విషయ పరిజ్ఞానం, లెక్కలు, తేదీలు, చమత్కారం, సమయ స్ఫూర్తి, ముక్కుసూటిగా ప్రవాహ వేగంతో మాట్లాడే లక్షణం, స్పష్టమైన ఉచ్చా రణ, గంభీరమైన కంఠస్వరం వంటి లక్షణాలు మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఓ ప్రత్యేకతను సంతరించిపెట్టాయి. శాసన సభలోనూ, బయటా ఆయన మాట్లాడిన ప్రతిమాటా ఒక చెణుకే.
ఓసారి రోశయ్య అల్లుడు ఒక విందులో తన మిత్రులతో ఎంజాయ్ చేస్తూ టీవీ ఛానెళ్లకు చిక్కారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో టీడీపీ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. సభలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మూకుమ్మడిగా ఉత్సాహంతో రెచ్చిపోయారు. చివరగా రోశయ్య తాపీగా నిలబడ్డారు. ‘అధ్యక్షా... ఎన్టీ రామారావు గారికీ, నాకూ దేవుడు మంచి అల్లుళ్ళనివ్వలేదు. ఏంచేస్తాం అధ్యక్షా’ అనేసి ఠక్కున కూర్చున్నారు. పాపం... తెలుగు తమ్ముళ్లు నవ్వలేరు, నవ్వకుండా ఉండలేరు. ఇక చంద్రబాబు పరిస్థితి సరే సరి! మిగతా సభ్యుల నవ్వులతో ఆనాటి సభ వెల్లివిరిసింది.
మరోసారి సభలో చంద్రబాబు ఆరోపణలపై ప్రతిస్పందిస్తూ ... ‘అధ్యక్షా... స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని నేను డ్రామా కంపెనీవాడు అనలేదు. ముందు ఆయన డ్రామాలు వేశాడు. తరవాత సినిమాల్లోకి వెళ్లి ప్రముఖ నటుడయ్యాడు అన్నానంతే. మీరు (చంద్రబాబును ఉద్దేశించి) ఒకప్పుడు ఆయన్ను గౌరవించారు. మధ్యలో పోయింది.
తర్వాత మళ్ళీ వచ్చింది... సరే, నన్ను తెలివితేటలు గలవాణ్ణని అన్నారు. నేను తెలివితేటలు గలవాణ్ణయితే ఇలా ఉంటానా? ఒంటరిగా ఉన్నప్పుడెప్పుడో అదనుచూసి రాజశేఖర రెడ్డిని ఒక్కపోటు పొడిచి ఆ సీట్లో కూర్చునేవాడిని...’ అన్నారు. అంతే... చంద్రబాబు, ఆ పార్టీ సభ్యులు కిక్కురుమంటే ఒట్టు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇష్టమైన ఓ చెణుకు గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలా చెప్పారు: ‘‘రోశయ్య ఓసారి రాజమండ్రిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్టులకు వెళ్లడంపై మాట్లాడుతూ, ఇది రాష్ట్రానికి మంచిది కాదు–అప్పుల ఊబిలోకి పోతాం అన్నారు... సరే విలేకర్లు తర్వాత ఆయన మాటల్ని మరో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఫైనాన్స్ మినిస్టర్ (యనమల రామృష్ణుడు)తో అని, దీనికేమంటారు? అని అడిగారు.
అందుకాయన మేమేమైనా తప్పు చేస్తున్నామా, ఫెసిలిటీ ఉంది, వాడుకుంటున్నాం. దాని కెందుకింత గొడవ? అన్నారు. ఈ సంగతి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్సులో రోశయ్యతో చెప్పి, దీనిపై మీరేమంటారు? అని అడిగారు. దీనికి రోశయ్య ‘చూడు నాయనా... ప్రతి ఊరికీ శ్మశానం ఫెసిలిటీ ఉంటుంది. ఉంది కదాని వాడుకోం కదా, జీవుడు పోయిన తర్వాతే అక్కడికి పట్టుకెళ్ళేది’ అని జవాబిచ్చారు.
చెణుకులు విసరడమే కాదు అణకువలోనూ, అందరితో కలివిడిగా ఉండడంలోనూ ఆయన పెట్టింది పేరు. ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగుతూ తన పేషీలో సెక్రెటరీ, పీ.ఏ, ఇతర ఉద్యోగులందరి సీట్ల దగ్గరకూ వెళ్లి ‘నా టెర్మ్ అయిపోయింది. కృతజ్ఞతలు. నా వల్ల ఏమైనా ఇబ్బందిపడి ఉంటే ఏమీ అనుకోకండి’ అని వినమ్రంగా చెప్పారు రోశయ్య.
శాసన మండలి సభ్యునిగా ఎన్టీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి, మండలి రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకునేలా చేశాడని నాటి విశ్లేషకులు అంటుంటారు. రోశయ్య ఏ పదవి చేపట్టినా ఉద్యోగంలా భావించారు. అసంతృప్తిగా పని చేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. అవినీతి మచ్చలేని నిలువెత్తు నిజాయితీ ఆయన. ప్రత్యర్థులు సైతం ఒప్పుకునే సత్యమిది. రాజకీయాల్లో ఆయన స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిది.
– తిరుమలగిరి సురేందర్,ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్
తస్సాదియ్యా... మన రోశయ్య!
Published Wed, Jul 3 2024 12:39 AM | Last Updated on Wed, Jul 3 2024 6:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment