తెలుగు కోసం న్యాయపోరు | Legal battle on telugu language in tamilnadu | Sakshi
Sakshi News home page

తెలుగు కోసం న్యాయపోరు

Published Sat, Nov 14 2015 8:47 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

Legal battle on telugu language in tamilnadu

చెన్నై : విద్యా సంబంధ దయనీయ పరిస్థితుల నుంచి గట్టెక్కెందుకు తమిళ రాష్ట్రంలోని తెలుగువారు న్యాయపోరాటానికి దిగక తప్పలేదు. మాతృభాషపై మమకారాన్ని కాపాడుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు. నిర్బంధ తమిళం ముసుగులో మైనారిటీ ప్రజల మనోభావాలను కాలరాస్తున్న పాలకుల్లో కనువిప్పు కలిగించేందుకు అవిశ్రాంతపోరు అనివార్యమైంది.   
 
తమిళనాడులో తమిళం ప్రధాన భాషకాగా ఇంగ్లిషు, హిందీ వంటి జాతీయ, అంతర్జాతీయ భాషలను మినహాయిస్తే 13 మైనారిటీ భాషలున్నాయి. రాష్ట్ర జనాభాలో తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ తదితర 13 లింగ్విస్టిక్ మైనారిటీ భాషలకు చెందినవారు 40 శాతం వరకు ఉన్నారు. దేశం మొత్తం మీద త్రిభాషా సంప్రదాయం కొనసాగుతుండగా తమ కు హిందీ భాష వద్దంటూ 1970 కాలం లో తమిళనాడులో పోరాటం చేశారు. హిందీ అక్షరాలు కనపడితేచాలు వాటిపై తారుపూశారు. చివరకు రైల్వేస్టేషన్లలోని హిందీ అక్షరాలకు సైతం తారుపూతలో మినహాయింపు ఇవ్వలేదు.
 
తమిళుల ఉద్యమానికి దిగివచ్చిన కేంద్రం ద్విభాషా సంప్రదాయానికి ఆమోదముద్ర వేసింది. తమిళనాడులోని అన్ని విద్యాసంస్థల్లో ఇంగ్లిషు, తమిళం భాషలే పరిమితమయ్యాయి. అంతటితో శాంతించని తమిళ పాలకులు (డీఎంకే ప్రభుత్వం) రాష్ట్రంలోని మైనారిటీ భాషల వారిని దెబ్బతీసేందుకు 2006లో నిర్బంధ తమిళం చట్టం తెచ్చింది.

ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో చదువుకునే మైనారిటీ విద్యార్దులపై బలవంతంగా తమిళ భాషను రుద్దడమే ఈ చట్టం అంతరార్థం. మరి తమ మాతృభాష మాటేమిటని ప్రశ్నించిన వారికి ‘ఔట్ ఆఫ్ సిలబస్’గా చదువుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చింది. ప్రభుత్వానికి పట్టని భాషలో చదువుకుంటే ఫలితం ఏమిటనే వాదన మైనారిటీ వర్గాల్లో బయలుదేరింది.

మాతృభాషాభిమానుల హక్కులను కాపాడేందుకు అఖిల భారత తెలుగు సమాఖ్య, సమాజ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి 2006లోనే సంయుక్తంగా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు కొట్టివేయడంతో సుప్రీం కోర్టు కెళ్లారు. దురదృష్టవశాత్తు రెండు కోర్టుల్లోనూ కేసు వీగిపోవడంతో మైనారిటీ భాషల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
 
నిర్బంధ తమిళంపైనా నిర్లక్ష్యం..
మైనారిటీ ప్రజలను, వారి మాతృభాషను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన నిర్బంధ తమిళం చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. నిర్బంధ తమిళ చట్టాన్ని అనుసరించి కాంపోటెంట్ అథారిటీని ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. తమిళ సబ్జెక్టును బోధించాల్సిన ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం ఇందులో ప్రధానమైంది. అయితే చట్టం చేసిన ప్రభుత్వం అథారిటీ ఏర్పాటును అటకెక్కించేసింది.
 
తమిళ ఉపాధ్యాయులు ఖాళీలను భర్తీ చేయలేదు.రాష్ట్రంలో మొత్తం 1500 మైనారిటీ భాషల వారి పాఠశాలలు ఉండగా, వీటిల్లో 900 తెలుగు పాఠశాలలు, 300 ఉర్దూ పాఠశాలలు, ఇతర భాషలవి ఉన్నాయి. మచ్చుకు ఒక్క మైనారిటీ పాఠశాలలో సైతం తమిళ ఉపాధ్యాయ నియామకానికి ప్రభుత్వం అనుమతించలేదు.

2006 నాటి నిర్బంధ తమిళ చట్టం ప్రకారం 2015-16 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసేవారు ఇతర పరీక్షలను తెలుగులో రాసినా తమిళం సబ్జెక్టు పరీక్షను విధిగా రాయాల్సి ఉంటుంది. తమిళ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం రాబోయే పదో తరగతి పరీక్షల్లో తమిళం సబ్జెక్టును విధిగా రాయాలనే నిబంధనను మాత్రం అమలుచేసేందుకు సిద్ధమైంది.
 
 ఈ రకంగా రాష్ట్రం మొత్తం మీద 30 వేల మంది మైనారిటీ విద్యార్థుల మెడపై నిర్బంధ తమిళ చట్టం అనే కత్తి వేలాడుతోంది. ఏఐటీఎఫ్ నేతృత్వంలో సాగుతున్న న్యాయపోరులో భాగంగా కోర్టుకు హాజరైన అధికారులు చట్టం అమలులో లోపాలు లేవని, తమిళ ఉపాధ్యాయుల నియామకం సక్రమంగా సాగిందని బదులిచ్చారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు క్వాలిఫైడ్ తమిళ ఉపాధ్యాయుల నియామకంపై పూర్తిస్థాయి ఆధారాలను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
ఏపీలో తమిళులకు పెద్దపీట..
ఏపీలో తమిళ విద్యార్థులకు పెద్ద గౌరవమే దక్కుతోంది. చిత్తూరు జిల్లాలో 11,170 మంది తమిళ విద్యార్థులు చదువుకుంటున్నారు. 66 తమిళ పాఠశాలలు, 6 కాలేజీలున్నాయి. ఎస్వీ యూనివర్సిటీలో 20 పీజీ సీట్లతో తమిళ విభాగమే ఉంది. 2003లో కార్వేటినగరంలో తమిళ టీచింగ్ ట్రైనింగ్ కాలేజీ ఏర్పడింది. ఈ కాలేజీలో మొత్తం 50 మంది విద్యార్థులకు అవకాశం ఉండగా నాన్ లోకల్ కోటా కింద తమిళనాడుకు 20 శాతం కేటాయించారు.
 
మాతృభాషల కోసం మరో పోరు..
మాతృభాషను కాపాడుకునేందుకు కొంతకాలంగా పోరు సాగిస్తున్నట్లు అఖిల భారత తెలుగు సమాఖ్య(ఏఐటీఎఫ్) అధ్యక్షులు, లింగ్విస్టిక్ మైనారిటీ ఫోరం చైర్మన్ డాక్టర్ సీఎంకే రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. 2012లో సీఎం జయలలితకు రాసిన ఉత్తరం ద్వారా ఒత్తిడికి గురైన ప్రభుత్వం అదే ఏడాది కాంపోటెంట్ అథారిటీని నియమించగా అనేక లోపాలు బయటపడ్డాయని తెలిపారు. 2013-14లో కోర్టుకు వెళ్లడంతో కేవలం 20 శాతం పాఠశాలల్లో తమిళ ఉపాధ్యాయులను నియమించిందని చెప్పారు.
 
తమిళభాషను నేర్చుకునేందుకు మైనారిటీలు వ్యతిరేకంగా కాదని, అయితే మాతృభాషకు సైతం అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు వివరించారు. 2006 నుంచి నిర్బంధ తమిళం చట్టం అమలుచేసి ఉంటే ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు తమిళంపై పూర్తిస్థాయి పట్టు సాధిం చేవారని, ఈ పరిస్థితి లేనందున కోర్టు ద్వారా పోరు సలుపుతున్నట్లు చెప్పారు. 9వ తరగతి వరకు మైనారిటీ భాషలను చదువుకుని పదో తరగతిలో అకస్మాత్తుగా తమిళం రాయించడం ద్వారా 30వేల మంది విద్యార్థుల భవిష్యత్తు కాలరాసినట్లు అవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement