ప్రపంచ రికార్డులతో శ్యామ్ కుటుంబం
సాక్షి, ఆత్రేయపురం: చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా కళ్లప్పగించి సంభ్రమాశ్చర్యాలకు గురవుతూ మధ్య మధ్య చప్పట్లు కొడుతూ ఆసక్తిగా తిలకించే ప్రదర్శన ఇంద్రజాలం. అతి ప్రాచీన భారతీయ కళ ఇది. కోల్‌కతాలో పుట్టి తన ఇంద్రజాలంతో ప్రపంచాన్ని సమ్మోహనం చేసిన సీనియర్ పీసీ సర్కార్ జయంతి ఆదివారం. ఈ రోజును అంతర్జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సర్కార్‌ను ఆదర్శంగా తీసుకుని ధనంతో పని లేకుండా ఇంద్రజాలంతో సమాజ సేవ చేయవచ్చని నిరూపిస్తున్నారు ఆ ఇంద్రజాలికుల కుటుంబం. ఒక ఇంద్రజాలికుడి ప్రదర్శన తిలకించడమే అద్భుతమంటే.. ఇంటిల్లిపాదీ ఇంద్రజాలికులై వారి ప్రదర్శనలు చూడాలంటే రెండు కళ్లూ చాలవు కదూ. ఆ వేడుక చూడాలంటే జిల్లాలోని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో కేశవ స్వామి గుడి వీధిలోని ప్రముఖ ఇంద్రజాలికుడు శ్యామ్ జాదూగర్ ఇంటికి వెళ్లాల్సిందే. గ్రామానికి చెందిన చింతా శ్యామ్ కుమార్ లొల్ల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య అన్నపూర్ణ. వారి సంతానం చింతా తేజశ్రీ రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయినిగా, కుమారుడు మోహిత్ ఫిజియోథెరపీలో డిగ్రీ చదువుతున్నాడు.
శ్యామ్‌ను అభినందిస్తున్న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి
ప్రదర్శనలు
ఆంధ్రా పీసీ సర్కార్‌గా పేరు తెచ్చుకున్న చింతా శ్యామ్ కుమార్ ‘శ్యామ్ జాదూగర్’ వేదిక పేరుతో ఇంద్రజాల, మనస్తత్వ రంగాల్లో పలు ప్రపంచ రికార్డులను సాధించారు. ఇతని ప్రదర్శన అంటే సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, విదేశీయులు, సినీ ప్రముఖులు ఆసక్తిగా తిలకిస్తూ మంత్ర ముగ్ధులవుతారు. ప్రపంచంలోనే అతి తక్కువ మందికి తెలిసిన బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ (కళ్లకు గంతలు కట్టుకుని వాహనాలు నడపడం, ఇంద్రజాల ప్రదర్శనలు చేయడం) ను ఉపయోగించి ఆయన సమాజాన్ని చైతన్యపరచడానికి కృషి చేస్తున్నారు. విద్యార్థుల్లో మేధస్సును పెంచడానికి తన ఇంటిలో బ్రెయిన్ జిమ్‌ను నిర్వహిస్తున్నారు.
శ్యామ్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
సమాజ సేవలో..
బాగా సంపాదించాక సమాజ సేవ చేద్దామనుకుంటారు చాలామంది. సమాజ సేవ డబ్బుతో కూడుకున్నదనే భావన చాలా మందిలో ఉంది. అది తప్పని.. కళ ద్వారా చేయవచ్చనని శ్యామ్ కుటుంబ సభ్యులు నిరూపిస్తున్నారు. తమ ఇంట్లో నిర్మించిన ‘అబ్రక దబ్ర’ కళా వేదిక ద్వారా ఎన్నో అవగాహన సదస్సులను నిర్వహించడంతో పాటు, మ్యాజిక్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అంతే కాకుండా తాము దాచుకున్న మొత్తంలో కొంత వృద్ధులకు , పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు. బ్రెయిన్ జిమ్‌ను నిర్వహిస్తూ విద్యార్థుల్లో మైండ్ పవర్‌ను అభివృద్ధి చేయడంతో పాటు జీవితంలో సరైన లక్ష్యాలు నిర్దేశించుకోలేక ఆత్మహత్యలు చేసుకునే ఎంతో మందికి మంచి జీవితాన్ని ప్రసాదించారు.
శ్యామ్‌ను అభినందిస్తున్న పాతపాటి కుటుంబ సభ్యులు
రికార్డులు, అవార్డులు..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు, అవార్డులతో పాటు సత్కారాలను అందుకున్నారు. అంతే కాకుండా వివిధ వైకల్యాలతో ఉన్న వారికి ఇంద్రజాలంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని కూడ రికార్డులోకి ఎక్కించిన ఘనత వీరిది. ఇప్పటి వరకూ శ్యామ్ సుమారు 20 రికార్డులు కైవసం చేసుకోగా మోహిత్ 3 రికార్డులు, తేజశ్రీ రెండు రికార్డులను కైవసం చేసుకున్నారు. శ్యామ్, మోహిత్, తేజశ్రీ వివిధ రకాల అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. కాగా మీరు మీ సమస్యలతో సతమతమవుతూ సరైన లక్ష్యాన్ని నిర్ణయించుకోలేక పోతున్నట్టయితే ప్రతి రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య 98663 72645 నంబర్‌కు ఫోన్ చేసి ఉచిత కౌన్సిలింగ్ పొందవచ్చని వారు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment