తెలుగు విజయం | Telugu language in tamilnadu | Sakshi
Sakshi News home page

తెలుగు విజయం

Published Tue, Jan 26 2016 10:59 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

తెలుగు విజయం

తెలుగు విజయం

13 వేల మంది విద్యార్థులకు ఊరట
హైకోర్టు స్పష్టమైన తీర్పు
అందరికీ వర్తింపజేయాలని ఎమ్మెల్యే గోపీనాథ్ విజ్ఞప్తి
 
 
చెన్నై: నిర్బంధ తమిళంపై తెలుగువారు సాగించిన న్యాయపోరులో ఎట్టకేలకు విజయం సాధించారు. హైకోర్టు తీర్పుతో చట్టపరమైన ఉత్తర్వులు పొందడం ద్వారా మాతృభాషపై మమకారాన్ని నిలబెట్టుకున్నారు. నిర్బంధ తమిళం నుంచి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకున్న పదో తరగతి విద్యార్థుల మొర మద్రాసు హైకోర్టు ఆలకించింది. రానున్న పదోతరగతి పరీక్షల్లో మినహాయింపు కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్న సుమారు 13 వేల మంది విద్యార్థులకు హైకోర్టు తీర్పుతో ఊరట లభించింది.


తమిళనాడులోని తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ తదితర 13 లింగ్విస్టిక్ మైనార్టీ భాషలకు చెందిన 40 శాతం మంది విద్యార్థులపై తమిళభాషను బలవంతంగా రుద్దేందుకు 2006 డీఎంకే ప్రభుత్వం నిర్బంధ తమిళం చట్టం తెచ్చింది. ఈ చట్టం కారణంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో చదువుకునే లింగ్విస్టిక్ మైనార్టీ విద్యార్థులు బాధితులుగా మారిపోయారు.
 
మా మాతృభాష మాటేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారికి ‘ఔట్ ఆఫ్ సిలబస్’గా చదువుకోండి అంటూ ప్రభుత్వం తేలిగ్గా తీసిపారేసింది.  2006 నాటి నిర్బంధ తమిళ చట్టం ప్రకారం 2015-16 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసేవారు ఇతర పరీక్షలను తెలుగులో రాసినా తమిళం సబ్జెక్టు పరీక్షను విధిగా రాయాల్సి ఉంటుంది. తమిళ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం రాబోయే పదో తరగతి పరీక్షల్లో తమిళం సబ్జెక్టును విధిగా రాయాలనే నిబంధనను మాత్రం అమలు చేసేందుకు సిద్ధమైంది.
 
ఈ రకంగా రాష్ట్రం మొత్తం మీద సుమారు 30 వేల మంది లింగ్విస్టిక్ మైనార్టీ విద్యార్థులు తెలుగా, తమిళమా అనే మీమాంసలో పడిపోయారు. మైనార్టీ ప్రజలను, వారి మాతృభాషను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన నిర్బంధ తమిళం చట్టాన్ని అమలు చేయడంలో సాగిన నిర్లక్ష్యాన్ని లింగ్విస్టిక్ మైనార్టీల వారు కోర్టు దృష్టికి తెచ్చి పిటిషన్లపై ఏఐటీఎఫ్ తదితర తెలుగు సంఘాల నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్ తెలుగువారికి అండగా నిలవడంతోపాటూ ఇద్దరు పదోతరగతి విద్యార్థినులతో హైకోర్టులో ఇటీవలే మరో పిటిషన్ దాఖలు చేయించారు.
 
 తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమించారు. కోర్టుకు హాజరైన ప్రభుత్వ అధికారులు చట్టం అమలులో లోపాలు లేవని, తమిళ ఉపాధ్యాయుల నియామకం సక్రమంగా సాగిందని కోర్టును నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ వాదన నమ్మశక్యంగా లేదని భావించిన హైకోర్టు తెలుగువారి విన్నపాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా గత ఏడాది నవంబరు 24 సూచనగా చెప్పింది. అయితే హైకోర్టు  సూచనలను ధిక్కరించిన ప్రభుత్వం తన పని తాను చేసుకుపోయింది.
 
మినహాయించాల్సిందే: హైకోర్టు : ప్రభుత్వ ధిక్కార ధోరణితో విస్తుపోయిన లింగ్విస్టిక్ మైనార్టీలు మరోసారి కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ సోమవారం స్పష్టమైన తీర్పునిచ్చారు. నిర్బంధ తమిళం నుంచి మినహాయించాలని కోరుతూ పాఠశాలలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల విజ్ఞప్తులను మన్నించాలని ఆదేశించింది. పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంలో ఇచ్చిన మినహాయింపును ఎంతకాలం పాటూ ఉంచాలో జ్యుడిషియల్ కమిషన్ నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు.
 
మాతృభాషల రక్షణ ప్రభుత్వ బాధ్యత  : నిర్బంధ తమిళం చట్టం అమలుపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం మన్నిం చడంతోపాటూ లింగ్విస్టిక్ మైనార్టీల అందరికీ వర్తింపజేయాలని హోసూరు ఎమ్మెల్యే గోపీనాధ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్ర భుత్వం పెద్ద మనసుతో వ్యవహరించాలని అన్నారు. లింగ్విస్టిక్ మైనార్టీల మాతృభాష పరిరక్షించడంలో ప్రత్యేకశ్రద్ధ చూపాలని కోరారు.
 
లింగ్విస్టిక్ మైనార్టీల గెలుపు : మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు లింగ్విస్టిక్ మైనార్టీల గెలుపని ఏఐటీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి పేర్కొన్నారు. నిర్బంధ తమిళం చట్టంపై తాము సాగించిన పోరు వృథా పోలేదని అన్నారు. హైకోర్టు తీర్పుతో సుమారు 13 వేల మంది విద్యార్థులకు ఊరట లభించినట్లయిందని తెలిపారు.
 
 న్యాయమే గెలిచింది  : మాతృభాషను కాపాడుకునేందుకు తెలుగువారు సాగించిన అలుపెరుగని పోరులో న్యాయమే గెలిచిందని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ పేర్కొన్నా రు. ప్రతి ఒక్కరి మాతృభాషను గౌరవించడం ప్రభుత్వాధినేతల కనీస కర్తవ్యమని ఆయన వ్యాఖ్యానించారు. నిర్బంధ తమిళంపై హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పు అందరికీ కనువిప్పు కాగలదని అన్నారు.
 
 హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం :నిర్బంధ తమిళం చట్టంపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని చాటుకునే ముఖ్యమంత్రి జయలలిత కోర్టు తీర్పును, తెలుగువారి ఆశలు, ఆశయాలను సైతం మన్నించాలని కోరారు. లింగ్విస్టిక్ మైనార్టీ ప్రజలకు జయ అండగా ఉంటే, రాబోయే ఎన్నికల్లో అదే ప్రజలు జయకు అండగా నిలిచి అఖండ మెజార్టీని కట్టబెడుతారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement