తెలుగు: ఎప్పుడు? ఎక్కడ? ఎలా? | Telugu: When? Where? How so? | Sakshi
Sakshi News home page

తెలుగు: ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

Published Sat, Nov 21 2015 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

తెలుగు: ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

తెలుగు: ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

 ఒక విధంగా చూస్తే గాథాసప్తశతి తెలుగు భాషలోని ప్రథమ వాఙ్మయం- మౌఖికం. హాలుడు ఆ గాథలలోని సౌందర్యానికి ముగ్ధుడై వాటిని ప్రాకృత భాషలోనికి (రాజభాషలోనికి) ఆర్యావృత్తాలలోనికి అనువదించి ఉంటాడు.
 
 సింధూ నది ప్రాంతం నుండి ద్రావిడులు దక్షిణాదికి వలస వచ్చారని చరిత్ర చెప్పుతూ ఉంది. మరి వారు వలస రాకపూర్వం దక్షిణ భారతదేశమంతా జనశూన్యంగా ఉండినదా? జనావాసాలూ, జనాలూ లేనే లేరా? ఉండుంటే వారికొక భాష ఉండదా? వారి భాష ఏమైంది?దాక్షిణాత్య జనులు దక్షిణ భారతదేశం లోనే ఆవిర్భవించార నడమే సహజ సిద్ధాంతం.

 దక్షిణ భారతదేశంలో మొట్ట మొదట వెలసిన ప్రముఖ ఆదిమానవులు నివాసం ఏర్పాటు చేసుకొన్న తుంగభద్రా, కృష్ణానదీ తీర పర్వతారణ్యాలే రామాయణంలో చెప్పబడిన కిష్కింధ. రామునికి కిష్కింధలోనే జనావాసాలు కనబడ్డాయి. కిష్కింధ సమీపంలో ఋశ్య మూకమూ, మాల్యవంతమూ అనే కొండల పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు కూడ హంపి వద్ద ఉన్న రెండు కొండలకు ఆ పేర్లే ఉన్నాయి.
 కిష్కింధలో నివాసం చేసుకొని ఉండినవారే రామాయణంలో చెప్పబడిన వానరులు. వారే ఆధునిక చరిత్రకారులు చెబుతున్న ద్రావిడులు. వాల్మీకి ఈ వానరులకు తోకలున్నట్లు వర్ణించినాడు కానీ అది కావ్య సౌందర్యానికే కావచ్చు. వారు మామూలు కోతులైతే వాల్మీకి వారిని అంతటి బృహత్కాయులుగా, శక్తిమంతులుగా వర్ణించి ఉండడు. అలా వర్ణిస్తే అది హాస్యాస్పదమౌతుంది. కాబట్టి వారు నిస్సం దేహంగా బృహత్కాయులైన, అనాగరికులైన ఆదిమానవులే. వారు మాట్లాడుతూ ఉండిన భాషే మూల దక్షిణ భారతభాష. ఆధునిక చరిత్రకారులు చెప్పే మూల ద్రావిడ భాష.

 ఉత్తరాది వారి నాగరికత దక్షిణాది నాగరికత కంటే చాలా ప్రాచీనమైనది. దక్షిణాదిలో భాషలు ఇంకా శైశవ దశలో ఉండగానే ఉత్తరాది వారి సంస్కృతంలో గొప్ప వాఙ్మయమే- వేదాలు- వెలిసింది. దక్షిణాదిలో ఒక పరిపాలనా వ్యవస్థ లేని కాలంలోనే ఉత్తరాదిలో రాజు, మంత్రులు, సేనాధిపతి, సైన్యమూ, పన్నులు, ఉద్యోగులు మొదలైన పాలనా వ్యవస్థ ఏర్పడింది.

 శ్రీరాముడు వనవాసం నెపంతో దక్షిణాదికి వచ్చి గోదావరీ తీరంలో నిలవడమూ, ఖరదూషణాదులను చంపడమూ, అందుకు ప్రతీకారంగా రావణుడు సీతను అపహరిం చడమూ, రామలక్ష్మణులు కిష్కింధ వాసులతో సఖ్యం చేసుకోవడమూ, వారి సాయంతో లంకకు వెళ్ళి రావణుని వధించి తిరిగి అయోధ్యకు చేరుకోవడమూ భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టం. ఇది ఒక విధంగా రాజకీయ వ్యవస్థ లేని దక్షిణ భారతదేశాన్ని ఆర్య సంస్కృతి లోనికి లాగుకొనే ప్రయత్నం. రాజకీయ, సాంస్కృతిక దండయాత్ర.

 దక్షిణాదిలో మూలద్రావిడ భాష ఇంకా పరిపక్వమూ, వాఙ్మయ నిర్మాణ సమర్థమూ కాకముందే సంస్కృత భాష దక్షిణాదిపైన ఉప్పెనలా విరుచుకుపడింది. ఉత్తరాదికి సమీపంలో ఉన్న నేటి తెలుగు కన్నడ ప్రాంతాల మీద సంస్కృత ప్రభావం ఎక్కువగా పడింది. సంస్కృతం ఆధిక్యత క్రింద అచ్చమైన మూల ద్రావిడ పదాలు అనేకం మాయమై పోయాయి. భాష యొక్క మూల లక్షణాలైన క్రియా పదాలు, సర్వనామాలు మొదలైనవి మాత్రం ఎలాగో చెక్కుచెదరకుండా నిలిచాయి. తెలుగు కన్నడ ప్రాంతాలకు దక్షిణంగా ఉండిన తమిళ ప్రాంతం పైన  సంస్కృత భాషా ప్రభావం అంతగా పడలేదు. తమిళం మూలద్రావిడ భాషకు దగ్గరగా నిలబడింది. తెలుగు, కన్నడం ఇంచుక దూరంగా జరిగిపోయాయి. ఇవికాక మూల ద్రావిడ భాష నుండి అనేక చిన్న చిన్న భాషలు చీలిపోయాయి. ఈ రీతిగా దక్షిణాది భాషలలో విభిన్నత్వం ఏర్పడటానికి చాలా కాలమే పట్టి ఉండవచ్చు.

 దాక్షిణాత్య భాషల వారు తమకంటూ ఒక లిపిని తయారుచేసుకొన్న సందర్భంలో తెలుగు భాష మాట్లాడేవారు తమ ఉచ్చారణకు అవసరమైన ముప్పై ఆరు అక్షరాలనేకాక సంస్కృత పదాల ఉచ్చారణకు అవసరమైన మరో ఇరవై అక్షరాలను కలుపుకొని తమ వర్ణ సమామ్నాయాన్ని రూపొందించుకొన్నారు.

 ఇక లిపి విషయానికొస్తే దక్షిణాది లిపులు కూడా బ్రాహ్మీలిపి నుండి పరిణమించినవే అంటున్నారు కొందరు భాషాశాస్త్రవేత్తలు. కానీ అది అంత సమర్థనీయంగా కనిపించదు. క్రీ.శ.575లో వేయబడిన కలిమెళ్ళ ధనంజయుని తొలితెలుగు శాసనంలోనూ, క్రీ.శ.848లో వేయబడిన అద్దంకి పండరంగని తొలి తెలుగు పద్యశాసనంలోనూ ఉన్న అక్షరాలను పరిశీలిస్తే ఆ శాసనాల లిపికీ బ్రాహ్మీలిపికీ పెద్దగా పోలికలు కనబడడం లేదు. న, ణ, డ మొదలైన మూడు నాలుగు అక్షరాలు మాత్రం నాగరి లిపిని పోలి ఉన్నాయి. తక్కినవన్నీ స్వతంత్రమైన లిపిగానే కనబడుతూ ఉన్నాయి.

 మాటలు సద్యఃస్ఫురణతో హఠాత్తుగా పుట్టుకొస్తాయి. మాటలు పుట్టడానికి అవసరమే తప్ప ప్రయత్నం అవసరం లేదు. లిపి అట్లా కాదు. లిపి వ్యాప్తి చెందాలంటే పరస్పర అంగీకారంతో అక్షర రూపాన్ని సృష్టించడం, జ్ఞాపకం పెట్టుకోవడం, పునఃప్రయోగం మొ దలైన అనేకాంశాలు అవసరమౌతాయి. మౌఖిక వాఙ్మయం వ్యక్తిగత సృష్టి- లిపి సామూహిక సృష్టి. బహుశా తెలుగు లిపికి ఈ విధమైన రూపకల్పన, అధికార ముద్ర శాతవాహనుల కాలం చివరి నుండి విష్ణుకుండినుల కాలం మధ్య ఏర్పడి ఉండవచ్చు. విష్ణుకుండినుల కాలంలోనూ తరువాత ఆంధ్రదేశాన్ని ఏలిన రాజులకాలం లోనూ తెలుగు లిపి పరిపుష్టంగా శాసనాలలో కనబడుతూ ఉంది.

 తెలుగువాడైన శాతవాహన రాజైన హాలుడు క్రీ.శ. మొదటి శతాబ్దంలో గ్రామీణ ప్రజలు పాడుకుంటూ ఉండిన ఏడు నూర్ల గాథలను ‘గాథాసప్తశతి’ పేరుతో సంకలనం చేశాడు. ఆ గాథలన్నీ ప్రాకృత భాషలో ఉన్నాయి. గ్రామీణ ప్రజలకు ప్రాకృత భాషతో పని ఏమి? వారు ఆ గాథలను తెలుగులోనే రచించి ఉంటారు. ఒక విధంగా చూస్తే ఇదే తెలుగు భాషలోని ప్రథమ వాఙ్మయం- మౌఖికం. హాలుడు ఆ గాథలలోని సౌందర్యానికి ముగ్ధుడై వాటిని ప్రాకృత భాషలోనికి (రాజభాషలోనికి) ఆర్యావృత్తాల లోనికి అనువదించి ఉంటాడు.
 ఆనాడే గనుక తెలుగు భాషకు లిపి ఉండుంటే, హాలుడు ఆ గాథలను తెలుగులోనే యథాతథంగా తెలుగు గ్రామీణులు రచించిన ఛందస్సులోనే గ్రంథస్థం చేసి ఉండుంటే, తెలుగు భాషను రాజభాషగా చేసుకొని ఉండుంటే, ఈనాడు భారతఖండంలో తెలుగు యొక్క ప్రాబల్యమూ, తెలుగు వారి యొక్క కవితా వైభవమూ ఎంతో ఉజ్జ్వలంగా ఉండేవి.
 
 (చరిత్ర, తెలుగు, సంస్కృతం మీద సాధికారత ఉన్న కరణం బాలసుబ్రహ్మణ్య పిళ్ళె ‘తెలుగు: ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా?’ చిరుపొత్తం రాశారు. అందులోని కొన్ని భాగాలే పై వ్యాసం.)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement