కోర్టులో భార్యకు భరణంగా ఇచ్చిన చిల్లర
చండీగఢ్ : విడాకులు తీసుకున్న భార్యను ఇబ్బంది పెట్టడానికి కొత్తపద్దతి ఎంచుకున్నాడో లాయర్ భర్త. భరణంగా ఇవాల్సిన డబ్బు ఇవ్వలేదని కోర్టు మెట్లెక్కిన భార్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. కోర్టులో భర్త చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుంది ఆ భార్య. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్‌కు చెందిన ఓ లాయర్ 2014లో భార్య నుంచి వేరుపడి కొద్ది సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నాడు. భార్యకు నెలవారీ ఖర్చుల నిమిత్తం భరణంగా నెలకు 25వేల రూపాయలు ఇవ్వాలని కోర్టు ఆదేశింది. అయితే రెండు నెలలుగా తన భర్త భరణం ఇవ్వటం లేదని భార్య కోర్టును ఆశ్రయించింది. కోర్టులో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమె భర్త డబ్బు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.
అయితే ఇక్కడే భార్యకు చుక్కెదురైంది. ఇవ్వాల్సిన 25వే రూపాయల్లో కేవలం నాలుగు వందలు మాత్రమే నోట్లుగా ఇచ్చి మిగిలిన 24,600కు రూపాయి, రెండు రూపాయల నాణేల చిల్లర రూపంలో ఇచ్చాడు. అంతే ఆ భార్య కోర్టులోనే గొల్లుమంది. భర్త తనను ఇబ్బంది పెట్టడానికే ఇలా చేస్తున్నాడని న్యాయమూర్తి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన వద్ద డబ్బులు లేవన్న భర్త వాదనను ఆమె తప్పుబట్టింది. కాగా లాయర్ భర్త తన పనిని సమర్థించుకుంటూ.. భరణం డబ్బులు ఇలా చిల్లర ఇవ్వకూడదని ఎక్కడా రాసిలేదని అన్నాడు. ఈ చిల్లర పనితో కంగుతిన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment