ప్రభుత్వ బడిలో ప్రగతి కెరటాలు | International recognition of govt education with CM Jagan reforms | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడిలో ప్రగతి కెరటాలు

Published Thu, May 2 2024 5:34 AM | Last Updated on Thu, May 2 2024 5:34 AM

 ప్రపంచ బ్యాంక్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, జపాన్‌లో ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

ప్రపంచ బ్యాంక్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, జపాన్‌లో ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

సీఎం జగన్‌ సంస్కరణలతో సర్కారు విద్యకి అంతర్జాతీయ గుర్తింపు..  

విదేశీ వేదికలపై ప్రతిభ చాటుతున్న ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు

రైతు కూలి బిడ్డ.. అమ్మాజాన్‌ 

లారీ డ్రైవర్‌ బిడ్డ.. రాజేశ్వరి 

సెక్యూరిటీ గార్డు బిడ్డ.. జ్యోత్స్న

కౌలురైతు కొడుకు.. అంజన్‌ సాయి 

రోజు కూలీ కూతురు.. గాయత్రి 

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కుమార్తె.. శివలింగమ్మ 

ప్రభుత్వ టీచర్‌ కూతురు.. మనస్విని 

రైతుబిడ్డ.. యోగీశ్వర్‌ 

మెకానిక్‌ కూతురు.. రిషితారెడ్డి 

ఆటోడ్రైవర్‌ బిడ్డ.. చంద్రలేఖ  

తల్లిదండ్రులు కష్టపడితేనే పూట గడిచే కుటుంబాలకు చెందిన పిల్లలు వీరు. సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పంతో అత్యాధునికంగా మారిన ప్రభుత్వ బడుల నుంచి ఐక్యరాజ్య సమితిలో మెరిసిన మెరుపు తీగలు. 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 550 నుంచి 590 మార్కులు సాధించి, ప్రతిభను నిరూపించుకున్న ఆణిముత్యాలు.

నానాజీ అంకంరెడ్డి, సాక్షి అమరావతి:  ప్రభుత్వ బడులు, జూనియర్‌ కాలేజీల్లో చదువు­కుని టాపర్లుగా నిలిచిన వారికి ఏటా ’జగనన్న ఆణిముత్యాలు’ పేరిట వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సత్కరిస్తోంది. రాష్ట్రంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు 22 వేల మందిని ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట నగదు ప్రోత్సాహకాలతో సత్కరించి, పేద విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు.. ఇలాంటి పేదింటి రత్నాలను ప్రభుత్వ ప్రతినిధులుగా 10 మందిని ఎంపిక చేసి ఐక్యరాజ్య సమి­తికి పంపించారు. 

అప్పటి వరకు కనీసం జిల్లా కేంద్రాన్ని కూడా చూడని ఈ విద్యార్థులు ఐక్యరాజ్య­సమితి, ప్రపంచ బ్యాంకులో ప్రసంగించడం చరిత్ర సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన మార్పు­లు, మనబడి నాడు – నేడుతో సమకూరిన సదుపాయాలు, ఆధునిక ల్యాబ్స్‌తో జాతీయ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో టాపర్లుగా నిలిచిన మరో ఏడు­గురు విద్యార్థులు జపాన్‌ వెళ్లి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు ఈ స్థాయి­లో ప్రోత్సహించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. 

పేదింటి ఆణిముత్యాలే రాష్ట్ర ప్రతినిధులు 
2019లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, పేదల పిల్లల విద్యాభివృద్ధిపై దృష్టి సారించారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేశారు. స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల ద్వారా బోధన, టోఫెల్‌ శిక్షణ వంటివి ప్రవేశపెట్టి, బోధన ప్రమాణాలు పెంచి, సర్కారు స్కూళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఇదే అంశాన్ని తెలియజేస్తూ గతేడాది ఆగస్టులో న్యూయార్క్‌ నగరంలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్‌ పొలిటికల్‌ ఫోరం (సదస్సు)లో ఏపీ విద్యా సంస్కరణలను తెలియజెబుతూ ఏర్పాటు చేసిన స్టాళ్లు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల అభివృద్ధిని స్వయంగా తెలుసుకుంటామని పలు దేశాల ప్రతినిధులు కోరడంతో పాటు ఐక్యరాజ్య సమితికి ప్రతినిధులను పంపాలని ఆహా్వనించారు. సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ సదస్సులకు అత్యున్నత అధికారులను పంపిస్తారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పాఠశాలల అభివృద్ధిపై మాట్లాడేందుకు విద్యార్థులే సరైన ప్రతినిధులని సీఎం జగన్‌ భావించారు. అందుకే ఈ ఆణిముత్యాలను అంతర్జాతీయ వేదికలపై ప్రతినిధులుగా పంపించారు. 

సీఎం నమ్మకాన్ని వమ్ము చేయని మన పిల్లలు 
2022–23 విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలను 150 మందిని ఎంపిక చేసి, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, మారిన బడుల తీరుపై పరీక్ష పెట్టారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మందికి ఇంటర్వ్యూలు చేసి, వారి నుంచి 10 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌ 15 నుంచి 27 వరకు వీరంతా ప్రభుత్వ ఖర్చుతో అమెరికా వెళ్లి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. 

ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో స్వయంగా మాట్లాడారు. ప్రపంచంలో అత్యంత అరుదుగా మాత్రమే ప్రవేశం లభించే అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో సైతం వీరు మాట్లాడే అవకాశం లభించింది. పేదింటి పిల్లలైనా, ప్రభుత్వ చేయూతతో అంతర్జాతీయ స్థాయి విజ్ఞానాన్ని సముపార్జించుకొన్న వీరంతా సీఎం జగన్‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను వివరించారు. సీఎం జగన్‌ ఆదర్శవంతమైన సంస్కరణలను ప్రపంచానికి చాటిచెప్పారు. 

జపాన్‌ సకురా సైన్స్‌ ఫెయిర్‌కూ ఏపీ విద్యార్థులు 
రాష్ట్ర ప్రభుత్వం నాడు – నేడు పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించింది. దీంతో అక్కడి సైన్స్‌ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం నిర్వహించే ఇన్నోవేషన్‌ ఇన్‌ సైన్స్‌ పర్‌స్యుట్‌ ఫర్‌ ఇన్‌సై్పర్డ్‌ రీసెర్చ్‌ (ఇన్‌సై్పర్‌) పోటీల్లో సత్తా చాటుతున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులు దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపే ఆకర్షణీయమైన అంశాలు, నమూనాలు తయారు చేయాలి. 

ప్రభుత్వ పాఠశాలల్లో లేబొరేటరీలు అత్యాధునికంగా తీర్చిదిద్దడంతో మన విద్యార్థులు గత నాలుగేళ్లుగా ఏటా 40 వేలకు పైగా ప్రాజెక్టులు చేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతున్నాయి. గత నాలుగేళ్లుగా జాతీయ పోటీలకు దాదాపు 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు ప్రభుత్వం పేటెంట్‌ హక్కులు కూడా ఇస్తుంది. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్‌సై్పర్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. ఇక్కడే కాదు.. 2019 నుంచి 2022 వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏడుగురు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించి, ‘జపాన్‌ సకురా’ అంతర్జాతీయ పోటీలకు ఎంపికై జపాన్‌లో పర్యటించి వచ్చారు.

ప్రభుత్వ బడిలో కొత్త ఆవిష్కరణలు  
విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించడంతో విద్యార్థులు చేస్తున్న ప్రయోగాలు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకడంతో పాటు పేటెంట్లు సైతం అందుకుంటున్నారు. గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్‌ విద్యార్థిని పి.కీర్తి వీధుల్లో కూరగాయలు అమ్ముకునేవారికి ఉపయోగపడే వెండర్స్‌ ఫ్రెండ్లీ సోలార్‌ కార్ట్‌ను రూపొందించింది. 

చిత్తూరు జిల్లా ఏఎల్‌పురం జెడ్పీ స్కూల్‌ విద్యార్థిని కె.ప్రణయ 15 రోజులు కూరగాయలు పాడవకుండా నిల్వ చేసుకునే గార్లిక్‌ బ్యాగ్‌ను రూపొందించింది. చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్‌ విద్యార్థి పి.చరణ్‌ తేజ బైక్‌పై వెనుక కూర్చున్న వారికి రక్షణగా ఉండే సైడ్‌ సీట్‌ను తయారుచేశాడు. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురూ వారు నిత్యం చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించడమే కాదు.. గత నవంబర్‌లో జపాన్‌ వెళ్లి వచ్చారు. మరో నలుగురు విద్యార్థులు వచ్చే నెలలో జపాన్‌ పర్యటనకు వెళ్లనున్నారు.

అత్యంత సామాన్యుల పిల్లలకే అవకాశం  
⇒ ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరు జెడ్పీ స్కూల్లో చదువుకున్న పసుపులేటి గాయత్రి గతేడాది పదో తరగతిలో 590 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. జగనన్న ఆణిముత్యాలు అవార్డు కింద రూ.50 వేలు అందుకుంది. కూలి పనులు చేసే తండ్రి కష్టంపైనే బతుకుతున్న ఈ కుటుంబానికి జగనన్న విద్య, సంక్షేమ పథకాలు దన్నుగా నిలిచాయి. 

⇒ కర్నూలు జిల్లా కౌతాళం మండలం పొదలకుంటకు చెందిన మించాలవారి సోమనాథ్, గంగమ్మలకు నలుగురు సంతానంలో ఒకరైన శివలింగమ్మ ఆదోని కేజీబీవీలో పదో తరగతిలో 541 మార్కులు సాధించింది.  

⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన వంజవాకం యోగీశ్వర్‌ తండ్రి నాగరాజు సామాన్య రైతు. చంద్ర­గిరి ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకున్న యోగీశ్వర్‌ గతేడాది పదో తరగతిలో 586 మార్కులు సాధించి జిల్లాలో రెండోస్థానంలో నిలిచాడు. 

⇒ విజయనగరంలో మెకానిక్‌గా పనిచేస్తున్న అల్లం రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మిల కుమార్తె రిషితారెడ్డి స్థా­నిక కస్పా మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైసూ్కల్లో పదో తరగతిలో 587 మార్కులు సాధించింది. ప్రస్తు­తం నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో చదువుతోంది. 

⇒ శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన షేక్‌ ఫాతిమా భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను పోషించు­కుంటోంది. ఈమె రెండో కూతురు అ­మ్మాజాన్‌ వేంపల్లిలోని ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదివి గతేడాది పదో తరగతిలో 581 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి­లో జగనన్న ఆణిముత్యాలు సత్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి అందుకుంది. ఇ­ప్పు­డు ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో చదువుతోంది. 

⇒ నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతానికి చెందిన సి.రాజేశ్వరి తండ్రి దస్తగిరి లారీడ్రైవర్‌. తల్లి రామలక్ష్మమ్మ ఇంటి వద్ద బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. రాజేశ్వరి నంద్యాలలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివి 583 మార్కులు సాధించి జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ బాలిక ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతోంది. 

⇒ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రామారావు, మణి దంపతుల రెండో కుమార్తె మోతుకూరి చంద్రలేఖ స్థానిక కేజీబీవీలో చదువుకుని గతేడాది పదో తరగతిలో 523 మార్కులు సాధించింది. జిల్లా టాపర్‌గా నిలిచి జగనన్న అణిముత్యాలు సత్కారం కింద రూ.50 వేల నగదు బహుమతి అందుకుంది. 

⇒ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన దడాల సింహాచలం ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. ఈయన రెండో సంతానమైన డి.జ్యోత్స్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో చదువుకుని పదో తరగతిలో 589 మార్కులు  సాధించి జగనన్న ఆణిముత్యాలు రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాన్ని అందుకుంది. ప్రస్తుతం కృష్ణాజిల్లా ఈడుపుగల్లులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయం ఐఐటీ అకాడమీలో ఇంటర్‌ చదువుతోంది. 

⇒ పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరుపల్లి గ్రామానికి చెందిన జి.గణేష్‌ అంజన సాయి ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గురుకుల పాఠశాలలో చదువుకుని గతేడాది పదో తరగతిలో 581 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించాడు. ఇతని తండ్రి గోపి కౌలు రైతు కాగా, తల్లి లక్ష్మి గృహిణి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement