ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో.. | Rajamahendravaram: Andhri Kuteeram Telugu Literary Organization 85 Years Journey | Sakshi
Sakshi News home page

ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..

Published Fri, Dec 30 2022 3:38 PM | Last Updated on Fri, Dec 30 2022 3:38 PM

Rajamahendravaram: Andhri Kuteeram Telugu Literary Organization 85 Years Journey - Sakshi

(డెస్క్‌ – రాజమహేంద్రవరం): ఇది 85 ఏళ్లనాటి ముచ్చట.. అప్పటికి స్వాతంత్య్ర రావటానికి దశాబ్ద కాలం వ్యవధి ఉంది. దేశమంతా స్వేచ్ఛా కాంక్ష ప్రజ్వరిల్లుతోంది. పట్టణాలు, పల్లెలు మహాత్ముని పథంలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని పల్లిపాలెం అనే చిన్న గ్రామంలోని వీధుల్లో భోగిమంటల్లా నాలుగైదు చోట్ల నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయి. అవేమిటని ఆరా తీస్తే.. తెల్లవారి మిల్లు దుస్తులను రాశులుగా పోసి మంట పెడుతున్నారు గ్రామస్తులు.

గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా రేగిన ఆ అగ్నిశిఖలు ఆ గ్రామంలోని 17 ఏళ్ల యువకుడిలో ఓ కొత్త ఆలోచన రేపాయి. ఖద్దరు వస్త్రధారణ, గ్రామ స్వరాజ్య సాధన, పల్లెసీమల్లో విద్యావ్యాప్తి, మద్యపానం, జూదాలకు దూరంగా ఉండటం.. ఇలా బాపూజీ బాటలో మన గ్రామంలోని యువత పయనిస్తే దేశానికి మేలు చేసినట్లే కదా అని భావించాడు. ఆ కుర్రాడు– మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఆ వయసులోనే తన ఇంటిని కార్యక్షేత్రంగా మలచుకుని ఆంధ్రీ కుటీరం పేరుతో.. తన తండ్రి ఆశీస్సులతో ఒక సంస్థను ప్రారంభించాడు.


యువతలో సాహిత్యాభిలాష

ఆంధ్రీ కుటీరం సంస్థకు 1938 జనవరి 13న మధునాపంతుల శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ కోడిపందేలు,  గుండాటల వంటి జూదాలతో కాలాన్ని వృథా చేస్తున్న యువకులను దగ్గరకు చేర్చుకున్నారు. మామిడి తోటల్లోకి తీసుకువెళ్లి తెలుగు భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగించారు. తెలుగు, సంస్కృత కావ్యాలు, వ్యాకరణం నేర్పి, భాషా ప్రవీణులను చేసి, ఉపాధ్యాయ వృత్తికి దారి చూపారు. అనంతరం కాలంలో మహాకవిగా, కళాప్రపూర్ణునిగా, ఆంధ్రపురాణకర్తగా మధునాపంతుల సువిఖ్యాతులయ్యారు. అన్ని కులాల వారికీ ఉచితంగా విద్య నేర్పుతామని పత్రికా ప్రకటనలు ఇచ్చారు. గ్రామసీమల్లో విద్యావ్యాప్తికి ‘నేను సైతం’ అంటూ ఆయన తలపెట్టిన ఈ యజ్ఞం ఇలా సాగుతుండగా.. తోరణం పేరుతో తన తొలి ఖండకావ్య సంపుటిని కవిసమ్రాట్‌ విశ్వనాథవారి పీఠికతో వెలువరించారు. పల్లెసీమల్లో భాషా వ్యాప్తికి ఆంధ్రీ కుటీరం వంటి సంస్థలు అవసరమని విశ్వనాథ ఆకాంక్షించారు.

ఆనాడే అక్షరాంకురార్పణ
అదే ఏడాది మధునాపంతులకు ఓ ఆలోచన కలిగింది. తెలుగు భాషా సేవకు పత్రికా నిర్వహణ తోడ్పాటు అవుతుందని భావించారు. వెంటనే తండ్రికి, కవితా గురువు శతావధాని ఓలేటి వెంకట రామశాస్త్రికి ఆ విషయం విన్నవించారు. పిఠాపుర సంస్థాన ఆస్థాన కవులైన ఓలేటి వారు అక్కడి సొంత ప్రెస్సు విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో పత్రిక అచ్చు వేయించుకునేందుకు అనుమతించారు. ఆంధ్రికి కాకినాడ కలెక్టర్‌ 1939 మార్చి 15న డిక్లరేషన్‌ ఇచ్చారు.

పల్లిపాలెమే కార్యస్థానంగా మలచుకుని 1939 మార్చి నుంచి ఆంధ్రి సాహిత్య మాసపత్రిక ఆరంభమైంది. ఆంధ్ర శబ్దానికి ఆంధ్రి స్త్రీ వాచకమే కాకుండా ఆ పేరుతో ఒక రాగం కూడా ఉంది. ‘ప్రమాది ఉగాది నాడు 1939 మార్చి 22న వేదుల రామమూర్తి అధ్యక్షతన ఆంధ్రి ప్రారంభోత్సవం జరిగింది. ‘గొప్పగా ఉన్నది. నగర సంకీర్తన చేసితిమి ఆనాడు నాకు గల ఉత్సాహము అతివేలము’ అని ‘జ్ఞప్తి’ అనే డైరీలో మధునాపంతుల రాసుకున్నారు.


ఎందరో మహానుభావుల ప్రశంస

నేటి కథ.. ఆంధ్రియన్న స్వసంస్కృతి పురంధ్రియన్న అన్నన్నా.. ఏమి వెర్రి నీది ఓయన్నా.. అని మధునాపంతులను డాక్టర్‌ సి. నారాయణరెడ్డి ప్రశంసించారు. ఆంధ్రపురాణం, ఆంధ్ర రచయితలు, ఆంధ్రి.. ఇలా తన అణువణువులోనూ ఆంధ్రత్వం పుణికి పుచ్చుకున్న కవి ఆయన. ఆయన నెలకొల్పిన ఆంధ్రీ కుటీరాన్ని వారి ఆశయాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా నడుపుతుండటం విశేషం.

ఈ సంస్థ వచ్చే నెలలో 85వ వార్షికోత్సవం నిర్వహించుకోనున్నది. వాడ్రేవు చిన వీరభద్రుడన్నట్లు ‘ఈ ఊరి అరుగులు ఎన్నో దశాబ్దాలుగా సారస్వత సత్రయాగానికి నోచుకున్నాయి’. నేటికీ ఈ ప్రాంతానికి వచ్చిన సారస్వత ప్రియులైన ప్రముఖులంతా పల్లిపాలెం సందర్శించటం సాధారణం. శాస్త్రి శత జయంత్యుత్సవాలను కేంద్ర సాహిత్య అకాడమీ  2020లో ఇక్కడే నిర్వహించింది. ఆంధ్ర పురాణ సవ్యాఖ్యాన బృహత్‌ గ్రంథాన్ని ప్రచురించిన అజోవిభో అధినేత అప్పాజోస్యుల సత్యనారాయణ.. ఆ గ్రంథాన్ని మధునాపంతుల రచించించిన మామిడి వృక్షం కిందనే ఆవిష్కరించారు.

ఆంధ్రి విశిష్టతలు 
► పిఠాపురం మహారాజా, జయపురం సంస్థానాధీశులు విక్రమదేవవర్మ, సర్‌ సీఆర్‌ రెడ్డి వంటి ప్రముఖుల ఆశీస్సులతో మొదలైన ఆంధ్రి పత్రికలో చెళ్లపిళ్ల, జాషువా, విశ్వనాథ, వేలూరి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కరుణశ్రీ, దేవులపల్లి, గడియారం వంటి వారెందరో తమ కవితలు, అమూల్య వ్యాసాలు రాసేవారు. రచయితలు, కవులు ఎంత ప్రసిద్ధులైనా వారి రచనల కింద సంపాద కుడు నిక్కచ్చిగా, నిర్భీతిగా రాసే వ్యాఖ్యలు ఆ రోజుల్లో సంచలనం కలిగించేవి.

► ఉత్తమ సాహిత్య విలువలతో సాగిన ఆ పత్రిక మూడేళ్ల పాటు 36 సంచికలు వెలువడి అనివార్య పరిస్థితుల్లో ముూతపడింది.

► పోస్టల్, కరెంటు సౌకర్యాలు లేవు. కనీసం  సరైన రహదారి కూడా లేని ఓ చిన్న గ్రామం నుంచి ఉత్తమ విలువలతో వెలువడిన ఆ పత్రికపై పరిశోధనలు జరిగాయి.

► అజోవిభో సంస్థ ఆంధ్రిలోని ముఖ్యమైన వ్యాసాలన్నిటినీ సంకలనం చేసి ఓ పుస్తకంగా ప్రచురించే ప్రయత్నిస్తోంది.

► ప్రెస్‌ అకాడమీ ఆర్కివ్స్‌ వెబ్‌సైట్‌లో ఆంధ్రి సంచికలన్నీ అందుబాటులో ఉంచారు.


సాహిత్యాభిమానుల సహకారం మరువలేనిది

ఎప్పుడో మధునాపంతుల నాటిన బీజం నేటికీ పచ్చగా ఉండాలనే సంకల్పంతో ఆంధ్రీ కుటీరం సంస్థను కొనసాగిస్తున్నాం. సాహితీవేత్తలు, మిత్రుల సహకారం మరువలేనిది. ఇన్నేళ్లు సజీవంగా ఉన్న సంస్థలు అరుదనే చెప్పాలి. సంప్రదాయ భూమిక, ఆధునిక ఆలోచనా స్రవంతుల స్వీకరణే లక్ష్యంగా అక్షర సేవ చేసి ఆంధ్రిని ఆరాధించుకోవాలన్నదే సంకల్పం. భవిష్యత్తులో కూడా అందరి సహకారాన్నీ కోరుకుంటున్నాం.
– మధునాపంతుల సత్యనారాయణమూర్తి, సంచాలకుడు, ఆంధ్రీ కుటీరం, పల్లిపాలెం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement