విదేశీ వర్సిటీలు సరే, తెలుగు వర్సిటీ మాటేంటి? | Yarlagadda lakshmi prasad takes on ap govt behaviour on telugu language | Sakshi
Sakshi News home page

విదేశీ వర్సిటీలు సరే, తెలుగు వర్సిటీ మాటేంటి?

Published Sun, Dec 20 2015 11:36 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

విదేశీ వర్సిటీలు సరే, తెలుగు వర్సిటీ మాటేంటి? - Sakshi

విదేశీ వర్సిటీలు సరే, తెలుగు వర్సిటీ మాటేంటి?

తెలుగు విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోక ఎన్ని చేసినా వ్యర్థం
సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారింది
కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో ‘సాక్షి’ ముఖాముఖి

 
విజయవాడ : రాష్ట్రంలోని రెండు ప్రధాన యూనివర్సిటీల్లో పనిచేసే సుమారు 500 మంది అధ్యాపక సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు లేక చెంబులు, బిందెలు తాకట్టుపెట్టుకుని కాల్‌మనీ కోరల్లో చిక్కుతున్నారంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు, లోక్‌నాయక్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు యూనివర్సిటీ కోసం తన అంతరంగంలోని తపనను యార్లగడ్డ ‘సాక్షి’ ముఖాముఖిలో ఇలా ఆవిష్కరించారు.
 
సాక్షి: తెలుగు వర్సిటీ ఏర్పాటుకు మీ పోరాటం ఎలా ఉంటుంది?
యార్లగడ్డ: పోరాటం అనే పెద్ద మాటలు నేను మాట్లాడలేను. అయితే రాష్ట్ర విభజన జరిగి దాదాపు సంవత్సరంన్నర గడిచిపోయింది. తెలుగు వర్సిటీ ఏర్పాటులో ఒక్క అడుగు ముందుకు పడలేదు. అదే నా ఆవేదన.
 
సాక్షి: తెలుగుకు ప్రాధాన్యం దక్కడంలేదంటారా?
యార్లగడ్డ: కనీసం రాజధాని శంకుస్థాపన బోర్డులోనే తెలుగుకు చోటులేదు. అధికార భాష అమలులో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది శూన్యం.
 
సాక్షి: తెలుగు యూనివర్సిటీ ఏర్పాటులో జాప్యం ఎందుకు?
యార్లగడ్డ: పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని తెలంగాణకు పరిమితం చేసుకుని దానికి సురవరం ప్రతాపరెడ్డిగారి పేరు పెట్టుకుంటామని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ప్రకటన చేశారు. వెంటనే ఈ విషయాన్ని మన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లాను. సీఎం చంద్రబాబునాయుడు రాజమండ్రి కేంద్రంగా తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు.
 
సాక్షి:  సీఎం వాగ్దానం చేసి నెలలు గడిచింది కదా?
యార్లగడ్డ: తెలంగాణ వాళ్లు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి కూడా ఏపీలో ఉన్న 90 సెంటర్లకు సర్వీసులు నిలిపేశారు. జూలైలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని మూడు పీఠాలకు సంబంధం లేదని ప్రకటించారు. జూలై నుంచి ఏపీలో ఈ వర్సిటీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది 500 మందికిపైగా జీతాలు లేవు. వాళ్లు కుటుంబ పోషణ కోసం వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కాల్‌మనీ బారిన పడుతున్నారు. అం బేడ్కర్ వర్సిటీకి సంబంధించి హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
 
సాక్షి: ప్రభుత్వంపై మీరు చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి?
యార్లగడ్డ: నాది ఆగ్రహం కాదు. ఆవేదన. సెప్టెంబర్ 4న హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాధికారులు నవంబర్ 12 వరకు స్పందించకపోవడంతో హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు కోసం తహతహలాడిపోతున్నారు. వాటిని విద్యాసేవ కోసం స్థాపిస్తారా? రాష్ట్రంలో సొంత యూనివర్సిటీలను పట్టించుకోకుండా ప్రైవేటు విశ్వవిద్యాలయాలను పట్టుకొస్తానంటావ్.
 
సాక్షి: డిప్లొమా ఇన్ జపాన్ భాష పెడతానంటావ్. డిప్లొమా ఇన్ ఫ్రెంచి భాష పెడతానంటారు. వంద భాషలు పెట్టండి. ముందు అమ్మభాష ఏది?
యార్లగడ్డ: వర్సిటీల సిబ్బందికి జీతాలు అర్జెంటుగా ఇప్పించకపోతే మీరు ఎన్ని చేసినా వ్యర్థం. మీరు సమర్థులు అనిపించుకుంటారో లేక అసమర్థులుగా మిగిలిపోతారో తేల్చుకోవాలని చెప్పడానికి నాకు ఎటువంటి మోహమాటం లేదు. వింటే సంతోషం. వినకపోతే ఎన్నికలొస్తాయ్ ప్రజలు చూసుకుంటారు. ఇది నా గొడవ కాదు.


సాక్షి: మాతృభాష అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు?
యార్లగడ్డ: అధికార భాషా సంఘానికి హరికృష్ణను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు. కానీ ఇంతవరకు అధికార భాషా సంఘం లేదు. దాని కార్యాలయం లేదు. అంచేత నేను ముఖ్యమంత్రిని కోరేదేమంటే అయ్యా తెలుగు భాషకు సంబంధించి మీ స్పీచ్ బాగుంది. కానీ ఆచరణ బాగాలేదు. దీనిపై దృష్టి పెట్టండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement