2 Years Of YS Jagan Rule In AP: కొత్త చరిత్ర  | All facilities are available in govt schools and hospitals in AP with Nadu Nedu | Sakshi
Sakshi News home page

2 Years Of YS Jagan Rule In AP: కొత్త చరిత్ర 

Published Sun, May 30 2021 3:34 AM | Last Updated on Sun, May 30 2021 8:14 AM

All facilities are available in govt schools and hospitals in AP with Nadu Nedu - Sakshi

ప్రభుత్వ పాఠశాలలపై చేస్తున్న వ్యయాన్ని సామాజిక పెట్టుబడిగా భావిస్తున్నాం. అందుకే వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాం. మానవ వనరుల అభివృద్ధితోనే మెరుగైన సమాజం సాధ్యమన్నది మా విశ్వాసం. ఈ కారణంగానే 45,329 స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు మూడు దశల్లో మన బడి నాడు–నేడు కార్యక్రమానికి రూప కల్పన చేశాం.
– మనబడి నాడు–నేడు ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అత్యంత ప్రాధాన్యతతో శ్రీకారం చుట్టిన ‘మనబడి నాడు–నేడు, వైద్య రంగం నాడు–నేడు’ కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. విద్యా రంగాన్నే తీసుకుంటే.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ స్కూళ్లు దశాబ్దాలుగా కునారిల్లి శిథిలావస్థకు చేరుకున్నాయి. స్కూళ్లలో కనీస సదుపాయాలు లేక పిల్లలు బడులకు వెళ్లాలంటేనే ఆసక్తి కనబరిచేవారు కాదు. మరుగు దొడ్లు, మంచి నీరు వంటివి లేకపోవడంతో ఆడపిల్లలు ఎంతో మంది చదువుకు స్వస్తి చెప్పారు. ఈ అవస్థలను తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసిన వైఎస్‌ జగన్‌.. అధికారంలోకి రాగానే ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టారు. 45,329 స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు మూడు దశల్లో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా పది రకాల సౌకర్యాలను కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలిదశలో 15,715 స్కూళ్లలో అభివృద్ధి పనులకు 2019 నవంబర్‌ 14వ తేదీన  శ్రీకారం చుట్టారు. ఈ పనులు దాదాపు పూర్తికావ చ్చాయి. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.3,669 కోట్లు మంజూ రు చేయగా, ఇప్పటి వరకు రూ.3,158 కోట్లు వ్యయమైంది. రెండో దశలో 12,240 స్కూళ్లలో అభివృద్ధి పనులు పనులు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

► గతంలో 104 వాహనాలంటే పల్లెలకు చుట్టపు చూపుగా వెళ్లేవి. ఇప్పుడలా కాదు. వైద్యులుంటారు, వైద్య పరీక్షలు చేస్తారు, మందులుంటాయి. పల్లెల్లో మంచానికే పరిమితమైన ప్రత్యేక కేసులను ఇంటివద్దకే వెళ్లి చూస్తున్నారు. దీర్ఘకాలిక జబ్బులకు ప్రతిరోగికీ, ప్రతి నెలా ఆ ఊరికే వెళ్లి మందులిస్తున్నారు. అవసరమైతే వీళ్లే   ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేసి, ఎలక్ట్రానిక్‌ డేటా బేస్‌లో పొందు పరుస్తారు. భవిష్యత్‌లో వైద్యం అవసరమైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. తద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ భావన ఏర్పడుతుంది. 2020 జూలై 1 నుంచి 2021 మే 25 వరకూ 656 వాహనాల ద్వారా 49.26 లక్షల మంది లబ్ధి పొందారు.

► చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 16 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక వైద్యానికి పెద్దపీట వేస్తూ వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌లు, కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే 12 వేలకు పైగా రెగ్యులర్‌ నియామకాలు చేపట్టారు. మొత్తం 10,011 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల ఏర్పాటులో భాగంగా 8,545 కొత్తవి నిర్మిస్తున్నారు. వీటి వ్యయం రూ.1,692 కోట్లు. మారుమూల గ్రామంలోనూ వైద్య సేవలు అందించాలన్నది ఈ క్లినిక్‌ల ఉద్దేశం. రూ.246 కోట్లతో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు. 

మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఇద్దరు డాక్టర్లు
► రాష్ట్రంలో 1,133 పీహెచ్‌సీలున్నాయి. ఇకపై అన్ని మండలాల్లో రెండు పీహెచ్‌సీలతో పాటు ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. 
► శిథిలావస్థకు చేరిన 982 పీహెచ్‌సీలకు రూ.413.54 కోట్లతో మరమ్మతులు చేసి, రూ.256.99 కోట్లతో 151 పీహెచ్‌సీలు కొత్తవి నిర్మిస్తున్నారు.  
► పట్టణాల్లో పేదల కోసం 560 యూపీహె æచ్‌సీలు (పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు) ఏర్పాటు చేసింది. 355 కొత్త భవనాలకు రూ.355 కోట్లు, 205 పీహెచ్‌సీల మరమ్మతు లకు రూ.61.5 కోట్లు వ్యయం చేస్తోంది.

 బోధనాస్పత్రుల పునరుద్ధరణ
► ప్రస్తుతం 11 మెడికల్‌ కాలేజీలు వాటికి అనుబంధంగా ఆస్ప త్రులు ఉన్నాయి. వీటికి మరమ్మతులు, వైద్య పరికరాల కోసం రూ.3,820 కోట్లు వ్యయం చేయనున్నారు. కొత్తవి ఒకవైపు, ఉన్న వాటి పునరుద్ధరణ ఇంకో వైపు సాగుతోంది. 
► ఇవి కాకుండా ట్రైబల్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, కడపలో స్పెషాలిటీ ఆస్పత్రి, పలాసలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోంది. 

పార్లమెంటుకొక మెడికల్‌ కాలేజీ
ఇదొక విప్లవాత్మక నిర్ణయం. రాజశేఖరరెడ్డి హయాంలో ఒకేసారి 4 మెడికల్‌ కాలేజీలు పెట్టారు. ఆ తర్వాత ఒకేసారి 16 కొత్త వైద్య కాలేజీలు (పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి) ఏర్పాటు చేస్తుండటం చరిత్రలో ఇదే మొదటిసారి.  ఇందుకోసం రమారమి రూ.7,880 కోట్లు వ్యయం అంచనా. ఇప్పటికే టెండర్ల దశ పూర్తి చేసుకున్నాయి. కాలేజీలు రావడం వల్ల 2 వేల వరకు ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా రానుండటమే కాకుండా స్పెషాలిటీ వైద్యం రాష్ట్రం నలుమూలలకూ చేరువవుతుంది.

సెకండరీ కేర్‌కు భరోసా
ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, సామాజిక ఆస్పత్రులకు వైఎస్‌ జగన్‌ సర్కారు భరోసా ఇస్తోంది. 42 ఏరియా ఆస్పత్రుల నిర్మాణానికి రూ.682 కోట్లు, 121 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు రూ.528 కోట్లు, రెండు మాతా శిశు సంరక్షణా కేంద్రాలకు రూ.13 కోట్లు కేటాయించారు. మొత్తం సెకండరీ కేర్‌ కు రూ.1,223 కోట్లు వ్యయం చేస్తున్నారు.

కోవిడ్‌ నియంత్రణలో ముందంజ
రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణలో దేశంలోనే మెరుగైన ఫలితాలను సాధించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ల్యాబొరేటరీల విషయంలో రాష్ట్రంలో 2020 ఫిబ్రవరి నాటికి ఒక్క వైరాలజీ ల్యాబ్‌ లేదు. నమూనాలు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించాల్సిన దుస్థితి. అలాంటిది ఇప్పుడు రోజుకు లక్షకు పైగా టెస్టులు చేసే స్థాయికి చేరుకుంది. 
► రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిలో 13 జిల్లాల్లో 14 వైరాలజీ ల్యాబొరేటరీల ఏర్పాటు.. కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన తొలి రాష్ట్రంగా నమోదు
► బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌ మైకోసిస్‌)ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు.. 26వేల పడకలకు పైగా ఆక్సిజన్‌ పైప్‌లైన్‌లు వేయగలిగారు
► జర్మన్‌ హ్యాంగర్‌ టెక్నాలజీతో తాత్కాలిక పడకల ఏర్పాటుకు చర్యలు
► రమారమి 18,500 మంది సిబ్బంది కోవిడ్‌ సేవల కోసం నియామకం.. ఆక్సిజన్‌ రవాణా కోసం 25 ప్రత్యేక ట్యాంకర్ల కొనుగోలుకు చర్యలు
► 57 ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ (ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్బ్‌డ్‌) ఆక్సిజన్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకు చర్యలు
► కోవిడ్‌ కోసం ఇప్పటి వరకు దాదాపు రూ.2,500 కోట్లు వ్యయం 

జగన్‌ మామ వల్లే మళ్లీ బడికి..
 8వ తరగతి చదువుతున్నప్పుడు.. మా నాన్న చనిపోయారు. అమ్మ కష్టం చూడలేక నేను చదువు మానేశాను. నాన్న లేని.. నన్ను, మా కుటుంబాన్ని సీఎం జగన్‌ మామే ఆదుకున్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం వల్ల నేను మళ్లీ చదువుకుంటున్నాను. అమ్మ ఒడి ద్వారా ఇప్పటివరకు రూ.29 వేలు వచ్చాయి. ఇప్పుడు స్కూల్‌లో నేను టాపర్‌ని. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాను. అందులో కూడా మంచి గ్రేడ్‌ సాధించి.. పెద్ద చదువులు చదివి ఇంజనీర్‌ కావాలనుకుంటున్నా.  
– రాజేశ్వరి, పి.నాగిరెడ్డిపల్లి, అనంతపురం  

 జగనన్న అమ్మ ఒడి  
పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని సీఎం జగన్‌ ప్రవేశపెట్టారు. దీని ద్వారా తమ పిల్లలను బడులకు పంపే అర్హురాలైన ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు అందిస్తున్నారు. 1–12వ తరగతి వరకు చదివే పిల్లల కోసం దీన్ని అమలు చేస్తున్నారు. ఈ రెండేళ్లలో రూ.13,022.93 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 

 అన్నగా ఆదుకున్నాడు..
మా ఊరు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఎరుకలచెర్వు. అక్కడ పనుల్లేక కర్నూలుకు వచ్చాం. కూలి పనులు చేస్తూ నన్ను, నా చెల్లిని కష్టపడి చదివించే మా నాన్న గుండెపోటుతో చనిపోయాడు. అమ్మ టైలరింగ్‌ పని చేసేది. అయినా కాస్త డబ్బులే వచ్చేవి. మా చదువులు మధ్యలోనే ఆగిపోతాయేమోనని భయపడ్డా. కానీ సీఎం జగన్‌ మమ్మల్ని ఒక అన్నగా ఆదుకున్నారు. ‘జగనన్న వసతి దీవెన’ కింద డబ్బులు వచ్చాయి. నా మెస్‌ బిల్లులకు ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాగే నాకు జగనన్న విద్యా దీవెన, చెల్లికి జగనన్న అమ్మ ఒడి డబ్బులూ వచ్చాయి.
– ఎం.భార్గవి, బీటెక్, కర్నూలు  

 జగనన్న వసతి దీవెన
‘ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి’ అని విశ్వసించిన ముఖ్యమంత్రి.. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, అంతకుమించి ఉన్నత విద్య అభ్యసించే పేద విద్యార్థులకు భోజన, వసతి వ్యయాన్ని అందిస్తున్నారు. ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఆపై చదువులకు రూ.20 వేలు చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే.. అంతమందికీ వారి తల్లుల ఖాతాల్లోనే ఈ మొత్తాన్ని జమ చేస్తోంది.

అమ్మాయిని ఆనందంగా చదివిస్తున్నా 
మాకు ఇద్దరు పిల్లలు. నా భర్తకు వచ్చే డబ్బులు ఇంటి కిరాయి, కుటుంబపోషణకే సరిపోతాయి. దీంతో మా పెద్దబ్బాయి చదువు ఆపేశాడు. నేను ఇంటి దగ్గరే అంగడి పెట్టుకున్నా. జగనన్న పథకాల వల్ల కూతురు పార్వతిని మాత్రం చదివించుకుంటున్నాం. మా బిడ్డకు విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.20 వేలు వచ్చాయి. మా పై భారం తగ్గింది. ఆయన సీఎంగా ఉన్నంత వరకు బిడ్డల చదువులకు ఇబ్బంది ఉండదు.   
 – పి.గీత, తిరుపతి  

 జగనన్న విద్యా దీవెన
పేద విద్యార్థులూ పెద్ద చదువులు చదవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకమే జగనన్న విద్యా దీవెన. డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు దీని ద్వారా పూర్తి ఫీజును చెల్లిస్తున్నారు. కాలేజీలకు కాకుండా తల్లుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేయడం ద్వారా.. తమ పిల్లల చదువుల గురించి యాజమాన్యాలను ప్రశి్నంచే అధికారాన్ని వారికి ప్రభుత్వమిచ్చింది.

టిప్‌టాప్‌గా బడికి వెళ్తున్నారు
నా కూతురు చనిపోయింది. మనవరాలు షేక్‌ కతేజ బేగాన్ని అల్లుడు నా దగ్గరే వదిలేసి వెళ్లిపోయాడు. నేను బతకడమే కష్టమనుకుంటున్న తరుణంలో.. మనవరాలు తోడైంది. రెండేళ్ల కిందటి వరకు చాలా ఇబ్బందైపోయింది. జగన్‌ బాబు ఎప్పుడైతే సీఎం అయ్యి.. విద్యా కానుక, అమ్మఒడి పథకాలు పెట్టారో అప్పుడే నా మీదున్న భారం తగ్గింది. బిడ్డ ఇప్పుడు ఎనిమిదో తరగతి చదువుతోంది. మామూలు చదువే కష్టమనుకుంటే.. పెద్ద పెద్ద బడుల్లోలాగా మంచి దుస్తులు, పుస్తకాలు, బ్యాగు, షూలు, బెల్టు పెట్టుకొని టిప్‌టాప్‌గా తయారై.. నా మనవరాలు బడికి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. 
– పాపాయమ్మ, బొండపల్లి, విజయనగరం 

 జగనన్న విద్యా కానుక
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచేలా.. కార్పొరేట్‌ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా నిలబడేలా జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 1 నుంచి 10వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికీ 3 జతల యూనిఫారం, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగ్‌ను అందిస్తున్నారు.  వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికీ డిక్షనరీని కూడా అందించబోతున్నారు. నాణ్యమైన వ్రస్తాన్ని తల్లిదండ్రులకే అందిస్తూ.. వాటి కుట్టుకూలిని కూడా తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తోంది. 

మమ్మల్ని గుర్తించిన ముఖ్యమంత్రి  
వంశపారంపర్యంగా వస్తున్న క్షురక వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం. ఆస్తులు, భూములేమీ లేవు. గతంలో ఎవ్వరూ మా గోడు పట్టించుకోలేదు. జగన్‌ అధికారంలోకి రాగానే ‘జగనన్న చేదోడు’ ద్వారా ఆదుకున్నారు. పెద్ద పెద్ద సెలూన్ల వల్ల వ్యాపారాలు దెబ్బ తిన్న మాకు.. సీఎం జగన్‌ ఇస్తున్న డబ్బులే అండగా ఉంటున్నాయి. మమ్మల్ని గుర్తించిన ముఖ్యమంత్రి.. జగన్‌ ఒక్కరే. 
– కె.శ్రీనివాసరావు, ఎస్‌.కోట

జగనన్న ‘చేదోడు’ 
సమాజంలో ఎన్నో ఏళ్లుగా నిరాదరణకు గురవుతున్న వర్గాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. టైలరింగ్‌ షాపులున్న దర్జీలు, లాండ్రీలు నడిపే రజకులు, షాపులున్న నాయి బ్రాహ్మణులకు ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు 2,98,428 మందికి రూ.298.43 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు.

జగనన్న తప్ప ఎవరూ పట్టించుకోలేదు..
నా భర్తకు ఆరోగ్యం బాగుండదు. దీంతో నేను ఇంటి వద్దే చిల్లర దుకాణం నడుపుకుంటున్నా. దాని వల్ల వచ్చే ఆదాయం అరకొరే. కష్టాల్లో నన్ను ఎవరూ పట్టించుకోలేదు. జగనన్న తోడు కింద సీఎం జగన్‌ రూ.10 వేలు ఇచ్చారు. కష్టాల్లో ఉన్న నాకు ధైర్యమిచ్చారు. 
    – ముద్దా సునీత, పుల్లలచెరువు, ప్రకాశం జిల్లా 

జగనన్న తోడు 
చిరు వ్యాపారులు రోడ్డెక్కి వ్యాపారం చేస్తే గానీ పూట గడవదు. పెట్టుబడికి కూడా చేతిలో డబ్బులు ఉండవు. విధి లేని పరిస్థితుల్లో అధిక వడ్డీకి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిందే. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా వీరి గురించి పట్టించుకోలేదు. కానీ సీఎం జగన్‌ వీరి కోసం ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. సున్నా వడ్డీ రుణ సదుపాయాన్ని కల్పించారు. ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటూ బ్యాంకుల నుంచి సున్నా వడ్డీకి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రుణం ఇప్పిస్తోంది. వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. 5,55,160 మందికి రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీకి రూ.555.16 కోట్ల రుణాలిప్పించింది. 

రోడ్డున పడకుండా ఆదుకున్నారు.. 
చేపల వేటపై నిషేధం విధించినప్పుడు ఇబ్బంది పడేవాడిని. పస్తులున్న రోజులూ ఉన్నాయి. ఇలాంటి కష్ట కాలంలో మమ్మల్ని ఆదుకోవడానికే వైఎస్‌ జగన్‌ను దేవుడే పంపించాడనుకుంటా. మత్స్యకార భరోసా ద్వారా రూ.10 వేలు మా బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తున్నారు. రోడ్డున పడకుండా ఆదుకుంటున్నారు.   
– బర్రి అప్పన్న, తిప్పలవలస, విజయనగరం 

మత్స్యకార భరోసా
సముద్రంలో వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు గత ప్రభుత్వ హయాంలో అరకొరగా కొద్ది మందికి రూ.4 వేలే ఇచ్చేవారు. జగన్‌ సీఎం అయిన తర్వాత రూ.10 వేలకు పెంచారు. చేపల వేట జీవనాధారంగా బతుకుతున్న ఇతర సామాజిక వర్గాలకూ ప్రభుత్వం మత్స్యకార భరోసా అందించింది. ఇందులో బీసీలు 1,18,119 మంది, ఓసీలు 747 మంది, ఎస్సీలు 678 మంది, ఎస్టీలు 331 మంది ఉన్నారు. 

ఇంట్లో కూడా ఇలాంటి భోజనం పెట్టలేదు..
నేను, నా భర్త కూలి పనులకు వెళ్తేనే కుటుంబం గడిచేది. మా అమ్మాయి అలేఖ్య 9వ తరగతి చదువుతోంది. గత ప్రభుత్వమున్నప్పుడు మధ్యాహ్న భోజనంలో రోజూ ఉడికీ ఉడకని సాంబారన్నమే పెట్టేవాళ్లు. అది తినలేక మా అమ్మాయి ఇంటికి వచ్చేది. కానీ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ‘జగనన్న గోరుముద్ద’ పెట్టడంతో.. పాప రోజూ స్కూల్‌లోనే తింటోంది. ఆరు రోజులు ఆరు రకాల కూరలు, కిచిడీ, పులిహోరతో మంచిగా భోజనం పెడుతున్నారని.. గుడ్లు, చిక్కీలు, పొంగలి కూడా పెడుతున్నారని పాప చెబుతుంటే చాలా ఆనందంగా ఉంటోంది. ఇంట్లో కూడా అంత మంచి భోజనం పెట్టి ఉండం. 
– పి.విజయ, కొడవలూరు, నెల్లూరు జిల్లా
 

జగనన్న గోరుముద్ద
ఉడికీ ఉడకని అన్నం.. అందులోనూ పురుగులు, చిన్నచిన్నరాళ్లు, నీళ్లలాంటి పప్పు చారు.. పాడైపోయిన గుడ్లు.. ఇది ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో పెట్టిన మధ్యాహ్న భోజనం. సగానికి పైగా పిల్లలు ఈ ఆహారం తినలేక ఇళ్లకు వెళ్లిపోయేవారు. మరికొందరు పస్తులుండేవారు. ఈ పరిస్థితిని జగనన్న గోరు ముద్ద ద్వారా సీఎం జగన్‌ పూర్తిగా మార్చేశారు. శుచికరంగా, రుచికరంగా.. విద్యార్థులకు కడుపు నిండుగా భోజనం పెడుతున్నారు. 45 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో 36,88,610 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అలాగే రూ.వెయ్యిగా ఉన్న వంటపని వారి భృతిని రూ.3 వేలకు పెంచారు. కొత్త మెనూ వచ్చాక మధ్యాహ్న భోజనం చేస్తున్న వారి సంఖ్య 9 శాతం పెరిగింది. గతంలో 87 శాతంలోపే ఉన్న హాజరు 94 శాతానికిపైగా పెరిగింది. కొత్త మెనూ వల్ల సర్కార్‌ అదనంగా రూ.1,048.57 కోట్లు ఖర్చు చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement