రాష్ట్రంలో ఏటా లక్షలాది మంది చదువుతున్న ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల సిలబస్ ఇంగ్లిష్‌లోనే ఉంది. శాస్త్ర పరిశోధనా రంగం, వాటికి ప్రామాణికమైన జర్నల్స్, ఇంటర్నెట్ సమాచారం, ఇతరత్రా రిఫరెన్స్ సమాచారం అంతా కూడా అదే భాషలో అందుబాటులో ఉండటం గమనార్హం.
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన విధానాన్ని ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో సామాజిక విద్యా విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉన్నత అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునేందుకు ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యమే చోదక శక్తి అని గుర్తించింది. జూలీ డియల్‌డన్- 2014 సర్వేతోపాటు పలు అధ్యయనాలు ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ దృష్ట్యా ఇంగ్లిష్‌లో భాషా పరిజ్ఞానమే కాకుండా.. విజ్ఞాన సర్వస్వాన్ని మన విద్యార్థులు ఒడిసి పట్టేందుకు వీలుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు, వాటికి కొమ్ముకాస్తున్న మీడియా సంస్థలు, మరికొందరు వితండవాదం చేస్తుండటం విస్మయపరుస్తోంది. మాతృ భాషతోనే విజ్ఞాన సముపార్జన సాధ్యమని ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నాయని విద్యావేత్తలు మండిపడుతున్నారు.
ఇంగ్లిష్‌తో విజ్ఞాన అనుసంధానం
ఇంగ్లిష్‌లోని విజ్ఞాన సర్వస్వాన్ని చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు తమ మాతృభాష ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావిస్తుండటం విడ్డూరంగా ఉంది. ఆ దేశాల్లో జాతీయ భాష ఒక్కటే అన్నది గుర్తుంచుకోవాలి. బహుభాషలకు నెలవైన మన దేశంలో అందరూ మాట్లాడగలిగే భాష అంటూ లేదు. అధికారికంగా 22 భాషలున్నాయి. ఈ పరిస్థితిలో ఇంగ్లిషు భాషలో ఉన్న విజ్ఞాన సర్వస్వాన్ని అన్ని భాషల్లోకి అనువదించడం అన్నది ఆచరణ సాధ్యం కాదని విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. మన రాష్ట్రంతో సహా ఏ రాష్ట్రంలోనూ గత 70 ఏళ్లలో పాలించిన ప్రభుత్వాలు ఆ పని చేయలేకపోయాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాద్యమంలో పాఠశాల విద్య చదివిన విద్యార్థులు ఉన్నత విద్యలో తప్పనిసరిగా ఇంగ్లిష్ మాద్యమంలోనే చదవాల్సి వస్తోంది. దీంతో ఆ భాషలో విషయ పరిజ్ఞానం సరిగా లేకపోవడంతో మన విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా తల్లిదండ్రులు కేవలం ఇంగ్లిష్ మీడియం కోసమే ప్రయివేట్ స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి పెద్ద ఎత్తున ప్రయివేటు స్కూళ్లకు మళ్లారు. దీంతో ప్రభుత్వ స్కూళ్ల ఉనికి ప్రశ్నార్థంగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 5 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
ఇంగ్లిష్‌తోనే ఉన్నత అవకాశాలు
దేశ ప్రస్తుత జనాభా దాదాపు 136 కోట్లు. ఇంత జనాభాకు తగిన ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కేవలం మన దేశంలోనే కల్పించడం ఆచరణ సాధ్యం కాదన్నది గుర్తించాలి. దాదాపు 30 కోట్ల మంది సరైన ఉపాధి అవకాశాల కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో విదేశాలు, దేశంలో నెలకొల్పే విదేశీ కార్పొరేట్ సంస్థలపై ఆధారపడక తప్పదని జాతీయ అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అందుకు ఇంగ్లీషులో పరిజ్ఞానం తప్పనిసరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదివిన విద్యార్థులకు, దేశంలోని ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థులకు లభిస్తున్న అవకాశాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటోందని విద్యావేత్తలు ప్రస్తావిస్తున్నారు. ఈ వాస్తవాలను గుర్తించే పలు దేశాలు ఇంగ్లిష్ మాద్యమంలో విద్యా బోధన వైపు మరలుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం వేగంగా విస్తరిస్తోందని బ్రిటీష్ కౌన్సిల్ కోసం జూలి డియల్ డన్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రధానంగా భారత ఉప ఖండంతోపాటు బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలతో పాటు 55 దేశాల్లో ఆ సంస్థ సర్వే చేసింది.
జూలి డియల్ డన్ సర్వే మేరకు..
- 55 దేశాల్లో ప్రభుత్వ పాఠశాలలు 53 శాతం, ప్రైవేట్ పాఠశాలలు 88 శాతం ఇంగ్లిష్‌లో విద్యా బోధన చేస్తున్నాయి. ఉన్నత విద్యలో ప్రభుత్వ విద్యా సంస్థలు 70 శాతం, ప్రైవేట్ విద్యా సంస్థలు 90 శాతం ఇంగ్లిష్ బోధన సాగుతోంది.
- 55 దేశాల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనకు అనుకూలంగా ప్రజాభిప్రాయం మారుతోంది. గత పదేళ్లలో 62 శాతం మంది ప్రజలు ఈ మీడియం వైపు మొగ్గు చూపారు.
- ఇటలీ 10 ఏళ్ల క్రితమే ఇంగ్లిష్‌లో విద్యాబోధనను విస్తృతంగా చేపట్టింది. జర్మనీ, ఫ్రాన్స్‌దేశాలు కూడా ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయి.
- శ్రీలంక 2001లోనే ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఇంగ్లిష్ మీడియం బోధనను అందుబాటులోకి తెచ్చి విజయవంతంగా నిర్వహిస్తోంది.
విద్యాబోధన వేరు.. భాష పరిరక్షణ వేరు
ఇంగ్లిష్‌లో విద్యాబోధనకు మాతృభాష పరిరక్షణకు ముడి పెట్టడం సరికాదని విద్యావేత్తలు తేల్చి చెబుతున్నారు. విద్య, సంస్కృతి, సాహిత్యంలను వేర్వేరుగా చూడాలని సూచిస్తున్నారు. ఇంగ్లిష్‌తో తెలుగు భాషకు ముప్పు అనే సందేహాన్ని దివంగత భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు గతంలోనే కొట్టిపారేశారు. కనీసం వెయ్యి మంది మాట్లాడే భాష ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ఆయన సాధికారికంగా విశ్లేషించారు. అలాంటిది దాదాపు 9 కోట్ల మంది మాతృ భాష అయిన తెలుగుకు ఎలాంటి ముప్పు ఉండదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇంగ్లిష్ మీడియంతో తెలుగు ఉనికికి ముప్పు అనేది ఎక్కడా శాస్త్రీయంగా రుజువు కాలేదని ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పెద్దిరాజు చెప్పారు.
నష్టపోతున్న ప్రతిభావంతులు
ఉత్తరాంధ్రతోసహా మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తున్నారు. వారికి విషయ పరిజ్ఞానం ఉంటోంది. కష్టపడేతత్వం ఉంది. కానీ ఇంగ్లిష్‌లో విషయ పరిజ్ఞానం సరిగా లేకపోవడంతో కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలు పొందలేక నష్టపోతున్నారు. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చదివక పోవడమే వారికి ప్రతికూలంగా మారింది. ప్రపంచీకరణ నేపథ్యంలో అందివస్తున్న అవకాశాలను మన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలంటే పూర్తిగా ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడమే మార్గం.
- ప్రసాదరెడ్డి, ఇన్‌చార్జ్ వీసీ, ఆంధ్రా యూనివర్సిటీ
కేరళ, ఒడిశాలే ఆదర్శం
ప్రపంచీకరణ నేపథ్యంలో మన విద్యార్థులు రాణించి ఉన్నత స్థానాలు చేరుకోవాలంటే ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన తప్పనిసరి. యూపీపీఎస్సీ వంటి పోటీ పరీక్షల్లో భావ వ్యక్తీకరణ అన్నది అత్యంత కీలకం. ఆ విషయంలో తెలుగు మీడియం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం. దీన్ని అధిగమించి మన విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనే పరిష్కార మార్గం. మన కంటే వెనుకడిన ఒడిశా కూడా ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతో అద్భుత ఫలితాలు సాధిస్తోంది. కేరళ విద్యార్థులు అత్యధికంగా జాతీయ, అంతార్జతీయంగా రాణించడానికి కూడా ఇదే కారణం.
- ప్రొఫెసర్ నారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ
సామాజిక విద్యా విప్లవం
ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన రాష్ట్రంలో సామాజిక విద్యా విప్లవానికి నాంది అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ప్రాథమిక విద్య దశలో విద్యార్థుల్లో గ్రహణ శక్తి ఎక్కువుగా ఉంటుంది. ఆ సమయంలో ఇంగ్లిష్‌తో సహా ఏ భాషలో అయినా సులువుగా పరిజ్ఞానాన్ని సముపార్జించుకోగలుగుతారు. అదే ఓ వయసు వచ్చిన తర్వాత నేర్పుతామంటే అది పడికట్టు పదాలకే పరిమితమవుతుంది. ఇది గుర్తించే జర్మనీ, ఫ్రాన్స్‌లతోపాటు చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన వైపు మొగ్గు చూపిస్తున్నాయి. విద్య, భాష పరిరక్షణ, సాహిత్యం అన్నవి వేర్వేరు. వాటిని కలిపి చూడకూడదు. రాష్ట్రంలో లక్షలాది మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే తెలుగు భాషకు ముప్పు అనిగానీ విద్యార్థుల వికాసానికి భంగం అని గానీ ఎవరూ మాట్లాడ లేదు. కార్పొరేట్ కాలేజీల్లో తెలుగు బదులు సంస్కృతం సబ్జెక్టు పెడుతుంటే ప్రశ్నించలేదు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే మాతృ భాషకు, విద్యార్థుల వికాసానికి భంగం వాటిల్లుతోందని కొన్ని సంస్థలు గగ్గోలు పెట్టడం సరికాదు. తెలుగు భాష పరిరక్షణకు గ్రంథాలయాలను పటిష్ట పరచాలి.
- కత్తి పద్మారావు, దళిత ఉద్యమ నిర్మాత
Comments
Please login to add a commentAdd a comment