చదివించిన భర్తకు మహిళా ఇంజినీర్ టోకరా
కేకే నగర్(తమిళనాడు):
ఎంతో కష్టపడి చదివించిన భర్తకు టోకరా ఇచ్చి మరో పెళ్లి చేసుకుంది ఓ మహిళా ఇంజినీరు. ఈ సంఘటన తమిళనాడులోని నెల్లైలో వెలుగు చూసింది. వివరాలివీ.. తిరునల్వేలి సమీపంలోని మేలకున్నత్తూర్’ నల్లమ్మాళ్ కట్టలై వీధికి చెందిన కుమార్ (30) ఏడేళ్ల క్రితం కేరళ ఎర్నాకులంకు చెందిన ధనలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. చదువుకోవాలన్న ధనలక్ష్మి కోరిక మేరకు.. సేలంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించాడు. ఇందుకోసం కుమార్ తన 5ఎకరాల పొలాన్ని, నగలను, అమ్మివేశాడు.
ఇంజినీరింగ్ అనంతరం ధనలక్ష్మి ఎంటెక్ చదవడానికి ఆసక్తి చూపడంతో కుమార్ తనకు అంత స్తోమత లేదని చదవించడం కుదరదని చెప్పాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ధనలక్ష్మి తన సర్టిఫికెట్లను, తన వస్తువులను తీసుకుని ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. రెండు రోజుల క్రితం ధనలక్ష్మి బంధువు ఒకరు కుమార్‌ను కలిశాడు. కుమార్ చనిపోయినట్లు చెప్పి ధనలక్ష్మి రెండో పెళ్లి చేసుకుందని చెప్పాడు. దీంతో కుమార్ ఒక్కసారిగా షాక్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో ధనలక్ష్మి కుమార్ చనిపోయినట్లు చెప్పి రాజపాళయంకు చెందిన ఇంజినీరును పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేరళకు వెళ్లి ధనలక్ష్మి, ఆమె తల్లిని, రెండో భర్తను విచారిస్తున్నారు.