
నిర్బంధ తమిళ చట్టంపై ఉద్యమిద్దాం
♦ తెలుగు భాషను పరిరక్షించుకుందాం
♦ ‘మాతృభాషను కాపాడుకుందాం’లో వక్తలు
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది’ గుర్తొచ్చినప్పుడు ఆహా.. ఓహో అనడం, తెలుగు కనపడాలి.. వినపడాలనే రాతలతో సరిపెట్టుకోవడం కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందంటే సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలుగు అభిమానుల పోరాటాలతోనే ఉమ్మడి ఏపీలో అధికార భాషా సంఘానికి ఊపిరి వచ్చిందని, అదే స్ఫూర్తితో అంతా కదిలి తమిళనాడు సీఎం జయలలిత ఇంటి ఎదుట ఆందోళనకు ఉపక్రమిస్తే కానీ తిమిళనాట తెలుగు భాష బతికిబట్టకట్టదని వారు వాపోయారు.
తమిళ పాఠశాలల్లో నిర్భంధ తమిళ చట్టంపై ఉద్యమించాల్సిందేనని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం తమిళనాడు తెలుగు యువశక్తి, తమిళనాడు తె లుగు సంఘాల ఆధ్వర్యంలో ‘మాతృభాషను కాపాడుకుందాం’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో భాషాభిమానులు క్రిష్ణారెడ్డి, రామారావు, జర్నలిస్టు సంఘాల నేతలు ఎం. సోమయ్యతో పాటు పలువురు సాహితీ వేత్తలు, రచయిత పాల్గొన్నారు.
తెలుగు వెండి తెరతోనే జయకు ఖ్యాతి...
తల్లిదండ్రులను ఎవరైనా తక్కువ చేసినా, అవమానించినా ఊరుకుంటామా? లక్షలాది మంది తెలుగు వారున్న తమిళనాడులో తెలుగు వెలగాల్సిందే. తమిళనాడు సీఎం జయలలిత తొలుత తెలుగు వెండి తెరపైనే ఖ్యాతి గడించారు. తమిళనాడు ప్రజల్లో ఐక్యత ఎక్కువ. పాఠశాలల్లో నిర్భంద తమిళ చ ట్టాన్ని మనమూ సంఘటితంగా అడ్డుకుందాం.
- వడ్డేపల్లి కృష్ణ, ప్రముఖ రచయిత
జయ ఇంటి వద్ద ఆందోళన...
ఇప్పటికే చాలాసార్లు ఆందోళన చేశాం. అయినా దిగిరాలేదు. ఇక సీఎం జయలలిత ఇంటిని ముట్టడించాల్సిందే. సమస్యను అక్కడే పరిష్కరించుకుందాం. తమిళనాడులో 90 వేల మంది విద్యార్థులు తెలుగు మీడియం చదువుతున్నారు. ఇప్పుడు తమిళంలో పరీక్షలు రాయమంటే ఎలా?. వారి భవిష్యత్తు కోసం తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు, ప్రజలు ఉద్యమించాలి.
- సినీ నిర్మాత, అభ్యుదయ వాది తమ్మారెడ్డి భరద్వాజ
తెలుగు రాష్ట్రాల భాషా సాంస్కృతిక శాఖలు చర్చ జరపాలి
భాష పట్ల అభిమానం ఉండాలి. కానీ ఇతర భాషల పట్ల దురాభిమానం తగదు. దీన్ని ఎవరూ అంగీకరించరు. నాడు తెలుగుకు ప్రాచీన హోదా రాకుం డా అడ్డుకున్నది తమిళనాడువారే. పక్కనే ఉన్న రాష్ట్రం తెలుగును రద్దు చేయడం జుగుప్సాకరం. తెలంగాణ, ఏపీల భాషా సాంస్కృతిక శాఖలు స్పందించి, తమిళనాడు సాంస్కృతిక శాఖతో చర్చించాలి.
- బసవపున్నయ్య,టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి
డిసెంబర్ 1 లోపల స్పందించకపోతే...
డిసెంబర్ 1 లోపల జయలలిత ఈ చట్టంపై స్పందించి.. తమిళనాట తెలుగు విద్యార్థులకు న్యాయం చేయాలి. లేకుంటే డిసెంబర్ 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తాం. 20 కోట్ల మంది మాట్లాడే తెలుగు భాషను జాతీయ రెండో అధికార భాషగా గుర్తించాలి.
- కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి