Rajahmahendravaram
-
ఆర్థిక నేరగాళ్లకు ‘స్నేహ’హస్తం!
సాక్షి, రాజమహేంద్రవరం: ‘స్నేహ బ్యారక్’.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఈ బ్యారక్‌కు అంత క్రేజ్ ఎందుకంటే.. ఆర్థిక నేరాల్లో రిమాండ్‌కు వచ్చే ఖైదీలకు ఆ బ్యారక్‌ను కేటాయిస్తుంటారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో జ్యుడీషియల్ రిమాండ్ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం అదే బ్యారక్ కేటాయించడంతో ఆ బ్లాక్ పేరు మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జైలుకు 150 ఏళ్ల చరిత్ర రాజమండ్రి సెంట్రల్ జైలుకు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. అత్యంత భద్రతతో కూడిన జైల్‌గా దీనికి పేరు. జైల్లో చిన్నవి, పెద్దవి కలిపి 11 బ్లాక్‌లు ఉన్నాయి. ఒక్కో బ్లాక్‌కు కనిష్టంగా 6 రూములు ఉంటాయి. ఇలా మొత్తం 52 గదులు ఉన్నాయి. 1602లో డచ్ దేశస్థులు కోట నిర్మిస్తే.. దానిని 1864లో బ్రిటిష్ పాలకులు జైలుగా మార్చారు. 1870లో పూర్తి స్థాయి కేంద్ర కారాగారంగా తీర్చిదిద్దారు. 190 ఎకరాల్లో విస్తరించిన జైల్లో సుమారు 152.76 ఎకరాలు ఖాళీ స్థలం కాగా, 37.24 ఎకరాల్లో భవనాలు ఉన్నాయి. అప్పట్లో నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరలేదు. ఇటీవల కొన్నింటిని ఆధునీకరించారు. చంద్రబాబుకు ప్రత్యేక వసతులు అధునాతన వసతులతో నిర్మించిన స్నేహ బ్లాక్‌లో 13 గదులు ఉంటాయి. చంద్రబాబు రిమాండ్‌కు వచ్చిన సందర్భంగా అప్పటికే ఉన్న ఖైదీలను ఖాళీ చేయించి బ్యారక్ మొత్తం ఆయనకే కేటాయించారు. ఇతర బ్యారక్ల నుంచి ఖైదీలు ఎవరూ అటు వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. వీఐపీలకు ఉండే సౌకర్యాలన్నీ కల్పించారు. అందులో ఒక గదిని అత్యంత సౌకర్యవంతంగా తయారు చేసి బాబుకు కేటాయించారు. గదిలో ఫ్యాన్, సేదతీరేందుకు సౌకర్యమైన బెడ్, న్యూస్ పేపర్, ఏసీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే గదిలో ప్రత్యేకంగా టీవీ ఉండదు. కామన్ ఏరియాలో ఉంటుంది. బయటకు వెళ్లి ఇతర ఖైదీలతో కలసి టీవీ చూసే వెసులుబాటు చంద్రబాబుకు లేదు. 24 గంటల పాటు వైద్యులను అందుబాటులో ఉంచారు. ఇక చంద్రబాబుకు మందులు, భోజనం లాంటి సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కేటాయించారు. నలుగురు వ్యక్తిగత భద్రత సిబ్బందిని పహారా పెట్టారు. వీరితో పాటు 24 గంటలూ జైలు సిబ్బంది బ్యారక్ చుట్టూ కాపలా ఉంటారు. చంద్రబాబుకు ముందు ఈ బ్లాక్‌ను ఎర్రచందనం అక్రమ రావాణా కేసులో రిమాండ్‌కు వచ్చిన వారికి కేటాయించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు జైలు భోజనమే పెట్టాలి -
ఆర్టీసీ బస్ రూటు ఎటు?
సాక్షిప్రతినిధి, అమలాపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అతి పెద్ద ఆర్టీసీ రీజియన్ రాజమహేంద్రవరం. జిల్లాల పునర్విభజన తరువాత ఈ జిల్లా మూడు జిల్లాలవ్వడంతో రాజమహేంద్రవరం రీజియన్ విభజనపై ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు రీజియన్ కూడా మూడు రీజియన్లు అవుతుందా ? లేకుంటే డిపోల వారీగా విభజన జరుగుతుందా? అనేది ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఆర్టీసీ రీజియన్ పనిచేస్తోంది. రీజినల్ మేనేజర్ రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. జిల్లాల విభజనకు ముందున్న రీజియన్ పరిధిలో తొమ్మిది డిపోలు ఉన్నాయి. విభజన అనంతరం రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడ్డ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి పశ్చిమగోదావరి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలు చేరాయి. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో కొవ్వూరు, నిడదవోలులో డిపోలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు డిపోలు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోకి రావడంతో డిపోల సంఖ్య 11కు చేరింది. విజయవాడకు నివేదిక రీజియన్ స్థాయిలో 11 డిపోల విభజనపై కసరత్తు మొదలైంది. జిల్లాల పునర్విభజన తరువాత కోనసీమ జిల్లా పరిధిలోకి నాలుగు ఆర్టీసీ డిపోలు (అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రాపురం) వస్తాయంటున్నారు. కాకినాడ జిల్లా పరిధిలోకి మూడు డిపోలు (కాకినాడ, తుని, ఏలేశ్వరం)తీసుకురానున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడ్డ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి (రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు) డిపోలు రానున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో ప్రాథమికంగా జరిపిన విభజనలో తూర్పుగోదావరి జిల్లాలో మిగిలిన జిల్లాల్లో కంటే ఒక డిపో అదనంగా వచ్చేలా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం రీజియన్‌కు రోజూ కోటి రూపాయల పైనే ఆదాయం వస్తోంది. ఇందులో అత్యధికంగా కాకినాడ డిపో పరిధిలో తిరిగే 171 బస్సుల ద్వారా వస్తోంది. ఈ బస్సులు 75,722 కిలోమీటర్లు తిరిగి రూ.26 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఉద్యోగుల ఎదురుచూపులు ఆదాయంలో మూడో స్థానం రాజమహేంద్రవరం డిపోలో కనిపిస్తోంది. ఈ డిపో పరిధిలో 141 బస్సులు 54,828 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఫలితంగా రూ.17 లక్షల ఆదాయం వస్తోంది. ఆదాయం, బస్సులు, ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఆర్టీసీలో విభజన జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. జిల్లాల వారీగా విభజించి ఈ మేరకు వివరాలను విజయవాడ బస్సు భవన్‌కు ఇప్పటికే పంపారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అధికారికంగా విభజన ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా? అని 3501 మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సహజంగా ఆర్టీసీలో ఏళ్ల తరబడి ఒకే డిపో పరిధిలో పనిచేస్తున్న వారే అధికం. అదీ కూడా తమ సొంత ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో జిల్లాల పునర్విభజన తరువాత ఏ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులను అక్కడే కొనసాగిస్తారా?, లేక అటూ, ఇటూ మార్చుతారా? అనేది ఎప్పటికి తేలుస్తారోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. డిపో మేనేజర్లను ఎప్పటి మాదిరిగానే కొనసాగే అవకాశ ముంది. రీజియన్ వ్యవస్థ కాకుండా మూడు జిల్లాలకు ముగ్గురు జిల్లా మేనేజర్లను నియమిస్తారని భావిస్తున్నారు. డిపోల విభజన సహా అన్ని అంశాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాలు రావాల్సి ఉంది డిపోల విభజన, ఉద్యోగుల సర్దుబాటు వంటి అంశాలపై ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. డిపోల స్థాయిలో కసరత్తు పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. ఉద్యోగుల విభజన పెద్దగా ఉండదనే అంటున్నారు. ఏ డిపో పరిధిలో వారు ఆ డిపోలోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. – నాగేశ్వరరావు, ఆర్ఎం, రాజమహేంద్రవరం -
గౌతమీ తీరాన మహాత్ముని అడుగుజాడలు
రాజమహేంద్రవరం కల్చరల్: స్వాతంత్య్ర ఉద్యమకాలంలో జాతిపిత, మహాత్మా గాంధీ పాదస్పర్శతో అఖండ గౌతమీ తీరం పునీతమైంది. 1921–46 మధ్య కాలంలో మహాత్ముడు రాజమహేంద్రవరానికి ఐదు సార్లు వచ్చారు. 1921 మార్చి 30న, అదే సంవత్సరం ఏప్రిల్ 4న, 1929 మే 6న, 1933 డిసెంబర్ 25న, 1946 జనవరి 20వ తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగిన పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు. 1929, 1933 పర్యటనల్లో సీతానగరంలోని గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమంలో బస చేశారు. నేటికీ బా–బాపు కుటీరం పేరున ఉన్న కుటీరంలో గాం«దీజీ ఉపయోగించిన రాటా్నన్ని పదిలపరిచారు. 1929 మే 6వ తేదీ కందుకూరి వీరేశలింగ పురమందిరంలో స్త్రీ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 1929 పర్యటనల్లో పాల్ చౌక్ వద్ద జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. (నేటి కోటిపల్లి బస్టాండు సమీపంలో). నాటి జ్ఞాపకాలు మహాత్ముని వంటి ఒక వ్యక్తి ఈ భూమిపై సంచరించారంటే, ముందు తరాలవారు నమ్మకపోవచ్చని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్నారు. మహాత్ముని చూసిన ఒకరిద్దరు వ్యక్తులు ఇంకా మన నడుమ ఉండటం మన అదృష్టం.. నాటి జ్ఞాపకాలను, వారి మాటల్లోనే తలుచుకుందాం.. ఆ ముఖ వర్చస్సు ఆ తరువాత చూడలేదు: వైఎస్ నరసింహారావు ‘అది 1946వ సంవత్సరం. జనవరి 20వ తేదీ సాయంత్రం 4 గంటల సమయం. రాజమహేంద్రవరం రైల్వేస్టేషను గూడ్సుయార్డ్ ప్రాంతం. అక్కడ మహాత్మాగాంధీ దర్శనం పొందాను. అప్పుడు నా వయసు పది సంవత్సరాలు. గాంధీజీ కలకత్తా నుంచి మద్రాసు వెళుతూ, సుమారు 40 నిమిషాలు స్టేషను గూడ్సు యార్డు వద్ద ఉన్న మైదానంలో ప్రసంగించారు. నాకు సరిగా కనపడటం లేదంటే, బలిష్ఠుడైన మా తాతగారు నన్ను ఎత్తుకున్నారు. మహాత్ముని వంటి ముఖ వర్చస్సుతో ఉన్న వ్యక్తిని ఆ తరువాత నేను ఎప్పుడూ చూడలేదు. మహాత్ముని హిందీ ప్రసంగాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు కళా వెంకట్రావు తెలుగులోకి అనువదించారు. అదే ఈ ప్రాంతంలో మహాత్ముని చివరి పర్యటన.. మరో విషాదకర సంఘటన.. అది 1948 ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం. మెయిన్ రోడ్డుమీద పెద్ద కోలాహలం.. కంభంవారి సత్రం చివరన ఉన్న మెయిన్ రోడ్డు మీదకు నేను పరిగెత్తాను. పూలరథంపైన వృద్ధుడైన ఒక గాంధేయవాది నిలబడి ఉన్నారు. తలపై అస్థికల పేటిని పెట్టుకున్నారు. రాజమహేంద్రవరం రైలు స్టేషను నుంచి కోటిలింగాల ఘాట్ వరకు ఊరేగింపు సాగింది. ఊరేగింపు అగ్రభాగాన బ్యాండు, సన్నా యి మేళాలు, తరువాత గాం«దీజీకి ఇష్టమైన భజనగీతాలను ఆలపిస్తూ కొన్ని వందల మందితో ఊరేగింపు సాగింది. ఆ క్షణాన నాలో తెలియని ఆవేశం వచ్చింది. ఆ మహనీయుని పట్ల భక్త్యావేశంలో మునిగాను. అప్రయత్నంగా ఆ ఊరేగింపులోకి చొరబడ్డాను. గాంధీటోపీలు ధరించినవారెందరో ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. కోటిలింగాల ఘాట్‌లో అస్థికలు కలిపారు. అందరూ స్నానాలు చేశారు. నేను అప్రయత్నంగా స్నానం చేసి, తడిబట్టలతో ఇంటికి తిరిగి వచ్చాను. మన పవిత్ర కర్తవ్యం మహాత్ముడు రాజమండ్రి వచ్చిన తేదీలతో ఒక శిలాఫలకాన్ని రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషను ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. విజయవాడ రైల్వేస్టేషను ప్రవేశ హాలు వద్ద మహాత్ముడు విజయవాడకు వచ్చిన తేదీలను వివరిస్తూ, ఒక బోర్డును ఏర్పాటు చేశారు. ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు. మనకు కావలసింది కాసింత శ్రద్ధ. ముందు తరాలవారికి చరిత్ర తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది. -
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు
సాక్షి, రాజమండ్రి: రాయల్ వశిష్ట బోటు ప్రమాద బాధితుల కోసం హెల్ప్ డెస్క్‌ఏర్పాటు చేశారు. పోలీసులు...బాధిత కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో బంధువులకు సమాచారం ఇచ్చారు. బాధితులకు సమాచారం అందించడంతో వారంతా తమవారిని గుర్తించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ తల్లిదండ్రుల ఆవేదన నిలువరించడం ఎవరి తరం కావడం లేదు. అలాగే నల్గొండకు చెందిన రవీందర్‌రెడ్డి తల్లిదండ్రులు కూడా మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆరు మృతదేహాలను వారి బంధువులు గుర్తించారు. కాగా 41వ రోజుల అనంతరం మునిగిపోయిన బోటును ఎట్టకేలకు గోదావరి నుంచి బయటకు తీశారు. బోటు వెలికితీసిన అనంతరం అందులో 8 మృతదేహాలు దొరికాయి. ఆ మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మార్చరీలో భద్రపరిచారు. మృతేహాలు బోటులోని ఓ గదిలో ఉండిపోవడంతో గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయాయి. అయితే వరంగల్‌కు చెందిన కొమ్ముల రవి ఆధార్ కార్డు లభించడంతో మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. వరంగల్ కు చెందిన బస్కే ధర్మరాజును గుర్తించారు. అలాగే రాయలు వశిష్ట బోటు డ్రైవర్లు పోతా బత్తుల సత్యనారాయణ, సంగాడి నూకరాజు, నల్గొండకు చెందిన సురభి రవీందర్, బోట్ హెల్పర్ పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ మృతదేహాలను కూడా కుటుంబీకులు గుర్తుపట్టారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులు మృతదేహాలను అప్పగిస్తారు. సెప్టెంబర్ 15న కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బోటులో 77మంది ఉన్నారు. వారిలో 26మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడగా, 46మంది మృతి చెందారు. మరో అయిదుగురు గల్లంతు అయ్యారు. మరోవైపు ఇంకా లభించాల్సిన అయిదు మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారు. ధర్మాడి సత్యం బృందం తిరుగు పయనం ఆపరేషన్ రాయల్ వశిష్టను పూర్తి చేసుకుని ధర్మాడి సత్యం బృందం తిరుగుపయనం అయింది. ఈ సందర్భంగా ధర్మాడి సత్యం మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితులు ఉన్నా...తీవ్రంగా శ్రమించి బోటును ఒడ్డుకు చేర్చామన్నారు. గతంలో చాలా బోట్లు వెలికి తీశామని, అయితే రాయల్ వశిష్ట బోటు వెలికితీయడం చాలా కష్టంతో కూడుకుందని అన్నారు. ప్రవాహంతో ఉన్న నదిలో నుండి బోటును ఒడ్డుకు తీయడం మాటలు కాదని, రెండు గంటల్లో మునిగిపోయిన బోటునుఒడ్డుకు తీసేస్తానని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివ చెప్పిన మాటలకు మీడియా విస్తృత ప్రచారం కల్పించడం విచారకరమన్నారు. అతని వద్ద ఓ తాడు లేదు... సిబ్బంది లేరని ధర్మాడి సత్యం పేర్కొన్నారు. లాంచీలోనే పడుకుని ఉదయం ఆరు గంటలకు లేచి, సాయంత్రం వరకూ బోటు వెలికితీతకు శ్రమించినట్లు చెప్పారు. -
జైల్లో ఎయిడ్స్ ఖైదీల కేసుపై హైకోర్టులో విచారణ
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎయిడ్స్ ఖైదీలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు శుక్రవారం అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 27మందికి ఎయిడ్స్ ఉందో, లేదో అధికారులు నిర్థారించాలని హైకోర్టు ఆదేశాలతో జైలు అధికారులలో హైరానా మొదలైంది. హెచ్ఐవీ రోగుల పరిస్థితిపై సీరియస్ అయిన హైకోర్టు 27మందికి రోగ నిర్థారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. ఏడు కొండలు అనే ఖైదీ తాను హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడనని, తనకు బెయిల్ ఇస్తే ఇంటి వద్ద కొన్ని రోజులు వైద్యం చేయించుకుంటానని హైకోర్టుకు విన్నవించుకోవడంతో న్యాయస్థానం ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీలు, రిమాండ్ ఖైదీలు కలిపి మొత్తం 1400మంది ఉన్నారు. 1200మందికి పరిమితి ఉన్న జైలులో అదనంగా 200 మంది ఖైదీలు ఉన్నారు. దీంతో జైలులో ఆస్పత్రి సౌకర్యాలు అంతంత మాత్రమే. జైలులో ముగ్గురు డాక్టర్లు ఉన్నా రాత్రి వేళల్లో ఏ ఒక్క డాక్టరూ అందుబాటులో ఉండటం లేదని ఖైదీలు పేర్కొంటున్నారు. -
భాస్కరభట్లకు మాతృవియోగం
రాజమహేంద్రవరం : ప్రముఖ సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్ తల్లి విజయలక్ష్మి (67) తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్ను మూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భాస్కరభట్ల పెద్ద కుమారుడు. విజయలక్ష్మి అంత్యక్రియలు స్థానిక ఇన్నీసుపేట కైలాసభూమిలో మంగళవారం జరిగాయి. ఆమె చితికి భాస్కరభట్ల నిప్పంటించారు. పలువురు సినీ ప్రముఖులు, సాహితీకారులు భాస్కరభట్లకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
‘దేశం’ కోటలకు బీటలు.. పశ్చిమగోదావరిలో అవినీతి రాజ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రశాంతతకు రాజకీయ చైతన్యానికి ప్రతీక.. పల్లెసీమలకు నిలయం.. అదే పశ్చిమగోదావరి జిల్లా.. అయితే జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు సాధించే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నానుడి ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం సీట్లన్నీ గెలిచినా టీడీపీకి ఈసారి ఎదురుగాలి వీస్తోంది. అన్ని స్థానాలలో విజయం సాధించి ఎన్నికల ఫలితాలను రివర్స్ చేసేలావైఎస్సార్ సీపీ దూసుకుపోతోంది. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత జిల్లాలో ఇసుక దోపిడీతో మొదలైన పాలన ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరించింది. ప్రతి పనీ తమ వాళ్లకు అప్పగించి కమీషన్లు తీసుకోవడంపైనే అధికార పక్ష ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టారు. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాను ఒక రౌడీ రాజ్యంగా మార్చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో జిల్లాకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా సాగలేదు. పోలవరం అయినా పూర్తి చేసిందా అంటే అదీ లేదు. జిల్లాకు కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పట్టిసీమ పేరుతో నీరు ఇష్టారాజ్యంగా తరలించి డెల్టాను ప్రమాదంలో పడేసింది. వ్యవసాయంగిట్టుబాటవ్వక రైతాంగం ఆక్వావైపు చూస్తోంది. ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పటికే మూడు లక్షల ఎకరాల ఆయకట్టు చెరువులుగా మారిపోయింది. కాలువలు, వాగులనూ, ఆఖరికి పోలవరం కుడికాల్వ గట్టుని కూడా వదలకుండా తవ్వేసి గోదావరికి గుండెకోత మిగిల్చారు. గోదావరి కాకుండా తమ్మిలేరు, జల్లేరు వాగులతోపాటు ఎర్రకాలువ, బైనేరు, తూర్పు, పడమర కాలువలను సైతం విడిచిపెట్టకుండా కోట్లు కూడబెట్టుకున్నారు. జిల్లాలో ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి పార్లమెంట్ స్థానాల పరిధిలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు, దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాలు వస్తాయి. నర్సాపురం నియోజకవర్గం పరిధిలోకి నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం,పాలకొల్లు, ఆచంట వస్తాయి . రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోకి నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలు వస్తాయి. గత ఎన్నికల్లో ఏలూరు, రాజమండ్రి నుంచి తెలుగుదేశం అభ్యర్ధులు గెలవగా, నర్సాపురం మిత్రపక్షాల పొత్తులో భాగంగా బీజేపీ గెలుచుకుంది. ... ఆచంట మాజీ ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు ఆచంట వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా ఉన్నారు. ఏడాదికాలంగా ప్రజల మద్య ఉంటూ వారి అవసరాలను సొంత డబ్బు తో నెరవేరుస్తున్నారు. తెలుగుదేశం తరపున పితాని సత్యనారాయణ రెండుసార్లు గెలిచి మంత్రిగా పనిచేస్తున్నారు. రెండుసార్లు గెలిచినా ప్రజలకు ఏం చేయలేకపోవడంతో ఆయనపై వ్యతిరేకత ఉంది. ... నర్సాపురం కాపుల ఆధిపత్యం ఉన్న నియోజకవర్గం అయిన నర్సాపురంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మరోసారి సీటు తనదే అని చెబుతుండగా, కాపు కార్పొరేషన్ ఛైర్మన్, కొత్తపల్లి సుబ్బారాయుడు తాను కూడా లైన్లోనే ఉన్నానంటున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. చిరంజీవి స్వగ్రామం మొగల్తూరు ఈ నియోజకవర్గంలోనే ఉండటంతో జనసేన కూడా ఆశలు పెట్టుకుంది. ... చింతలపూడి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి స్వచ్ఛంద విరమణ చేసిన వీఆర్ ఎలీజా ఉన్నారు. ప్రతి నిత్యం ప్రజలకు అండగా ఉంటున్నారు. టీడీపీ మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా చీలిపోయి ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే పీతల సుజాతను తప్పించి కర్రా రాజారావుకు టీడీపీ టికెట్ ఇచ్చారు. ... దెందులూరు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చిన దగ్గర నుంచి దళితులను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేయడం వరకూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతినిత్యం వార్తల్లో నిలిచారు. చింతమనేనిని ఢీకొట్టడానికి ఎన్ఆర్ఐ, యువకుడు అయిన కొఠారు అబ్బయ్య చౌదరిని వైఎస్సార్ సీపీ రంగంలోకి దింపింది. ఈసారి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా చింతమనేని ఓటమి ఖాయమే అవుతుంది. ... భీమవరం రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి ఆంజనేయులు పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ సీటు తన కుమారుడికి ఇప్పించుకోవడానికి టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ప్రయత్నించినా చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో ఆ వర్గం అసంతృప్తిగా ఉంది. వైఎస్సార్ సీపీ తరపున మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఈసారి ఎలాగైనా భీమవరం సీటు దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ... ఏలూరు ప్రశాంతంగా ఉండే ఏలూరు గత ఐదేళ్లలో రౌడీరాజ్యంగా మారిపోయింది. ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి బుజ్జి అరాచక శక్తులను పెంచిపోషిస్తుండటంతో ప్రజలు ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ ఆళ్ల నానిని వైఎస్సార్సీపీ రంగంలోకి దింపింది. ఏలూరు మేయర్ నూర్జహాన్, అమె భర్త కో–ఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడం బలంగా మారింది. ... గోపాలపురం టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ రిజర్వ్డ్ నియోజకవర్గం ఈసారి మార్పునకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన ముప్పిడి వెంకటేశ్వరరావుపై ఉన్న వ్యతిరేకత.. ఆయనకు సీటు ఇవ్వద్దంటూ ప్రత్యర్ధి వర్గం గొడవలతో ఈసారి ఇక్కడ వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయంగా కనపడుతోంది. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న తలారి వెంకట్రావు ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థ్ధిగా ఉన్నారు. ... తాడేపల్లిగూడెం 2014లో ఎన్నికల్లో బీజెపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు గెలిచారు. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న ముళ్లపూడి బాపిరాజు మాణిక్యాలరావుకు ప్రతి నిమిషం అడ్డుపడుతూనే వచ్చారు. సీఎం చంద్రబాబు బాపిరాజుకు చెయ్యిచ్చి ఈలి నానిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన తిరుగుబావుటా ఎగరవేయగా, మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన తీర్ధం పుచ్చుకుని పోటీకి సిద్ధమయ్యారు.ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ... కొవ్వూరు ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించి కోట్లకు పడగలెత్తిన మంత్రి జవహర్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. అతనిని మార్చాల్సిందేనని పార్టీలోని మెజారిటీ నాయకులు పట్టుబట్టారు. దాంతో పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు టికెట్ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలపై ఉద్యమిస్తూ ఈసారి టీడీపీ కోటను బద్దలుకొట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. ... ఉండి టీడీపీ ఎమ్మెల్యే శివరామరాజు తీరు పట్ల సొంత పార్టీలో వ్యతిరేకత ఉంది. తనకు ఎదురుతిరిగిన వారిపై పోలీసులను ఉసిగొల్పి వేధిస్తారన్న పేరుంది. ౖవైఎస్సార్‌సీపీ నుంచి పీవీఎల్ నరసింహరాజు రంగంలో ఉన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రఘురామకృష్ణంరాజుది కూడా ఈ నియోజకవర్గమే. ... నిడదవోలు ఇసుకను అడ్డం పెట్టుకుని వందల కోట్లు దోచేసిన ఘనత ఇక్కడ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకే దక్కుతుంది. ఇక్కడ ఎవరిని బరిలోకి దింపేది చంద్రబాబునాయుడు ఇంకా నిర్ణయించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ పీసీసీ అధ్యక్షుడు జీఎస్ రావు కుమారుడు శ్రీనివాసనాయుడు రంగంలో ఉన్నారు. ... పాలకొల్లు పాలకొల్లులో రెండురోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవడంతో ఇక్కడ వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమైంది. ఇక్కడ ప్రతి పనికి కమీషన్లు వసూలు చేస్తారని పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి చంద్రబాబు సీటు ఖరారు చేశారు. ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న అంగర రామమోహనరావుకు నిమ్మలకు విబేధాలు పార్టీ విజయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ... పోలవరం పోలవరం భూసేకరణ పేరుతో జరిగిన అవినీతి, గిరిజనులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నేతలు సాగించిన అకృత్యాలతో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీలోని వారే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తెల్లం బాలరాజు రంగంలో ఉన్నారు. ... తణుకు తన మాట వినలేదని సాక్షాత్తు సబ్ ఇన్‌స్పెక్టర్‌నే కింద కూర్చొపెట్టిన ఘనత ఉన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ మాజీ జెడ్పీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ... ఉంగుటూరు ఇక్కడ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా ఉన్న పుప్పాల వాసుబాబు గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన గన్ని వీరాంజనేయులు పేకాట క్లబ్లుల నిర్వహణ, అక్రమ ఆక్వా చెరువులు, కొల్లేరు ఆక్రమణలతో ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారు. -
దివాకర్ల, విశ్వనాథల సమ్మేళనమే ‘శలాక’
పంచ సప్తతి గోష్ఠిలో మహా మహోపాధ్యాయ గోపాలకృష్ణ జటావల్లభులకు ‘శలాక విద్వత్’ పురస్కార ప్రదానం రాజమహేంద్రవరం కల్చరల్ : విఖ్యాత పండితుడు దివాకర్ల వేంకటావధాని వినయసౌజన్యాలను, సుప్రసిద్ధ రచయిత విశ్వనాథ సత్యనారాయణ పాండితీగరిమను ప్రాచార్య శలాక రఘునాథశర్మలో చూడవచ్చని మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. వ్యాస, శంకరుల ఆర ్షవాజ్ఞ్మయ ప్రచారమే రఘునాథశర్మ జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. ఆదివారం ధర్మంచర కమ్యూనిటీహాల్లో జరిగిన రఘునాథ శర్మ పంచసప్తతి పూర్తి అభినందన గోష్ఠిలో విశ్వనాథ మాట్లాడుతూ శలాక శతమానోత్సవం కూడా నగరంలో జరగాలని ఆకాంక్షించారు. నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు శలాక రచించిన సప్త గ్రంథాలను ఆవిష్కరించారు. శలాక విశ్వగురువు అని కొనియాడారు. శలాక ఇటీవల రచించిన రచించిన ‘ఆదిత్య హృదయ హృదయము, మహాత్ములు– మణిదీపాలు, కల్పవృక్ష వాగ్వైభవము, ఉత్తర గీతాసౌరభము, స్ఫురణాదీపకలికలు, పంచామృతరసవాహిని, భాగవత నవనీతము’ గ్రంథాలను భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు సభకు పరిచయం చేశారు. ఆదిత్య హృదయాన్ని గీతతో సమన్వయం చేస్తూ శలాక రచించిన ‘ఆదిత్య హృదయ హృదయము’ గ్రంథాన్ని పరిచయం చేస్తూ.. భారతంలో గీత, రామాయణంలో ఆదిత్య హృదయము– రెండూ యుద్దభూమిలోనే చెప్పబడ్డాయని, రెండింటిలో శ్రోతలు(అర్జునుడు, శ్రీరాముడు) దైన్యస్థితిలో వాటిని విని, ఉత్తేజితులయ్యారని తెలిపారు. అనంతరం రఘునాథశర్మ ‘మహాభారత ధర్మజ్ఞ’ జటావల్లభుల జగన్నాథాన్ని ‘శలాక విద్వత్సమర్చన పురస్కారం’ పేరిట రూ.30,000 నగదుతో సత్కరించారు. అన్నజ్ఞాన సమారాధన యజ్ఞాన్ని ప్రారంభించినట్టు ప్రకటించారు. సాహితీవేత్తలు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి, అరిపిరాల నారాయణరావు, గురజాల హనుమంతరావు శలాకకు అభినందనలు తెలిపారు. హాజరైన సాహితీవేత్తలు శలాకను ఘనంగా సత్కరించారు. వెదురుపాక విజయదుర్గా పీఠం తరఫున అడ్మినిస్ట్రేటర్ వి.బాపిరాజు శలాకకు ఆశీస్సులందజేశారు. నగరంలోని సాహితీకారులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
'నాన్నను ఉగ్రవాదిలా చూస్తున్నారు'
- అమ్మకు వెన్నెముక సమస్య ఉంది.. ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో పడేశారు - తమ్ముడి బట్టలు చించేసి ఈడ్చుకుపోయారు - అన్ని చానళ్లలో వచ్చినా హోంమంత్రి బుకాయింపు - ముద్రగడ పద్మనాభం పెద్ద కుమారుడు బాలు ఆవేదన రాజమహేంద్రవరం : 'ప్రభుత్వం నాన్నను ఉగ్రవాదిగా చూస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని దీక్ష చేస్తున్నప్పుడు వందలాది మంది పోలీసులు ఇంట్లోకి చొరబడి బలవంతంగా ఎత్తుకెళ్లారు. అమ్మ వెన్నెముక సమస్యతో బాధపడుతున్నా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో పడేశారు. తమ్ముడిని దుస్తులు చించివేసి కొట్టారు. అయినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా దీక్ష కొనసాగుతుంది' అని కాపునేత ముద్రగడ పద్మనాభం పెద్దకుమారుడు బాలు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి ఎదుట విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి ప్రాణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను కొట్టడం అన్ని టీవీ చానెళ్లలో ప్రసారమయ్యిందని, అయినా అలా జరగలేదని హోంమంత్రి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులను మోహరించి ఆంక్షల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఆస్పత్రి వద్ద బారికేడ్లు పెట్టి రోగులను ఇక్కట్లకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కాపులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. -
కృష్ణా పుష్కరాలకు 600 ప్రత్యేక రైళ్లు
- దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్ కుమార్ రాజమహేంద్రవరం రూరల్ : ఆగస్టు నెలలో జరుగనున్న కృష్ణా పుష్కరాలకు 600 ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటు, 2000 అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లోని మొదటి ఫ్లాట్‌ఫారమ్‌లో చేపట్టిన ఆధునికీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో అశోక్ కుమార్‌తోపాటు రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్‌లు సోమవారం సాయంత్రం రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ.. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే అన్నిశాఖల అధికారుల సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. నలుమూలలు నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేవిధంగా నాలుగు ప్రధాన హాల్ట్‌ల సౌకర్యం కల్పిస్తామన్నారు. జూలై 31నుంచి గోదావరి అంత్యపుష్కరాలు: ఎంపీ మాగంటి గోదావరి అంత్య పుష్కరాలు జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్ పేర్కొన్నారు. అంత్య పుష్కరాల సమయంలో గోదావరి సంబరాలు కూడా నిర్వహిస్తామన్నారు. అంత్యపుష్కరాల విషయంపై కొంత గందరగోళం ఉంది, అయితే దీనిపై టీటీడీ వేదపండితులు, రాజమహేంద్రవరంలోని వేదపండితులతో మాట్లాడామని, గోదావరి నదికి మాత్రమే అంత్య పుష్కరాలున్నాయని, మిగిలిన నదులుకు లేవని చెప్పారన్నారు. ఆగస్టు 11వ తేదీ రాత్రి అన్ని ఘాట్ల వద్ద హారతి ఇచ్చి గోదావరి అంత్య పుష్కరాలకు ముగింపు పలికి, ఆగస్టు 12న కృష్ణా పుష్కరాలకు స్వాగతం పలుకుతామన్నారు. -
తెలుగుకు అన్యాయంపై ‘ఆవేదన దీక్ష’
రాజమహేంద్రవరం : ‘తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవలసిన ఉగాది కాదు. ఇది తెలుగు భాషా సంస్కృతులకు జరుగుతున్న దగాది’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన శుక్రవారం మండుటెండలో ‘ఆవేదన దీక్ష’ చేశారు. తాము కొత్తగా ఏదీ కోరడం లేదని, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు భాష విషయంలో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు, గద్దెనెక్కాక చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని కోరుతున్నామన్నారు. 'తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా చెబుతున్న అమరావతి నిర్మాణ శిలాఫలకం, తాత్కాలిక రాజధాని శిలాఫలకాలు ఇంగ్లిషులోనే ఉన్నాయి. ఆంగ్ల శిలాఫలకాలకు నేను వ్యతిరేకం కాదు. అధికార భాషా చట్టం ప్రకారం ప్రభుత్వ శిలాఫలకాలు, రాతకోతలలో తెలుగు తప్పనిసరి. నేను తెలుగులో శిలాఫలకం తయారు చేయించి, గత నెల 26న విజయవాడలో ఆ శిలాఫలకాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి సీఆర్డీఏ కార్యాలయంలో అందజేశాను. గత నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలుసుకుని ఉగాదిలోగా తెలుగు భాషలో శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని కోరాను. తప్పక చేస్తానని ఆయన ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం తెలుగులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మన అసెంబ్లీలో బడ్జెట్‌ను ఇంగ్లిషులో ప్రవేశపెట్టారు. ఇది సిగ్గుచేటు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరాన్ని ప్రధాన కేంద్రంగా చేస్తామని గోదావరి పుష్కరాల సమాపనోత్సవంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ దిశగా అడుగు పడలేదు. ప్రభుత్వం తనకు తానే తెలుగు భాషకు వ్యతిరేకమని నిరూపించుకుంటోంది. ఇది ఎవరికీ వ్యతిరేక దీక్ష కాదు. నిరసన దీక్ష కాదు. మా ఆవేదనను వ్యక్తం చేయడానికి చేస్తున్న దీక్ష మాత్రమే. తెలుగు భాషా సాంసృ్కతిక రంగాలకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి’ అని యార్లగడ్డ డిమాండ్ చేశారు. దీక్షలో రొటేరియన్ పట్టపగలు వెంకటరావు, బ్రౌను మందిర నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి పాల్గొన్నారు.