ఆర్‌జె రోహిణి ఫ్రమ్ సింగపూర్ | RJ Rohini explains her experiences from singapore | Sakshi
Sakshi News home page

ఆర్‌జె రోహిణి ఫ్రమ్ సింగపూర్

Published Wed, May 28 2014 6:36 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

ఆర్‌జె రోహిణి ఫ్రమ్ సింగపూర్

ఆర్‌జె రోహిణి ఫ్రమ్ సింగపూర్

దేశవ్యాప్తంగా ఎన్నో ఎఫ్‌ఎం స్టేషన్లు ఉన్నాయి. వందలాది మంది ఆర్‌జెలుగా వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అలాంటి వారిలో సింగపూర్ రేడియో మస్తీ 96.3 లో పని చేస్తున్న రోహిణీ రామనాథన్ ప్రత్యేకం. తమిళనాడుకు చెందిన రోహిణీ ముంబైలో పుట్టి పెరిగారు. అక్కడే ఆరు సంవత్సరాలు ఆర్‌జెగా పనిచేసి, సంవత్సరం క్రితమే సింగపూర్ ఎఫ్‌ఎంలో ఆర్‌జె గా చేరారు.

 ‘‘నేను కొత్త ఆర్‌జెనని శ్రోతలకు తెలుసు. అందువల్ల నేను రేడియోలో ఏ తప్పు మాట్లాడినా వెంటనే పట్టేస్తారు. నేను మొట్టమొదట రేడియోలో మాట్లాడినప్పుడు సింగపూర్‌లోని రోడ్ల పేర్లన్నీ తప్పుగా పలికాను. ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలు, ఆ పదాల్ని ఎలా పలకాలో నాకు వివరించారు. వారు అలా చెబుతుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపించేది’’ అంటారు రోహిణి. రోహిణికి సింగపూర్  ఎంతో అందంగా అనిపించింది. ఆ దేశంలో ఆమెకు ఎన్నో తీయని అనుభవాలు ఎదురయ్యాయి. అక్కడ పనంతా సజావుగానే సాగుతోంది. ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని, రేడియోకి వచ్చి కార్యక్రమం ప్రారంభించే సమయానికి రోహిణికి చాలా చిరాగ్గా ఉంటుంది. ‘‘కార్యక్రమం ప్రారంభమైందంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ఫోన్ చేసిన వారందరితోనూ మాట్లాడాలి. కానీ మా చిరాకును, అసహనాన్ని కనపడనివ్వకూడదు’’ అంటూ చిరునవ్వుతో చెబుతారు ఆమె. రోహిణి రేడియోలో మాట్లాడటానికి ఇంకా రాకుండానే, ఎందరో శ్రోతలు ఆమెతో మాట్లాడటానికి సిద్ధమైపోతారు.

 ‘‘ప్రతిరోజూ ఒకావిడ సరిగ్గా సాయంత్రం 4.30 కి ఫోన్ చేస్తారు. ఆ టైమ్‌కి నేను వస్తానని ఆవిడకు బాగా తెలుసు. నేను టీ తాగానా లేదా అని ఆవిడ నన్ను ఎంతో ఆప్యాయంగా ప్రశ్నిస్తారు.  ఆ తరవాత షో మధ్యలో మళ్లీ ఫోన్ చేస్తారు’’ అంటూ మురిసిపోతూ చెబుతారు రోహిణి. శ్రోతలు తమ విషయాలన్నీ ఆమెతో పంచుకుంటారు. అవతల వింటున్నవారెవరని ఆలోచించకుడా ఫోన్ చేసేస్తారు. కొందరు శ్రోత లైతే, ‘‘నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. కొంచెం ఈ విషయం ఆమెకు చెప్పండి. ఎలాగైనా ఆ అమ్మాయిని ఇక్కడికి రప్పించండి’’ అని బతిమలాడుతారు.

 ‘‘ఇక్కడి భిన్న సంస్కృతులు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తాయి. భారతదేశంలోనైతే, అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు, మనకిష్టం ఉన్నా లేకపోయినా మన వైపు కళ్లప్పగించి చూస్తారు. ఒక్కోసారి ఈ స్థితి ప్రమాదస్థాయికి చేరుకుంటుంది. నేను సింగపూర్ వచ్చినప్పుడు ఇక్కడ నన్నెవ్వరూ గుచ్చి గుచ్చి చూడలేదు. ప్రతివారూ వారి వారి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు’’ అంటూ సింగపూర్‌లో తనకు నచ్చిన  అంశాలను ఆనందంగా వివరించారు రోహిణి. ఆమె ఇంగ్లీషు, హిందీ, మరాఠీ (మహారాష్ట్రలో జననం), తమిళం (మాతృభాష), గుజరాతీ, కొద్దికొద్దిగా ఫ్రెంచ్, స్పానిష్, మొత్తం ఏడు భాషలలో మాట్లాడగలరు.

 ‘‘రాత్రి ఎనిమిది గంటలకు నా షో పూర్తవుతుంది. ఆ వెంటనే నేను ఇంటికి వెళ్లకుండా, బయటి పనులు చూసుకోవడం, మిత్రులను కలవడం వంటివి చేస్తుంటాను. నగరంలో సంగీత కచేరీలు, కామెడీ షోలు... వంటి కార్యక్రమాలు జరుగుతుంటే వాటికి వెళుతుంటాను’’ అంటూ తన  అభిరుచులను వివరించారు రోహిణి. ముంబైలో ఆర్‌జెగా పని చేసినప్పుడు ఆమె జీవితంలో కొన్ని మరచిపోలేని జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ‘‘నేను స్టూడియోకి వెడితే, అక్కడ నా షో కోసం ముగ్గురు ప్రొడ్యూసర్‌లు సిద్ధంగా ఉంటారు. రేడియోలో నా షో విన్న కొందరు అభిమానులు ఒక్కోసారి హోటల్‌లో టేబుల్ కూడా బుక్ చేస్తుంటారు. ఇక్కడ సింగపూర్‌లో మాత్రం నా కార్యక్రమానికి నేనే స్క్రిప్ట్ తయారుచేసుకోవాలి. నా కాఫీ నేనే తెచ్చుకోవాలి. నా పనులన్నీ నేనే చేసుకోవాలిఇదే మంచిది. నా జీవితంలో మొట్టమొదటిసారిగా, ఇలా కార్యక్రమం చేయడం. ఈ కార్యక్రమానికి వచ్చే పొగడ్తలు, విమర్శలు అన్నిటికీ నేనే బాధ్యురాలిని. దేశం మారటం నాకు నిజంగా చాలా మంచి చేసింది. రేడియోలో మాట్లాడటం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక్కడకు వచ్చిన తర్వాత నాకు ఒక విషయం అర్థం అయ్యింది, మనం ఎక్కడ ఉన్నామని కాదు, ఏం చేస్తున్నామని కాదు, ఇక్కడివారు నాతో చక్కగా మాట్లాడుతుంటారు. థ్యాంక్ గాడ్’’అంటూ సింగపూర్ పట్ల తన కృతజ్ఞతను వ్యక్తపరుస్తారు రోహిణి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement