సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కార్ తీసుకువచ్చిన సంస్కరణలతో మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. గతంలో ఏదైనా పరీక్షను ఆంగ్ల మాధ్యమంలో రాయడానికి వెనకంజ వేసే మన రాష్ట్ర విద్యార్థులు ఇప్పుడు ఆ భయం పోగొట్టుకుని ముందంజలో దూసుకెళుతున్నారు. ఇటీవల ఇంగ్లిష్ మీడియం విద్యా బోధన విషయంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (ఎన్‌ఏఎస్)–2023లో మన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిభ చూపించారు. ఈ సర్వేలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్ సాధించడం గమనార్హం.
అంతేగాక జాతీయ సగటు కంటే ‘డబుల్’ రెట్లకు పైగా మన విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. దేశంలోని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం ఆ సర్వే నిర్వహించింది. ఇంగ్లిష్ మీడియం చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థులను ఎంపిక చేసి పరీక్ష నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థుల జాతీయ సగటు 37.03 శాతంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల శాతం 84.11గా ఉండటం విశేషం.
ముఖ్యంగా సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో జాతీయ సగటు కంటే ఎక్కువ ప్రగతి సాధించడం సాధ్యమైంది. బైలింగువల్ (ఇంగ్లిష్–తెలుగు) టెక్టŠస్ బుక్స్ పంపిణీ, ఇంగ్లిష్ ల్యాబ్స్‌తో విద్యార్థులకు నిరంతరం ప్రత్యేక బోధన అందించడంతో విద్యార్థులు ఆంగ్ల పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకుంటున్నారు. అలాగే ఫార్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలను ఆంగ్ల మాధ్యమంలో రాయడం వల్ల వారు భాషపై పట్టు సాధిస్తున్నారు.
మూడు తరగతుల విద్యార్థులపై అంచనా పరీక్ష
దేశ వ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసి (ఎఫ్‌ఎల్‌ఎన్) సర్వేను ఏటా నిర్వహిస్తుంది. 2021లో కేంద్రం ఎన్‌ఏఎస్, 2022లో ఎఫ్‌ఎల్‌ఎన్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన అప్పటి సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలు సైతం అమలు చేస్తోంది.
ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఏఎస్–2023 సర్వేలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 3, 6, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసి సర్వే పరీక్ష నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాయడానికి 1,12,72,836 మందిని ఎంపిక చేయగా 41,74,195 మంది (37.03 శాతం) హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 6,42,496 మందిని ఎంపిక చేస్తే 5,40,408 మంది (84.11 శాతం) ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాశారు.
ఈ పరీక్షలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు మనకంటే వెనుకబడడం గమనార్హం. పేదింటి పిల్లలు అంతర్జాతీయ అవకాశాలను అందుకోవాలంటే ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి అని భావించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడంతో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.
బోధన, పరీక్షా విధానంలో సంస్కరణలు
దేశంలో ఉత్తమ విద్యా సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధన, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సంస్కరణలను, పథకాలను అమలు చేస్తోంది. బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్స్, ఐఎఫ్‌పీ స్క్రీన్లు, ఇంగ్లిష్ ల్యాబ్స్‌తో పాటు, విద్యార్థి సామర్థ్యాల ఆధారంగా బోధన అందిస్తున్నారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అంతేగాకుండా ఏపీ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్’ను రూపొందించి అమలు చేస్తున్నారు. దాంతో ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన రెండు ఫార్మెటివ్ అసెస్‌మెంట్ (యూనిట్ టెస్ట్)లలో 91.03 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు.
ఇంగ్లిష్ మీడియం సర్వేలో పాల్గొన్న విద్యార్థులు ఇలా..
Comments
Please login to add a commentAdd a comment