించగా ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో అనుమానం వచ్చిన సంతోష్ కుమార్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.