తెలుగు భాష పరిరక్షణకు కృషి
► సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు
విశాఖ–కల్చరల్ : తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు పిలుపునిచ్చారు. గురుద్వార్ జంక్షన్ సమీప శాంతినగర్‌లోని పరవస్తు పద్య పీఠం కార్యాలయంలో ఆదివారం ‘తెలుగు భాష–రక్షణ’ అనే అంశంపై ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. చాలా మందికి తెలుగు మాధ్యమాల్లో చదివితే మంచి ఉద్యోగాలు రావన్న అపోహ ఉందన్నారు. మాతృభాషలో పట్టు సాధిస్తే ఎన్ని భాషలైనా సులువుగా నేర్చుకోవచ్చని చెప్పారు. కమ్మనైన అమ్మభాషను మనమే చులకన చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాచీన హోదా కోసం పట్టుబట్టిన మనమే.. అది దక్కాక బోధన భాషగా కూడా పనికి రాదనడంలో అర్ధముందా? అని ప్రశ్నించారు. తెలుగు వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు భాగస్వామ్యులై ఉద్యమించాలన్నారు. విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేతి డాక్టర్ సూరపనేని విజయకుమార్ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, కళల పరిరక్షణ, అధ్యయనమే ధ్యేయంగా తెలుగు భాష ఖ్యాతిని ఇనుముడింపజేయాలన్న లక్ష్యంతో నిఘంటువును రూపొందిస్తున్నామన్నారు. ముందుగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీఠం అధ్యక్షుడు సూరి, తదితరులు పాల్గొన్నారు.