radio jackie
-
నిన్నటిదాకా నవ్వుతూ, తుళ్లుతూ : మహిళా ఆర్జే ఆత్మహత్య? సీఎం దిగ్భ్రాంతి!
ఎపుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉండే వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయింది. తనను తాను జమ్మూ కీధడ్కన్ అని పిలుచుకునే పాపులర్ ఆర్జే సిమ్రాన్ సింగ్ తన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. సోషల్ మీడియాలో స్టార్లుగా ఎదిగి, లక్షల అభిమానులను సంపాదించుకుని, ఒక వెలుగు వెలుగుతున్న తరుణంలో జీవితంలో మరో ఉదయం లేకుండా చేసుకోవడం విషాదం.గురుగ్రామ్ అద్దె అపార్ట్మెంట్లో సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య చేసుకొంది. రాత్రి పదిన్నర గంటలకు ఆమె స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే సిమ్రాన్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా సిమ్రాన్ మనస్తాపంతో ఉందని ఆమె తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కానీ ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. మరోవైపు ఆర్జే సిమ్రాన్ చివరి పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ నెల (డిసెంబర్)13న తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్‌ను పోస్ట్ చేసింది. 'బీచ్ ఒడ్డున అంతులేని ముసిముసి నవ్వులతో ఉన్న అమ్మాయి' అంటూ చాలా సంతోషంగా కనిపించింది. చక్కటి ఫోటోలను పోస్ట్ చేసింది. మరి ఇంత ప్రశాంతంగా ఉన్న అమ్మాయి గుండెల్లో రగిలిన బడబానలం ఏంటి అనేది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది.ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపంజమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన యంత్రి, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులర్పించారు. సిమ్రాన్ కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు తమ హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. View this post on Instagram A post shared by RJ SIMRAN (@rjsimransingh) సిమ్రాన్ ఆత్మహత్య వార్త దావానలంలా వ్యాపించడంతో ఆమె అభిమానులు షాకయ్యారు. ఏమైంది, ఎందుకు ఇంత పనిచేసింది, అంటూ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో హ్యాపీగా ఉన్నంత మాత్రాన, వారి జీవితాల్లో ఆనందం ఉన్నట్టు కాదు.. వాస్తవం మరోలా ఉంటుందనే విషయాన్ని ఆమె నిష్క్రమణ రుజువు చేసిందంటూ మూడో యూజర్ కమెంట్ చేయడం గమనార్హం. -
మాటల కశ్మీరం.. సమానియా
సరిహద్దు సమస్యలు, అంతర్గత అల్లరు,్ల మరోపక్క ఉగ్రమూకల దాడులతో అట్టుడికే కశ్మీర్... ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత మిగతా రాష్ట్రాల్లాగే పరిస్థితులు క్రమంగా మారుతుండడంతో..అక్కడి యువత సరికొత్త ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇటువంటి అవకాశాన్ని తన తెలివితేటలు, నైపుణ్యంతో అందుకున్న ఆర్జే సమానియా.. ఉత్తర కశ్మీర్లో తొలి మహిళా ఆర్జేగా నిలిచింది. 19 ఏళ్ల సమానియా బారముల్ల ఓల్డ్ టౌన్‌కు చెందిన అమ్మాయి. సమానియా భట్ రోజూ తండ్రి పక్కన కూర్చుని ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయాలను ఆయనతో చర్చిస్తూ అప్డేటెడ్గా ఉండేది. ఉదయాన్నే వచ్చే వార్తాపత్రికలను చదువుతూ, టీవీల్లో వచ్చే వార్తలను శ్రద్ధగా వినడం ఆమెకు ఒక అలవాటుగా ఉండేది. ఆ అలవాటే నేడు సమానియాను ఉత్తర కశ్మీర్లో తొలి రేడీయో జాకీగా మార్చింది. తన సుమధుర వాక్ చాతుర్యంతో శ్రోతల్ని ఆకట్టుకొంటూ నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. మాస్ కమ్యూనికేషన్ అండ్ వీడియో ప్రొడక్షన్లో డిగ్రీ చదివింది. జర్నలిస్టు కావాలన్న కలతో డిగ్రీలో మాస్ కమ్యునికేషన్ పాఠాలు చాలా శ్రద్ధగా నేర్చుకునేది. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే స్థానిక న్యూస్ పేపర్ లలో కూడా పనిచేసేది. ఆ ఆసక్తితోనే డిగ్రీ పూర్తయ్యాక జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో పీజీ ఎంట్రన్స్ కోసం సన్నద్ధమవుతూ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసింది. స్కాలర్షిప్ మంజూరు అయినప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ వల్ల చేతికి రాకుండానే స్కాలర్షిప్ వెనక్కి వెళ్లింది. ఇది సమానియాకు కాస్త బాధ కలిగించినప్పటికీ నిరుత్సాహ పడకుండా ముందుకు సాగింది. ఆర్జేగా... స్కాలర్షిప్ రాలేదన్న బాధలో ఉన్న సమానియాకు మజ్‌బగ్‌లో ఉన్న కశ్మీర్ రేడియో ఛినార్–ఎఫ్ఎమ్:90.4 రేడియో జాకీలకోసం దరఖాస్తుల ఆహ్వాన ప్రకటన కనిపించింది. అది చూసి వెంటనే రేడియో జాకీ (ఆర్జే) పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఈ పోస్టుకోసం కశ్మీర్‌లోని వివిధ జిల్లాల నుంచి 250 మంది పోటీపడ్డారు. పోటీ ఎక్కువగా ఉండడంతో నాలుగైదు రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత సమానియా ఆర్జేగా సెలెక్ట్ అయ్యింది. కాగా రేడియో స్టేషన్ నలుగుర్ని మాత్రమే ఎంపిక చేయగా.. సమానియా మాత్రమే మహిళా ఆర్జేగా సెలెక్ట్ అయ్యింది. ఆకట్టుకునే వాక్చాతుర్యంతో శ్రోతలలో పాజిటివ్ ఎనర్జీని నింపుతూ తనవైపు తిప్పుకుంటుంది. ‘హల్లా బోల్ విత్ ఆర్జే సమానియా’ షో చేస్తూ శోతల అభిమానం చూరగొనడం, ఈ షోకు మంచి స్పందన లభించడంతో తొలుత మ«ధ్యాహ్నం 12గంటల నుంచి 3 గంటల వరకు ఉన్న షో సమయాన్ని, మ«ధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరుగంటల వరకు ప్రసారం చేస్తున్నారు. ప్రేర ణాత్మక మాటలు చెప్పడమేగాక ఆయా రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదిగిన యువతీ యువకులను అతిథులుగా పిలిచి క్రియేటివ్‌గా ఇంటర్వ్యూలు కూడా చేస్తోంది. ఆత్మీయ స్వరం, సానుకూల మాటలతో సమానియా రేడియో జాకీగా దూసుకుపోతోంది. ‘‘నేను ఆర్జే అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ప్రింట్ మీడియాలో పనిచేస్తున్నప్పుడు టీచర్లు, స్నేహితులు ‘నువ్వు రేడియో జర్నలిజానికి బాగా పనికొస్తావు’ అని ప్రోత్సహించేవారు. అయితే నేను ఎప్పుడు ఆ దిశగా ప్రయత్నించలేదు. కానీ రేడియో స్టేషన్ చినార్ ప్రకటన నాలో ఆశలు రేపింది. అందరితో పోటీపడి ఆర్జేగా సెలెక్ట్ అయ్యాను. నైపుణ్యం కలిగిన కశ్మీర్ యువతను మేల్కొల్పడమే మా ముఖ్య ఉద్దేశ్యం. యువతలోని శక్తిసామర్థ్యాలను తట్టిలేపి, వారిలోని ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చూపించడమే’’ అని సమానియా చెప్పింది. -
‘హలో హాంకాంగ్’లో రేడియో జాకీగా..
‘భాష అందరి జన్మహక్కు. తల్లి భాషను అందరూ నేర్వాలి. రోజులో తొలి పలుకు అమ్మ భాషదే కావాలి. అప్పుడే కన్నవారికి, విద్య నేర్పిన గురువుకు, పుట్టిన గడ్డ రుణం తీసుకొన్న వాళ్లం అవుతాం. ఖండంతరాల్లో స్థిరపడ్డా అమ్మ.. అమ్మే కదా.! నేను ఎక్కడ ఉన్నా నా మూలాలు తెలుగు నేలపైనే ఉన్నాయి’.. అంటున్నారు జయ పీసపాటి. హాంకాంగ్‌లో తెలుగు భాష అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఆమె సిటీకి వచ్చిన సందర్భంగా శుక్రవారం ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. అవి జయ మాటల్లోనే.. సాక్షి,సిటీబ్యూరో: మా నాన్న యుద్ధనపూడి నాగేశ్వరరావుది విజయవాడ దగ్గర యుద్ధనపూడి, అమ్మ శ్యామలాదేవిది మచిలీపట్నం. నాన్న రైల్వేలో ఉన్నతోద్యోగి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర పనిచేశారు. నా పదేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాం. నా చదవువంతా ఇక్కడే సాగింది. సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ఎంఏ పట్టా పొందా. 2002లో హాంకాంగ్‌కు పయనం నా భర్త రవిశంకర్ పిసపాటి మర్చంట్ నేవీలో మెరైన్ ఇంజినీర్. బాంబే, గోవాల్లో పనిచేశారు. 2002లో ఉద్యోగ రీత్యా హాంకాంగ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాం. ఇద్దరు పిల్లలు. బాబు కృష్ణ ఇంజినీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్నాడు. పాప సాహితి అక్కడే పదో తరగతి చదువుతోంది. తెలుగువారి కోసం వెతికా.. హాంకాంగ్‌లో నా భర్త డ్యూటీకి వెళితే రెండుమూడు నెలలుకు గాని రారు. ఓ రోజు అత్యవసర అవసర పనిపడింది. అక్కడ తెలుగువారి కోసం ఎంత వెదికినా కనిపింలేదు. ఎలాంటి తెలుగు అసోషియేషన్స్ కూడా లేవు. ఓ ఏడాది గాలించాక.. అక్కడే వర్శిటీలో పనిచేసే కేపీ రావు 15 తెలుగు కుటుంబాల వారిని వనభోజనాలకు పిలిచారు. అక్కడే మనవారిని కలిసి పరిచయం చేసుకున్నాను. హాంకాంగ్‌లో సమాఖ్య ఏర్పాటు చేశా.. తెలుగు వారి చిరునామాలు, ఈ మెయిల్స్, ఫేస్బుక్ ద్వారా అందరినీ కలిసేదాన్ని. అలా 2006లో ‘ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య’ ఏర్పాటు చేశా. అప్పుడు 40 కుటుంబాలు అందులో చేరాయి. ఇప్పుడు ఆ సంఖ్య 200 కుటుంబాలకు పెరింగింది. ఉద్యోగ, విద్య, వ్యాపార రీత్యా ఎవరు హాంకాంగ్ వచ్చినా తొలుత తెలుగు సమాఖ్యను సంప్రదిస్తారు. అందరి ఆలోచనలు మేరకు ఏటా వనభోజనాలు, ఉగాది, నవరాత్రులు, సంక్రాంతి, సత్యనారాయణ వ్రతాలు చేస్తాం. అన్ని తెలుగు పండుగులు చేస్తాం. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు బహుమతులు ఇస్తుంటాం. చైనీయులకు తెలుగు నేర్పుతున్నా.. నేను ఉడ్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ ప్రి స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నా. అక్కడ అంతా ఇంగ్లీషు మీడియమే. హాంకాంగ్ వెళ్లినప్పటి నుంచి ఏటా తెలుగు క్లాసులు చెబుతున్నాను. మన వారితో పాటు చైనీయులు కూడా వచ్చి మన భాష నేర్చుకుంటున్నారు. కారణం ఏంటంటే.. అక్కడి చైనీస్ మన కూచిపూడి నాట్యం నేర్చుకొని నృత్య ప్రదర్శనలు ఇస్తుంటారు. ఆ నాట్యం కోసం మన తెలుగును కూడా నేర్చుకుంటున్నారు. అమెరికాలో మన తెలుగు కవి, రచయిత చిట్టెం రాజు పరిచయమయ్యారు. సిలికానాంధ్ర వారి ‘మనబడి’ని పరిచయం చేశారు. 2013 నుంచి 16 వరకు వారి తెలుగు తరగతులు నడిచాయి. తెలుగు సర్టిఫికెట్ కోర్సు కోసం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిని కలిశారు. వారు 50 మంది మినిమం ఉండాలన్నారు. ఇప్పుడు నేనే సొంతంగా తెలుగు తరగతులు తీసుకుంటున్నా. ‘హలో హాంకాంగ్’లో రేడియో జాకీగా.. ఎన్ఆర్ఐ వెబ్‌పోర్టల్‌లో తెలుగు వన్ డాట్ కామ్ ఉంది. దానికి అనుసంధానంగా ‘తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్’ నడుస్తోంది. అందులో ‘హలో హంకాంగ్’ లైవ్ కార్యక్రమం శని, ఆదివారాల్లో చేస్తారు. రేడియో జాకిగా పనిచేస్తున్నా. నేను వివిధ అంశాలపై తెలుగులో ఉపన్యాసం ఇస్తాను. ఇప్పటి వరకు సైనికుల కోసం జైహింద్, తెలుగు విశిష్టతపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చా. ఈ గ్లోబల్ రేడియో హైదరాబాద్ నుంచే రన్ అవుతోంది. భాషపై ప్రేమతో... నా భాషకు, దేశానికి ఏదో చేయాలనే తపన ఉంది. లలితమైన భాష రమ్యమైన భావం తెలుగుది. ఈ భాషలో ఉన్న మాధుర్యాన్ని వర్ణించలేం. భాష అందరి జన్మహక్కు.. అందుకే భాషా యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నా. తెలుగు భాషను పదిమందికి నేర్పడం నా సంకల్పం. నా తుది వరకు హాంకాంగ్ వేదికగా ఈ యజ్ఞం కొనసాగిస్తాను.. అంటూ ముగించారు. -
ఆర్జె రోహిణి ఫ్రమ్ సింగపూర్
దేశవ్యాప్తంగా ఎన్నో ఎఫ్ఎం స్టేషన్లు ఉన్నాయి. వందలాది మంది ఆర్‌జెలుగా వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అలాంటి వారిలో సింగపూర్ రేడియో మస్తీ 96.3 లో పని చేస్తున్న రోహిణీ రామనాథన్ ప్రత్యేకం. తమిళనాడుకు చెందిన రోహిణీ ముంబైలో పుట్టి పెరిగారు. అక్కడే ఆరు సంవత్సరాలు ఆర్జెగా పనిచేసి, సంవత్సరం క్రితమే సింగపూర్ ఎఫ్ఎంలో ఆర్జె గా చేరారు. ‘‘నేను కొత్త ఆర్జెనని శ్రోతలకు తెలుసు. అందువల్ల నేను రేడియోలో ఏ తప్పు మాట్లాడినా వెంటనే పట్టేస్తారు. నేను మొట్టమొదట రేడియోలో మాట్లాడినప్పుడు సింగపూర్‌లోని రోడ్ల పేర్లన్నీ తప్పుగా పలికాను. ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలు, ఆ పదాల్ని ఎలా పలకాలో నాకు వివరించారు. వారు అలా చెబుతుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపించేది’’ అంటారు రోహిణి. రోహిణికి సింగపూర్ ఎంతో అందంగా అనిపించింది. ఆ దేశంలో ఆమెకు ఎన్నో తీయని అనుభవాలు ఎదురయ్యాయి. అక్కడ పనంతా సజావుగానే సాగుతోంది. ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని, రేడియోకి వచ్చి కార్యక్రమం ప్రారంభించే సమయానికి రోహిణికి చాలా చిరాగ్గా ఉంటుంది. ‘‘కార్యక్రమం ప్రారంభమైందంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ఫోన్ చేసిన వారందరితోనూ మాట్లాడాలి. కానీ మా చిరాకును, అసహనాన్ని కనపడనివ్వకూడదు’’ అంటూ చిరునవ్వుతో చెబుతారు ఆమె. రోహిణి రేడియోలో మాట్లాడటానికి ఇంకా రాకుండానే, ఎందరో శ్రోతలు ఆమెతో మాట్లాడటానికి సిద్ధమైపోతారు. ‘‘ప్రతిరోజూ ఒకావిడ సరిగ్గా సాయంత్రం 4.30 కి ఫోన్ చేస్తారు. ఆ టైమ్‌కి నేను వస్తానని ఆవిడకు బాగా తెలుసు. నేను టీ తాగానా లేదా అని ఆవిడ నన్ను ఎంతో ఆప్యాయంగా ప్రశ్నిస్తారు. ఆ తరవాత షో మధ్యలో మళ్లీ ఫోన్ చేస్తారు’’ అంటూ మురిసిపోతూ చెబుతారు రోహిణి. శ్రోతలు తమ విషయాలన్నీ ఆమెతో పంచుకుంటారు. అవతల వింటున్నవారెవరని ఆలోచించకుడా ఫోన్ చేసేస్తారు. కొందరు శ్రోత లైతే, ‘‘నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. కొంచెం ఈ విషయం ఆమెకు చెప్పండి. ఎలాగైనా ఆ అమ్మాయిని ఇక్కడికి రప్పించండి’’ అని బతిమలాడుతారు. ‘‘ఇక్కడి భిన్న సంస్కృతులు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తాయి. భారతదేశంలోనైతే, అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు, మనకిష్టం ఉన్నా లేకపోయినా మన వైపు కళ్లప్పగించి చూస్తారు. ఒక్కోసారి ఈ స్థితి ప్రమాదస్థాయికి చేరుకుంటుంది. నేను సింగపూర్ వచ్చినప్పుడు ఇక్కడ నన్నెవ్వరూ గుచ్చి గుచ్చి చూడలేదు. ప్రతివారూ వారి వారి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు’’ అంటూ సింగపూర్‌లో తనకు నచ్చిన అంశాలను ఆనందంగా వివరించారు రోహిణి. ఆమె ఇంగ్లీషు, హిందీ, మరాఠీ (మహారాష్ట్రలో జననం), తమిళం (మాతృభాష), గుజరాతీ, కొద్దికొద్దిగా ఫ్రెంచ్, స్పానిష్, మొత్తం ఏడు భాషలలో మాట్లాడగలరు. ‘‘రాత్రి ఎనిమిది గంటలకు నా షో పూర్తవుతుంది. ఆ వెంటనే నేను ఇంటికి వెళ్లకుండా, బయటి పనులు చూసుకోవడం, మిత్రులను కలవడం వంటివి చేస్తుంటాను. నగరంలో సంగీత కచేరీలు, కామెడీ షోలు... వంటి కార్యక్రమాలు జరుగుతుంటే వాటికి వెళుతుంటాను’’ అంటూ తన అభిరుచులను వివరించారు రోహిణి. ముంబైలో ఆర్జెగా పని చేసినప్పుడు ఆమె జీవితంలో కొన్ని మరచిపోలేని జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ‘‘నేను స్టూడియోకి వెడితే, అక్కడ నా షో కోసం ముగ్గురు ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉంటారు. రేడియోలో నా షో విన్న కొందరు అభిమానులు ఒక్కోసారి హోటల్లో టేబుల్ కూడా బుక్ చేస్తుంటారు. ఇక్కడ సింగపూర్‌లో మాత్రం నా కార్యక్రమానికి నేనే స్క్రిప్ట్ తయారుచేసుకోవాలి. నా కాఫీ నేనే తెచ్చుకోవాలి. నా పనులన్నీ నేనే చేసుకోవాలిఇదే మంచిది. నా జీవితంలో మొట్టమొదటిసారిగా, ఇలా కార్యక్రమం చేయడం. ఈ కార్యక్రమానికి వచ్చే పొగడ్తలు, విమర్శలు అన్నిటికీ నేనే బాధ్యురాలిని. దేశం మారటం నాకు నిజంగా చాలా మంచి చేసింది. రేడియోలో మాట్లాడటం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక్కడకు వచ్చిన తర్వాత నాకు ఒక విషయం అర్థం అయ్యింది, మనం ఎక్కడ ఉన్నామని కాదు, ఏం చేస్తున్నామని కాదు, ఇక్కడివారు నాతో చక్కగా మాట్లాడుతుంటారు. థ్యాంక్ గాడ్’’అంటూ సింగపూర్ పట్ల తన కృతజ్ఞతను వ్యక్తపరుస్తారు రోహిణి.