‘భాష అందరి జన్మహక్కు. తల్లి భాషను అందరూ నేర్వాలి. రోజులో తొలి పలుకు అమ్మ భాషదే కావాలి. అప్పుడే కన్నవారికి, విద్య నేర్పిన గురువుకు, పుట్టిన గడ్డ రుణం తీసుకొన్న వాళ్లం అవుతాం. ఖండంతరాల్లో స్థిరపడ్డా అమ్మ.. అమ్మే కదా.! నేను ఎక్కడ ఉన్నా నా మూలాలు తెలుగు నేలపైనే ఉన్నాయి’.. అంటున్నారు జయ పీసపాటి. హాంకాంగ్‌లో తెలుగు భాష అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఆమె సిటీకి వచ్చిన సందర్భంగా శుక్రవారం ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. అవి జయ మాటల్లోనే..
సాక్షి,సిటీబ్యూరో: మా నాన్న యుద్ధనపూడి నాగేశ్వరరావుది విజయవాడ దగ్గర యుద్ధనపూడి, అమ్మ శ్యామలాదేవిది మచిలీపట్నం. నాన్న రైల్వేలో ఉన్నతోద్యోగి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర పనిచేశారు. నా పదేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాం. నా చదవువంతా ఇక్కడే సాగింది. సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ఎంఏ పట్టా పొందా.
2002లో హాంకాంగ్‌కు పయనం
నా భర్త రవిశంకర్ పిసపాటి మర్చంట్ నేవీలో మెరైన్ ఇంజినీర్. బాంబే, గోవాల్లో పనిచేశారు. 2002లో ఉద్యోగ రీత్యా హాంకాంగ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాం. ఇద్దరు పిల్లలు. బాబు కృష్ణ ఇంజినీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్నాడు. పాప సాహితి అక్కడే పదో తరగతి చదువుతోంది.
తెలుగువారి కోసం వెతికా..
హాంకాంగ్‌లో నా భర్త డ్యూటీకి వెళితే రెండుమూడు నెలలుకు గాని రారు. ఓ రోజు అత్యవసర అవసర పనిపడింది. అక్కడ తెలుగువారి కోసం ఎంత వెదికినా కనిపింలేదు. ఎలాంటి తెలుగు అసోషియేషన్స్ కూడా లేవు. ఓ ఏడాది గాలించాక.. అక్కడే వర్శిటీలో పనిచేసే కేపీ రావు 15 తెలుగు కుటుంబాల వారిని వనభోజనాలకు పిలిచారు. అక్కడే మనవారిని కలిసి పరిచయం చేసుకున్నాను.
హాంకాంగ్‌లో సమాఖ్య ఏర్పాటు చేశా..
తెలుగు వారి చిరునామాలు, ఈ మెయిల్స్, ఫేస్‌బుక్ ద్వారా అందరినీ కలిసేదాన్ని. అలా 2006లో ‘ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య’ ఏర్పాటు చేశా. అప్పుడు 40 కుటుంబాలు అందులో చేరాయి. ఇప్పుడు ఆ సంఖ్య 200 కుటుంబాలకు పెరింగింది. ఉద్యోగ, విద్య, వ్యాపార రీత్యా ఎవరు హాంకాంగ్ వచ్చినా తొలుత తెలుగు సమాఖ్యను సంప్రదిస్తారు. అందరి ఆలోచనలు మేరకు ఏటా వనభోజనాలు, ఉగాది, నవరాత్రులు, సంక్రాంతి, సత్యనారాయణ వ్రతాలు చేస్తాం. అన్ని తెలుగు పండుగులు చేస్తాం. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు బహుమతులు ఇస్తుంటాం.
చైనీయులకు తెలుగు నేర్పుతున్నా..
నేను ఉడ్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ ప్రి స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నా. అక్కడ అంతా ఇంగ్లీషు మీడియమే. హాంకాంగ్ వెళ్లినప్పటి నుంచి ఏటా తెలుగు క్లాసులు చెబుతున్నాను. మన వారితో పాటు చైనీయులు కూడా వచ్చి మన భాష నేర్చుకుంటున్నారు. కారణం ఏంటంటే.. అక్కడి చైనీస్ మన కూచిపూడి నాట్యం నేర్చుకొని నృత్య ప్రదర్శనలు ఇస్తుంటారు. ఆ నాట్యం కోసం మన తెలుగును కూడా నేర్చుకుంటున్నారు. అమెరికాలో మన తెలుగు కవి, రచయిత చిట్టెం రాజు పరిచయమయ్యారు. సిలికానాంధ్ర వారి ‘మనబడి’ని పరిచయం చేశారు. 2013 నుంచి 16 వరకు వారి తెలుగు తరగతులు నడిచాయి. తెలుగు సర్టిఫికెట్ కోర్సు కోసం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిని కలిశారు. వారు 50 మంది మినిమం ఉండాలన్నారు. ఇప్పుడు నేనే సొంతంగా తెలుగు తరగతులు తీసుకుంటున్నా.
‘హలో హాంకాంగ్’లో రేడియో జాకీగా..
ఎన్‌ఆర్‌ఐ వెబ్‌పోర్టల్‌లో తెలుగు వన్ డాట్ కామ్ ఉంది. దానికి అనుసంధానంగా ‘తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్‌నెట్’ నడుస్తోంది. అందులో ‘హలో హంకాంగ్’ లైవ్ కార్యక్రమం శని, ఆదివారాల్లో చేస్తారు. రేడియో జాకిగా పనిచేస్తున్నా. నేను వివిధ అంశాలపై తెలుగులో ఉపన్యాసం ఇస్తాను. ఇప్పటి వరకు సైనికుల కోసం జైహింద్, తెలుగు విశిష్టతపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చా. ఈ గ్లోబల్ రేడియో హైదరాబాద్ నుంచే రన్ అవుతోంది.
భాషపై ప్రేమతో...
నా భాషకు, దేశానికి ఏదో చేయాలనే తపన ఉంది. లలితమైన భాష రమ్యమైన భావం తెలుగుది. ఈ భాషలో ఉన్న మాధుర్యాన్ని వర్ణించలేం. భాష అందరి జన్మహక్కు.. అందుకే భాషా యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నా. తెలుగు భాషను పదిమందికి నేర్పడం నా సంకల్పం. నా తుది వరకు హాంకాంగ్ వేదికగా ఈ యజ్ఞం కొనసాగిస్తాను.. అంటూ ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment