‘మౌనంగానే ఎదగమనీ.. మొక్క నీకు చెబుతుంది’.. ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని’.. అంటూ నిరాశా చీకట్లను తరిమేసే స్ఫూర్తిదాయక పాటలు రాయాలన్నా.. పెదవే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మా... అని తల్లి ప్రేమ మాధుర్యాన్ని గుమ్మరించాలన్నా.. తిరునాళ్ళలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చే తల్లి చిరునవ్వులా.. అని అద్భుతమైన గీతం రాయాలన్నా...ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా... అంటూ సమకాలీన రాజకీయాలను స్పృశించాలన్నా..మెగాస్టార్ చిరంజీవి అభిమానుల జాతీయ గీతంగా పేర్కొనే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. అని ఉర్రూతలూగించాలన్నా..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది.. మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది.. అని చీరకట్టు గొప్పతనానికి జైకొట్టాలన్నా..తెలుగు సినిపరిశ్రమలో ఇప్పుడు ఒక్కరికే సాధ్యం.. ఆ ఒకే ఒక్క రచయిత చంద్రబోస్..
చంద్రబోస్ కాదు.. చంద్ర‘భేష్’ అని తెలుగు సినీ పాట గర్వంగా తలెత్తుకునేలా చేసిన వేటూరి సుందరరామమూర్తితోనే ప్రశంసలు అందుకున్న కవి.మారుమూల పల్లె.. సాధారణ కుటుంబ నేపథ్యంతో వచ్చి ఇంజినీరింగ్‌లో జేఎన్‌టీయూ థర్డ్ ర్యాంక్ సాధించి కూడా కేవలం గానం, కవిత్వంపై మక్కువతో సినిమా పాట బాట పట్టారు చంద్రబోస్.మనిషిలో ప్రేరణ, స్ఫూర్తి రగిలించే సోలో, యుగళగీతాలు, సామాజిక సందేశాలు.. ఇలా ఏపాటైనా ఆలవోకగా రాసేసి సినిమా కవిగా వచ్చే ఏడాది పాతికేళ్ళ ప్రాయంలోకి అడుగుపెడుతున్న చంద్రబోస్ సోమవారం విశాఖలో సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే..
చదువు.. చదువు.. చదువు... చదువే ఓ మూలధనం.. విద్యార్ధులే కాదు.. సమాజంలో ఎవరైనా.. ఏ రంగంలోని వారైనా.. వారికిష్టమున్న రంగం కావొచ్చు.. అంశంకావొచ్చు.. చదవాల్సిందే.. అధ్యయనం చేయాల్సిందే. ‘పరుగెత్తు..నడువు.. లేదంటే పాకుతూవెళ్లు.. అంతేకానీ ఒకే చోట కదలకుండా కూర్చోకు’.. అని మహాకవి శ్రీశ్రీఅన్నట్లే నా సృజనతో నేను చెప్పేది ఒకే ఒక్క మాటచదవు.. చదువు.. చదువు..
తెలుగుపాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు లేదు
తెలుగు సినీ పాటకు జాతీయస్థాయిలో తగినంత గుర్తింపు రావడం లేదనే అభిప్రాయం నాలో ఉంది. జాతీయ అవార్డులు పొందుతున్న మిగిలిన భాషా చిత్రాల పాటలను నేను అనువదించి వింటుంటాను. ఆ సాహిత్యమూ తెలుసుకుంటాను. కచ్చితంగా వాటికంటే మన తెలుగు పాటలేమీ తీసిపోవు. అంతకంటే మంచి సాహిత్యమే మన పాటల్లో ఉంది. కానీ ఎందుకో మొదటి నుంచి తెలుగుపాటకు తగినంత గుర్తింపు దక్కడం లేదు. బహుశా మన పాటను భుజానికెత్తుకునే వాళ్ళు అక్కడ లేకపోవడం వల్లనేమోనని అనుకుంటాను. నా ఆటోగ్రాఫ్ సినిమాలో మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. పాట విషయమే తీసుకుందాం. తమిళ మాతృక సినిమాలో ఆ పాటకు ఎంతో గుర్తింపునిచ్చారు. ఇంటర్ విద్యలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు. ఎన్నో అవార్డులు వచ్చాయి. వాస్తవానికి మాతృకలోని పాట కంటే తెలుగు పాటే ఎక్కువమందికి చేరువైంది. ఆ పాట కంటే మన తెలుగు పాటే బాగుందని విమర్శకులు కూడా ప్రశంసించారు. కానీ జాతీయ స్థాయి అవార్డే కాదు.. రాష్ట్రంలోనూ రాలేదు. కానీ ఆ పాట ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. తెలంగాణలోని యువతి ప్రణీత 80శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ఎన్నో రోజులు చికిత్స పొందింది. ఆ సమయంలో ఆమె ప్రతిరోజూ భక్తి గీతాలతో పాటు మౌనంగా ఎదగమనే పాటతో పాటు నేనున్నాను సినిమాలోని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని.. అనే పాటలు విని సాంత్వన పొందానని చెప్పినప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ ఆ రెండు పాటలూ నేను రాసినవే. ఏ అవార్డు ఇంతటి గౌరవాన్ని అందిస్తుంది..చెప్పండి. అందుకే ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు కంటే ప్రజలు ఇచ్చే గుర్తింపునకే విలువ ఎక్కువ
జానపదమే... జ్ఞానపథం
మన సాహిత్యానికి గానీ. సంస్కృతికి గానీ జానపదమే ప్రధానం.. అందుకే నేను జానపదమే జ్ఞానపథం అంటాను. సాహిత్యం జీవనాడిగా ఉందంటే అందుకు జానపదమే కారణం. నేను ఎదిగిన పల్లె వాతావరణం కావొచ్చు, నేను రాసిన పాట పామరులకీ అర్ధం కావాలనే ఆశ కావొచ్చు.. జానపదమే నన్ను ప్రభావితం చేసింది. నాకు సంగీతం అనువంశికంగా కాదు.. అనుసృజనగా వచ్చింది.
రంగస్థలం పాటలు రాయలేదు..అశువుగా చెప్పా
వాస్తవానికి నేను పాటలు పాడదామనే సినీరంగానికి వచ్చాను. మొదట లక్ష్యం అదే.. కానీ ఆ వైపు అవకాశాలు రాకపోవడంతో ఓ మిత్రుడి సలహా మేరకు పాటలు రాశా ను. మొదటిసారి 1995లో డి రామానాయుడు నిర్మించిన తాజ్‌మహల్ సినిమాలో పాట రాసేందుకు దర్శకుడు ముప్పలనేని శివ అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా పాటలు రాస్తూనే ఉన్నాను. 24 ఏళ్ళ కెరీర్‌లో 3300 పాటలు రాశాను. ఒక్కోసారి ఓ పాట రాసేందుకు నాలుగైదు రోజు లు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ రంగస్థలం సినిమాలోని అన్ని పాటలూ నేనే రాశాను. విచిత్రమేమిటం టే పేపర్‌పై పెన్ను పెట్టి ఒక్క పాట కూడా రాయలేదు. డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, నేను కూర్చుంటే... ఆశువుగా అర్ధగంటలో ఒక్కో పాట చెప్పేస్తే.. వాళ్లు రికార్డ్ చేసేశారు. ఆ పాటల్లో ఎంతటి సాహిత్యముంది..
స్ఫూర్తి రగిలించే పాటలు నేనే ఎక్కువ రాశా
నా లిరిక్స్‌లో నవరసాలూ ఉంటాయి. హాస్యం, శృంగారం, క్రోధం, శాంతం, కరుణ భయం,. బీభత్సం.. అన్నీ ఉంటాయి. కానీ నాకు మనిషికి ప్రేరణనిచ్చి.. స్ఫూర్తిని రగిలించి సందేశాన్నిచ్చి ముందుకు నడిపించే పాటలంటేనే ఇష్టం. నిరాశ, నిస్పృహలను పారదోలే స్ఫూర్తి సాహిత్యంతో 35పాటలు రాశాను. బహుశా తెలుగు సినిమా సాహిత్యంలో అలాంటి పాటలు ఎక్కువ రాసింది నేనే అని అనుకుంటాను. ఆ అవకాశం నాకే ఎక్కువ వచ్చిందని భావిస్తాను..
కొత్త రచయితలూ...
సినిమా రంగంలోకి రావాలనుకునే కొత్త రచయితలూ ముందు బాగా చదవండి. కవిత్వానికి మూమూలు మాటకు తేడా ఏమిటో తెలుసుకోవాలి. మాట కవిత్వం ఎలా అవుతుంది.. ఎందుకు అవుతుంది. అయ్యేందుకు మనం ఏం ప్రయోగం చేయాలో ఆలోచించాలి. సినిమా పాటలకు ఉండే నాలుగు లక్షణాలు క్లుప్తత, గాఢత, స్పష్టత, సరళత.. ముందుగా ఇవి అలవర్చుకోవాలి. ఇక సినిమా పాటలకు ఛందస్సు అవసరం లేదు..యతిప్రాస ఉంటే చాలు. ఉదాహరణకు.. ’ మా బాధలను ఓదార్చే తోడుండేవాడివిరా... ఇది మామూలు మాట.. ’’మా బాధలను ఓదార్చే నువ్వుంటే బాగుండురా... ’ ఇది కవిత్వం..
బాలసాహిత్యమే మనిషికి పునాది
బాలసాహిత్యమే ఏ మనిషికైనా పటిష్ట పునాది వేస్తుంది. అంతకుమించిన సాహితీ సంపద లేదు. బాలలకు లేతప్రాయంలో శబ్దసంపద, ఊహాశక్తిని పెంపొందించే నైతిక రుజువర్తనను అందించాలి. నీతి కథలు చదివించాలి. సాహిత్యం మనల్ని పరిపుష్టం చేస్తుంది. బాల్యంలో బొమ్మరిల్లు, బుజ్జాయి, చందమామ, బాలమిత్ర.. భాగవతం, బాలసాహిత్యం వంటివి చదివితే ఎదుగుదలలో తిరుగుండదు. ఒకప్పుడు పిల్లలకు వాటితోనే విద్యాభ్యాసం మొదలుపెట్టించేవారు.
మాతృభాషకు మించింది ఏదీ లేదు..
♦ భాష బలహీనమైతే బంధం బలహీనమైనట్టు..
♦ మాతృభాషతోనే వేగంగా బుద్ధి వికాసం
♦ తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయిలో తగినంత గుర్తింపు రావడం లేదు
♦ మన పాటను భుజానికెత్తుకునే వాళ్లు అక్కడ లేకపోవడం వల్లనేమో..
♦ జాతీయ అవార్డులు సాధిస్తున్న ఇతర భాషల పాటల కంటే తెలుగు పాటేం తీసిపోదు
♦ సినిమా పాట రాయడం అవధానం కంటే పెద్ద ప్రక్రియ
♦ పాటలు పాడదామని వచ్చి రచయితగా మారాను
♦ చిరంజీవి సైరాలో పాట రాస్తున్నా విశాఖలో ఉండి ఎన్నో పాటలు రాశాను
మాతృభాషను నిర్బంధంగా చదివించాలి
మాతృభాషకు మించింది ఏముంది.. భాష బలహీనమైతే బంధం బలహీనమైనట్లే.. నాన్నా అన్న పిలుపులో ఉండే గాఢత డాడీలో ఉండదు. అమ్మా అన్న పిలుపులో ఉండే మాధుర్యం మమ్మీలో ఉండదు. పిలుపు మారినప్పుడు బంధం కూడా మారుతుంది. మాతృభాషతో బుద్ధి వికాసిస్తుంది. ఆలోచనలు విస్తరిస్తాయి. పరభాషతో బుద్ధి వికాసం అంత త్వరగా రాదు. అందుకే మాతృభాషను నిర్బంధంగా చదివించాలని నేను భావిస్తాను. కనీసం ప్రాధమిక విద్యాబోధనైనా తెలుగులో కచ్చితంగా> జరిగి తీరాలి. ఆస్ట్రేలియాలో మాతృభాషలో చదువుకున్న వారికి అక్కడి ప్రభుత్వం 130 డాలర్లు బహుమతిగా అందిస్తోంది. అక్కడ స్థిరపడిన ఏ భాషకు చెందిన వారైనా వారి మాతృభాషలో చదువుకుంటే ప్రోత్సాహం అందిస్తోంది. తెలుగుభాష పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే కాదు.. మనందరిదీ.
సినిమా పాటరాయడం చాలా కష్టం..
మామూలు పాటలు రాయడం వేరు.. సినిమా పాటలు రాయడం వేరు. సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్‌ను పట్టుకుని. దర్శకుడు ఇచ్చే సందర్భాన్ని అర్ధం చేసుకుని, హీరో ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులను మెప్పించేలా సినిమా పాట ఉండాలి. అందుకే సినిమా పాట రాయడం చాలా కష్టం. అది ఓరకంగా అవధానం కంటే పెద్ద ప్రక్రియ. ఇటీవలికాలంలో సినిమా కవులకు సోషల్ మీడియా సాహిత్యం సవాల్ విసురుతోంది. వాట్సాప్‌లో ప్రపంచస్థాయి కవిత్వాలు నీతులు, శుభాషితాలు. ఛలోక్తులు.. ఇలా పలు రూపాల్లో కవిత్వం వెల్లువెత్తుతోంది. దాన్ని మించి సినిమాలో చెప్పాలి. అందునా ఇప్పుడు కాలం మారింది. వేగం పెరిగింది. సినిమాకు మహారాజపోషకులైన యువత ఆలోచనలు మారాయి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కవిత్వం రాయాలంటే కత్తిమీద సాములా అయింది. సినిమాల్లో యుగళగీతాలు తగ్గాయి,, సిట్యుయేషన్ సాంగ్స్ వస్తున్నాయి. పాట సినిమాలో అంతర్భాగంగా వచ్చేదే అయినప్పటికీ అది సినిమా కంటే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. చైతన్యపరుస్తుంది.
ఆచార్య ఆత్రేయ అంటే ప్రాణం
♦ సినీ కవుల్లో ఆచార్య ఆత్రేయ అంటే ప్రాణం. ఆయన స్ఫూర్తితోనే ఎన్నో పాటలు రాశాను. నాలుగైదు మాటలతోనే గొప్ప అర్థం వచ్చేలా.. అందరికీ అర్థమయ్యేలా రాయడం ఆత్రేయ సాహిత్యం నుంచే నేర్చుకున్నాను. ఓ సందర్భంలో ఆయన రాసిన సాహిత్యం గురించి.. ప్రియుడి సన్నిహితులు చనిపోతే ప్రేయసి ఇలా ఓదారుస్తుంది..
♦ ‘రారయ్య పోయిన వాళ్ళు.. ఎవరయ్యా ఉండే వాళ్ళు’ ఇదీ సాహిత్యం గొప్పతనం
మరో సందర్భంలో
♦ నీకు నాకూ పెళ్ళంట...నింగీ నేలకు కుళ్ళంట...ఎందుకంటేయుగయుగాలుగా ఉంటున్నా అవి కలిసింది ఎప్పుడూ లేవంట..మరో సందర్భంలో
నీకూ నాకూ పెళ్ళంట.. నదికి కడలికి పొంగంట..యుగయుగాలు వేరైనా అవి కలవనది ఎపుడూ లేదంట
♦ ఇలా అనల్పమైన అర్ధం ఇవ్వాలనే స్ఫూర్తిని ఆత్రేయ నుంచే పొందాను. పెద్ద పెద్ద సమాసాలతో సంక్లిష్టమైన పదాలతో పాటలు రాయను. నేను రాసిన ప్రతి మాట అమ్మకు అర్ధమవ్వాలని అనుకుంటా.. అమ్మకు అర్ధమైతే అందరికీ అర్ధమైనట్టే.
సైరాకు రాస్తున్నా...విశాఖలో ఎన్నో పాటలురాశాను
సుందరమైన విశాఖ నగరంలో నాకు వృత్తిరీత్యా ఎంతో అనుబంధముంది. ఆర్య, బన్ని సినిమాల్లోని పాటలతో పాటు ఇటీవల ట్రెండింగ్ సాంగ్‌గా మారిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో ఫ్రెండ్‌షిప్‌పై వచ్చే ట్రెండు మారినా ఫ్రెండు మారడే పాటను ఇక్కడే రాశాను. ఇలా ఎన్నో పాటలను విశాఖలో కూర్చుని రాశాను. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరాకి రాస్తున్నాను. పాట రాయాలని నేను వైజాగ్‌లో ఉన్నప్పుడే పిలుపువచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment