
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్నెట్‌లో తెలుగు ప్రకటనలు ఇచ్చేవారికి గూగుల్ ఇండియా శుభవార్త చెప్పింది. గూగుల్ యాడ్స్ ఫ్లాట్‌ఫామ్స్ అయిన యాడ్ వర్డ్స్, యాడ్ సెన్స్‌లలోని సాంకేతికతను ఇకపై తెలుగు ప్రకటనలకు కూడా అందించనున్నట్టు తెలిపింది. ప్రాంతీయ భాషలైన హిందీ, బెంగాలీ, తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సాంకేతికత అందుబాటులో ఉన్నట్టు గూగుల్ ప్రకటించింది. తెలుగులో వెబ్‌సైట్లు, బ్లాగ్‌లు నిర్వహించేవారు ఇకపై గూగుల్ యాడ్ సెన్స్‌లోకి సైన్ ఇన్ అయి ప్రకటనలు పొందడమే కాకుండా తమ సైట్లలో ప్రకటనలు ఇచ్చేలా అడ్వర్టైజర్స్‌ను ఆకర్షించవచ్చని తెలిపింది. తద్వారా ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొంది. ‘గూగుల్ ఫర్ తెలుగు’ కార్యక్రమంలో భాగంగా ఈ సాంకేతికతపై వినియోగదారులకు అవగాహన కల్పించడానికి గూగుల్ ఇండియా వర్క్‌షాపులు కూడా నిర్వహించింది.
బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గూగుల్ దక్షిణాసియా ఉపాధ్యక్షుడు రాజన్ ఆనంద్ మాట్లాడుతూ.. భారత్‌లోని ప్రాంతీయ భాషాభిమానులకు ప్రత్యేకమైన సమాచారాన్ని అందించడం కోసమే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. తద్వారా గూగుల్ యాడ్స్ ఫ్లాట్‌ఫాంపై భారతీయ భాషలకు మద్దతు కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రాంతీయ భాషల్లో మెరుగైన సమాచారం అందించడం కోసం పరిశ్రమలోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాల్సి ఉందన్నారు. దీంతో దేశ అవసరాలకు అనుగుణంగా సమాచారం అందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ప్రకటనకర్తలకు కూడా తమ ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు ఇవ్వడం సులభతరం అవుతుందన్నారు.