
రెండో మాట
వేగశక్తిలో ఇతర భారతీయ భాషలకన్నా తెలుగుదే పైచేయిగా ఉండటమేగాక, కంప్యూటరీ కరణలో కూడా తెలుగు లిపి అత్యంత ప్రయోజనకర స్థాయిలో ఉండగలదని రూఢి అవుతోంది. తెలుగు అజంత భాష కావడం, ‘రస భావ సమర్పణ శక్తి’లో సంస్కృతానికి దీటైన భాష కావడం వల్లనే ప్రపంచ ప్రసిద్ధ జీవ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ హాల్డేన్ సహితం శాస్త్ర, సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష భారతీయ భాషల్లో ఒక్క తెలుగేనని యాభై ఏళ్లనాడే చెప్పాడు.
‘‘తెలుగు భాషకు చిరునామాలు–మన గ్రామాలు. ఒక భాష స్వీయ అస్తిత్వం ఆ భాషకు సంబంధించిన దేశీ పదాలలో వ్యక్తమవుతుంది...ఒక అవమానం నుంచి, తృణీకరణ నుంచి, ‘నాది తెలుగు కాదు’ అన్న విపరీత వాదనలో నుంచి ఉప్పొంగినది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. అలాంటి స్థితిలో ఇంకొక చివరికి వెళ్లి ‘మా భాష వేరే!’ అని మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది. అదొక భావోద్వేగపూరిత ప్రకటన.. ఎన్ని ప్రాంతాలలో, ఎన్ని తీర్లుగా మాట్లాడినా తెలుగు తెలుగే. అంతటా ఉన్నది తెలుగే. సమన్వయం వల్లనే అసలు తెలుగు బయట కొస్తుంది.’’
– డాక్టర్ నలిమెల భాస్కర్, ఆచార్య నందిని సిధారెడ్డి
‘‘ప్రపంచ భాషలనే పాలపుంతలో ప్రతి పదమూ, అక్షరమూ ఒక నక్షత్రమే!’’
– ఐక్య రాజ్య సమితి విద్యా, సాంస్కృతిక సంస్థ
‘‘ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా! యాసలు వేరుగ ఉన్నా–మన బాస తెలుగు బాసన్నా! వచ్చిండన్నా వచ్చాడన్నా–వరాల తెలుగు ఒకటేనన్నా!’’
– డాక్టర్ సినారె
ఇంతకూ మన తెలుగుకు అంత మాధుర్యం ఎలా వచ్చింది? ఒక్కటే సమాధానం– తెలుగు అక్షరంలో ఒదిగి ఉన్న శక్తి. వర్ణంలో, దాని ఉచ్చారణలో దాగిన వేగం.. వేగాతివేగం. అందుకే తెలుగు అక్షరం ప్రపంచ భాషలలో ‘వేగవతి’గా అవతరించింది. ఈ అక్షరశక్తిని నాలుగున్నర దశాబ్దాల నాడే ఆచార్య బీఎస్ రామకృష్ణ నిరూపించారు. తెలుగువాడైన రామకృష్ణ సుప్రసిద్ధ గణాంక, గణిత శాస్త్రవేత్త. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్. ఆ రహస్యాన్ని ప్రచురించే అదృష్టం తెలుగువాడికంటే ముందు సుప్రసిద్ధ శాస్త్ర విషయాల పత్రిక ‘సైన్స్‌టుడే’కే దక్కింది. ప్రపంచ భాషలలో అక్షరశక్తిలో ఉచ్చారణకు అనువైన వేగశక్తి ఉన్నది తెలుగేనని ఆచార్య బీఎస్ నిరూపించారు. ‘క్షరము’(నశింపు)లేనిదే అక్షరం. కాబట్టి (న క్షరతీత్యక్షరమ్) వాక్కును పవిత్రశక్తిగా మలిచింది. బహుశా ఆ శాబ్దిక శక్తినే, అక్షరరూపంలో ‘బ్రాహ్మీ’ లిపినే సరస్వతిగా భావించి ‘సర్వ శుక్లా సరస్వతి’ అని పోతనామాత్యుడు సంభావించి ఉంటాడు. అందుకే భారతీయ భాషలకు పునాదులు నిర్మించిన ‘బ్రాహ్మీ’ లిపినీ, దాని నుంచే అవతరించిన తెలుగు లిపిని తోబుట్టువులుగా భాషా శాస్త్రవేత్తలు పరిగణిస్తారు.
అన్ని పలుకుబడులూ విలువైనవే
‘పదాన్ని బానిసగా, రాగాన్ని రంభ’గా మలుచుకునే వారు ఈ లోకంలో లేకపోలేదు. మనం ప్రయోగించే పదం లేదా అక్షరాల వేగాన్ని కొలిచేవారూ, కొలవగల వారూ అరుదు. సర్వశాస్త్రాలకు మూలమైనది గణితశాస్త్రం (మ్యాథమేటిక్స్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్) అంటారు. కొలతలతో నిమిత్తం లేని ప్రపంచం లేదు. ప్రతి దానికీ కొలతలూ, కొలమానాలూ ఉంటాయి. తాజా పరిశోధనల ఫలితంగా మనిషి నవ్వును కూడా కొలిచే సాధనాలు సిద్ధమవుతున్నాయి. నవ్వుకు సైతం కొలతలు, కొలబద్దలు ఉన్నాయని హాస ప్రక్రియా శాస్త్రంలో (సైన్స్ ఆఫ్ ది లాఫ్టర్) విశేష పరిశోధన చేసిన జపాన్ దేశ ఆచార్యుడు యోజీ కిమూరా నిర్ధారించారు. ఆయన నవ్వును కొలిచే యంత్రాన్ని కనుగొన్నారు. దీనికే ఎహెచ్ అని పొట్టి పేరు పెట్టారు. ఆంగ్ల వర్ణమాల చిన్న బడిలోని ‘ఎ’(a) అక్షరం, పెద్దబడిలోని ‘హెచ్’(H) అక్షరం కలిపితే వచ్చినదే ‘ఎహెచ్’(aH). ఇదొక సంకేతం. నవ్వుకు కొలమానం. స్వేచ్ఛగా నవ్వగలిగే చిన్నారులలో ఈ శక్తి సెకనుకు 10 ఎహెచ్ ప్రమాణంలో ఉంటుందట. ఇది పెద్దల నవ్వు కన్నా రెట్టింపు లాస్యశక్తిని విడుదల చేసిందని ఆచార్య కిమూరా లెక్క గట్టారు. ఈ ప్రక్రియ మొత్తం భాష లేకుండా రాణిం చదు. శ్రీశ్రీ అన్నట్టు ‘పశువుకొక్క భాష/ శిశువుకొక్క భాష/ మానవుడికి మాత్రం సంఖ్యానంతపు పలుకుబళ్లు’. కాబట్టి ఆ భాషలనూ, పలుకుబడులనూ రక్షించుకోవడం తప్పనిసరి. వేగమూ, వేగంగా ఆలోచించడమూ మానవుడి లక్షణాలలో ఒకటి. అయితే ఈ వేగాన్ని అన్ని భాషలలోని పదాలు అందుకోలేవు. భావాల బట్వాడాకు, అంటే కమ్యూనికేషన్స్‌కు ప్రపంచంలో ఏ భాషకు మంచి సౌలభ్యం ఉంది? ఏ భాషా పదానికి, ఏ అక్షరానికి ఎంత వేగం ఉంటుంది? ఒక భాషాపదం లేదా అక్షరం వేగవతి కావాలంటే ఉండవలసిన ప్రమాణాలేమిటి? ఇత్యాది ప్రశ్నలకు గణితశాస్త్రం, గణాంకశాస్త్రాల ఆధారంగా లెక్కకట్టి ఇంగ్లిష్, రోమన్, జర్మన్ లిపులకూ, వాటి అక్షరాలకూ తెలుగు అక్షరానికీ మధ్య పోలిక చూడడమే కాకుండా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడ, మలయాళీ లిపులతో తెలుగు లిపినీ, తెలుగు పదాన్నీ పోల్చి వీటిలో భావాలను వేగాతివేగంగా బట్వాడా చేసే శక్తి తెలుగు అక్షరానికే ఉందని నిరూపించిన ఏకైక తెలుగు మేధావి ఆచార్య రామకృష్ణ.
సైన్స్‌టుడే గమనించిన తరువాతైనా!
ధ్వని–ప్రతిధ్వని శాస్త్రాలు, సమాచార సిద్ధాంత అనువర్తిత శాస్త్రం రామకృష్ణ అభిమాన విషయాలు. 1973లో ఈయన ‘భాషల శక్తి సామర్థ్యాలు’(ఎఫిషియన్సీ ఆఫ్ లాంగ్వేజెస్) పేరుతో రాసిన సిద్ధాంత రచనను ‘సైన్స్‌టుడే’ ప్రచురించిన తరువాత కూడా మనం కళ్లు విప్పలేకపోయాం. సమాచారం ఇచ్చి పుచ్చుకోవడానికి కమ్యూనికేషన్ ఇంజనీర్లు ఏ భాషను ఎంపిక చేసుకుంటున్నారన్న ప్రశ్నకు సమాధానంగా రామకృష్ణ రాసిన అద్భుత విశ్లేషణే ఆ రచన. పదాలలో దాగిన అక్షర వేగ రహస్యం ఈ ప్రచురణతోగానీ తెలియరాలేదు. దేవనాగరితోపాటు మరాఠీ లిపితో, శబ్దాలతో కూడా తెలుగు లిపిని పోల్చి ఏ లిపి రాతకూ, వాక్కుకూ దాని వేగం సమాచార బట్వాడాలో ఉపయోగపడుతుందో నిరూపించారు. ఏ భాషలో ఏ అక్షరం ఒకే పాఠంలో ఎక్కువసార్లు ఎంత శాతం మేర వాడుకలోకి వస్తూంటుందో తేల్చారు రామకృష్ణ. ఒక లిపిని మనిషి ఎంత వేగంగా రాయగలడో, ఆ వేగమే ఆ లిపి/అక్షరం ప్రాముఖ్యతకు ప్రమాణం అని చెప్పారాయన. అందరూ ఒకే వేగంతో అక్షరాన్ని/లిపిని రాయరు. కాబట్టి రెండు వేర్వేరు లిపులు రాయడానికి పట్టే అసలు కాలాన్ని గణాంకశాస్త్ర సాయంతో ఆయన లెక్కగట్టారు. రోమన్, ఇంగ్లిష్ లిపులలో వాటిని రాయడానికి పట్టే సగటు వేగాన్ని అంచనా కట్టి ఇలా నిగ్గు తేల్చారు. ఈ అన్ని భాషలలోకన్నా అచ్చులు, హల్లులతో కూడిన పదాలను తెలుగు లిపిలోనే వేగంగా రాయటం సులభమని నిరూపించారు. ఆయన ఉద్దేశంలో అక్షరం/భాష అంటే సంజ్ఞ లేదా గుర్తు లేదా నిర్ణీత ప్రమాణం. దాని మారుపేరే ‘కోడ్’. అంటే, ఒక్కొక్క అక్షరానికి అవసరమైన బిట్స్‌ను సమాచార ప్రమాణం లేదా కొలబద్ద అంటారు. అలాంటి ‘బిట్లు’ ఇంగ్లిష్‌కు 1 లక్షా 71 వేల 107 ఉంటే, వీటిని జర్మన్ లిపి లేదా అక్షరంలోకి అనువదించాల్సి వస్తే 2 లక్షల 7,500 ‘బిట్లు’ అవసరం అవుతాయి. మరోమాటలో చెప్పాలంటే, తక్కువ సంఖ్యలో ‘బిట్లు’ అవసరమైన భాష మాత్రమే తనపైకి అనంతంగా వచ్చి పడుతున్న కమ్యూనికేషన్స్ (సమాచార) ఒత్తిడిని తట్టుకొని నిలబడగలుగుతుందని రామకృష్ణ రుజువు చేశారు.
భాషలోని ఈ పొదుపరితనాన్ని రాతలో ఆ భాషా లిపి లేదా అక్షరం వేగాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు– ఇంగ్లిష్‌లో ఒక అక్షరం 7.71 ‘బిట్ల’ సమాచారాన్ని అందించగల్గితే, తెలుగు అక్షరంతో అదే సమాచారాన్ని అందించడానికి కేవలం 1.14 బిట్లు సరిపోతాయి. అలాగే ఇంగ్లిష్‌లో ఒక అక్షరం ద్వారా సమాచారం అందించడానికి సగటున ఎన్ని ‘బిట్లు’ అవసరమవుతాయో అంతే సరిసమాన స్థాయిలో తెలుగు అక్షరానికి పట్టే ‘బిట్లు’, ప్రతి ‘బిట్టు’కు అవసరమైన అదనపు ‘బిట్లు’ కూడా కలిపి మొత్తం 1.18 బిట్లు (అంటే, 1.14+0.04) మాత్రమే సరిపోగా, హిందీలోకి అదే దామాషాలో బిట్లూ+ అదనపు బిట్లూ మొత్తం 1.56 బిట్లు, తమిళానికి మొత్తం 1.26 బిట్లూ అవసరమయ్యాయని రామకృష్ణ తేల్చారు. అంటే, ఇంగ్లిష్‌లో ఒక్కొక్క పదానికి పర్యాయపదాలు అనేకం ఉండగా, తెలుగులో మాత్రం ఒకే ఒక్క పదం ద్వారా ఎంతో సమాచారాన్ని, పర్యాయ పదాల్ని అందించవచ్చునని తేలింది. రాతలో లిపి అనేది వేగవంతమైన పాత్రకు సంబంధించింది. ఇంగ్లిష్‌ను రోమన్ లిపిలో రాయడానికి పట్టిన సగటు వేగం 176 సెకండ్లు కాగా, అదే ఇంగ్లిష్ లిపిని తెలుగులో రాయడానికి 166 సెకండ్లు పట్టింది. తెలుగును రోమన్ లిపిలో రాయడానికి 192 సెకండ్లు పడితే, దానిని తెలుగులోనే రాసుకుంటే తెలుగు లిపికి సగటు వేగం కేవలం 151 సెకండ్లు. అచ్చులు, హల్లులతో కూడిన తెలుగు శబ్దాలను తెలుగు లిపిలో ఇతర భాషా శబ్దాలకన్నా వేగంగా బట్వాడా చేయవచ్చునని చెబుతూ రామకృష్ణ ఇతర భారతీయ భాషల్లో తెలుగులిపిని రాతలోనూ, దాని వేగంతోనూ పోల్చినప్పుడు రుజువైన సగటు వేగం నిష్పత్తిని శాతంలో లెక్కకట్టి చూపాడు: తెలుగు 0.94 శాతం, తమిళం 1.07 శాతం, కన్నడం 1.05 శాతం, సంస్కృతం (దేవనాగరి) 1.06 శాతం, మలయాళం 0.95 శాతం. ఈ అక్షర వేగశక్తిలో మనకు దగ్గరగా పోలికకు వచ్చేది మలయాళం మాత్రమే.
తెలుగుకున్న వేగం గొప్పది
దీనిని బట్టి వేగశక్తిలో ఇతర భారతీయ భాషలకన్నా తెలుగుదే పైచేయిగా ఉండటమేగాక, కంప్యూటరీకరణలో కూడా తెలుగు లిపి అత్యంత ప్రయోజనకర స్థాయిలో ఉండగలదని రూఢి అవుతోంది. తెలుగు అజంత భాష కావడం, ‘రస భావ సమర్పణ శక్తి’లో సంస్కృతానికి దీటైన భాష కావడం వల్లనే ప్రపంచ ప్రసిద్ధ జీవ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ హాల్డేన్ సహితం శాస్త్ర, సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష భారతీయ భాషల్లో ఒక్క తెలుగేనని ఏభై ఏళ్లనాడే చెప్పాడు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఎంతసేపూ లాభాపేక్షతో కూడిన వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఆలోచనా వేగంతో వ్యాపారం దౌడు తీయాల’ని (బిజినెస్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ థాట్) సూత్రీకరిస్తే, మన రామకృష్ణ తెలుగు పదాన్ని దాని అక్షర వేగాన్ని దృష్టిలో పెట్టుకుని ‘సమాచార వేగాన్ని బట్టి పదం కదం తొక్కాల’ని (వర్డ్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్) కూడా సూత్రీకరించినట్టయింది.
అందుకని తెలుగు అక్షర శక్తిని గుర్తించి, మాండలిక సొగసుల్ని, ‘యాస’ల సోయగాల్ని ఆనందిస్తూనే ప్రాంతీయ విభేదాలకు, సంకుచిత భావజాలానికి చోటివ్వకుండానే తెలుగుజాతి ఏకతానాదాన్ని బలంగా సర్వత్రా మీటాలి. అయితే తెలుగు అక్షర శక్తికి తగినట్టుగా విద్యాలయాల్లో ప్రాథమిక దశ నుంచి డిగ్రీ దశ వరకు తెలుగును ‘ఆప్షనల్’గా ఉంచడమా, తప్పనిసరి బోధనా భాషగా ఉంచడమా అన్నది ఇంకా ఎటూ తేలకుండా ఉండటం క్షేమదాయకం కాదు.
abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు