స్కూళ్లలో పిల్లల హాజరుపై దృష్టి | CM YS Jagan Comments In A Review On Mana Badi Nadu-Nedu Program | Sakshi
Sakshi News home page

స్కూళ్లలో పిల్లల హాజరుపై దృష్టి

Published Thu, Feb 4 2021 3:45 AM | Last Updated on Thu, Feb 4 2021 8:59 AM

CM YS Jagan Comments In A Review On Mana Badi Nadu-Nedu Program - Sakshi

సాక్షి, అమరావతి: స్కూళ్లలో పిల్లల హాజరు వివరాలను ప్రత్యేక యాప్‌ ద్వారా సేకరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. స్కూళ్లకు పిల్లలు గైర్హాజరైతే వెంటనే ఎస్‌ఎంఎస్‌ ద్వారా తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళ్లాలని స్పష్టం చేశారు. రెండో రోజు కూడా పాఠశాలకు రాకపోతే నేరుగా సంబంధిత వలంటీర్‌ను ఆ పిల్లల ఇంటికి పంపి, ఎందుకు రాలేదో వివరాలను కనుక్కోవాలని చెప్పారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. మన బడి నాడు–నేడు, విద్యార్థుల హాజరు, గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు పునఃప్రారంభం, విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. విద్యార్థుల హాజరుపై యాప్‌ను రూపొందించారా? లేదా? అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 15 నుంచి యాప్‌ ద్వారా పిల్లల హాజరు సేకరిస్తామని అధికారులు వెల్లడించారు.
మన బడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకంపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌   

నాడు–నేడు పనుల నాణ్యతలో రాజీపడొద్దు 
► మన బడి నాడు–నేడు పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని, రెండో విడత నాడు–నేడు పనులకు సిద్ధం కావాలని సీఎం చెప్పారు. మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా పనులు ప్రారంభించాలని సూచించారు. 
► రెండో విడత నాడు–నేడు పనులను ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ పనులను డిసెంబర్‌ 31లోగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. రెండో విడత నాడు – నేడు పనుల కోసం సుమారు రూ.4,446 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని తెలిపారు. 
► మొదట విడత నాడు–నేడు కోసం సుమారు రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్నామని, స్కూళ్లను బాగు చేయడానికి ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. 
 
గోరుముద్ద నాణ్యత బావుండాలి 
► గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. 
► భోజనం నాణ్యతలో రాజీ పడరాదని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. 
  
టాయిలెట్ల నిర్వహణపై ఎస్‌వోపీ  
► ‘టాయిలెట్ల నిర్వహణకు సులభ్‌ ఇంటర్నేషనల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. తద్వారా వారు దాదాపు 49 వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. టాయిలెట్ల నిర్వహణపై ఎస్‌వోపీ రూపొందించి దాని ప్రకారం నిర్వహణ సిబ్బందికి సులభ్‌ ఇంటర్నేషనల్‌ వారు శిక్షణ ఇస్తారు. నిర్వహణ సిబ్బంది కోసం ఏటా రూ.324 కోట్లు, పరికరాల కోసం రూ.54 కోట్లు, క్లీనింగ్‌ మెటీరియల్‌ కోసం రూ.35 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందుకు సంబంధించి 15 రోజుల్లో టెండర్లు పిలుస్తాం’ అని అధికారులు తెలిపారు. 
► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఇక ఉదయం 9 గంటల నుంచే పాఠశాలలు   
రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉదయం వేళ సాధ్యమైనంత త్వరగా స్కూళ్లలో బోధన ప్రారంభించడం మంచిదని సూచించారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించగలుగుతుందని, ఆ సమయంలో పాఠ్యబోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకోగలుగుతారన్నారు.

ప్రపంచంలో పాఠశాలలన్నీ ఉదయం 8 లేదా 8.30 గంటలకల్లా ప్రారంభమవుతున్నాయని, అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఆలస్యంగా 9.30కు ప్రారంభం కావడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుండదన్న చర్చ జరిగింది. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకొని రాష్ట్రంలో కనీసం 9 గంటలకల్లా స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉదయం త్వరగా ప్రారంభించి, ఆ మేరకు సాయంత్రం త్వరగా తరగతులు ముగించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాగా,  పాఠశాలల వేళలపై గురువారం ఉత్తర్వులు జారీ చేస్తామని విద్యాశాఖ అధికారులు వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement