
(ఇన్‌సెట్‌లో) సీతానగరం బా–బాపూ కుటీరంలో గాంధీజీ వినియోగించిన రాట్నం
రాజమహేంద్రవరం కల్చరల్: స్వాతంత్య్ర ఉద్యమకాలంలో జాతిపిత, మహాత్మా గాంధీ పాదస్పర్శతో అఖండ గౌతమీ తీరం పునీతమైంది. 1921–46 మధ్య కాలంలో మహాత్ముడు రాజమహేంద్రవరానికి ఐదు సార్లు వచ్చారు. 1921 మార్చి 30న, అదే సంవత్సరం ఏప్రిల్ 4న, 1929 మే 6న, 1933 డిసెంబర్ 25న, 1946 జనవరి 20వ తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగిన పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు. 1929, 1933 పర్యటనల్లో సీతానగరంలోని గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమంలో బస చేశారు. నేటికీ బా–బాపు కుటీరం పేరున ఉన్న కుటీరంలో గాం«దీజీ ఉపయోగించిన రాటా్నన్ని పదిలపరిచారు. 1929 మే 6వ తేదీ కందుకూరి వీరేశలింగ పురమందిరంలో స్త్రీ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 1929 పర్యటనల్లో పాల్ చౌక్ వద్ద జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. (నేటి కోటిపల్లి బస్టాండు సమీపంలో).
నాటి జ్ఞాపకాలు
మహాత్ముని వంటి ఒక వ్యక్తి ఈ భూమిపై సంచరించారంటే, ముందు తరాలవారు నమ్మకపోవచ్చని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్నారు. మహాత్ముని చూసిన ఒకరిద్దరు వ్యక్తులు ఇంకా మన నడుమ ఉండటం మన అదృష్టం.. నాటి జ్ఞాపకాలను, వారి మాటల్లోనే తలుచుకుందాం..
ఆ ముఖ వర్చస్సు ఆ తరువాత చూడలేదు: వైఎస్ నరసింహారావు
‘అది 1946వ సంవత్సరం. జనవరి 20వ తేదీ సాయంత్రం 4 గంటల సమయం. రాజమహేంద్రవరం రైల్వేస్టేషను గూడ్సుయార్డ్ ప్రాంతం. అక్కడ మహాత్మాగాంధీ దర్శనం పొందాను. అప్పుడు నా వయసు పది సంవత్సరాలు. గాంధీజీ కలకత్తా నుంచి మద్రాసు వెళుతూ, సుమారు 40 నిమిషాలు స్టేషను గూడ్సు యార్డు వద్ద ఉన్న మైదానంలో ప్రసంగించారు. నాకు సరిగా కనపడటం లేదంటే, బలిష్ఠుడైన మా తాతగారు నన్ను ఎత్తుకున్నారు. మహాత్ముని వంటి ముఖ వర్చస్సుతో ఉన్న వ్యక్తిని ఆ తరువాత నేను ఎప్పుడూ చూడలేదు. మహాత్ముని హిందీ ప్రసంగాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు కళా వెంకట్రావు తెలుగులోకి అనువదించారు. అదే ఈ ప్రాంతంలో మహాత్ముని చివరి పర్యటన..
మరో విషాదకర సంఘటన..
అది 1948 ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం. మెయిన్ రోడ్డుమీద పెద్ద కోలాహలం.. కంభంవారి సత్రం చివరన ఉన్న మెయిన్ రోడ్డు మీదకు నేను పరిగెత్తాను. పూలరథంపైన వృద్ధుడైన ఒక గాంధేయవాది నిలబడి ఉన్నారు. తలపై అస్థికల పేటిని పెట్టుకున్నారు. రాజమహేంద్రవరం రైలు స్టేషను నుంచి కోటిలింగాల ఘాట్ వరకు ఊరేగింపు సాగింది. ఊరేగింపు అగ్రభాగాన బ్యాండు, సన్నా యి మేళాలు, తరువాత గాం«దీజీకి ఇష్టమైన భజనగీతాలను ఆలపిస్తూ కొన్ని వందల మందితో ఊరేగింపు సాగింది. ఆ క్షణాన నాలో తెలియని ఆవేశం వచ్చింది. ఆ మహనీయుని పట్ల భక్త్యావేశంలో మునిగాను. అప్రయత్నంగా ఆ ఊరేగింపులోకి చొరబడ్డాను. గాంధీటోపీలు ధరించినవారెందరో ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. కోటిలింగాల ఘాట్‌లో అస్థికలు కలిపారు. అందరూ స్నానాలు చేశారు. నేను అప్రయత్నంగా స్నానం చేసి, తడిబట్టలతో ఇంటికి తిరిగి వచ్చాను.
మన పవిత్ర కర్తవ్యం
మహాత్ముడు రాజమండ్రి వచ్చిన తేదీలతో ఒక శిలాఫలకాన్ని రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషను ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. విజయవాడ రైల్వేస్టేషను ప్రవేశ హాలు వద్ద మహాత్ముడు విజయవాడకు వచ్చిన తేదీలను వివరిస్తూ, ఒక బోర్డును ఏర్పాటు చేశారు. ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు. మనకు కావలసింది కాసింత శ్రద్ధ. ముందు తరాలవారికి చరిత్ర తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది.