తెలుగు భాషకు ద్విత్వం ప్రాణాధారం. ‘క’కు కా వొత్తు, ‘త’కు తా ఒత్తు, ఇలా ఏ హల్లుకు ఆ హల్లే జత పడటం- అమ్మ, అక్క, అయ్య వంటి హల్లుల కలయిక తెలుగు పదాల ప్రాథమిక స్వభావం... ద్విత్వాక్షరాలుండే పదాలను ఎన్నుకోవడమే కాకుండా, ప్రాస స్థానంలో వాటిని వినియోగించే చమత్కారంతో తన రచనకు తెలుగుదనాన్ని సమకూర్చాడు తిక్కన. సున్నితపు త్రాసుతో తూచినట్టు సరయిన స్థానంలో తగిన పదం ఎలా వచ్చిపడుతుంది? రాస్తున్నది చరిత్రకు సంబంధించిన తొలి పేజీలు. అందులోనూ వస్తువు సైన్సు. దానికి ఆయన జవాబు ఆశ్చర్యానికి లోను చేసింది. ‘ఈ తెలుగు సామర్థ్యానికి కారణం పద్యం, మూలం పదమూడవ శతాబ్దపు తిక్కన’.
‘టూకీగా ప్రపంచ చరిత్ర’ పేరుతో ఎం.వి.రమణారెడ్డి ఒక పుస్తకం వెలువరించారు. వారి పై జవాబు ద్వారా, పదేళ్ళ క్రితం వారే వెలువరించిన ‘మహాభారత స్రవంతిలో తెలుగింటికొచ్చిన ద్రౌపది’ గురించి తెలుసుకుని, దాన్నీ చదివాను. వామపక్ష మేధావి రమణారెడ్డి, తిక్కన చిత్రించిన తెలుగు ద్రౌపదిని విశ్లేషించడం ముచ్చట కల్గించింది. పద్యం అనగానే బూర్జువా బూజు ధోరణిలో కాకుండా, హేతుబద్ధమైనది గ్రహించాలనే రీతిలో ఆయన భారతాన్ని, అందునా తిక్కన భారతాన్ని ఇష్టపడి, అందులో ద్రౌపది పాత్ర చిత్రణలో ఎంత తెలుగుదనమున్నదో వివరించడం అర్థవంతంగా అనిపించింది.
‘‘...ఇక్కడ తిక్కన తెలుగు ఇల్లాలితో పాటు, తెలుగు తల్లిని కూడా ఆవిష్కరించాడు. అదివరకటి భారతీయ సాహిత్యానికి స్త్రీలో కనిపించింది కేవలం కామోద్రేకం మాత్రమే. సందర్భం ఒత్తిడి చేస్తే ఒకటి, రెండు సన్నివేశాల్లో ఇతర ఉద్రేకాలను వెల్లడించినా, వాటికి అంత ప్రాముఖ్యం ఆ సాహిత్యంలో కనిపించదు. 13వ శతాబ్దపు తెలుగు సాహిత్యం ఆ సంకుచితత్వానికి వీడ్కోలు పలికింది. అందుకు గాను ఇటు తిక్కన సోమయాజికీ, అటు పాల్కురికి సోమనాథునికీ భారత జాతి రుణ పడిపోయింది’’అని రమణారెడ్డి వ్యాఖ్యానిస్తారు. కీచకునితో అవమానపడిన ద్రౌపది, భీమసేనుడికి కర్తవ్య బోధ చేస్తుంది. తన పరిస్థితి ఏమిటో వివరించిన నేపథ్యంలో-ద్రౌపదిని తిక్కన ఎలా చిత్రించారో చెబుతూ చేసిన విశ్లేషణ ఇది: అంతకు ముందు అధ్యాయంలో కౌరవ సభలో జరిగిన పరాభవం గురించి బాధ పడిన ద్రౌపది నన్నయ్యకు కేవలం ఒక హరికథకురాలిగా కనబడుతుంది.
ఇక్కడ రమణారెడ్డి అంటారు: ‘‘ఇప్పుడు గూడ భర్తను ఒక కర్తవ్యానికి ఉసిగొల్పడమే ఆమె ధ్యేయం. అయినా ఉద్రేకాన్ని వెళ్లగక్కే ఆ తీరులో ఆడ హరిదాసులా కాకుండా అచ్చం తెలుగింటి ఆడ బిడ్డలా కనిపిస్తుంది.’’ దీనికాధారం అయిన తిక్కన పద్యమిది:
నన్ను పరాభవించి, సదనంబునకున్ జని కీచకుండు, ము
న్నున్న తెరంగు తప్పక, సుఖోచిత శయ్యను నిద్రసేయ, నీ
కన్ను మొగుడ్చు ఊరటకు కారణమెయ్యది భీమసేన? మీ
అన్న పరాక్రమంబు వలదన్ననొకో దయమాలి తక్కటా?
(నన్ను పరాభవించి ఆ కీచకుడు తన ఇంటికి జేరి సుఖంగా నిద్ర పోతున్నాడు- అవమాన పడింది పరాయి స్త్రీ కాబట్టి కలత లేకుండా వాడు సుఖంగా నిద్రబోగలుగుతున్నాడు- కట్టుకున్న పెళ్ళానికి ఇంత అవమానం జరిగితే నీ కంటికి కునుకు పట్టేంత నిబ్బరం ఎలా కలిగిందయ్యా? నా మీద జాలి మాత్రమైనా లేకుండా ఇలా పడుకున్నావంటే, పరాక్రమించొద్దని మీ అన్న పెట్టిన ఆంక్ష అడ్డు తగిలిందా ఏమి?)
ఈ పద్యం ఆధారంగా రమణారెడ్డి విశ్లేషణ ఇలా సాగుతుంది: ‘‘... ఈ పద్యంలో తెలుగుదనం ఉట్టిపడటం కూడా గమనించదగిన మరో విశేషం. అది కేవలం తెలుగు పదాలను పలికించడంతో సాధించిన ప్రయోజనం కాదు. తత్సమాల మీదా, పొడవాటి సమాసాల మీదా నన్నయకు ఎంత మోజున్నా తెలుగు మాటలను ఆయన తక్కువేం వాడలేదు. అలాగే తిక్కన సంస్కృత పదాలను పూర్తిగా వదిలేయనూ లేదు.
హల్లుల కలయికలో సంస్కృతానికి సంయుక్తాక్షరాల ప్రాధాన్యత మెండు. తెలుగు భాషకు ద్విత్వం ప్రాణాధారం. ‘క’కు కా వొత్తు, ‘త’కు తా ఒత్తు, ఇలా ఏ హల్లుకు ఆ హల్లే జత పడటం- అమ్మ, అక్క, అయ్య, చెల్లి, ఎర్ర, నల్ల వంటి హల్లుల కలయిక తెలుగు పదాల ప్రాథమిక స్వభావం... ద్విత్వాక్షరాలుండే పదాలను ఎన్నుకోవడమే కాకుండా, తరచూ ప్రాస స్థానంలో వాటిని వినియోగించే చమత్కారంతో తన రచనకు తెలుగుదనాన్ని సమకూర్చాడు. తెలుగు భాషకు నన్నయ కావ్య గౌరవం కలిగించగా, తిక్కన దానికి సాహిత్య సామర్థ్యాన్ని ప్రసాదించాడు.’’
ద్రౌపది పాత్ర ద్వారా తిక్కన ఎలా తెలుగుదనాన్ని చిత్రించారో వివరించడానికి ఈ 168 పేజీల పుస్తకం రాసినా-మొత్తం భారతాన్ని చదివిన అనుభూతి కలుగుతుంది. వస్తువునూ, శైలినీ, భాషనూ త్రాసుతో లెక్కించినట్టు సాహిత్య సాము చేశారు రమణారెడ్డి. వారి భాష సున్నితపు త్రాసుకు తిక్కన స్ఫూర్తి కావచ్చు, కానీ దాన్ని మరింతగా సొంతం చేసుకొని ప్రపంచ విజ్ఞాన చరిత్రను తెలుగులో అందిస్తున్నారనే అంతరార్థం నాకు అవగతమైంది.
- డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
09440732392
తిక్కన ఇచ్చిన సున్నితపు త్రాసు
Published Mon, Apr 4 2016 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM
Advertisement
Advertisement