ధర్మ ద్రోహం బాబుదే | Chandrababu demolished 30 temples in Vijayawada | Sakshi
Sakshi News home page

ధర్మ ద్రోహం బాబుదే

Published Fri, Sep 27 2024 4:34 AM | Last Updated on Fri, Sep 27 2024 4:43 AM

Chandrababu demolished 30 temples in Vijayawada

పవిత్రతను కాపాడింది వైఎస్సార్, జగన్‌లే

తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం, విజయవాడలో 30 ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు

ధూప దీప నైవేద్యాల కింద 5,338 ఆలయాలకు వైఎస్‌ జగన్‌ సాయం 

చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాల పునర్నిర్మాణం 

2,635 నూతన ఆలయాల నిర్మాణం.. మరో 300 ఆలయాల జీర్ణోద్ధరణ 

అర్చకుల జీతాలు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు, రూ.10 వేల నుంచి రూ.15,625కు పెంపు 

వంశపారంపర్య అర్చకులు ఓపిక ఉన్నంత కాలం పని చేసుకునే అవకాశం  

అర్చకుల సంక్షేమానికి రూ.48.33 కోట్ల సాయం.. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు, వేతనాల పెంపు   

శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్‌ జగనే

అమరావతి, విశాఖ, భువనేశ్వర్, కశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం.. మఠాధిపతులు, ఆగమ పండితులతో ధార్మిక పరిషత్‌ ఏర్పాటు

తిరుమలలో పలు కార్యక్రమాలకు వైఎస్సార్, జగన్‌ హయాంలలోనే శ్రీకారం

సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, తిరుపతి: విదేశీ దండయాత్రికులను మించి ఆలయాలను నేలమట్టం చేసిన చరిత్ర సీఎం చంద్రబాబు సొంతం! తిరుమల వేయి కాళ్ల మండపం నుంచి విజయవాడలోని పురాతన ఆలయాల దాకా ఆయన తీరు ఇదే! వదాన్యుల ఔదార్యంతో భక్తులు, బాటసారుల కోసం ఏర్పాటైన సత్రాలను సైతం విక్రయించి సొమ్ము చేసుకునేందుకు వెనుకాడ లేదు. 

బెజవాడ అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజల కలకలం బాబు నిర్వాకమే కదా! ఇక చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల వేళ జరిగిన తొక్కిసలాటతో డజన్ల సంఖ్యలో భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి! 

దేవాలయాలను కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన చరిత్ర చంద్రబాబుదైతే వేల ఆలయాలను నిర్మించడంతోపాటు జీర్ణోద్ధారణ పనులు సైతం చేపట్టి హైందవ ధర్మాన్ని గౌరవించిన మనసున్న పాలకుడు వైఎస్‌ జగన్‌. ఆలయ నిర్మాణం, ఆధునికీకరణ పనులకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగనే. 

ఏడుకొండల వైభవాన్ని చాటి చెబుతూ శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రారంభమైంది నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే. మతాలకు అతీతంగా మానవత్వానికి పెద్దపీట వేసిన పాలకులు వైఎస్సార్, వైఎస్‌ జగన్‌. 

మూడేళ్లకు ఒకసారి ధార్మిక పరిషత్తు కమిటీలను నియమించాల్సి ఉండగా ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ హయాంలో మాత్రమే ఏర్పాటయ్యాయి. నిత్య పూజలకు నోచుకోని వేలాది దేవాలయాల్లో ధూపదీప నైవేద్య పథకం ద్వారా దీపాలు వెలిగించిన వైఎస్సార్‌ కుటుంబంపై చంద్రబాబు బరి తెగించి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. 

పద్నాలుగేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గుర్తుండిపోయే కార్యక్రమాలు ఒక్కటైనా చేపట్టని సీఎం చంద్రబాబు అతి పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిందలు వేయటంపై భక్తకోటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. ఆయన నిర్వాకాలను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. శ్రీరాముడి పాలనలో ధర్మం నాలుగు పాదాలపై నడిచిందని చెబుతారు... మరి ధర్మ ద్రోహం చేసింది ఎవరు?   
విశాఖలో వైఎస్‌ జగన్‌ హయాంలో నిర్మించిన శ్రీవారి ఆలయం     

శరణం అయ్యప్పా..!!
భక్తులు అయ్యప్ప మాల ధరించడం కారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయంటూ చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎగతాళిగా మాట్లాడారు. మద్యం అమ్మకాలు తగ్గి రాష్ట్రం ఆదాయం కోల్పోవాల్సి వస్తోందని నాడు దారుణంగా వ్యాఖ్యానించారు.

బాబు పాలనలో కూల్చివేతలు.. విక్రయాలు.. క్షుద్రపూజలు!
తిరుమలలో 1472 సంవత్సరంలో నిర్మించిన పురాతనమైన వెయ్యి కాళ్ల మండపాన్ని 2003లో కూల్చివేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వమే.  
⇒ గతంలో చంద్రబాబు హయాంలో విజయవాడ దుర్గగుడిలో క్షుద్రపూజలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. 


⇒ బెంజి సర్కిల్‌ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను చంద్రబాబు తన  సన్నిహితుడి విద్యా సంస్థకు కారుచౌకగా కట్టబెట్టారు. 
⇒ 2014– 19 మధ్య సింహాచలం ఆలయ భూముల రికార్డుల నుంచి వందల ఎకరాల భూమి మాయమైనట్లు దేవదాయ శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. 

⇒ విజయనగరంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణం పేరుతో మాన్సా­స్‌ ట్రస్టుకు విశాఖ చుట్టు పక్కల ఉన్న విలువైన భూములను 2014లో చంద్రబాబు ప్రభుత్వం 
విక్రయించింది. 
⇒ అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో ఉన్న విలువైన భూములను టీడీపీ నాయకులకు చంద్రబాబు కారుచౌకగా కట్టబెట్టేందుకు చేసిన యత్నాలపై వైఎస్సార్‌ సీపీ న్యాయ పోరాటం చేసింది.  

⇒ చంద్రబాబు హయాంలో ఆలయాల పాలక మండళ్ల సభ్యులుగా నియమించిన టీడీపీ నేతల ఆగడాలతో వివిధ సందర్భాల్లో ఐదుగురు అర్చకులు మృతి చెందినట్లు అర్చక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.  

వైఎస్సార్‌ హయాంలో కీలక నిర్ణయాలు
⇒ రాజకీయ నేతల జోక్యానికి తావు లేకుండా దేవదాయ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు 21 మందితో ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చట్ట సవరణలు చేసింది.  

⇒ దేవదాయ శాఖ పరిధిలో కనీస వార్షికాదాయం లేని వేలాది ఆలయాల్లో నిత్య పూజల కోసం ధూప దీప నైవేద్య పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా దివంగత వైఎస్సార్‌ తెచ్చారు. తొలి విడతగా 3,500 ఆలయాల్లో అమలు చేశారు.  


⇒ వైఎస్సార్‌ హయాంలో భక్తులకు స్వామి వారి అన్న ప్రసాదాలు ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకా­రం చుట్టారు. క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు పాలు, అన్న ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది కూడా వైఎస్‌ పాలనలోనే. తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాల ద్వారా భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టారు. దివ్య దర్శనం టోకె­న్లు, చంటి పిల్లలకు దైవ దర్శనం, తిరుమలకు వెళ్లే భక్తు­లు ప్రతి ఒక్కరూ తిరునామం తిలక ధారణ చేయాలనే నిబంధన తెచ్చారు. తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరుగాడకుండా పవిత్రతను పరిరక్షించారు. స్వామి వారి వైభవం చాటేందుకు భక్తి చైతన్య రథాలు తెచ్చారు.  

⇒ వేద విద్య, విజ్ఞానం, పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో టీటీడీ 2006లో వేద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. దేశంలో ఆధ్యాత్మీక విద్య అందించే ఏకైక యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్సిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని విభాగాలను విస్తరించే దిశగా అడుగులు వేశారు.  

⇒ ఏడుకొండల వైభవాన్ని దశదిశలా చాటేందుకు నాటి సీఎం వైఎస్సార్‌ సూచనలతో అప్పటి టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి 2008 జూన్‌లో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ను ప్రారంభించారు. భక్తులను ఆధ్యాత్మీక సాగరంలో ఓలలాడించే కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అశేష భక్త కోటి ఎస్వీబీసీ చానల్‌ ద్వారా వీక్షిస్తోంది. 

⇒ శ్రీనివాసుడి వైభవాన్ని చాటిన వాగ్గేయ కారుడు అన్నమయ్య ఉత్సవాలు నిర్వహించింది వైఎస్సార్‌ హయాంలోనే. 75 మంది వేద పండితులతో విద్వత్తు సదస్సులు కూడా నిర్వహించారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమా­న్ని ప్రవేశపెట్టారు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహం పేరుతో నిత్యం హోమం నిర్వహణ కార్యక్రమా­న్ని ప్రారంభించింది కూడా వైఎస్సార్‌ పాలనలోనే.  

⇒ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2006లో కళ్యాణమస్తు పథకానికి రూపకల్పన చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వివాహం చేసుకునే ప్రతి జంటకు బంగారు మంగళసూత్రాలు, వెండి మెట్టెలు, నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్లి సామగ్రి, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్లి భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేశారు. మంగళసూత్రాలు, మెట్టెలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 36 వేల నూతన జంటలకు పంపిణీ చేసి శ్రీవారి కళ్యాణమస్తు కార్య­క్రమం ద్వారా వేడుకగా వివాహం జరిపించారు.  

⇒ దళిత, గిరిజన గోవిందం పేరుతో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్‌ పాలనలోనే. స్వామి వారినే దళిత, గిరిజన వాడలకు తీసుకెళ్లి శ్రీవారి దర్శనభాగ్యం కల్పించే కార్యక్రమం చేపట్టారు. మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణ ఇచ్చి సమానత్వాన్ని చాటారు.

జగన్‌ పాలనలో ధర్మ సంరక్షణ ఇలా..
⇒ తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవకు స్వచ్ఛమైన వెన్న సమకూర్చేందుకు నాటి సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో టీటీడీ చైర్మన్‌ నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశీ ఆవు పాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తిరుమలలోని గోశాలను విస్తరించారు. సుమారు 150 పాలిచ్చే ఆవులను సంరక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గో మహా సమ్మేళనం నిర్వహించారు.   

⇒ చిన్నారుల్లో దైవభక్తి పెంపొందించేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గోవింద కోటి, రామకోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోవింద, రామకోటి రాసిన పిల్లలకు వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కల్పించింది. గోవింద నామ కోటి పుస్తకాలను భక్తులకు ఉచితంగా అందించింది. 

⇒ టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలతో పాటు వేతనాలు పెంచారు. కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపారు. 
⇒ వంశపారంపర్య అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా వారికి ఓపిక ఉన్నంత కాలం పని చేసుకునే అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు.  

⇒ తిరుమలలో శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయం పునరుద్ధరణ 
⇒ తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా నివసించే ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని చేపట్టారు.   

⇒ వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో సుమారు రూ.350 కోట్లతో శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా 2,635 నూతన ఆలయాలను నిర్మించారు. మరో 300 ఆలయాలకు మరమ్మతులు చేపట్టి జీరో్ణద్ధారణ చేశారు.  
⇒ అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్ము కశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ హయాంలో శ్రీకారం చుట్టారు. 
⇒ వైఎస్సార్‌ తరహాలో వేద విద్యకు ప్రాధాన్యతనిచ్చారు.  

⇒ గత ప్రభుత్వం తొలగించిన ప్రధాన కైంకర్యాలను పండితులు, వేద విద్వాంసులు, పీఠాధిపతుల సలహాలతో పునరుద్ధరించారు.  
⇒ మఠాధిపతులు, ఆగమ పండితులతో 2022 ఆగస్టులో రెండో విడత ధార్మిక పరిషత్‌ను నియమించి నిర్ణయాధికారాలు కల్పించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే. 

⇒ దేవదాయ శాఖ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విప్లవాత్మక ఆర్డినెన్స్‌ తెచ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపనకు తావు లేకుండా కేవలం ఒక నోటీసు ఇచ్చి వారం రోజుల తర్వాత భూమిని స్వా«దీనం చేసుకునే అధికారాన్ని దేవదాయ శాఖకు ఆర్డినెన్స్‌ ద్వారా కట్టబెట్టారు.  

⇒ వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉండగా ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ వంశపారంపర్య ధర్మకర్తలు, స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తూ జీవో ఇచ్చింది.  
⇒ 2014– 19 మధ్య విజయవాడలో కృష్ణా నది ఒడ్డున 30కిపైగా పవిత్ర దేవాలయాలను చంద్రబాబు ప్రభుత్వం కూల్చి వేయగా అనంతరం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వాటిని పునఃనిర్మించింది.  

⇒ 2021 మే 14న జీవో నెంబరు 52 జారీ చేయడం ద్వారా గతంలో రూ.5,000 వేతనాలు పొందే వారికి రూ.పది వేల చొప్పున, రూ.పది వేల వేతనం పొందేవారికి రూ. 15,625 చొప్పున వేతనాలను పెంచుతూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 
⇒ వంశపారంపర్య అర్చకత్వం హక్కులను గుర్తిస్తూ ఎండోమెంట్‌ ప్రాపర్టీ రిజిస్టర్‌లో ఆయా అర్చకుల పేర్ల నమోదుకు నిర్ణయం తీసుకున్నది గత ప్రభుత్వమే.  

⇒ ఈనాం భూములు కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకు గత ప్రభుత్వం రైతు భరోసా పథకం అందజేసింది. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేసింది. 
⇒ అర్చక సంక్షేమ ట్రస్టు ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి రూ.48.33 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది.  

⇒ బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా అర్చక సమాఖ్య నాయకులకు స్థానం కల్పించింది.  
⇒ పాలక మండలి సభ్యులెవరైనా అర్చక స్వాముల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే పదవీ కాలం పూర్తి కాకముందే తొలగించేలా చట్ట సవరణ తెచ్చింది.  

⇒ రాష్ట్రవ్యాప్తంగా 16 ఆగమ వేద పాఠశాలల ద్వారా 400 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతోపాటు స్టైఫండ్‌ రూ.3.06 కోట్లు అందజేసింది.  
⇒ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేవదాయ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా విజయవాడలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.  

⇒ మఠాధిపతులు, ఆగమ పండితులతో ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేసి నిర్ణయాధికారాలు కల్పించిన వైఎస్‌ జగన్‌
⇒ 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ధూప దీప నైవేద్య పథకాన్ని 1,600 ఆలయాలకు పరిమితం చేయగా అనంతరం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 5,338 ఆలయాలలో అమలయ్యేలా చర్యలు తీసుకుంది.

⇒ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడసేవకు భక్తులు అందరూ వచ్చి దర్శించుకోలేరనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడసేవ నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి నెలా పున్నమి గరుడసేవ ద్వారా ఎంతో మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పించింది.

⇒ ఆలయ నిర్మాణం, ఆధునికీకరణ  పనులకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగనే. గతంలో ఇతర ఆలయాల నుంచి సమకూరిన కామన్‌ గుడ్‌ ఫండ్‌ నిధుల నుంచే ఈ కార్యక్రమాలు చేపట్టగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తొలిసారిగా విజయ­వాడ దుర్గ గుడి ఆలయ అభివృద్ధికి ఖజానా నుంచి రూ.70 కోట్లు మంజూరు చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement