మనబడి నాడు–నేడు కార్యక్రమాలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు కింద రెండో విడత పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 9,476 ప్రైమరీ పాఠశాలలు, 822 అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 2,771 రెసిడెన్షియల్ స్కూళ్లు, హైస్కూళ్లు, 473 జూనియర్ కాలేజీలు, 1,668 హాస్టళ్లు, 17 డైట్ కాలేజీలు, 672 ఎంఆర్‌సీఎస్, 446 భవిత కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. మనబడి నాడు–నేడు కార్యక్రమాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. వీటి నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, కేర్ టేకర్‌కు సగటున రూ.6 వేలు చెల్లిస్తామని చెప్పారు. టాయిలెట్లను శుభ్రపరిచే సామగ్రితో కలుపుకుని ఒక్కో స్కూలుకు రూ.6,250 నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. వెయ్యికి పైగా విద్యార్థులున్న పాఠశాలల్లో టాయిలెట్ కేర్ టేకర్లు నలుగురు ఉంటారని తెలిపారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
పాఠ్యపుస్తకాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి తానేటి వనిత
అంగన్‌వాడీల్లో మార్చిలో తొలి దశ పనులు
► అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు– నేడు కింద 2021 మార్చిలో మొదటి దశ పనులు మొదలు పెట్టి, రెండున్నరేళ్లలో మొత్తం పనులు పూర్తి చేసేలా నిర్ణయించాం. తొలి విడతలో 6,407 కొత్త అంగన్‌వాడీల నిర్మాణం, 4,171 అంగన్‌వాడీల్లో అభివృద్ధి పనులు చేపడతాం.
► మొత్తం 27,438 కొత్త అంగన్‌వాడీ భవనాలు నిర్మించడంతో పాటు 16,681 చోట్ల అభివృద్ధి పనులను చేపడుతున్నాం. ఇందుకోసం మొత్తంగా సుమారు రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా.
వైఎస్సార్ ప్రీ ప్రైమరీలు
► అంగన్‌వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్న నేపథ్యంలో చిన్నారుల కోసం రూపొందించిన పుస్తకాలను మంత్రి ఆదిమూలం సురేష్, అధికారులు సీఎంకు చూపించారు.
► పుస్తకాల నాణ్యత బాగుండాలని అధికారులను సీఎం ఆదేశించారు. పిల్లలకు జిజ్ఞాస పెంచేలా, బోధన కోసం ప్రత్యేక వీడియోలు రూపొందించామని అధికారులు తెలిపారు.
జగనన్న విద్యాకానుక
► వచ్చే ఏడాది ఇవ్వాల్సిన విద్యాకానుకపైనా సీఎం సమీక్షించారు. స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
► స్కూలు యూనిఫామ్స్ సహా దేంట్లోనూ నాణ్యత తగ్గకుండా చూడాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఏడో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభమవుతుందన్నారు.
► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment