అందమైన తెలుగు భాషకు నగరంలో అందలమేది? అచ్చంగా తెలుగు మాట్లాడడం..రాయడం మచ్చుకైనా కానరాకపాయె. ముందు వరుసలో ఉండి అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగు భాష సరిగా అమలు కావడం లేదు. కేవలం బోర్డులకే పరిమితమైంది తప్ప...ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫైళ్లు, పాలనపరమైన వ్యవహారాలు సైతం ఆంగ్లంలోనే జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో పదిశాతం మాత్రమే తెలుగు అమలవుతుండడం గమనార్హం. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో నగరంలోని వివిధ కార్యాలయాల్లో తెలుగు భాష అమలుపై సాక్షి ప్రత్యేక కథనం...
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ తెలుగు మహాసభలకు ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ మహా నగరంలో అధికార భాష అమలు అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులపై మాత్రమే తెలుగు అమలు కనిపిస్తుండగా...ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆంగ్ల భాష రాజ్యమేలుతోంది. కనీసం పరిపాలన పరమైన వ్యవహారాల్లో అధికార భాష తెలుగు అమలుకు కనీస ప్రోత్సాహం కరువైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో దస్త్రాలు మ్యానువల్ విధానం నుంచి ఈ–ఆఫీస్‌కు అప్‌డేట్ అవుతున్నా..తెలుగు సాఫ్ట్‌వేర్ ఏర్పాటును విస్మరించడం విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు అధికార యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో ప్రజలు పెట్టుకునే దరఖాస్తులకు సైతం ఆంగ్లంలో సమాధానాలు ఇస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. సాక్ష్యాత్తు ప్రభుత్వం పరంగా అధికార భాష తెలుగును తూచ తప్పకుండా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకునే నాథులే కరువయ్యారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలా ఉండాలి...
అధికార భాషా చట్టం–1966 ప్రకారం తెలుగు అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో శిలాఫలకాలు తెలుగులో తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు పట్టికలు, ఉద్యోగుల సంతకాలు, సెలువు దరఖాస్తులు తెలుగులో రాయాల్సి ఉంటుంది. శిలాఫలకాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు, హోదా తెలుగులో ఉండేవిధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ గ్రేటర్ పరిధిలో సరిగా అమలు కావడం లేదు.
తెలుగు సాఫ్ట్‌వేర్ ఎక్కడ?
ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలుకు ప్రోత్సాహాం కరువైంది. కంప్యూటర్లలో కనీసం తెలుగు స్టాఫ్‌వేర్ కూడా లేకుండా పోయింది. ఒకవేళ సాఫ్ట్‌వేర్ వేసుకున్నా తెలుగు టైపింగ్ వచ్చే ఉద్యోగులు కరువయ్యారు. దీంతో ఫ్రభుత్వ విభాగాల దస్త్రాలన్నీ ఆంగ్లంలోనే కొనసాగుతున్నాయి. జిల్లా స్థాయి కలెక్టరేట్‌లలో ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ ఉత్సవ విగ్రహంగా తయారైంది. వివిధ శాఖల్లో అధికార భాష అమలుపై నెలవారీ నివేదికలు సైతం తెప్పించకోవడంలో విఫలమవుతున్నారు. మరోవైపు వివిధ శాఖలు సైతం నివేదికలు పంపించేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. మూడు నెలలకోసారి జరగాల్సిన సమీక్షల ఊసే లేకుండా పోయింది.
అమలు ఇలా...
నగరంలో తెలుగు భాష అమలు కేవలం çపదిశాతానికి పరిమితమైంది. రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంతాల్లో 40 శాతం, మేడ్చల్ పరిధిలో 40 శాతం అమలవుతోంది. హైదరాబాద్‌లో పౌరసంబంధాల శాఖ 80 శాతం, మహిళా శిశు సంక్షేమ శాఖలో 60 శాతం తెలుగు భాష అమలవుతోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి విభాగాల్లో సుమారు 80 శాతం వరకు తెలుగు అమలవుతుండగా వంద శాతం పూర్తి చేసేందుకు కార్యాచరణకు సిద్ధమయ్యారు. మిగిలిన విభాగాల్లో ఆంగ్లంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పరంగా వచ్చే లేఖలు, మెమోలూ ఆంగ్లంలోనే ఉంటున్నాయి.
కార్యాలయాల్లో అధికార భాష అమలు అంతంతే
Published Tue, Dec 12 2017 8:22 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment