తెలుగుదేల యన్న దేశంబు తెలు గేను / తెలుగు వల్లభుండ తెలుగొ కండ / ఎల్ల నృపులు గొలువ నెఱు గవే బాసాడి / దేశ భాషలందు తెలుగు లెస్స అని... అన్నది మన తెలుగు రాయడు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషా మాధుర్యాన్ని, గొప్పదనాన్ని చాటిచెప్పిన రాయలు చరిత్రలోనే కాదు, సాహిత్య చరిత్రలోనూ శాశ్వ తమైన కీర్తిని సొంతం చేసుకున్నాడు. కానీ భారత దేశం పరాధీనమైనప్పుడు దేశ భాషలు అడుగంటిపోయాయి. ఆంగ్ల భాష అందలమెక్కింది. మాతృభాషలో మాట్లా డటం అవమానం గానూ, ఆంగ్లంలో మాట్లాడడం గొప్ప గానూ భావించే దౌర్భాగ్యం ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇంకా కొన్ని భాషలకు స్వాతంత్య్రం రాలేదు. పరభాషను పట్టుకుని పాకులాడుతూనే ఉన్నాం.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మహా త్మాగాంధీగారు స్వదేశీ భాషలను బలోపేతం చేసుకోవా ల్సిన అవసరం ఉందని ప్రబోధించారు. అందుకనుగుణం గానే భారత ప్రభుత్వం ప్రాంతీయ భాషలకు ప్రత్యేక హోదా కల్పించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భాషాభిమానులైన తమిళులు ప్రాచీన భాషా హోదాను తెచ్చుకుని తమ భాషలో ఉన్న ప్రాచీన సాహిత్య శాస్త్ర విజ్ఞానాలను ఆధునిక సాంకేతిక విజ్ఞానంలో పదిల పరు చుకుంటున్నారు. మన తెలుగు వాళ్లకు మన మాతృ భాషకు ప్రాచీన హోదా సాధన మీద అంతగా పట్టింపు లేకుండా గడిచిపోయింది. కానీ 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగారు తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించారు. అదే సంవ త్సరంలో ఆయన ప్రారంభించిన ఆర్‌జీయూకేటీ ట్రిపుల్ ఐటీకి చెందిన మూడు సెంటర్ల (ఇడుపుల పాయ, నూజి వీడు, బాసర)లో ఇంజనీరింగ్ విద్యార్థులకు తెలుగును ‘ఆప్షనల్ సబ్జెక్టు’గా చదవడానికి అవకాశమిచ్చారు. అలా ఆయన తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్నారు. ఏ కోర్సు చదివినా మనకు సంస్కారాన్ని నేర్పేది మాతృభాష మాత్రమేనని నమ్మారాయన. తాను నమ్మినదే ఆచరించి చూపించారు.
ప్రాచీన హోదాతో ఏమొస్తుంది?
తెలుగుకు ప్రాచీన హోదా వస్తే అటు భాషోద్ధరణ పరంగానే కాకుండా, ఉద్యోగాల కల్పన వంటి అనేక రకాల ప్రయోజనాలుంటాయి.
– తెలుగు చక్కగా రాయడం, చదవడం వచ్చిన వారికి ఉన్న చోటనే ఉపాధి లభిస్తుంది. నెలరోజుల శిక్ష ణలో కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు తెలుగు టైప్ నేర్పిస్తే వాళ్లు ప్రాచీన ప్రతులను టైప్ చేసి డిజిటల్ రూపంలో భద్రపరచడానికి మార్గం సుగమం చేయగలు గుతారు.
– తాళపత్ర ప్రతులను యథాతథంగా రాసి ఇవ్వగలి గిన లేఖకులున్నారు. వారి చేత తాళపత్ర గ్రంథాల్లోని సమాచారాన్ని పేపర్ మీద రాయించుకుని, వాటిని కంప్యూటర్‌లో భద్రపరచడం ద్వారా తెలుగు భాషలో ఉన్న విలువైన విషయాలను భావి తరాల కోసం భద్ర పరచడం సులువవుతుంది.
– తెలుగు రాష్ట్రాల్లో పండితులు, మహా పండితులు, మహామహా పండితులు ఉన్నారు. టైప్ చేసిన ప్రతులను పండితులు ప్రూఫ్ రీడింగ్ చేసి తప్పులు దిద్ది, కాపీలను సరిచేస్తారు. ఇక మహా పండితులు, మహా మహా పండి తులు కాపీలను ఎడిటింగ్ చేసి పుస్తక రూపంలోకి తేవడా నికి సహకరిస్తారు. ద్విభాషా పండితులు అనువాదం చేసి ఇతర భాషల్లోకి మన గ్రంథాల్లో ఉన్న విలువైన సంగతు లను విస్తరింపచేస్తారు.
– ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని డిజి టలైజేషన్ నిపుణులు అందిస్తారు. సర్వర్‌మెయింటెనెన్స్, వెబ్ క్రియేషన్, వెబ్ మెయింటెనెన్స్, మ్యాటర్ క్లాసిఫికే షన్ వంటి పనుల అవసరం రీత్యా ఇంజనీరింగ్ విద్యార్థు లకు ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. లక్షల మందికి ఉన్న చోటనే ఉపాధి లభిస్తుంది. గ్రామాల్లో ఉన్న వాళ్లు అక్కడే ఉండి సేవలందించవచ్చు.
కొత్త డిక్షనరీలు వస్తాయి
భాషాభివృద్ధి జరగడం ఒక ఎత్తయితే, భాషలో ఉన్న పదాలన్నీ కంప్యూటర్లలో నిక్షిప్తమై వాటి కోసం డిక్షనరీలు తయారవుతాయి. ఇప్పుడున్న డిక్షనరీలు పరిమితమైన పదాలలోనే ఉన్నాయి. ఆ డిక్షనరీలు విస్తృతమవుతాయి. తెలుగు పలుకుబడులు, సామెతలు మొదలైన అనేక భాషావిశేషాలు వెలికి వస్తాయి. తెలుగు భాషలో ఉన్న సమస్త విషయాలు తెలుగువారి ముంగిట నిలుస్తాయి. ధనం, సమయం వృథా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మన చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాస్త్రాలు అందుబాటులోకి వస్తాయి. తెలుగులో పరిశోధనలు వేగవంతమవుతాయి. మన భాషలో ప్రాచీన కాలం నుంచి నిక్షిప్తమైన సమాచార మంతా వెలుగులోకి వస్తుంది.
నిధులున్నాయి... ఆచరణ లేదు
కేంద్రం నుంచి 2008–2019 వరకు సంవత్సరానికి 100 కోట్లు చొప్పున తెచ్చుకోవాల్సి ఉండింది. వాటిని సాధించడానికి తెలుగు భాషపై అభిమానం ఉండాలి, ఆచరణ ఉండాలి. ఆ నిధులతో భాషాభివృద్ధి, ప్రాచీన భాషా పరిరక్షణ, ఉపాధి కల్పన, తెలుగు భాషా సభల నిర్వహణ, తెలుగు భాషా పండితులకు ప్రతిభా పురస్కా రాలు మొదలైనవెన్నో నిర్వహించవచ్చు. ఇలాంటి కార్యక్ర మాల ద్వారా కొత్తతరానికి మాతృభాష ప్రాధాన్యతను తరచుగా గుర్తు చేస్తున్నట్లవుతుంది. ఈ రకంగా మాతృ భాషాభిమానం చాటుకున్న నాయకులు శ్రీకృష్ణదేవరా యల వలే శాశ్వతమైన కీర్తిప్రతిష్టలు పొందగలుగుతారు.
గ్రంథ రచన పరిశ్రమ
పూర్వం రాజులు భాషాభిమానంతో గ్రంథ రచనను ఒక పరిశ్రమగా నిర్వహించేవారు. ఎప్పటికప్పుడు పాతబ డిన తాళపత్రాలలోని విషయాన్ని తిరిగి కొత్త తాళపత్రాల మీద రాయించేవారు. ఈ ప్రక్రియ పండితుల పర్యవేక్ష ణలో జరిగేది. ఎందరికో ఉపాధి దొరికేది. సంస్కృతిని, సాహిత్యాన్ని, భాషను పరిరక్షించుకోవడానికి ఇంతగా శ్రమించేవాళ్లు. అలాంటి సంస్కృతిని తిరిగి ప్రవేశ పెట్టు కుని భాషను, సంస్కృతి, సాహిత్యాలను కాపాడుకోవడా నికి ప్రాచీన హోదా ఒక మంచి అవకాశం. వైఎస్‌ఆర్ ప్రాచీన హోదా సాధించారు. దానిని ఆచరణలో పెట్టే బాధ్యతను తనయుడుగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసు కోవాల్సిన అవసరం ఉంది. పుత్రుడంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడనేది వాడుకలో ఉన్న మాట. బృహదారణ్యకోపనిషత్తు ‘పు’ అంటే పూర్ణం చేయడం అని, ‘త్ర’ అంటే రక్షించడం అని చెప్పింది. అంటే... తండ్రి పూర్తి చేయలేకపోయిన మంచి పనిని తనయుడు పూర్తి చేసి రక్షించాలని అర్థం. తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చేవిధంగా వైఎస్ జగన్ ప్రయత్నించాలనీ, అందుకు సన్నద్ధంగా తగిన ప్రకటన చేయాలని కోరుతూ...
ప్రొ‘‘ కె. కుసుమారెడ్డి
వ్యాసకర్త విశ్రాంత తెలుగు ఆచార్యులు, ఓయూ
Comments
Please login to add a commentAdd a comment