ఈ బంగారూ గొప్పేంటో తెలుసా?
చాలామంది మార్కులు, ర్యాంకులే గొప్ప అనుకుంటారు. అందుకోసం పిల్లల్ని నానారకాలుగా ఒత్తిడికి గురిచేస్తూ.. తమ అభిప్రాయాలను వారిపై రుద్దుతుంటారు. కానీ, ముంబైకి చెందిన సుప్రియా అందరిలాగా ఆలోచించలేదు. సంప్రదాయ చదువులే సర్వసమని భావించలేదు. నిజానికి నాలుగేళ్ల కిందట ఆమె ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. దాదర్ పార్సీ యూత్ అసెంబ్లీ స్కూల్‌లో ఏడో తరగతిలో అద్భుతంగా చదువుతున్న తన కూతురు మాల్విక రాజ్ జోషీతో బడి మాన్పించింది. సంప్రదాయ చదువులకు స్వస్తిచెప్తి.. తనకు నచ్చిన సబ్జెక్ట్‌ను చదువుకొనేలా మాల్వికను ప్రోత్సహించింది. అదే 17 ఏళ్ల మాల్వికకు అద్భుతమైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది. పదో తరగతి చదవకపోయినా.. ఇంటర్ సర్టిఫికెట్ లేకపోయినా ఆమెకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్)లో సీటు లభించింది.
మాల్వికలోని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రతిభను గుర్తించిన మిట్ పిలిచి మరీ సీటు ఇచ్చింది. మిట్ అందించే ఉపకార వేతనం (స్కాలర్‌షిప్)తో ఆమె ప్రస్తుతం బ్యాచ్‌లర్ సైన్స్ డిగ్రీని అభ్యసిస్తున్నది. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్‌లో రెండు రతజ, ఒక కాంస్య పతకం సాధించడంతో ఆమెను ఈ అవకాశం వెతుక్కుంటూ వచ్చి వరించింది. ప్రొగ్రామింగ్ ఒలింపియాడ్‌గా పేరొందిన ఈ (మాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సబ్జెక్ట్) పోటీల్లో పతకాలు సాధించిన వారికి తమ ఇన్‌స్టిట్యూట్‌లోనే తీసుకొనే సంప్రదాయాన్ని మిట్ కొనసాగిస్తున్నది.
నిజానికి మాల్విక ఇంటర్ పాస్ కాకపోవడంతో దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీటు లభించలేదు. కేవలం చెన్నై మాథ్‌మేటికల్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఐ)లో ఆమెకు సీటు దొరికింది. డిగ్రీ విద్యార్థులకు సమానంగా ఆమెకు సబ్జెక్ట్‌పై అవగాహన ఉండటంతో ఆమె ఎమ్మెస్సీలో చేరింది.
మాల్వికకు ప్రతిష్టాత్మక మిట్‌లో సీటు రావడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 'మాది మధ్య తరగతి ఫ్యామిలీ. నిజానికి స్కూల్‌లో మాల్విక బాగా చదువుతున్నప్పుడే.. పిల్లలు సంతోషంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయ చదువుల కన్నా ఆనందమే అత్యంత ముఖ్యమని భావించాను' అని సుప్రియా చెబుతారు. ఆమెకు మాల్వికతోపాటు రాధ అనే కూతురు ఉంది. 'క్యాన్సర్ రోగుల సంక్షరణ చూసే ఓ స్వచ్ఛంద సంస్థలో నేను పనిచేస్తాను. ఎనిమిది, తొమ్మిది తరగతి చదివే పిల్లలు కూడా క్యాన్సర్ బారిన పడి అవస్థలు పడటం నన్ను కలిచివేసింది. అందుకే చదువుల కన్నా నా బిడ్డలు ఆనందంగా ఉండటం ముఖ్యమనుకున్నా' అని ఆమె తెలిపారు. ఇంజినీరు అయిన భర్తను కూడా ఇందుకు ఒప్పించారు.
ప్రస్తుతం బోస్టన్‌లో ఉండి చదువుకుంటున్న మాల్విక మాట్లాడుతూ 'నాలుగేళ్ల కిందట చదువు మానేసినప్పుడు నేను చాలా సబ్జెక్టులను అన్వేషించారు. అందులో ఒకటైన ప్రోగామింగ్ నాకు ఆసక్తి కలిగించింది. దాంతో మిగతా సబ్జెక్టుల కన్నా ప్రోగ్రామింగ్‌పై ఎక్కువ దృష్టి సారించా. దానిపై ఇష్టం ఏర్పడింది' అని తెలిపింది. ఆ ఇష్టం వల్లే సబ్జెక్టుపై పట్టు సాధించి.. ఇప్పుడు మిట్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్టు తాను సంతోషం వ్యక్తం చేసింది.