ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల సందర్భంగా కళాకారుల నాట్యం. ఇన్‌సెట్‌లో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఇకపై రాష్ట్రంలో ఏటా తెలంగాణ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. డిసెంబర్‌లో రెండు రోజుల పాటు సభలు జరుగుతాయని వివరించారు. ఇకపై ఏ మీడియమైనా, ఏ సిలబస్ అయినా ఈ గడ్డపై చదువుకోవాలంటే తెలుగును ఒక సబ్జెక్టుగా కచ్చితంగా నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌దాకా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చదవాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. భాష పండితుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. తెలుగు భాషాభివృద్ధికి జనవరిలో సమగ్ర ప్రణాళిక ప్రకటిస్తామని ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవం మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం, ప్రపంచ తెలుగు మహాసభలు ఊహించిన దానికంటే ఘనంగా జరిగాయంటూ హర్షం వెలిబుచ్చారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘‘ఎట్లా జరుగుతయో, ఎట్లా ఉంటుందో, మహా సభలను నిర్వహించే శక్తిసామర్థ్యా లు తెలంగాణ వాళ్లకు ఉన్నయో, లేవోననే సందేహాల మధ్య చాలా సంతోషంగా, అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని పండించినం. ఒకప్పుడు సిటీ కాలేజీ విద్యార్థిగా ఇదే ఎల్బీ స్టేడియంలో ఒక మూలన కూర్చుని ఇవే ప్రపంచ తెలుగు మహాసభలను తిలకించిన. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంలో మహా సభలు సగౌరవంగా జరిగినయి. మన తెలంగాణ తన భాషా వైదుష్యాన్ని, తేజో మయ సాహితీ వైభవాన్ని, పాండితీ ప్రకర్షను, కళా వైభవాన్ని ప్రపంచానికి చాటింది. సభలు విజయవంతమైనందుకు, ఆశించిన లక్ష్యం అద్భుతంగా నెరవేరినం దుకు వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తిగా, సంతోషంగా ఉంది. ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా గురుపూజ చేసి సంస్కారవంతంగా సభలను మనం ప్రారంభించుకున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి ముగింపు సమావేశానికి వచ్చిన రాష్ట్రపతికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రభుత్వ నిబద్ధత సభల ద్వారా వెల్లడైంది
తెలంగాణ భాష అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఈ సభల ద్వారా వెల్లడైంది. మన భాషను గౌరవించుకోవడమే గాక దేశంలోని అన్యభాషల ఉద్ధండులను, జ్ఞానపీఠ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలను గొప్పగా సన్మానించుకున్నాం. తెలుగు భాషను బతికించుకోవాలనే మాటలనూ ఈ సభల్లో పదేపదే విన్నాం. నాకు కొంత బాధ కలిగింది. తెలుగు మృత భాష కాకూడదని ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అన్నారు. తెలుగు నేలలోనే, మన గడ్డమీదనే ఇలా మన మాతృభాషను మృత భాష అనో, బతికించుకోవాలనో వినాల్సి రావడం బాధాకరం. ఈ దుస్థితి మన భాషకు పట్టకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుంది.
సభలు, సంబరాల తో సరిపెట్టకుండా, ఈ కృషిని తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణ సాహిత్య అకాడమీ సంపూర్ణంగా కొనసాగిస్తుంది. భాషా పండితుల సమస్యల విషయంలో ఇమిడి ఉన్న చిన్న న్యాయపరమైన సమస్యను పరిష్కరిస్తాం. భాషా పండితులుగా రిటైరైన వారికి పెన్షన్‌లో కొంత కోత విధిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా రద్దు చేస్తాం. తెలుగు భాష అభివృద్ధికి, తెలుగును అద్భుతమైన జీవ భాషగా నిలిపి ఉంచడానికి కొన్ని ప్రకటనలు ఈ రోజు చేయాలని భావించా. మొన్నటి ఉపన్యాసంలో ఆ మాట చెప్పగానే చాలామంది, చాలా రకాలుగా కొన్ని వందలు, వేల సూచనలు పంపించారు. ఇప్పటికిప్పుడు అర్ధంతరంగా ప్రకటించడం కంటే జనవరి తొలి వారంలో భాషా, సాహితీవేత్తల సదస్సు నిర్వహించి, వచ్చిన సూచనలన్నింటినీ క్రోడీకరించి కచ్చితమైన, నిర్దిష్టమైన ప్రణాళికను ప్రకటిస్తామని హామీ ఇస్తున్నా.
మహాసభలను విజయవంతంగా నిర్వహించిన మిత్రులు సిధారెడ్డికి, వారితో కలసి కృషి చేసిన బృందానికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు, డీజీపీకి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి వెంకటేశానికి, ప్రభుత్వాధికారులకు హృదయపూర్వక అభినందనలు. కిట్ల పంపిణీలో ఇబ్బందులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తాం. 42 దేశాల నుంచి, మన దేశంలోని 17 రాష్ట్రాల నుంచి, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి మహాసభలకు తరలివచ్చిన ప్రతినిధులు, భాషావేత్తలు, పండితులు, కవులు, గాయకులు, కళాకారులందరికీ వందనం, అభివందనం, శుభాభివందనం. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు మహాసభలను సుసంపన్నం చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’
నవ్వుపై కేసీఆర్ పద్యం... పద్యంతోనే ముగించిన సీఎం
ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆద్యంతం పద్యాలు పాడి అలరించిన సీఎం కేసీఆర్, ముగింపు కార్యక్రమంలోనూ మరో పద్యం పాడి ఆహూతుల మది దోచారు. నవ్వు, నవ్వుల తీరును వివరిస్తూ ఆయన చెప్పిన పద్యానికి సభికుల హర్షధ్వానాలతో ఎల్బీ స్టేడియం మార్మోగింది. ‘‘మహాసభల ఆరంభంలో కొంత బెరుకుగా ఉన్నప్పటికీ సంతోషంతో, ఆనందంతో, సుసంపన్నమైన సందర్భంలో నవ్వులతో ఈ సంరంభాన్ని ముగించుకుంటున్నాం. కనుక నేను కూడా నవ్వుల పద్యంతో ముగిస్తున్నాను’అంటూ ప్రసంగం చివరలో ఆయన ఆలపించిన పద్యం...
నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్
దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు,
కొన్ని విషప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమరసమున్
విరజిమ్ము విశుద్ధమైన లే
నవ్వులు సర్వదుఃఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్
Comments
Please login to add a commentAdd a comment