తెలుగుకు అన్యాయంపై ‘ఆవేదన దీక్ష’
తెలుగుకు అన్యాయంపై ‘ఆవేదన దీక్ష’
Published Fri, Apr 8 2016 8:08 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM
రాజమహేంద్రవరం : ‘తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవలసిన ఉగాది కాదు. ఇది తెలుగు భాషా సంస్కృతులకు జరుగుతున్న దగాది’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన శుక్రవారం మండుటెండలో ‘ఆవేదన దీక్ష’ చేశారు. తాము కొత్తగా ఏదీ కోరడం లేదని, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు భాష విషయంలో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు, గద్దెనెక్కాక చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని కోరుతున్నామన్నారు.
'తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా చెబుతున్న అమరావతి నిర్మాణ శిలాఫలకం, తాత్కాలిక రాజధాని శిలాఫలకాలు ఇంగ్లిషులోనే ఉన్నాయి. ఆంగ్ల శిలాఫలకాలకు నేను వ్యతిరేకం కాదు. అధికార భాషా చట్టం ప్రకారం ప్రభుత్వ శిలాఫలకాలు, రాతకోతలలో తెలుగు తప్పనిసరి. నేను తెలుగులో శిలాఫలకం తయారు చేయించి, గత నెల 26న విజయవాడలో ఆ శిలాఫలకాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి సీఆర్‌డీఏ కార్యాలయంలో అందజేశాను. గత నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలుసుకుని ఉగాదిలోగా తెలుగు భాషలో శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని కోరాను. తప్పక చేస్తానని ఆయన ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది.
పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం తెలుగులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మన అసెంబ్లీలో బడ్జెట్‌ను ఇంగ్లిషులో ప్రవేశపెట్టారు. ఇది సిగ్గుచేటు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరాన్ని ప్రధాన కేంద్రంగా చేస్తామని గోదావరి పుష్కరాల సమాపనోత్సవంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ దిశగా అడుగు పడలేదు. ప్రభుత్వం తనకు తానే తెలుగు భాషకు వ్యతిరేకమని నిరూపించుకుంటోంది. ఇది ఎవరికీ వ్యతిరేక దీక్ష కాదు. నిరసన దీక్ష కాదు. మా ఆవేదనను వ్యక్తం చేయడానికి చేస్తున్న దీక్ష మాత్రమే. తెలుగు భాషా సాంసృ్కతిక రంగాలకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి’ అని యార్లగడ్డ డిమాండ్ చేశారు. దీక్షలో రొటేరియన్ పట్టపగలు వెంకటరావు, బ్రౌను మందిర నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి పాల్గొన్నారు.
Advertisement