జ్యోత్స్న ఫణిజ పాడితే సంగీతం పరవళ్లు
మిణుగురులు
సమాజానికి దివిటీలు
జ్యోత్స్న ఫణిజ పాడితే సంగీతం పరవళ్లు తొక్కుతుంది. కలం కదిపితే అక్షరాలు తరంగాలై మనసును తట్టిలేపుతాయి. అంతేనా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లనూ వేగంగా చేస్తారు జ్యోత్స్న. పేద విద్యార్థులకు ఆంగ్ల భాషలో, కంప్యూటర్ అప్లికేషన్‌లలో ఉచిత శిక్షణ ఇస్తూ, ఆంగ్లసాహిత్యంలో నేడో రేపో డాక్టరేట్ పట్టా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారామె.ఇవన్నీ ప్రతిభ గలవారందరూ అవలీలగా చేసేవేగా... జ్యోత్స్న ప్రత్యేకత ఏమిటి.. అంటే ఆమెకు చూపు లేదు! అలా అని ఆమె ఏనాడూ దిగులు చెందలేదు. తన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ పదిమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఆమె విజయగాథే ఈ వారం ‘మిణుగురులు’
- నిర్మలారెడ్డి
కృష్ణా జిల్లా కైకలూరులో పాతికేళ్ల క్రితం... అభిమన్యకుమార్, సత్యవతిలకు అబ్బాయి తర్వాత రెండోసంతానంగా జన్మించింది జోత్స్న. మూడు నెలల వరకు వారు ఆ ఆనందంలోనే ఉన్నారు. తర్వాత ఓ రోజు ఆమె చూపులో ఏదో తేడాను గమనించారు. వైద్యులకు చూపిస్తే పుట్టుకతోనే అంధురాలు అని తేల్చారు! ‘‘అప్పుడు మా అమ్మ చాలా ఏడ్చిందట. నాన్నగారు చాలా బాధపడ్డారట. కానీ, అంత బాధలోనూ వారో నిర్ణయం తీసుకున్నారు. నా భవిష్యత్తును చక్కగా మలచాలని. అన్నయ్యతో పాటు నన్నూ స్కూల్లో చేర్పించారు. ఇంటర్మీడియెట్‌కి వచ్చాక చూపులేనివారికి సీట్ ఇవ్వలేమని కాలేజీ యాజమాన్యం చెప్పింది. నేనే కాలేజీ ప్రిన్సిపల్‌తో ‘మిగతా అందరికన్నా మంచి మార్కులు సాధించి చూపిస్తాను’ అని వాదించి, ఒప్పించాను. ఇంటర్మీడియెట్ వరకు ఉన్న ఊర్లోనే చదువుకున్న నేను డిగ్రీకి హైదరాబాద్‌కు వచ్చాను’’ అని చెప్పారు జ్యోత్స్న.
అన్నింటా మేటి..!
హైదరాబాద్‌లో ఓ అంధుల పాఠశాలలో చేరారు జ్యోత్స్న. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మాధ్యమంగా చదివినప్పటికీ డిగ్రీలో ఇంగ్లిష్ లిటరేచర్‌ని ఎంచుకున్నారు. యూనివర్శిటీ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత మెరిట్ స్కాలర్‌షిప్‌లు వరించి ఆమె తండ్రి కష్టాన్ని సగానికి తగ్గించాయి. కాలేజీ స్థాయిలో ఫెయిర్ అండ్ లవ్లీ వారి మెరిట్‌స్కాలర్‌షిప్‌తో జ్యోత్స్నకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. మూడు లక్షల మంది విద్యార్థినులతో పోటీపడి ఆ విజయాన్ని అందుకోగలిగారు. మరోవైపు ఎమ్.ఎ చేసి యు.సి.జి నెట్ క్వాలిఫై అయ్యారు. కువైట్, కెనడియన్ దేశాలలో మహిళల అభ్యున్నతికోసం ప్రసంగాలు ఇచ్చే అవకాశాలనూ వినియోగించుకున్నారు.. ఎక్కడకు వెళ్లినా ఒంటరిగానే వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇందుకు అమ్మానాన్నలే జ్యోత్స్నను ప్రోత్సహించారు. ప్రస్తుతం ఆమె ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు.
కంప్యూటర్ పరిజ్ఞానం
ముంబయ్‌లో అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ కోర్స్ చేశారు జ్యోత్స్న. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో టీ.సి.ఎస్ సంస్థ పెట్టిన పరీక్షలో మెరిట్ సాధించడంతో ఆ అవకాశం లభించింది. అంధులైన యువతీ యువకులకు మార్గదర్శకం చేసే కేంద్రాన్ని నెలకొల్పాలన్నది తన ఆశయం అని తెలిపారు జ్యోత్స్న.
ఆధారపడటం తను ఇష్టపడదు
జ్యోత్స్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మాకు దూరపు బంధుత్వం కూడా ఉంది. తన వ్యక్తిత్వం, ఎవరిమీదా ఆధారపడని తత్త్వం నన్ను ఎప్పుడూ అబ్బురపరిచేవి. పట్టుదల, ఇతరులకు సాయపడాలనే ఆలోచన కలిగిన ఆమెకు వెన్నుదన్నుగా నిలవాలనుకుని, తన చేయందుకున్నాను. నేను ఎం.బి.ఎ చేస్తున్నాను. నా సబ్జెక్ట్‌ల్లో వచ్చే సందేహాలనే కాదు జీవితంలో వచ్చే సవాళ్లనూ ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది.
- రాధాకృష్ణ (జ్యోత్స్న భర్త)