తెలుగునే లాగేస్తే మిగిలేదేంటి?
ఇప్పుడు పట్నాలలో, పల్లెల్లో చదివే అట్టడుగువారికి ఒకే ఒక సౌకర్యముంది. అది వారు సులభంగా అర్థం చేసుకోగలిగే తెలుగు భాషలో విద్య లభించే సౌకర్యం. ఆ కాస్త తెలుగును కూడా లాగేస్తే వారి భవిష్యత్తు ఏంటి?
తెలుగు భాష కొన్ని శతాబ్దాలుగా తెలంగాణాలో అందరూ విరివిగా మాట్లాడుతున్న, సగటు పౌరులు అనేకానేక అవ సరాలకు ఉపయోగి స్తున్న ప్రజా భాష, అది బోధనా మాధ్యమంగా గత అరవై ఏళ్లకు పైగా నిలదొక్కుకున్న భాష. మరి అలాంటి భాషను అకస్మాత్తుగా ఇంగ్లిష్ భాషతో భర్తీ చేస్తే అది ఎన్ని సామాజిక సంక్షోభాలకు దారి తీస్తుందో మన ప్రభుత్వం సావధానంగా ఆలోచిస్తు న్నట్లు లేదు. అది మన సమాజంలోని అనేకానేక రంగాలను ఎలా దెబ్బతీస్తుందో, వాటిలో పనిచేసే వారి గతి, వాటిలో పెట్టుబడులు పెట్టిన వారి గతి ఏమి కాబోతోందో ప్రభుత్వమే కాదు, సమాజం కూడా ఆలోచిస్తున్నట్లు లేదు.
ఈ భాషా సమస్య ఏ కొందరి సమస్యో కాదు, ఇది ఒక పదేళ్ళలో అందరినీ ముంచే, అందరినీ ముసురుకునే సునామీ లాంటి సమస్య. అనేకా నేకులను అనేకానేక నష్టాలకు కష్టాలకు గురిచేసే సమస్య. అలాంటిదాన్ని అలా నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఇపుడు చిన్నాచితకా బడుల్లో, పట్నాలలో, పల్లెల్లో చదివే అట్టడుగువారికి ఒకే ఒక సౌకర్య ముంది. అది వారు సులభంగా, సునాయాసంగా అర్థం చేసుకోగలిగే తెలుగు భాషలో విద్య లభించే సౌకర్యం, తక్కినవన్నీ లోటులూ, లొసుగులే. పాపం.. పసివారికి ఉండే ఒకే ఒక సౌకర్యం ఒక్క తెలుగు మీడియం మాత్రమే.
అది కాస్తా లాగేస్తే మిగిలేదేముంది ఆ బడుల్లో? మన విద్యాలయాల ఉద్ధరణను మనం అలాంటి బడుల వసతి సౌకర్యాల ఉద్ధరణతో మొదలెట్టాలి కాని తెలుగు మాధ్యమాన్ని తీసివేసి ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కాదు. దాని వలన జరిగేదీ లేదు, ఒరిగేదీ లేదు. పెపైచ్చు వారి విద్య ఇప్పటికన్నా అధ్వానమవుతుంది. అసలు అంత మంది అధ్యాపకులేరీ? ఇంగ్లిష్‌లో అన్ని సబ్జెక్ట్‌లు చెప్పగలిగేవారు ఏరీ?. వచ్చీరాని ఇంగ్లిష్‌లో వచ్చీ రాని వారు వచ్చీరాని విధంగా విద్య బోధిస్తే విద్యార్థులు ఇంటా బయటా దేనికి పనికొస్తారు? వారి పట్టాలు దేనికి పనికొస్తాయి? వారు న్యూనతా భావనకు లోనై ఇప్పటిలాగే భవి ష్యత్తులోనూ ఆత్మహత్యలకు పాల్పడరా?
అసలు మీడియం ముఖ్యమా? వనరులు, వసతులు, సౌకర్యాలు, ఉపాధ్యాయులు, సాంకేతిక పరికరాలు, క్రమశిక్షణ, సరైన విద్యా వాతావరణం, కార్యక్రమాలు ముఖ్యమా? విద్యాలయాలు అన్ని విధాలా బాగుంటే విద్యలు బాగుంటాయి, అవి బాగుండకపోతే ఇవి బాగుండవు. ఇతర ముఖ్యాం శాలను సమకూర్చకుండా, ఒక్క మాధ్యమం మాత్రమే ఏ అద్భుతాలనూ సాధించజాలదు. వాటిని గుర్తించి బాగుపరచడానికి ఇప్పటి పరిస్థి తుల్లో కనీసం రెండుమూడు దశాబ్దాలైనా పట్టొచ్చు. అందువలన మీడియంను గభాలున మార్చకుండా కొన్నాళ్ళు తెలుగు మీడియంను కొన సాగిస్తూ ఈలోగా వాటిని మెరుగు పరచుకుంటూ, మెల్లమెల్లగా అడుగులు వేయడం అవసరం.
తెలుగు మీడియం విద్యాలయాలు తెలుగు మీడియం వలన వెనకబడలేదు వాటికి ప్రభుత్వ చేయూత సరియైనంత లభించనందునే వెనకబడి పోయాయి. కనుక మొదట ఆ విద్యాలయాల వసతి సౌకర్యాలు, వనరులు మెరుగుపరచండి. గవర్న మెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్‌కు ఈ మాత్రం తీసిపోవని నిరూపించండి. తొందరపడి మూకుమ్మడి కన్వర్షన్‌కు నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తులను పాడుచేని అయ్యో ఇంత మంది భవిష్యత్తులు పాడుచేశామేమిటని ఆ తదుపరి నాలుక కరచుకోకండి.
కనీసం అత్యధికులైన బీదవారికి, పల్లెటూరి వారికి, వెనకబడినవారికి చెందిన గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంతవరకే ఉన్న విద్యా విధానాన్ని కొన్నాళ్ళు అలాగే ఉంచి వాటిలో బోధనా అధ్య యన పరిస్థితులను మెరుగుపరచి అటు తదుపరి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం మంచిదని గ్రహించండి. ఇంతవరకే పాడయిన వారిని ఇంగ్లిష్ మీడియం ద్వారా మరింత పాడు చేయకండి.
సదరు సమాజం, స్థానిక ప్రజలు కూడా మొదట వసతులు మెరుగుపర్చడానికి పట్టుబట్టాలి కాని ఇంగ్లిష్ మీడియం కోసం కాదు. వసతులు, వనరులు లేని ఇంగ్లిష్ మీడియం వారి పిల్లలకు ఇప్పటికన్నా ఎక్కువ హాని కలిగిస్తుందని, అలాంటి దాని వలన వారి పిల్లలు పట్నాలలోని మంచి వసతులు గల బడుల్లో చదివే వారితో పోటీపడ లేరని గ్రహించాలి. అలాంటి వనరులు, వసతులే కల్పిస్తే తెలుగు మీడియం స్కూళ్లూ అంతకన్నా బాగుం టాయని తెలుసుకోవాలి. ప్రభుత్వం ఉన్న వాటిని ఉద్ధరించడానికి ఒత్తిడి ఎక్కువ తేవాలి కాని కేవలం ఇంగ్లిష్ మీడియం కోసం కాదు.
తెలుగు మీడియం ఒకవిధంగా విద్యారం గంలో వెనకబడిన వారికి ఫార్వర్డ్ క్లాస్ వారితో పోటీ పడడానికి ఒక సబ్సిడీ లాంటిది, రిజర్వేషన్ లాంటిది. దానిని పోగొట్టుకోకండి. ఇంగ్లిష్ మీడి యంలో చేరగానే, చేర్పించినంత మాత్రాన్నే విద్యార్థి ఐ.ఐ.టి.కి పోతాడని, అమెరికాకు పోతా డనీ అనుకోకండి. అలా నెగ్గే వారి సంఖ్య ఆ మీడి యంలో చేరేవారి సంఖ్యలో ఎంతభాగమో తెలుసు కోండి. తక్కినవారు నెగ్గకపోవడానికి ప్రధానమైన కారణం ఇంగ్లిష్ భాష బరువేనని నెగ్గినవారినడి గితే మీకే తెలుస్తుంది. వారినడిగి తెలుసుకోండి.
ఇపుడు సులభమైన తెలుగు మీడియం ఉండగానే అనేకానేక గవర్నమెంటు స్కూళ్ళలో పరీక్షా ఫలితాలు దారుణంగా ఉన్నాయి. ఇక ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాక దాని భారం వలన అవి మరింత దారుణంగా తయారవుతాయని అటు ప్రభుత్వమూ, ఇటు తల్లిదండ్రులూ, వారి పిల్లలు, సమాజం కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే తెలు స్తుంది. ఏళ్ళ తరబడి ఇంగ్లిష్ మీడియంలో చది వినా కూడా నూటికి 90 శాతం విద్యార్థులు ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడలేకపోవడం, రాయ లేకపోవడం ఆ భాషాభారం వలననే అని తెలుసుకోండి.
వ్యాసకర్త వ్యవస్థాపక కన్వీనర్, తెలంగాణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫోరమ్
మొబైల్: 98481 95959
- డాక్టర్ వెల్చాల కొండలరావు